వరంగల్: ఈ హోటల్లో ఆర్డర్ చేసిన ఆహారం అంతా తినాల్సిందే, లేదంటే జరిమానా కట్టాల్సిందే

ఫొటో సోర్స్, Praveenshubham
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
‘’ఇద్దరు వృథా చేసే ఆహారంతో ఒకరి కడుపు నింపొచ్చని నా అనుభవంలో తెలుసుకున్నాను. అందుకే ఆహారం వృథా చేసే వారికి గత ఐదేళ్లుగా జరిమానా వేస్తున్నా. వారికి అన్నం మీద గౌరవం పెరగాలన్నదే నా ఆలోచన’’ అని వరంగల్‌లోని ఓ హోటల్ యజమాని ‘లింగాల కేదారి’ అంటున్నారు.
లింగాల కేదారి వరంగల్ తెలంగాణ చౌరస్తాలో ముప్పై ఏళ్లుగా హోటల్ బిజినెస్ చేస్తున్నారు. ఆయన హోటల్ పేరు 'లింగాల కేదారి ఫుడ్ కోర్ట్'
కేదారి ఐదేళ్లుగా కొన్ని రూల్స్ పెట్టుకొని ఈ హోటల్ నడుపుతున్నారు.
ఇందులో భోజనం చేసే కస్టమర్లు ఆహారం వృథా చేయకుండా తినాలన్నది ఆయన ప్రధానమైన నిబంధన (షరతు).
హోటల్ ప్రారంభించడానికి ముందు వరంగల్ జిల్లా పరిషత్ కార్యాలయం సమీపంలో కుండల దుకాణం నడిపేవారు కేదారి. అయితే, రోడ్డు విస్తరణలో ఆ దుకాణం తొలగించారు అధికారులు.
దీంతో ఆయన అక్కడే రాత్రిపూట తోపుడు బండిపై కొంతకాలం బజ్జీలు అమ్మారు. ఆ సమయంలో అమ్మకానికి వచ్చిన ఒక హోటల్ కొని, నడుపుతున్నారు.

ఫొటో సోర్స్, praveenShubham
భోజనం వదిలేస్తే ఫైన్
హోటల్‌కు వచ్చిన కస్టమర్లలో చాలా మంది అవసరానికి మించి వడ్డించుకుని, ఆ తర్వాత తినకుండా వదిలేసేవారు. ఆ ఆహారంతో మిగతావారు కడుపు నిండా భోజనం చేయవచ్చని ఆలోచించారు కేదారి.
దీంతో ఐదేళ్ల క్రితం తన హోటల్ నిర్వహణ పంథా మార్చుకున్నారు. ‘‘హోటల్‌లో ఆహారం వృథా చేయవద్దు, అలా చేస్తే జరిమానా కట్టాలి’’ అనే నిబంధన ముద్రించిన ఫ్లెక్సీని తన హోటల్‌లో పెట్టారు కేదారి. అనంతరం కొత్త విధానంలో హోటల్ నిర్వహణలో తనకు ఎదురైన అనుభవాలను ఆయన వివరించారు.
‘’నా హోటల్ జిల్లా కోర్టుకు ఎదురుగా ఉంటుంది. ఓసారి ఒక వ్యక్తి భోజనంలో పెరుగన్నం పూర్తిగా తినకుండా కొంత వదిలేశారు. అడిగితే.. ‘నేనెవరో నీకు తెలుసా? పక్క జిల్లా కోర్టులో జడ్జిని అని చెప్పారు’ అయినా వదిలిపెట్టకుండా 50 రూపాయల ఫైన్ డబ్బాలో వేయించాను. తర్వాత ఆయన నా భుజం మీద చేయి వేసి, జడ్జిగా అందరికి ఫైన్ వేసే తనతోనే ఫైన్ కట్టించావని మెచ్చుకున్నారు.’’
‘‘ఆహారం వృథా అరికట్టేందుకు నేను అనుసరించిన పద్ధతిని చాలా మంది ప్రశ్నించారు. ప్లేట్‌లో ఆహార పదార్థాలు వృథాగా వదిలేసి, నాతో గొడవ పెట్టుకున్నవారు చాలా మంది ఉన్నారు. అయినా నేను వదలకుండా జరిమానా కట్టించాను’’ అని అన్నారు కేదారి.

ఫొటో సోర్స్, praveenShubham
జరిమానాల సంగతి ఇలా ఉంచితే, మెతుకు కూడా వదలకుండా తిన్నవారికి రివార్డ్‌లను కూడా అందించారు కేదారి.
ఆహారం వృథా చేయకుండా పూర్తిగా తిన్న కస్టమర్లకు ప్రోత్సాహకంగా పోయిన ఏడాది వరకు 10 రూపాయల రివార్డ్ ఇచ్చారు. వరంగల్ సందర్శనకు వచ్చి తన హోటల్‌లో భోజనం చేసే స్కూల్ పిల్లలకు ఇప్పటికీ రివార్డులను ఇస్తుంటారాయన.
‘’నేను వేసేది జరిమానా అసలే కాదు, ఆహారం తయారీ క్రమంలో ఉండే శ్రమపై వారిలో ఆలోచన, గౌరవం పెంచడం మాత్రమే’’ అన్నారు కేదారి.
‘‘పని మీద వరంగల్‌కు వస్తే ఈ హోటల్‌లోనే భోజనం చేస్తాను. ఎవరూ ప్లేట్‌లో అన్నం వదిలేయకూడదన్న వారి ఆలోచన మంచిదే. ఇక్కడి నిబంధనలు తెలుసు కాబట్టి ఎంత అవసరమో అంతే ఆహారం ప్లేట్‌లో పెట్టుకుని తింటాను’’ అని హైదరాబాద్‌కు చెందిన కుమార స్వామి బీబీసీతో అన్నారు.
ఇంట్లో కూడా ఇవే షరతులు
తమ ఇంట్లో కూడా ఇవే షరతులు ఉంటాయని కేదారి కోడలు శ్రీలక్ష్మీ అంటున్నారు. భర్త, తోటి కోడలితో కలిసి ఈ హోటల్ నిర్వహణలో ఆమె సాయంగా ఉంటున్నారు.
‘‘ఆహారం వృథాపై మొదట్లో నాకు అంతగా తెలియదు. ఆ తర్వాత తెలుసుకున్నా. అవసరమైనంతే ఇంట్లో వండుతాం. మా పిల్లలకైనా, మా ఇంటికొచ్చే బంధువులకైనా అదే చెప్తాం. ఆహారం వృథా చేయకపోవడం మంచి విషయం. మా హోటల్‌కు వచ్చే ప్రతి ఒక్కరికి విషయం అర్థమయ్యేలా చెప్పడం మా బాధ్యతగా ఫీలవుతాం’’అని శ్రీలక్ష్మీ చెప్పారు.

ఫొటో సోర్స్, praveenShubham
చెత్త కుప్పల్లోకి టన్నుల కొద్దీ ఆహారం
‘‘మా కాలనీలో చెత్తను సేకరించే ‘స్వచ్ఛ్ ఆటో’లలో వృథా చేసిన ఆహార పదార్థాలే ఎక్కువుంటాయి. ఎప్పుడైనా ఆటోలు రాకపోతే అన్నం, కూరలు బయట పారేస్తారు. ఇవి తిని జంతువులు అనారోగ్యం పాలవుతున్నాయి. నాకు తెలిసీ రోజూ మా కాలనీలో సుమారు క్వింటాళ్ల మేర ఆహారం వృథా అవుతోంది’’ అని వరంగల్‌లోని పోస్టల్ కాలనీ ప్రెసిడెంట్ జనార్ధన్ గౌడ్ బీబీసీతో చెప్పారు.
‘‘మా ఒక్క డివిజన్‌లోనే ఇలా ఉంటే, మొత్తం వరంగల్ పరిస్థితి ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఏంటి? ఫంక్షన్ హాళ్లలో ఆహారం వృథా ఎక్కువగా ఉంటోంది. ఆ పదార్థాల తయారీ కోసం వాడే ముడి సరుకుల ఉత్పత్తి, ప్రాసెసింగ్, కుకింగ్ ఇలా వివిధ స్థాయుల వెనుక ఉండే శ్రమ చాలా మందికి అర్థం కావడం లేదు’’ అని ఆయన అన్నారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వృథా అవుతున్న ఆహారంపై ప్రజా ఆరోగ్య విభాగం అధికారి డాక్టర్ రాజేష్ బీబీసీతో మాట్లాడారు.
‘’వరంగల్ నగరంలో ప్రతి రోజు సేకరిస్తున్న తడి, పొడి చెత్త దాదాపు 450 మెట్రిక్ టన్నుల వరకు ఉంటుంది. ఇందులో సుమారు 40 మెట్రిక్ టన్నుల మేర ఆహార వ్యర్థాలే ఉంటున్నాయి’’ అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, praveenShubham
ఆహారం వృథాతో పర్యావరణానికీ నష్టమే
దేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణపై డూన్ యూనివర్సిటీ (డెహ్రాడూన్)కి చెందిన ‘స్కూల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ & నాచురల్ రిసోర్సెస్ ’ 2014 లో ఒక పరిశోధనా పత్రం ప్రచురించింది.
ఈ పరిశోధన పత్రం ప్రకారం కొన్ని దశాబ్ధాలుగా అభివృద్ది చెందుతున్న దేశాల్లోని పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాలు (ఆహారం,పేపర్, ప్లాస్టిక్, సానిటరీ వేస్ట్ లాంటివి) పెరుగుతున్నాయి.
పట్టణ ప్రాంతాలకు వలసలు పెరగడం, మారుతున్న జీవన శైలి, ఆర్థిక స్థితిలో మెరుగుదల మున్సిపాలిటీల్లో వ్యర్థాలకు (MSW-మున్సిపల్ సాలిడ్ వేస్ట్) కారణం అవుతున్నాయి.
ఒక ఇంటి నుంచి ఉత్పత్తి అయ్యే చెత్త పరిమాణం వారి కొనుగోలు సామర్థ్యంతో ముడిపడి ఉంటుంది. అంటే గృహాల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు (హౌజ్ హోల్డ్ వేస్ట్) ఆ ప్రాంతంలోని సాంఘిక, ఆర్థిక పరిస్థితులను తెలియజేస్తాయని ఈ నివేదిక తెలిపింది.

ఫొటో సోర్స్, praveenShubham
మార్పు వస్తే లాభాలెన్నో..
ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగం యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం (UNEP) వారి ‘ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్-2021’ ప్రకారం..ప్రపంచవ్యాప్తంగా వృథా అవుతున్న ఆహారం సామాజిక, ఆర్థిక అంశాలపై, పర్యావరణంపై ప్రభావం చూపుతోంది.
ఏటా ఉత్పత్తి అయ్యే గ్రీన్‌హౌస్ వాయువుల్లో 8-10 శాతానికి వృథా అవుతున్న ఆహారంతో సంబంధం ఉందని ఆ నివేదిక పేర్కొంది.
వివిధ స్థాయుల్లో ఉత్పత్తయ్యే ఆహార వ్యర్థాలను తగ్గిస్తే ప్రపంచానికి మెరుగైన ఆహార భద్రతతోపాటు భూమి, నీరు వంటి ప్రకృతి వనరులపై భారం తగ్గుతుందని చెప్పింది. దీంతో వాతావరణ మార్పులకు పరిష్కారాలు వంటి బహుముఖ ప్రయోజనాలు అందింవచ్చని నివేదిక వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం.. 2019లో ప్రపంచవ్యాప్తంగా 931 మిలియన్ టన్నుల ఆహారం వృథా అయ్యింది.
ఇందులో గృహాల నుంచి 569 మిలియన్ టన్నులు (61 శాతం ), ఫుడ్ సర్వీస్‌ల నుంచి అంటే హోటళ్లు, క్యాటరింగ్, క్యాంటీన్లు, హాస్టళ్లు, ఫుడ్ కోర్ట్‌లలో 244 మిలియన్ టన్నులు(26 శాతం) రిటైల్ రంగంలో 118 మిలియన్ టన్నులు (దుకాణాలు, స్టాల్స్) (13 శాతం) ఆహారం వృథాగా మారింది.
అంటే 2019లో ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయిన మొత్తం ఆహారంలో 17 శాతం వృథా అయ్యింది.

ఫొటో సోర్స్, praveenShubham
ఒక్కరు మారినా చాలు: కేదారి
దేశంలో ప్రతి ఇంటి నుంచి ఏడాదిలో 50 కిలోల ఆహారం వ్యర్థం అవుతోందని వివిధ సంస్థలు జరిపిన మూడు సర్వేల ఆధారంగా యూఎన్‌ఈపీ ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్- 2021లో చెప్పింది.
ఈ మూడు సర్వేల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని రాజాం ప్రాంతంలో 2016లో నిర్వహించారు. ఈ రిపోర్ట్ ప్రకారం రాజాంలో ఏటా ప్రతి ఇంటి నుంచి సరాసరి 58 కేజీల ఘన వ్యర్థాల ఉత్పత్తి జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆహార వృథా అంచనాలపై చాలా దేశాల్లో ఆధారపడదగ్గ నమ్మకమైన లెక్కలు లేవని, సర్వేల్లో చిన్న సైజు శాంపిళ్లు మాత్రమే ఉన్నాయని యూఎన్‌ఈపీ తన నివేదికలో చెప్పింది.
కచ్చితమైన లెక్కల కోసం ‘ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్-2021’ పలు సూచనలు చేసింది.
ప్రామాణికమైన పద్దతులు అవలంబించడం ద్వారా సేకరించే కచ్చితమైన లెక్కలతో ఎక్కువ ఏ రకమైన ఆహారం వృథా అవుతోంది? ఏ ప్రాంతాల్లో అవుతోంది? అన్న అంశాలను అర్థం చేసుకుని మెరుగైన వ్యర్థాల నిర్వహణ చేపట్టవచ్చని తెలిపింది.
తద్వారా ఆహార భద్రతను మెరుగుపరచడంతోపాటు ఎలాంటి ప్రయోజనం లేకుండా వృథా అయ్యే వనరులు, సమయం, డబ్బు అరికట్టవచ్చని అభిప్రాయపడింది.
‘‘నేను అవలంబించిన విధానంతో ఒక్కరు మారినా చాలు అనుకున్నాను. వృథా అరికడితే ఇంకా తక్కువ ధరకే హోటళ్లలో ఆహారం అందించవచ్చు. వివిధ స్థాయుల్లో జరిగే ఆహార వృథాపై జరిమానాలు విధించేలా భారతదేశంలో ప్రత్యేక చట్టం తీసుకురావాలి’’ అని కేదారి అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
- ఖమ్మం రాజకీయాలు: పాలేరు మీదే అందరి చూపు ఎందుకు?
- డెంగీ రెండోసారి వస్తే మరింత ప్రాణాంతకమా? అంత మంది చనిపోతున్నా ఈ వైరస్‌కు సరైన టీకా ఎందుకు రాలేదు?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















