ఉల్లిలో ఉండే పోషకాలు ఏమిటి? ఇది ఎక్కడ పుట్టింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మారెక్ ప్రోస్జెవిక్
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
ధరలు పెరుగుతుండటంతో ఉల్లి మరోసారి చర్చలోకి వచ్చింది. అనేక వంటకాల్లో ఉల్లిని వాడతారు. కొందరైతే ఉల్లిని ‘విశ్వ ఆహారం’గా అభివర్ణిస్తుంటారు.
ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచంలోని 175 దేశాల్లో ఉల్లిపాయలు పండిస్తారు. గోధుమలు పండించే దేశాలతో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు.
ఇంతకూ ఉల్లి ఎక్కడ పుట్టింది, దీని చరిత్ర ఏమిటి, ఉల్లిలో ఉండే పోషకాలు ఏమిటి, ఉల్లి ఉత్పత్తిలో ఏయే దేశాలు ముందున్నాయి అనే వివరాలు తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, YALE BABYLONIAN COLLECTION
నాలుగు వేల ఏళ్ల చరిత్ర
యేల్ యూనివర్సిటీలోని బాబిలోనియా కలెక్షన్‌లో మూడు మట్టి ఫలకాలున్నాయి. వంటలకు సంబంధించి ప్రపంచంలోనే అత్యంత పురాతన పుస్తకాలు ఇవేనంటారు.
నాలుగు వేల ఏళ్ల కిందట చిత్రలిపిలో లిఖించిన వీటిలోని అనేక విషయాలు 1985 వరకు వెలుగుచూడలేదు.
ఫ్రాన్స్‌కు చెందిన అసిరియాలజిస్ట్(చిత్రలిపిని విశ్లేషించేవారు), కుక్ అయిన జీన్ బొటెరో ఆ మూడు ఫలకాలపై ఏం రాసి ఉందనేది తేల్చారు.
నాలుగు వేల ఏళ్ల కిందట నుంచే మెసపటోమియాలో ఉల్లిని వినియోగించినట్లు ఇందులో ఆధారాలున్నాయి.
మెసపటోమియన్లు ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఉల్లి కాడలు వంటివన్నీ ఉపయోగించినట్లు ఆధారాలున్నాయి.
నాలుగు వేళ్ల తరువాత ఇప్పుడు కూడా ఉల్లికి ఉన్న ఆదరణ తక్కువేం కాదు.
ఉల్లి ప్రస్తావన లేని వంటల పుస్తకమే ఉండదంటే అతిశయోక్తి కాదు.

ఫొటో సోర్స్, THINKSTOCK
ఉల్లి ఎక్కడి నుంచి వచ్చింది?
ఉల్లి జన్యు విశ్లేషణ ఆధారంగా అది మధ్య ఆసియా నుంచి ప్రపంచమంతా వ్యాపించినట్లు చెప్పొచ్చని ఫుడ్ హిస్టోరియన్ లారా కెల్లీ చెప్పారు.
మెసపటోమియాలో ఉల్లి వినియోగానికి సంబంధించిన ఆధారాలుండడంతో సెంట్రల్ ఆసియా నుంచి అక్కడికి వెళ్లినట్లు భావిస్తున్నారు.
మరోవైపు కాంస్య యుగంలో యూరప్ ఖండంలోనూ ఉల్లి వినియోగం ఉన్నట్లు ఆధారాలున్నాయి.
‘2000 ఏళ్ల కిందట సిల్క్ రోడ్‌లో ఉల్లి రవాణా జరిగిందనడంలో ఎలాంటి అనుమానం లేదు. అప్పటికే మెసపటోమియన్లు వారి ఉల్లి వంటకాల చరిత్రను లిఖిస్తున్నారు’ అని కెల్లీ తన ‘సిల్క్ రోడ్ గోర్మెట్’ పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
45 శాతం భారత్, చైనాల్లో ఉత్పత్తి
ప్రస్తుతం ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ఉల్లిలో 45 శాతం భారత్, చైనాలలోనే పండుతోంది.
అయితే, ఉల్లి తలసరి వినియోగం అత్యధికంగా ఉన్న దేశాలు మాత్రం ఈ రెండూ కావు.
ఉల్లి తలసరి వినియోగం లిబియాలో అత్యధికంగా ఉంది. 2011లో లిబియా ప్రజల తలసరి ఉల్లి వినియోగం ఏడాదికి సగటున 33.6 కేజీలుగా ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి లెక్కలు చెప్తున్నాయి.
లిబియాలో ప్రతి వంటకంలోనూ ఉల్లి ఉపయోగిస్తారని చెప్తారు.
2011 లెక్కల ప్రకారం ఉల్లి తలసరి వినియోగంలో లిబియా తరువాత అల్బేనియా, తజక్‌స్తాన్, ఉజ్బెకిస్తాన్, అల్జీరియా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఉన్నాయి.
మరోవైపు ఫ్రాన్స్ ప్రజలు కూడా ఎక్కువగా ఉల్లి తింటారని కొందరు భావిస్తారు. కానీ, ఫ్రెంచ్ ప్రజల తలసరి ఉల్లి వాడకం 5.6 కేజీలు.
ఇండియాలో 1998లో ఉల్లి ధరలు పెరగడం వల్ల అప్పటి బీజేపీ ప్రభుత్వం కూలిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
ఉల్లిలో ఉండే పోషకాలేమిటి?
ఉల్లి తక్కువ కాలరీలు ఉండే ఆహారం అని డైటీషియన్ డాక్టర్ అర్చనా గుప్తా చెప్పారు.
అందులో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయని, విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని చెప్పారు.
100 గ్రాముల ఉల్లిలో 4 మిల్లీ గ్రాముల సోడియం, 1 మిల్లీ గ్రామ్ ప్రోటీన్, 9 నుంచి 10 మిల్లీ గ్రాముల కార్బోహైడ్రేట్స్, 3 మిల్లీ గ్రాముల ఫైబర్ ఉంటుందని ఆమె చెప్పారు.
ఉల్లి గురించి ఈ విశేషాలు మీకు తెలుసా?
- ప్రపంచంలో అతి పెద్ద ఉల్లిపాయ 2015లో పండింది. బ్రిటన్‌లోని లీస్టర్స్‌షైర్‌లో పండిన ఈ ఉల్లిపాయ బరువు 8.49 కేజీలు.
- ఉల్లిలో 85 శాతం నీరు ఉంటుంది.
- ఉల్లిపాయలు కోసేటప్పుడు ‘సిన్ ప్రొపనెథియల్ ఎస్ ఆక్సైడ్’(Syn-propanethial-S-oxide) అనే రసాయనం విడుదలవుతుంది. ఇది కళ్ల కొనల్లో ఉండే లాక్రిమల్ గ్రంథులను ఉత్తేజితం చేయడం వల్ల కన్నీళ్లు వస్తాయి.
ఇవి కూడా చదవండి:
- చంద్రయాన్-3 ల్యాండింగ్‌లో ఆ 15 నిమిషాలే ఎందుకు కీలకం... ‘ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ టెర్రర్’ అని ఇస్రో మాజీ చైర్మన్ ఎందుకన్నారు?
- BRICS కూటమి ఎలా మొదలైంది... ఇందులో చేరాలని 40 దేశాలు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నాయి?
- ఎంటర్ ది డ్రాగన్‌కు 50 ఏళ్లు: విడుదలకు ముందే బ్రూస్ లీ ఎలా మరణించారు, ఈ చిత్రం సినిమా చరిత్రను ఎలా మార్చింది?
- మేడ మీద చేపల పెంపకం - ఆదాయం ఎంతో తెలుసా
- చంద్రుడు లేకపోతే భూమికి ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














