ఎంటర్ ది డ్రాగన్‌కు 50 ఏళ్లు: విడుదలకు ముందే బ్రూస్ లీ ఎలా మరణించారు, ఈ చిత్రం సినిమా చరిత్రను ఎలా మార్చింది?

ఫొటో సోర్స్, Alamy
- రచయిత, టామ్ గ్రే
- హోదా, బీబీసీ ప్రతినిధి
కిక్‌లు, పంచ్‌లతో అంతర్జాతీయ చలనచిత్ర రంగ స్వరూపాన్ని మార్చేసిన బ్రూస్ లీ సినిమా ‘ఎంటర్ ది డ్రాగన్’ విడుదలై ఆగస్టు 19తో 50 ఏళ్లు నిండాయి.
తన అనూహ్యమైన వేగం, పవర్ పంచ్‌లతో ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ హాలీవుడ్‌లో మార్షల్ ఆర్ట్స్ సినిమాలకు ఈ సినిమా ద్వారా బ్రూస్ లీ గొప్ప పుష్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు.
కానీ, సినిమా సక్సెస్‌ను చూడకముందే ఆయన ప్రపంచాన్ని వీడారు.
1973 జులై 20న తన 32 ఏళ్ల వయసులో బ్రూస్ లీ హాంకాంగ్‌లో మరణించారు.
ఆయన నటించిన ఆఖరి సినిమా హాలీవుడ్‌లో ఒక ఐకానిక్ చిత్రంగా మిగిలిపోయింది.
బ్రూస్ మరణించిన తర్వాత నెల రోజులకు ‘ఎంటర్ ది డ్రాగన్’ సినిమా 1973 ఆగస్ట్ 19న విడుదలైంది.
ఒక మార్షల్ ఆర్ట్స్ టోర్నీ మాటున సాగుతున్న మాదకద్రవ్యాలు, వ్యభిచార ముఠాల అక్రమాలను బయటపెట్టేందుకు బ్రూస్ లీ చేసే ప్రయత్నాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతూ ఉంటుంది.
దుర్మార్గులైన విలన్‌లతో హీరో తన మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్‌తో వారితో ఎలా పోరాడారన్నది ఈ సినిమా కథాంశం.
ఈ సినిమాను ‘సాంస్కృతికంగా ప్రాముఖ్యత’ ఉన్న సినిమా కేటగిరీ కింద 2004 సంవత్సరంలో ఈ చిత్రాన్ని అమెరికా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌లోని ఫిల్మ్ లైబ్రరీలో భద్రపరిచారు.
అయితే, నిర్మాణ సమయంలో ఈ సినిమా అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. మొట్టమొదటిసారి చైనీస్, అమెరికన్ సినిమా ప్రొడక్షన్ కంపెనీలు చేతులు కలిపి ఈ సినిమాను నిర్మించాయి.
అయితే, భాషాపరమైన సమస్యలు, స్క్రిప్ట్ సమస్యలతోపాటు, హీరోకు అస్వస్థతలాంటి సమస్యలు ఎదురయ్యాయి. నిర్మాణ సంస్థలు బయటకు చెప్పిన దానికంటే సగం బడ్జెట్‌కే సినిమా సిద్ధమైందని ఆ చిత్రం అసోసియేట్ ప్రొడ్యూసర్ ఆండ్రీ మోర్గాన్ బీబీసీతో అన్నారు. అయితే, లాభాలు మాత్రం భారీగా వచ్చాయి.

ఫొటో సోర్స్, Alamy
అరుదైన స్టార్
70ల ప్రారంభం నాటికి "ది కింగ్ ఆఫ్ కూల్"గా పేరున్న హీరో మెక్ క్వీన్ హాలీవుడ్‌ను ఏలుతున్నారు. ‘ది మాగ్నిఫిసెంట్ సెవెన్’, ‘ది గ్రేట్ ఎస్కేప్’, ‘బుల్లిట్ అండ్ ది థామస్ క్రౌన్ ఎఫైర్’ లాంటి ఐకానిక్ సినిమాలతో హాలీవుడ్‌ను ఏలారు.
అయితే, 1940లో శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించి, హాంకాంగ్‌లో చాలా సంవత్సరాలు గడిపిన బ్రూస్ లీ కూడా ఆ తర్వాత హాలీవుడ్‌ను ఏలారు.
1959లో అమెరికాకు తిరిగి వచ్చిన తర్వాత సీటెల్‌లో స్థిరపడ్డారు బ్రూస్ లీ. ఫిలాసఫీ చదవడం కోసం వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో చేరారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని, సినిమా జీవితాన్ని ప్రారంభించడానికి బ్రూస్ లీ కాలిఫోర్నియా చేరుకున్నారు.
సినిమాల విషయంలో ఆయన ఉత్సాహం ఎలా ఉన్నా, ఆయనకో పెద్ద అడ్డంకి ఉంది. చైనా జాతీయుడు అనే ముద్ర అందులో ఒకటి. 61 కేజీల బరువు, 5 అడుగులు, 7 అంగుళాల ఎత్తుతో హాంకాంగ్ సినిమాల్లో తన మార్షల్ ఆర్ట్స్‌తో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించినా, బాల నటుడిగా అప్పటికే గుర్తింపు ఉంది.
కానీ, కాంటూనీస్ (హాంకాంగ్) యాసతో మాట్లాడే ఈ నటుడిని నమ్ముకుని సినిమాకు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలేదు హాలీవుడ్ నిర్మాతలు.
అమెరికాలో పదేళ్లు ప్రయత్నించినా, తన కెరీర్‌లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో విసుగెత్తిన బ్రూస్, 1971లో తిరిగి హాంకాంగ్ వచ్చేశారు. అక్కడ ది బిగ్ బాస్, ఫస్ట్ ఆఫ్ ఫ్యూరీ, ది వే ఆఫ్ డ్రాగన్ అనే మూడు యాక్షన్ సినిమాల్లో సక్సెస్ అయ్యారు. ఇందులో ది వే ఆఫ్ డ్రాగన్‌కు ఆయనే దర్శకుడు కూడా.
ఈ సినిమాలన్నీ హాలీవుడ్ ప్రమాణాలతో పోలిస్తే చాలా లో గ్రేడ్ మూవీస్ అనుకోవాలి. కాకపోతే, ఈ సినిమాలన్నీ ఆసియా దేశాల్లో బాక్సాఫీసులను కొల్లగొట్టాయి. దీంతో హాలీవుడ్ నిర్మాతలు ఆయన కోసం పరుగులు పెట్టారు. ఆ క్రమంలో పుట్టిందే ఎంటర్ ది డ్రాగన్

ఫొటో సోర్స్, Alamy
ఫైటింగ్ శైలిని మార్చిన బ్రూస్ లీ
మార్షల్ ఆర్ట్స్‌తో కూడిన యాక్షన్ సన్నివేశాల కోసం మాత్రమే ఎంటర్ ది డ్రాగన్ సినిమాను చూడాలి తప్ప, కథ, సినిమాటోగ్రఫీలాంటి వాటి కోసం దీన్ని చూడాల్సిన అవసరం లేదు. మార్షల్ ఆర్టిస్ట్‌గా బ్రూస్ లీ తన సమకాలీనుల కంటే చాలా ముందుండే వాడు.
కుంగ్ ఫూ, కరాటే,జూడో వంటి ట్రెడిషనల్ ఫైటింగ్ స్టైల్స్‌ను గౌరవిస్తూనే, దానికే కట్టుబడి ఉండే తత్వాన్ని అతను దూరంగా పెట్టారు. పోరాట దృశ్యాలలో తనదైన స్టైల్‌ను సృష్టించుకున్నారు బ్రూస్ లీ.
జీత్ కున్ డో అన్నది ఆయన సొంతంగా సృష్టించిన మార్షల్ ఆర్ట్స్ విధానం. దీన్నే క్రీడా పరిభాషలో మిక్స్‌డ్ మార్షల్స్ ఆర్ట్స్ అనొచ్చు.
ఎంటర్ ది డ్రాగన్ సినిమా ప్రారంభ సన్నివేశంలో, తర్వాత కాలంలో హాంకాంగ్ సినిమా స్టార్‌గా మారిన హాంగ్ అనే నటుడితో బ్రూస్ లీ ఫైట్ చేస్తారు.
ఈ ఫైటింగ్‌లో ఇద్దరు యాక్టర్లు చేతికి బిగుతైన గ్లవ్స్, ఒంటి మీద చిన్న నిక్కర్లు తొడుక్కుని ఫైటింగ్ చేస్తూ కనిపిస్తారు. ఈ డ్రెస్సింగ్ స్టైల్ ఆ తర్వాత కాలంలో అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్ షిప్ కు ప్రతీకాత్మకంగా మారింది.
ఎంటర్ ది డ్రాగన్ సినిమా కళకు, జీవితానికి ఉన్న అనుబంధాన్ని నిరూపిస్తుంది. ఈ సినిమాలో నటించినవారిలో చాలామంది వ్యవస్థీకృత నేరాలతో సంబంధం ఉన్న గ్యాంగుల నుంచి వచ్చిన వారే. వీరందరికీ మార్షల్స్ ఆర్ట్స్, స్ట్రీట్ ఫైటింగ్‌లతో అనుభవం ఉంది. సినిమాలో నిజ జీవితాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు బ్రూస్ లీ.
ఎంటర్ ది డ్రాగన్ కోసం అప్పటి వరకు ఏ సినిమాలోనూ వాడని అత్యంత అధునాతనమైన, శారీరకంగా శ్రమించాల్సిన ఫైట్ కొరియోగ్రఫీని సృష్టించారు బ్రూస్ లీ. చేతులతో చేసే ఫైటింగ్‌తోపాటు సంప్రదాయ ఆయుధాలను ఉపయోగించడం ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది.
‘‘గతంలో తనను ఎవరూ శ్రమ పెట్టనంతగా తన శరీరాన్ని శ్రమపెట్టుకున్నాడు బ్రూస్‌లీ. ఒక్కోసారి అతను బాగా మానసికంగా, శారీరకంగా అలసిపోవడం, డీ హైడ్రేషన్ వరకూ వెళ్లేవాడు. కానీ, వాటి పరిమితులు ఎంత వరకో ఆయనకు తెలుసు. తాను ఏం చేస్తున్నాడో తనకు బాగా తెలుసు’’ అని మోర్గాన్ అన్నారు.

ఫొటో సోర్స్, Alamy
విషాద ఘటన
ఎంటర్ ది డ్రాగన్ సినిమా 1973 ఏప్రిల్ నాటికి చిత్రీకరణ పూర్తయింది. లాస్ ఏంజెలెస్‌లో దీని రఫ్ కట్ చూసిన తర్వాత బ్రూస్ లీ ఈ సినిమాపై అంచనాలు పెంచుకున్నారు.
సినిమాకు డబ్బింగ్ చెప్పే క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను హడావుడిగా ఆసుపత్రికి తరలించారు. చివరకు అది సెరిబ్రల్ ఎడెమీ(మెదడువాపు) అని తేలింది. అది ఎందుకు వచ్చిందో ఎవరూ చెప్పలేకపోయారు.
అయితే, బ్రూస్ లీ శరీరం 18 ఏళ్ల కుర్రాడి శరీరంలా ఉందని, ఆయన కోలుకుని తిరిగి హాంకాంగ్ వెళ్లి సినిమాల్లో నటించగలరని డాక్టర్లు హామీ కూడా ఇచ్చారు.
కానీ, రెండు నెలల తర్వాత ఆయన ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న బెట్టీ టింగ్ పెయి అనే మహిళ ఇంట్లో ఉండగా ఆయన స్పృహ కోల్పోయారు. ఈసారి అది ప్రాణాంతకంగా మారింది.
ఆయన మరణానికి సరైన కారణమేంటనేది ఇప్పటి వరకు అంతుచిక్కలేదు. పెయిన్ కిల్లర్‌లు ఎక్కువగా వాడటం వల్ల ఈ మరణం సంభవించిందని అప్పట్లో వైద్యులు ప్రకటించారు.
లాస్ ఏంజిల్స్‌లోని గ్రామాన్స్ (ఇప్పుడు టీసీఎల్ ) చైనీస్ థియేటర్‌లో ఎంటర్ ది డ్రాగన్ విడుదల కావడానికి కొద్ది రోజుల ముందు లీ మృతదేహాన్ని సీటెల్‌కు తరలించారు. ప్రీమియర్ ఒక అద్భుతమైన సందర్భం కావాలి. కానీ విషాదంగా మిగిలింది.
ఇవి కూడా చదవండి:
- యూసీసీ: హిందూ, ముస్లిం చట్టాలపై ఉమ్మడి పౌర స్మృతి ప్రభావమేంటి... వారసత్వ ఆస్తి హక్కులు కూడా మారిపోతాయా?
- భారత విద్యార్థులను అమెరికా ఎందుకు తిప్పి పంపుతోంది? స్టూడెంట్స్ ఏం చేయాలి? ఏం చేయకూడదు?
- గ్రీన్ ట్యాక్స్: తెలంగాణలో 500.. ఆంధ్రపదేశ్‌లో 6,660. ఏపీలో భారీ పన్నులపై వాహనదారుల గగ్గోలు
- పీరియడ్స్ సమయంలో అథ్లెట్ల శిక్షణ ఎలా కొనసాగుతుంది... వారు ఎదుర్కొనే సమస్యలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















