పీరియడ్స్ సమయంలో అథ్లెట్ల శిక్షణ ఎలా కొనసాగుతుంది... వారు ఎదుర్కొనే సమస్యలేంటి?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, జాహ్నవి మూలే
- హోదా, బీబీసీ మరాఠీ
‘‘విజయవంతంగా మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన తర్వాత, నేను తిరిగి కిందకి వస్తున్నాను. నేనింకా 8000 మీటర్ల దూరంలో ఉండగానే నాకు పిరియడ్స్ వచ్చాయి’’ అని తన అనుభవాన్ని ప్రియాంక మోహితే చెప్పారు.
8000 మీటర్లకు పైగా ఎత్తులో ఉన్న ఐదు శిఖరాలను అధిరోహించిన తొలి భారతీయ మహిళా పర్వతరోహిణిగా ప్రియాంక మోహితే నిలిచారు.
తన అనుభవాలను ప్రియాంక పంచుకున్నారు.
‘‘నేను చాలా అలసిపోయాను. ఆక్సిజన్‌తో నేను 12 గంటల పాటు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాను. నా పిరియడ్స్ 10 రోజుల తర్వాత రావాలి. కానీ, అలసట, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో నాకు ముందుగానే పిరియడ్స్ వచ్చాయి. నేను దానికి సిద్ధంగా లేను. రెండు రోజుల పాటు నేను టిస్యూ పేపర్‌నే ప్యాడ్‌లాగా వాడాను’’ అని ప్రియాంక మోహితే చెప్పారు.
ఫిఫా మహిళల ప్రపంచ కప్ నేపథ్యంలో మహిళా క్రీడాకారులు ఎలా తమ పిరియడ్స్‌ను మేనేజ్ చేసుకోగలుగుతారు అనే అంశంపై చర్చ చేపట్టినప్పుడు, ప్రియాంక మోహితేను తన నెలసరి అనుభవాన్ని పంచుకోవాలని కోరాం.
ఈ టోర్నమెంట్‌కి ఒక్కరోజు ముందు, న్యూజీలాండ్ ఫుట్‌బాల్ జట్టు తన జెర్సీని మార్చింది. పిరియడ్స్ సమయంలో తెల్లటి వస్త్రాలతో వచ్చే సమస్యలను పరిగణనలోకి తీసుకుని, వారు నీలం రంగు జెర్సీని ఎంపిక చేసుకున్నారు.
ఇదే కారణంతో, మహిళా టెన్నిస్ క్రీడాకారులు రంగురంగుల అండర్‌షార్ట్స్‌ను ధరించేలా వింబుల్డన్ నిబంధనలను సరళీకరించారు.
మహిళా క్రీడాకారులు పిరియడ్స్ సమయంలో ఆటలు ఆడటం కొత్త విషయమేమీ కాదు. కొంతమంది పిరియడ్స్ సమయంలో కూడా ఘన విజయాలను సాధిస్తున్నారు.
వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను తనకు పిరియడ్స్ ఉన్నప్పుడే టోక్యో 2020లో రజత పతకాన్ని గెలుచుకున్నారు.
మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు శారీరకంగా, మానసికంగా తానెలా సిద్ధమయ్యారో మీరాబాయి చాను వివరించారు.
మహిళా క్రీడాకారులకు పిరియడ్స్ అనేవి అతిపెద్ద సవాలుగా ఉంటున్నాయి. చాలా మంది దీని గురించి ఎక్కువగా మాట్లాడటం లేదు కూడా.
ఇతర మహిళల లాగానే, మహిళా క్రీడాకారుల శరీరంలో కూడా వివిధ రకాల మార్పులు వస్తుంటాయి.
పిరియడ్స్ సమయంలో వచ్చే ఈ మార్పులకు మహిళా క్రీడాకారులు ఎలా అడ్జెస్ట్ అవుతున్నారో తెలుసుకునేందుకు మేం ప్రయత్నించాం.
పిరియడ్స్ సమయంలో ఆడటం కష్టమా?
పిరియడ్స్ సమయంలో మూడ్ స్వింగ్స్ అవ్వడం, పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి, వెన్నునొప్పి, కాళ్లు లాగుతుండటం, నొప్పి రావడం, అలసటగా, నీరసంగా ఉండటం వంటి వాటిని మహిళా క్రీడాకారులూ ఎదుర్కొంటారు.
ఇతర మహిళలు అయితే వీటికి నొప్పి తగ్గే టాబ్లెట్లు తీసుకుంటారు. కానీ, క్రీడల్లో ఉన్న కఠినతరమైన నిబంధనల వల్ల, క్రీడాకారులు తమకు తాము ఎలాంటి టాబ్లెట్లను తీసుకోవడానికి వీలులేదు.
పిరియడ్స్ సమయంలో కూడా వారు శిక్షణ తీసుని, మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సిందే.
దీనిపై స్వీడన్‌లోని కరోలింస్కా ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన సెసిలియా ఫ్రిడెన్ దీనిపై ఒక అధ్యయనం చేపట్టింది.
రుతుక్రమం ముందు, ఆ సమయంలో మహిళలకు అత్యధిక గాయాలు అవుతున్నాయని ఈ అధ్యయనం గుర్తించింది.
ఓవల్యూషన్ సమయంలో(14వ రోజు) మహిళలకు మోకాళ్ల గాయాలయ్యే అవకాశాలు అధికంగా ఉంటున్నాయి.
21వ రోజు నుంచి 28వ రోజు వరకు అలసట, మూడ్ స్వింగ్స్‌ను ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది.
టాప్ మహిళా క్రీడాకారుల్లో సగం మందికి పైగా హార్మోన్ మార్పులను ఎదుర్కొంటున్నారని, ఇది వారి శిక్షణ, ప్రదర్శనపై ప్రభావం చూపుతుందని 2016లో నిర్వహించిన మరో అధ్యయనం తెలిపింది.
ఈ అధ్యయనాన్ని చేపట్టిన డాక్టర్ జియోజ్రీ బ్రుయిన్‌వెల్స్ కూడా క్రీడాకారిణినే.
‘‘ఓవల్యూషన్‌కి ముందు మహిళల శరీరంలో ఇస్ట్రోజెన్ స్థాయిలు అధికంగా ఉంటాయి. ఈ సమయంలో వారు క్రీడల్లో అత్యధిక సామర్థ్యం చూపిస్తామని మహిళలు భావిస్తారు. కానీ, ఓవల్యూషన్‌కి కొద్ది సమయం ముందు దీని స్థాయిలు తగ్గిపోతాయి’’ అని ఆమె తెలిపారు.
‘‘ఆ తర్వాత దశలలో ప్రోజెస్టిరోన్ హార్మోన్ పెరుగుతుంది. దీని వల్ల శరీరంలో ఉష్ణోగ్రతలు, శ్వాస ఇబ్బంది, గుండె కొట్టుకోవడం పెరగడం జరుగుతుంటాయి. ఇది మెటబాలిక్ రేటుపై ప్రభావం చూపుతుంది. అందుకే, మీరు తీసుకునే ఆహారంలో మార్పులు చేయాలి’’ అని జియోజ్రీ చెప్పారు.
ఈ హార్మోన్ మార్పులను క్రీడాకారులు తెలుసుకుంటే, వారి శిక్షణ సమయాన్ని మార్చుకునేందుకు ఇది వారికి సాయంగా నిలుస్తుంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
పిరియడ్స్ సమయంలో శిక్షణ
‘‘ఒకవేళ ఏదైనా పెద్ద మ్యాచ్ ఉంటే, క్రీడాకారులు తమకు పిరియడ్స్ రాకపోతే సెలబ్రేట్ చేసుకునే వారు. కానీ, పిరియడ్స్ వస్తే ఇవన్నీ మారిపోతాయి’’ అని ఈ ఏడాది ప్రపంచ కప్‌లో ఓపెనింగ్ గోల్ కొట్టిన న్యూజీలాండ్ ఫుట్‌బాల్ ప్లేయర్ హన్నా విల్కిన్సన్ అన్నారు.
పిరియడ్స్ సమయంలో కూడా శారీరకంగా, మానసికంగా ఆడేందుకు సిద్ధంగా ఉండాలని ఆమె చెప్పారు.
‘‘పిరియడ్స్ సమయంలో కూడా నేను శిక్షణ తీసుకుంటాను. కనీసం వాకింగ్‌కు వెళ్లడం, ట్రెడ్‌మిల్ వర్కవుట్, యోగా, స్ట్రెచ్చింగ్ వంటివి చేస్తాను. పిరియడ్స్ సమయంలో కొన్ని శారీరక వ్యాయామాలను దూరంగా ఉంటాను. కానీ, పూర్తిగా వ్యాయాయం చేయడం మాత్రం ఆపను’’ అని ప్రియాంక మోహితే అన్నారు.
‘‘పిరియడ్స్ వస్తాయని తెలిసినా లేదా టైమ్ దగ్గర పడినా విద్యార్థులు నాకు ముందే చెబుతారు’’ అని గత 30 ఏళ్లుగా జిమ్నాస్టిక్స్ శిక్షణ ఇస్తోన్న మహారాష్ట్రకు చెందిన సీనియర్ కోచ్ హరీశ్ పరాబ్ చెప్పారు.
‘‘అప్పుడు వారి శిక్షణను, ప్రాక్టీసును దానికి అనుగుణంగా మారుస్తాను. పిరియడ్స్ సమయంలో వారి శరీరంపై అత్యధిక ఒత్తిడిని పెట్టకుండా చూసుకుంటాను. దీంతో, పిరియడ్స్ సమయంలో కూడా టోర్నమెంట్లను లేదా ట్రయల్స్‌ను ఎదుర్కొనేందుకు వారు శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉంటారు’’ అని తెలిపారు.
శిక్షణ, ఆహారం రెండూ కూడా వారికి అత్యంత కీలకమైనవిగా చెప్పారు.
‘‘చాలా మంది జిమ్నాస్ట్‌లు త్వరలోనే ట్రైనింగ్ ప్రారంభించబోతున్నారు. 12 ఏళ్ల వయసున్నప్పుడే, వారి ఆహారానికి సంబంధించి మేం పోషకాహార నిపుణులను సంప్రదిస్తాం. వారికి సరైన ఐరన్, కాల్షియం ఉండేలా చేస్తాం. గైనకాలజిస్ట్‌లతో పలు సెషన్లను ఏర్పాటు చేస్తాం. దీంతో, బాలికలు వారి శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో వారు తెలుసుకోగలుగుతారు’’ అని హరీశ్ పరాబ్ చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
టెక్నాలజీ ఎలా సాయం చేస్తోంది?
హాకీ, ఫుట్‌బాల్, క్రికెట్ ఆటల్లో మొత్తం జట్టుకి ఒకే రకమైన ఫిట్‌నెట్ రూల్‌ను అమలు చేయలేం.
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క క్రీడాకారులకు భిన్నమైన వ్యాయామ విధానాలను ఫిట్‌నెట్ ట్రైనర్లు సూచిస్తున్నారు.
‘‘ఆటల శిక్షణకు, ప్రదర్శనకు రుతుక్రమం ఎంతో కాలంగా ఒక అడ్డంకిగా నిలుస్తోంది. కానీ, దీనికి మీరు మరో వైపు చూస్తే, శిక్షణ వదులుకోవడం కంటే సరైన విధానంలో శిక్షణ తీసుకుంటూ హార్మోన్ హెచ్చుతగ్గులను కూడా సమర్థవంతంగా వాడుకోవచ్చు’’ అని ఇంగ్లీష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్ డాక్టర్ రిచర్డ్ బర్డెన్ చెప్పారు.
ఈ హెచ్చుతగ్గులను గుర్తించుకునేందుకు క్రీడాకారులు యాప్‌లను వాడుకోవచ్చు.
క్లూ, ఫిట్‌బిట్ వంటి యాప్‌లు మహిళల పిరియడ్స్‌ను ట్రాక్ చేస్తుంటాయి.
ఫిట్‌ఆర్ఉమెన్(FitRWoman) అనే యాప్ మరింత సాయంగా నిలుస్తోంది. ప్రతి రుతుక్రమ సైకిల్‌లో శిక్షణా విధానం, పోషకాహారం, ఫిజియాలజీ సపోర్ట్ వంటి వాటిని ఇది రూపొందిస్తోంది.
ఈ యాప్‌ను స్పోర్ట్స్ టెక్ కంపెనీ ఒరేకో అభివృద్ధి చేసింది.
ఈ యాప్ అభివృద్ధిలో డాక్టర్ జియోజ్రీ అధ్యయనం చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది.
డాక్టర్ జియోజ్రీ అమెరికా ఫుట్‌బాల్ జట్టుతో కలిసి పనిచేశారు. 2019లో ఈ జట్టు ప్రపంచకప్‌ను గెలుచుకున్నప్పుడు, శిక్షణ సమయంలో ఈ టెక్నాలజీ వారికి బాగా సాయం చేసింది.
వస్త్రాల కంపెనీలు కూడా మహిళా క్రీడాకారులకు అనువైన రీతిలో బట్టలను తయారు చేస్తున్నాయి.
పిరియడ్స్ సమయంలో అవసరమయ్యే లీక్‌ప్రూఫ్ బట్టలను మార్కెట్లోకి బట్టల కంపెనీలు తీసుకొస్తున్నాయి.

ఫొటో సోర్స్, PRIYANKA MOHITE/FACEBOOK
పిరియడ్స్ గురించి బహిరంగంగా మాట్లాడటం అత్యంత ముఖ్యం
క్రీడాకారులు రుతుక్రమం గురించి బహిరంగంగా మాట్లాడటం ప్రారంభించాలని పర్వతరోహిణి ప్రియాంక మోహితే భావిస్తున్నారు.
తొలుత తాను కూడా పిరియడ్స్ గురించి మాట్లాడాలంటే చాలా సిగ్గుపడేదాన్ని అని, కానీ ఇప్పుడు హైస్కూల్, కాలేజీల్లో అమ్మాయిలను, అబ్బాయిలను కలిసినప్పుడు, దీని గురించి మాట్లాడుతున్నట్లు చెప్పారు.
‘‘అన్నపూర్ణ శిఖరం ఎక్కేటప్పుడు, మా టీమ్‌లో నలుగురు అబ్బాయిలు ఉండేవారు. మేమంతా ఒకే టెంట్‌లో ఉండేవాళ్లం. పిరియడ్స్ పాడ్స్ లేదా కప్స్ మార్చుకోవాలంటే టెంట్‌లోనే మార్చుకోవాలి. ఎందుకంటే బయట అంత చలి గాలులు, మంచు ఉండేది. అందుకే, మీ టీమ్‌తో నమ్మకమే సంబంధాన్ని మీరు ఏర్పరుచుకోవాలి’’ అని ఆమె తెలిపారు.
సంప్రదాయంగా పురుషాధిక్యం ఉన్న రెజ్లింగ్ స్పోర్ట్‌లో పిరియడ్స్‌ను, రుతుక్రమాన్ని ఒక నిషేధిత అంశంగా చూస్తున్నారని అర్జున అవార్డు గ్రహీత, భారత రెజ్లర్ దివ్యా కక్రాన్ అన్నారు.
‘‘అమ్మాయిలు కోచ్‌కి చెప్పకపోతే వారు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. శుభ్రమైన మరుగుదొడ్లు ఉండవు. ప్యాడ్ లేదా కప్ మార్చుకునేందుకు సరైన స్థలం ఉండదు. ఒకవేళ పదేపదే టాయిలెట్‌కి వెళ్లినప్పుడు, మీ బట్టలు తడసిపోతాయి. అప్పుడు మీరు కోచ్‌కి ఏం చెబుతారు. పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి’’ అని ఆమె అన్నారు.
కోచ్‌ల పాత్ర ఈ సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. గత 30 ఏళ్లలో పరిస్థితులు చాలా మారాయని హరీశ్ పరాబ్ అన్నారు.
‘‘తల్లిదండ్రులకు అంతకుముందు కంటే ఎక్కువ అవగాహన ఉంటుంది. దీంతో వారు మహిళా క్రీడల్లో పిరియడ్స్ గురించి బహిరంగంగానే చర్చిస్తున్నారు. అమ్మాయిలు కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ ఎవరైనా నేరుగా నాతో మాట్లాడలేకపోతే, సీనియర్ ఆటగాళ్లు లేదా మహిళా అసిస్టెంట్ కోచ్‌లతో మాట్లాడతారు.’’ అని తెలిపారు.
అత్యంత ముఖ్యమైన ఏంటంటే, పిరియడ్స్ గురించి మహిళా క్రీడాకారులు బహిరంగంగా, నిజాయితీగా చర్చలు జరపాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
- ఎలినా స్వితోలినా: వింబుల్డన్‌లో ఆమె సెమీస్‌కు చేరుకోవడం ఎంతో స్పెషల్... ఎందుకో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు
- అజిత్ అగార్కర్: 2023 వరల్డ్ కప్ టీం ఎంపిక చేయనున్న ఈ చీఫ్ సెలక్టర్ 2003 ప్రపంచ కప్ జట్టులో ఉన్నా ఒక్క మ్యాచ్ కూడా ఎందుకు ఆడలేకపోయాడు
- వెస్టిండీస్: ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఈ జట్టు వరల్డ్ కప్ 2023కి ఎందుకు అర్హత సాధించలేకపోయింది?
- సర్ఫరాజ్ ఖాన్: 37 మ్యాచ్‌లలో 13 సెంచరీలు.. అయినా టీమ్ఇండియాకు సెలక్ట్ చేయలేదు.. లావుగా ఉంటే ఆడనివ్వరా
- వరల్డ్ కప్ 2023: భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















