జ్యోతి యర్రాజీ: ఆసియన్ గేమ్స్ 100 మీటర్ల హర్డిల్స్‌లో విశాఖ అథ్లెట్‌కు సిల్వర్ మెడల్

ఫొటో సోర్స్, Twitter/SAI Media
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
ఆసియా క్రీడల్లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ రజత పతకం సాధించారు. 100 మీటర్ల హర్డిల్స్ విభాగంలో ఆదివారం నాడు జరిగిన పోటీల్లో జ్యోతి ఈ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఈ విభాగంలో చైనా క్రీడాకారిణి వూ యానీ రేస్ ప్రారంభానికి ముందే పరుగు ప్రారంభించడంతో గందరగోళం ఏర్పడింది. వూ పక్కనే ఎడమవైపున ఉన్న జ్యోతి కూడా ఆమె పరుగు ప్రారంభించడంతో తాను కూడా ప్రారంభించారు.
దాంతో, పోడియం వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మొదట అధికారులు ఈ ఇద్దరు అథ్లెట్లూ తప్పు చేసినట్లు భావించారు. ఆ తరువాత జ్యోతి తప్పేమీ లేదని నిర్ణయించారు.
వూ యన్నీ రెండో స్థానంలో నిలిచినప్పటికీ పాల్స్ స్టార్ట్ చేసినందుకు అధికారులు ఆమెను అనర్హురాలిగా ప్రకటించారు. మూడో స్థానంలో నిలిచిన జ్యోతిని రెండో స్థానంలో సిల్వర్ మెడల్‌కు ఎంపిక చేశారు.

ఫొటో సోర్స్, M Narayana rao
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్
విశాఖపట్నానికి చెందిన జ్యోతి యర్రాజీ గత జూలైలో బ్యాంకాక్‌లో జరిగిన 25వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రేసులో గోల్డ్ మెడల్ సాధించారు.
50 ఏళ్ల ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా జ్యోతి యర్రాజీ నిలిచారు. ఆ సందర్భంలో ఆమె బీబీసీ తెలుగుతో మాట్లాడారు.
“మా నాన్న సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. ఆయనకు స్ట్పోర్ట్ పై పెద్దగా అవగాహన లేదు. కానీ ఏదైనా సాధించాలని నన్ను ఆయన ప్రోత్సహించారు. గోల్డ్ మెడల్ గెలిచానని చెప్పినప్పుడు, ఇంకా నువ్వెంత దూరం పరిగెడతావో పరిగెత్తు... నీ ఇష్టం అని ఆయన అన్నప్పుడు సంతోషంతో కన్నీళ్లు వచ్చాయి” అని ఆమె చెప్పారు.
జాతీయ స్థాయిలో 100 మీటర్ల హర్డిల్స్ రేసులో 12.82 సెకన్ల రికార్డు ఉన్న జ్యోతి, ఈ అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లో ఇదే దూరాన్ని 13.09 సెకన్లలో పూర్తి చేశారు.
ఈ రేసులో జ్యోతికి జపాన్‌కు చెందిన టెరాడా అసుకా (13.13 సెకన్లు), అయోకి మసుమి (13.26 సెకన్లు) గట్టి పోటీ ఇచ్చారు.
ఈ విజయంతో బుడాపెస్ట్‌లో జరుగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌కు జ్యోతి అర్హత కూడా సాధించారు.

ఫొటో సోర్స్, M Narayana rao
భువనేశ్వర్‌లో శిక్షణ
ఒడిశా భువనేశ్వర్‌లో రిలయన్స్ అథ్లెటిక్స్ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో ఇంగ్లండ్‌కు చెందిన కోచ్ జేమ్స్ హిల్లర్ ఆధ్వర్యంలో జ్యోతి శిక్షణ పొందుతున్నారు.
కొంత కాలంగా ఆమె జాతీయ, అంతర్జాతీయ పతకాలను సాధించడంతో పాటు తాను నెలకొల్పిన రికార్డులను తానే అధిగమిస్తూ వస్తున్నారు.
జ్యోతి తల్లిదండ్రులు కుమారి, సూర్యనారాయణ. సూర్యనారాయణ ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో గార్డుగా పని చేస్తున్నారు. తల్లి గృహిణి.
విశాఖపట్నంలోని కైలాసపురంలో నివాసముండే సూర్యనారాయణ దంపతులకు జ్యోతి 1999 ఆగష్టు 28న జన్మించారు.
ఆమె విశాఖలోని డాక్ లేబర్ బోర్డ్ స్కూల్‌లో పదవ తరగతి వరకు చదువుకున్నారు. ఆ పాఠశాలలో పీటీ ఉపాధ్యాయుడు శ్రీనివాస రెడ్డి క్రీడల పట్ల ఆమెకు ఉన్న ఆసక్తిని గమనించి ప్రోత్సహించినట్లు జ్యోతి బీబీసీకి చెప్పారు.
తన క్రీడా ప్రస్థానం, విజయాలు, భవిష్యత్తు లక్ష్యాలను జ్యోతి బీబీసీతో పంచుకున్నారు. వివరాలు ఆమె మాటల్లోనే...

ఫొటో సోర్స్, M Narayana rao
వేగం ఇంకా పెంచుకుంటా
‘‘రెండేళ్లుగా నిలకడగా రాణిస్తున్నాను. నా కెరియర్‌లో ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ గొప్ప విజయం. వాతావరణం అనుకూలించకపోవడంతో 13.09 సెకన్ల సమయం తీసుకున్నాను. లేదంటే 12.82 సెకన్లలోనే పూర్తి చేసేదాన్ని. ఎందుకంటే జాతీయ స్థాయిలో అదే నా రికార్డు.
ఈ చాంపియన్‌షిప్ కోసం పూర్తి ఫిట్‌నెస్ సాధించాను. దీనిలోనూ నా జాతీయ రికార్డైన 12.82ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. కానీ, రేసు ప్రారంభానికి ముందే వర్షం పడింది. తడిగా ఉన్న ట్రాక్ పై హర్డిల్స్ దాటుతున్నప్పుడు 6వ హర్డిల్ వరకు సులభంగా, నా సహజమైన స్పీడ్‌తోనే దూసుకుపోయాను. కానీ ఏడో హర్డిల్ వద్ద కొంచెం తడబాటుకు గురై, వేగం తగ్గింది. దీంతో 13 సెకన్లలోపు రేసును ముగించలేకపోయాను.
పతకాల కోసం ఆలోచన లేదు. భవిష్యత్తులో నా వేగాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నాను. ఆసియా చాంపియన్‌షిప్ విజయంతో ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించినందుకు ఆనందంగా ఉంది.

ఫొటో సోర్స్, M Narayana rao
విశాఖలో పూర్తిస్థాయి శిక్షణ కేంద్రాలు లేవు
ఇప్పటికీ మా నాన్న సెక్యూరిటీ గార్డుగానే పని చేస్తున్నారు. సెక్యూరిటీ గార్డు కూతురిగా ఫీల్డ్‌లోకి అడుగుపెట్టి, అంతర్జాతీయ స్థాయిలో రాణించడంపై నేను గర్వంగా ఫీలవుతున్నాను.
మా అమ్మ, నాన్నలకు క్రీడలంటే పెద్దగా తెలియదు. వాటిపై ఆసక్తి కూడా లేదు. అయితే నా చదువు సాగిన డీఎల్ బీ పాఠశాలలో పీటీ సర్ క్రీడలంటే నాకున్న ఉత్సాహన్ని గుర్తించారు. ఆయనే పాఠశాలలో జరిగే క్రీడల్లో నన్ను ప్రోత్సహించేవారు. 2015లో నేను పదో తరగతి పూర్తి చేశాను. ఆ తర్వాత నాకు డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ అసోసియేషన్ నుంచి మద్దతు లభించింది.
2015లో ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల మీట్‌లో బంగారు పతకాన్ని గెల్చుకున్నాను. ఆ తర్వాత మెరుగైన శిక్షణ కోసం హైదరాబాద్‌లోని శాయ్ సెంటర్‌కు వెళ్లాను. అక్కడ ఉండగానే గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో పెట్టిన సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో చేరే అవకాశం వచ్చింది. అయితే కొన్ని రోజుల శిక్షణ తర్వాత అది మూతపడింది.
విశాఖపట్నంలో పూర్తి స్థాయి శిక్షణ కేంద్రాలు లేవు. పైగా ఆర్థిక సమస్యలున్నాయి. ఆ సమయంలోనే అంటే 2019లో రిలయన్స్ ఆధ్వర్యంలో ఒడిశాలోని భువనేశ్వర్‌లో నడిచే అథ్లెటిక్స్ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్ నుంచి నాకు పిలుపు వచ్చింది.
అక్కడ నాకు ఇంగ్లండ్‌కు చెందిన జేమ్స్ హిల్లర్ కోచింగ్ ఇచ్చారు. ఇది నాకు ఎంతో ఉపయోగపడంది. ఆ శిక్షణతోనే నా వేగం మెరుగుపడింది.

ఫొటో సోర్స్, M Narayana rao
గుర్తింపు తేలిగ్గా రాలేదు
భువనేశ్వర్ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో కోచింగ్ తీసుకున్న తర్వాత నేను పాల్గొన్న పోటీల్లో నా ప్రతిభ అందరికీ కనిపించింది. కర్ణాటకలో జరిగిన ఆల్ ఇండియా ఇంటర్-యూనివర్శిటీ అథ్లెటిక్స్ మీట్‌లో 13.03 సెకన్లతో స్వర్ణం గెల్చుకున్నాను.
2020 ఫిబ్రవరిలో జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో మరో స్వర్ణం వచ్చింది. ఆ తర్వాత సంవత్సరం అంతర్జాతీయ ఈవెంట్లకు సిద్ధమయ్యాను.
కోవిడ్ మహమ్మారి కారణంగా 2021 వృథాగా పోయింది. అ తర్వాత 2022లో భువనేశ్వర్‌లో జరిగిన ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ మీట్‌తో మళ్లీ నా కెరియర్ ఊపందుకుంది.
2022 సెప్టెంబర్‌లో గుజరాత్‌లో జరిగిన జాతీయ పోటీల్లో 12.79 సెకన్లతో నా సమయం మెరుగుపడింది.
13 సెకన్ల కంటే తక్కువ సమయంలో రేసును పూర్తి చేసిన మొదటి భారతీయ మహిళగా నాకు గుర్తింపు లభించింది.
ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై 100 మీటర్ల పోటీలో సరికొత్త రికార్డును నెలకొల్పగలిగాను.
ఈ దశ వరకు చేరుకునే క్రమంలో 2022 మే నుంచి 2023లో ఇప్పటి వరకు అనేక సార్లు నా రికార్డును నేనే తిరగరాశాను. ఇది కూడా నాకు సంతోషాన్నిచ్చే అంశమే.

ఫొటో సోర్స్, M Narayana rao
ఒలింపిక్సే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే 12.77 సెకన్లలో హర్డిల్స్‌ను పూర్తి చేయాలి. ఇప్పటివరకు నా అత్యుత్తమ ప్రదర్శన 12.82 సెకన్లు. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే నా వేగం 0.05 సెకన్లు మెరుగవ్వాలి. దాని కోసం శ్రమిస్తున్నాను. ఒలింపిక్స్‌కు అర్హత సాధించి, పతకం గెలవడమే నా ప్రస్తుత లక్ష్యం.
టోక్యో ఒలింపిక్స్ 100 మీ. హర్డిల్స్ చాంపియన్ జాస్మిన్ కమాచోక్విన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమెను నేను ఆరాధిస్తాను. అందుకే ఆమెలాగా ఒలింపిక్స్ స్వర్ణం గెలవాలనే లక్ష్యం పెట్టుకున్నాను.
నాకు మొదట్నుంచీ టీం స్పోర్ట్‌లో కంటే వ్యక్తిగతంగా పోటీపడే విభాగాలంటేనే ఆసక్తి ఎక్కువ. అందుకు హర్డిల్స్ పరుగునే కెరియర్‌గా ఎంచుకున్నా.’’
అనురాగ్ ఠాకూర్, నీతా అంబానీ అభినందనలు
‘‘జ్యోతి ఎర్రాజీ ఆసియా రికార్డు నెలకొల్పుతుందని భావించాం. అయితే వర్షం కారణంగా జ్యోతి వేగాన్ని అందుకోలేకపోయినట్లు చెప్పింది. అయినా కూడా ఆమె స్వర్ణపతకం సాధించడం అందరికీ గర్వకారణం.’’ అని విశాఖ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ ఎం. నారాయణరావు బీబీసీతో అన్నారు.
“100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించి తన ప్రతిభను నిరూపించుకుంది. పేద కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ క్రీడాకారిణిగా రాణించడం మాకు గర్వకారణం.” అని నారాయణరావు అన్నారు.
స్వర్ణం నెగ్గిన జ్యోతికి కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ అభినందనలు తెలిపారు.
అంతర్జాతీయ హర్డిల్స్ పోటీల్లో జ్యోతి వేగం (సెకన్లలో)
- 2023 మేలో జర్మనీలో జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్ (12.84)
- 2023 మేలో నెదర్లాండ్స్‌లో జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్ (13.08)
- 2023 మేలో సైప్రస్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం (13.23 సెకన్లు)
- 2023 జూన్‌లో పోలండ్‌లో జరిగిన మహిళ 100 మీటర్ల హర్డిల్స్ (13.03)
- 2023 జూన్‌లో ఫిన్లాండ్‌లో జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్ (13.09)
జాతీయ హర్డిల్స్ పోటీల్లో జ్యోతి వేగం (సెకన్లలో)
- 2023 ఏప్రిల్‌లో బెంగళూరులో జరిగిన ఇండిన్ గ్రాండ్‌ప్రిక్స్ 100 మీటర్ల హర్డిల్స్‌లో వెండి పతకం (13.44)
- 2023 మేలో రాంచీలో జరిగిన 26వ నేషనల్ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 100 మీటర్ల హర్డిల్స్‌లో బంగారు పతకం (12.89)
- 2023 జూన్‌లో భువనేశ్వర్‌లో జరిగిన 62 నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 100 మీటర్ల హర్డిల్స్‌లో బంగారు పతకం (12.92)
- 2022 ఏప్రిల్‌లో నేషనల్ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 100 మీటర్ల హర్డిల్స్‌లో బంగారు పతకం (13.09)
- 2022 అక్టోబర్‌లో బెంగళూరులో జరిగిన 61వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో బంగారు పతకం (12.82)
100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి సాధించిన 12.82 సెకన్ల రికార్డు ఇప్పటికీ జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది.
ఇవి కూడా చదవండి
- బేబీ రివ్యూ: ‘అమ్మాయిని ఓ అబ్బాయి ఇంతలా ప్రేమిస్తాడా? ’ అనిపించే ఈ కథలో నిజమైన ప్రేమ ఎవరిది?
- Annuity plans: నెల జీతంలాగా స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే మార్గమిది, ఎవరు చేరొచ్చు, తెలుసుకోవాల్సిన విషయాలేంటి
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















