విశాఖపట్నం: రొయ్యల ధరలు ఎందుకు తగ్గిపోతున్నాయి

రొయ్యల గ్రేడింగ్
ఫొటో క్యాప్షన్, తూర్పు తీరంలో టైగర్, వైట్, బ్రౌన్, సింక్ రొయ్యలు మత్స్యకారుల వలలకు భారీగా చిక్కుతున్నాయి
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

‘పచ్చి సరుకండీ... తెచ్చింది తెచ్చినట్లు అమ్ముకోవాలి. లేదంటే పైసా కూడా రాదు. అదే వ్యాపారులకు బలం, మాకు శాపం’ అని రొయ్యల వేటకు వెళ్లి వచ్చిన బోటు యాజమాని దానయ్య బీబీసీతో అన్నారు.

ఫిషింగ్ హాలిడే ముగిసిన తర్వాత వేటకు వెళ్లిన మత్స్యకారుల పడవలు టన్నుల కొద్ది మత్స్య సంపదతో నిండుగా వస్తున్నాయి. రొయ్యలైతే విపరీతంగా వలలకు చిక్కుతున్నాయి.

ఇక తమ పంట పండిందని అనుకుంటూ తీరాన్ని చేరే మత్స్యకారులకు రొయ్యలు కొనేవారు లేక తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తుంది.

ఎక్కువ రొయ్యలు వలకు చిక్కినా కూడా మత్స్యకారులు వేటకు పెట్టిన పెట్టుబడి కూడా రాక నష్టపోతున్నారు. ఈ పరిస్థితికి కారణమేంటి?

 30 మంది వరకు ఉండే ఎగుమతిదారుల్లో కేవలం ముగ్గరు నలుగురే రొయ్యలు కొనడానికి వస్తున్నారు
ఫొటో క్యాప్షన్, 30 మంది వరకు ఉండే ఎగుమతిదారుల్లో కేవలం ముగ్గురు నలుగురే రొయ్యలు కొనడానికి వస్తున్నారు

‘ఎగుమతిదారుల ఆఫీసులకి తాళాలు’

విశాఖ నుంచి రొయ్యలు దేశంలోని ఇతర రాష్ట్రాలకే కాకుండా విదేశాలకు ఎగుమతి అవుతాయి. ఈ ఏడాది రొయ్యల దిగుబడి బాగుంది. వీటిని కొనేందుకు హర్బర్‌లో ఎగుమతిదారుల కొనుగోలు కేంద్రం కూడా ఉంది. అయితే ఇందులో 30 మంది వరకు ఉండే ఎగుమతిదారుల్లో కేవలం ముగ్గురు నలుగురే రొయ్యలు కొనడానికి వస్తున్నారు.

మిగతా వారు అసలు హార్బర్‌లోని తమ కార్యాలయాలకే రావడం లేదు. వాటికి తాళాలు వేసి ఉన్నాయి.

దీంతో రొయ్యలు కొనడానికి దళారులు వచ్చి, వారు ఎంత ధర నిర్ణయిస్తే అంతకే మత్స్యకారులు, బోటు యాజమానులు అమ్ముకోవాల్సిన పరిస్థితి కనిపించింది.

కొనుగోలు కేంద్రంలో ఉన్న రెండు, మూడు రొయ్యల కొనుగోలు యూనిట్ల వద్ద మాత్రమే కొందరు రొయ్యలను శుభ్రం చేస్తూ కనిపించారు.

అతి పెద్ద గోడౌన్‌లా ఉన్న పొడవాటి ఎగుమతుల కేంద్రం హడావుడి లేకుండా కనిపించింది.

‘‘రొయ్యల ఎక్స్‌పోర్టర్స్ కొనకపోతే మేం దళారులకు అమ్ముకోవాల్సిందే. ఎందుకంటే రోజులు గడుస్తున్న కొద్ది పాడైపోయే సరకు ఇది. పచ్చి సరకు. దీనిని సముద్రం నుంచి తెచ్చిన తర్వాత ఏదో ధరకు అమ్ముకోవలసిందే. ఎక్స్‌పోర్టర్లు కుమ్మక్కైపోవడంతో కనీసం మా పెట్టుబడి వచ్చినా చాలు అనుకుని, అమ్ముకోవాల్సిన పరిస్థితికి మత్స్యకారులు వచ్చారు.’’ అని ఏపీ మెకనైడ్జ్ ఫిషింగ్ బోట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానకిరామ్ బీబీసీతో చెప్పారు.

వీడియో క్యాప్షన్, రొయ్యల ధరలు ఎందుకు పడిపోతున్నాయి?

‘అందుకే రొయ్యలు మానేసి, చేపల కోసం వెళ్తున్నా’

‘‘రొయ్యల వ్యాపారం అసలేమి బాగోలేదండీ. నిరుడుతో పోలిస్తే కేజీకి రూ.100 నుంచి రూ. 200 వరకు ధర తగ్గిపోయింది. అందుకే వల నిండా రొయ్య పడినా, దానిని ఎలాగోలా వదిలించుకోవడమే కానీ, రూపాయి లాభం కూడా రావడం లేదు.’’ అని 6 బోట్లకు యాజమాని దానయ్య బీబీసీతో అన్నారు. ఒకప్పుడు దానయ్యకి 10 బోట్లు ఉండేవి, వ్యాపారం సరిగా సాగక వాటిలో నాలుగు అమ్ముకున్నానని చెప్పారు.

ఫిషింగ్ హాలిడే ముగియగానే రెండు బోటులను రొయ్యల వేటకే దానయ్య పెట్టారు. ఒక్కో దాంట్లో దాదాపు 500 కేజీల వరకు రొయ్యపడింది. నిరుడు కేజీ రూ. 500 ఉండటంతో...ఆ లెక్కనే లేదా అంత కంటే ఎక్కువే వస్తుందని అనుకున్నారు. కానీ దానయ్య సముద్రం నుంచి తీరానికి రొయ్యలను తేవడానికి అయిన ఖర్చు కూడా రాలేదని చెప్తున్నారు.

“రొయ్యల వేటకు వెళ్లి తిరిగి రావడానికి కనీసం 10 రోజులు పడుతుంది. రోజుకు సగటున బోటుకు 200 లీటర్ల డీజిల్‌ ఖర్చు అవుతుంది. ఒక్క డీజిల్‌కే రోజుకు రూ.20 వేలు ఖర్చు పెట్టాలి. అంటే డీజిల్‌కే రూ.2 లక్షలు, సిబ్బందికి తిండి, గ్యాస్, పరికరాల ఖర్చు రూ.15 వేలు, పది టన్నుల ఐస్ రూ.15 వేలు అవుతుంది. ఇతర ఖర్చులు అన్నికలుపుకొని రూ.2.30 లక్షలు అవుతుంది. ఎక్స్‌పోర్టర్లు చెప్పే ధర కేజీకి రూ.380, అంటే నాకు మొత్తం రూ. 1 లక్ష 90 వేలు వస్తుంది. ఈ లెక్కన రెండు బోట్లకు కలిపి రూ. 80 వేలు నష్టపోయాను. దాంతో రొయ్యలు ఇంకా భారీగానే దొరుకుతున్నా.. రొయ్యల వేటకు కాకుండా చేపల కోసం వేటకు వెళ్తున్నాను.” అని దానయ్య తానేలా నష్టపోయాడో లెక్కలతో వివరించారు.

రొయ్యలు
ఫొటో క్యాప్షన్, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు కూడా రొయ్యలు విపరీతంగానే దొరుకుతాయి. అయినప్పటికీ మత్స్యకారులు, బోటు యాజమానులు రొయ్యల వేటకు వెళ్లేందుకు సిద్ధంగా లేరు

‘నాలుగు రకాల రొయ్యల ధర తగ్గింది’

విశాఖ హార్బర్‌లో 700 మెకనైజ్డ్ బోట్లు ఉన్నాయి. మత్స్య సంపద వృద్ధి కోసం వేటకు విరామం ప్రటించిన తర్వాత జూన్ 15 నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటను ప్రారంభించారు.

ఫిషింగ్ హాలిడే తర్వాత భారీ ఎత్తున మత్స్య సంపద లభ్యమవుతుంది. ముఖ్యంగా రొయ్యలైతే విరివిగా దొరుకుతున్నాయి. తూర్పు తీరంలో టైగర్, వైట్, బ్రౌన్, సింక్ రొయ్యలు మత్స్యకారుల వలలకు భారీగా చిక్కుతున్నాయి. వీటిలో బ్రౌన్, సింక్ రొయ్యలే ఎక్కువ ఉంటాయి.

విశాఖ హర్బర్‌కు వేటకు వెళ్లిన మత్స్యకారులు తీసుకుని వచ్చే ఈ నాలుగు రకాలు రొయ్యలపై రూ. 50 నుంచి రూ. 200 వరకు తగ్గిపోయినట్లు ఎగుమతిదారుల కొనుగోలు కేంద్రం అందించిన సమాచారం ప్రకారం అర్థమవుతోంది.

ఆగష్టు, సెప్టెంబర్ వరకు కూడా రొయ్యలు విపరీతంగానే దొరుకుతాయి. అయినప్పటికీ మత్స్యకారులు, బోటు యాజమానులు రొయ్యల వేటకు వెళ్లేందుకు సిద్ధంగా లేరు. దీనికి కారణం ఎక్స్‌పోర్టర్స్ చేస్తున్న ధరల మాయాజాలమేనని అంటున్నారు.

చేపల వేట బోటు

‘విదేశాల్లో గిరాకీ తగ్గింది, మేం ఏం చేయలేం’

విశాఖ హర్బర్‌లోని ఎగుమతి దారుల కొనుగోలు కేంద్రంలో ఎక్స్‌పోర్టర్స్‌కు 30 వరకు కార్యాలయాలు ఉన్నాయి. బీబీసీ వెళ్లినప్పుడు కేవలం నాలుగైదు మాత్రమే తెరిచి కనిపించాయి.

మిగతావన్ని తాళాలు వేసి ఉన్నాయి. వాటిని తెరవడం కూడా లేదని ఎక్స్‌పోర్టర్స్ ఆఫీసుల వద్ద కాపలా కాస్తున్న వారు చెప్తున్నారు. ఆఫీసులు మూసి ఉండటంతోపాటు ధరలపై ఇద్దరు ఎక్స్‌పోర్టర్స్ పవన్, రహీంలతో బీబీసీ మాట్లాడింది.

‘‘రొయ్య సీజన్ ప్రారంభంలోనే బాగా దొరుకుతుంది. ఆ తర్వాత మళ్లీ అంత ఎక్కువగానూ, రోజూ దొరకదు. దాంతో ఎక్స్‌పోర్ట్ ఆర్డర్స్‌ను మేం అడ్వాన్స్‌గా బుక్ చేసుకోలేం. పైగా కనీసం 25 టన్నులు ఉంటే తప్ప విదేశాలకు తీసుకుని వెళ్లే షిప్పులు తీయరు. 25 టన్నులు వచ్చే వరకు కొన్న రొయ్యని చెడిపోకుండా నిల్వ చేయడం కష్టం. సముద్రంలో రకరకాలైన చోట్ల నుంచి వచ్చే రొయ్యలు అన్ని ఒకే సైజు కానీ, రంగు కానీ ఉండవు. దీంతో విదేశాలకు ఎగుమతి విషయంలో ఇది అడ్డంకిగా మారుతోంది. అదే వనామి రొయ్యలు (చెరువుల్లో పండించే) అయితే ఒకే సైజు, రంగులో ఉండటంతో పాటు ఎప్పుడు, ఎంత కావాలంటే అంత సరుకు సిద్ధంగా ఉంటుంది.” అని ఎగుమతిదారుడు పవన్ అన్నారు.

“అందుకే మాకు ఉన్న ఇబ్బందులను లెక్కలు వేసుకుని సముద్రం రొయ్యకు రూ.380 ధరను ఇవ్వగలుగుతాం. అంతకు మించి ఇస్తే మేం నష్టపోతాం. యూరోపియన్ దేశాలకు మన రొయ్య ఎక్కువగా ఎగుమతి అవుతుంది. వాటితో పాటు ప్రస్తుతం అమెరికా, చైనా, ఇతర దేశాలకు ఎగుమతులు జరగడం లేదు. అక్కడ రొయ్యల దిగుబడి పెరడమే ఇందుకు కారణం. దీంతో సముద్రపు రొయ్య కంటే వనామి రొయ్యతోనే మేం ఎక్కువ వ్యాపారం చేస్తున్నాం.” అని రహీం చెప్పారు.

ఇది ఒక్క విశాఖకే పరిమితం కాదని... అమెరికా, చైనా, యూరోప్ దేశాలతో వ్యాపారం చేసే మన హర్బర్లు అన్నింటి వద్దా రొయ్యల ధర తగ్గిందని ఆయన చెప్పారు.

రొయ్యలు
ఫొటో క్యాప్షన్, ధరల పెంపుపై బోటు ఆపరేటర్లు, ఎగుమతిదారులతో మత్స్యశాఖ అధికారులు గతవారం సమావేశం ఏర్పాటు చేశారు

‘లైసెన్స్ ఇక్కడ, వ్యాపారం అక్కడ’

ఎక్స్‌పోర్టర్లు తమ రొయ్యలు కొనకపోగా... కొనేందుకు ముందుకు వచ్చే హోటల్ యాజమానులను, కేటరింగ్ వ్యాపారులను కూడా మాయ చేస్తున్నారని మత్స్యకార సంఘం నాయకులు ఆరోపించారు.

హార్బర్‌కు వచ్చేవారితో ముందుగానే ఎక్కువ ధరకు బేరాలు చేసుకుని, తమ వద్ద మాత్రం తక్కువ ధరకే కొంటున్నారని అన్నారు.

‘‘విశాఖ హార్బర్‌లో మత్స్యకారులు సముద్రంలో వేటాడి తెచ్చిన రొయ్యలు కొంటామనే ఎగుమతిదారులు ఇక్కడ స్థలాలు తీసుకుని ఆఫీసులు పెట్టుకుని, వ్యాపారంపై రాయితీలు పొందుతున్నారు. కానీ ఇప్పుడు ఈ వనామీ రొయ్యల వ్యాపారం చేసుకుంటూ మా సరకు కొనడం లేదు. మత్స్య శాఖ ఎగుమతిదారులను ఒప్పించి గిట్టుబాటు ధరకు కొనేలా చర్యలు తీసుకోవాలి.” అని విశాఖ డాల్ఫిన్ బోటు ఆపరేటర్ల సంఘం అధ్యక్షులు సీహెచ్ వీర్రాజు డిమాండ్ చేశారు.

ఆఫీసులు విశాఖ హార్బర్‌లో తీసుకుని, వ్యాపారాలు వేరే చోటు చేస్తున్నారన్న విషయం నిజమేనని.. రాయితీల కోసం ఇక్కడ ఆఫీసులు నిర్వహిస్తున్నారని ఎగుమతిదారుల కొనుగోలు కేంద్రంలో పని చేస్తున్న సిబ్బంది కూడా బీబీసీతో చెప్పారు.

వీడియో క్యాప్షన్, సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను అర్ధరాత్రి వెళ్లి కాపాడిన కోస్ట్ గార్డ్

‘ధరల పెంపుపై సమావేశం, ఏమైందంటే...’

ధరల పెంపుపై బోటు ఆపరేటర్లు, ఎగుమతిదారులతో మత్స్యశాఖ అధికారులు గతవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఎక్కువ వ్యాపారం జరిగే బ్రౌన్ రొయ్యలను కిలో రూ.380కు మాత్రమే కొనగలమని వ్యాపారులు స్పష్టంగా చెప్పేశారు. వేటకు వెళ్తే విపరీతంగా రొయ్య దొరుకుతుంటే ఎగుమతిదారులు ఇలా తమ కష్టాన్ని దోచుకుంటున్నారంటూ బోటు యాజమానులు సమావేశంలో అధికారులకు తెలిపారు. ఈ సమావేశానికి ముగ్గురే ఎగుమతిదారులు హాజరయ్యారు.

ఈ సమావేశాన్ని నిర్వహించిన మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ విజయతో బీబీసీ మాట్లాడింది.

“నిరుడు రూ. 500 వరకు ధర పలికింది. అదే ధరను ఇప్పుడు ఎగుమతిదారులు ఇవ్వాలని బోటు యాజమానులు అడుగుతున్నారు. తాము ఇవ్వలేమని ఎగుమతిదారులు చెప్పారు. ప్రస్తుతానికైతే రూ. 380 చొప్పునే ఎగుమతిదారులు కొంటున్నారు. మత్స్యకారుల ఆరోపణలు, రొయ్యల ధర పెంపు వంటి అంశాలను ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తాం.” అని జాయింట్ డైరెక్టర్ విజయ బీబీసీతో చెప్పారు.

వీడియో క్యాప్షన్, టన్నున్నర బరువైన పులి బుగ్గల సొర్ర చేపను చూశారా
వీడియో క్యాప్షన్, ఆంధ్రా మడ అడవుల్లో పెరిగే పీతలకు ఆగ్నేయాసియా దేశాల్లో పెరుగుతున్న డిమాండ్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)