రొయ్యల సాగు రైతులను ఎందుకు కష్టాల్లోకి నెడుతోంది, వారి ఆందోళనకు కారణమేంటి?

రొయ్యలు
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

వనామీ రొయ్యల ధర 60 కౌంట్ (కేజీకి ఎన్ని రొయ్యలు తూగుతాయనేదాన్ని బట్టి కౌంట్ అనేది ఉంటుంది. 60 రొయ్యలు తూగితే దాన్ని 60 కౌంట్ అంటారు.)

ధరల్లో ఒడిదొడుకుల తీరు

అక్టోబర్ 20 - రూ. 350

నవంబర్ 20- రూ. 210

డిసెంబర్ 20- రూ. 280

గత ఏడాది ఈ సమయానికి అదే రకం కిలో రూ. 300 కూడా దాటింది. కానీ ఈసారి పరిస్థితులు అలా లేవు. ఆక్వా రంగంలో సంక్షోభం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.

రొయ్య సాగుదారులు మాత్రమే కాకుండా అటు రొయ్య పిల్లల హేచరీల నుంచి ఇటు ప్రాసెసింగ్ యూనిట్ల వరకు అనేక రంగాల్లో ఆందోళన కనిపిస్తోంది.

కొన్ని చోట్ల రొయ్యల రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. గిట్టుబాటు ధర కోసం ఇటీవల తొలిసారిగా నిరసనలు కూడా జరిగాయి.

ఇంతకూ ఆక్వా రంగంలో అసలు సమస్య ఏమిటి? అధిగమించే మార్గాలేంటీ అన్నది సర్వత్రా చర్చ సాగుతోంది.

రైతుల నిరసన

దేశంలో మూడొంతులు ఏపీలోనే....

ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో ఉంది. 974 కి.మీ. పొడవైన సుదీర్ఘ సముద్ర తీరమున్న రాష్ట్రంలో ఆక్వా సాగు పెద్దయెత్తున సాగుతోంది.

అందులో ముఖ్యంగా వనామీ రకం రొయ్యలు ఎక్కువగా ఉత్పత్తి జరుగుతోంది.

వనామీ రొయ్యలు దేశవ్యాప్తంగా 8.15 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతుంటే, అందులో ఆంధ్రప్రదేశ్ వాటా 6.34 లక్షల మెట్రిక్ టన్నులని 2020-21 నాటి సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఎంపెడా) లెక్కలు చెబుతున్నాయి.

రెండో స్థానంలో ఉన్న గుజరాత్ 50 వేల టన్నుల వనామీ రొయ్యలను ఉత్పత్తి చేస్తుంటే దానికి దాదాపు 13 రెట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుందంటే ఈ రంగంలో ఏపీ స్థాయి ఏమిటో అర్థమవుతుంది.

ప్రారంభంలో టైగర్ రొయ్యల వైపు మొగ్గు చూపిన ఆంధ్రప్రదేశ్ రైతులు గడిచిన రెండు దశాబ్దాలుగా వనామీ వెంటపడ్డారు.

భారత్ నుంచి ఎగుమతి అయ్యే వనామీ రొయ్యల్లో 65 శాతం ఒక్క ఆంద్రప్రదేశ్ నుంచే ఎగుమతి అవుతున్నాయి.

ఆక్వా రంగంలో సాగుదారులకు నిత్యం టెన్షన్ తప్పడం లేదు. వాతావరణం, వైరస్‌ల ప్రభావం తట్టుకుని ఉత్పత్తి చేసినా మార్కెట్ మాత్రం సమస్యగా మారుతోంది.

ధరల్లో హెచ్చుతగ్గులు ఇబ్బందికరంగా మారుతున్నాయి.

రొయ్యల పెంపకం

‘భయంతో అమ్మేయాల్సి వచ్చింది’

"నెల క్రితం మా చెరువుల్లో ఉన్న రొయ్య కొంటారా, లేదా అని భయపడాల్సి వచ్చింది. ఈక్వెడార్ పేరు చెప్పి అసలు ఆక్వా కల్చర్‌కే మనుగడ లేదు అంటూ ప్రచారం చేశారు. ఈక్వెడార్ ప్రొడక్షన్ వచ్చేసింది, అమెరికా, చైనా కొనడం లేదు అంటూ భయపెట్టేశారు. దాంతో ఏం జరుగుతుందోనని భయపడి 40, 30 కౌంట్ వచ్చేవరకూ ఉంచాల్సింది. 60 కౌంట్ కే తీసేశాను. దానికి గిట్టుబాటు ధర రాలేదు. పైగా 20 రోజుల కిందట పట్టుకెళ్ళి ఇప్పటికీ డబ్బులు ఇవ్వలేదు. అంటే మార్కెట్లోకి రైతుల సరుకు వస్తుందని తెలియగానే ధరలు తగ్గించేసి, ఇప్పుడు రైతుల దగ్గర సరుకు అయిపోగానే మళ్లీ ధరలు పెంచుతున్నారు" అని ఆక్వా రైతు పి.సత్యమోహన్ రెడ్డి తన అనుభవాన్ని బీబీసీతో పంచుకున్నారు.

ధర స్థిరత్వం లేకుండా రైతుల ఉత్పత్తులు వస్తున్నాయని తెలియగానే రాష్ట్రమంతా కలిపి ఓ 20, 30 మంది వ్యాపారాలు ధరలు నిర్ణయించే పరిస్థితి రావడం వల్ల తీవ్రంగా నష్టం జరుగుతోందని ఆయన వాపోయారు.

ఆక్వా రంగం మీద ఆధారపడిన అనేకమంది ఉపాధికి భద్రత కల్పించాల్సింది పోయి, చెరువులో రొయ్య పిల్లలు వేయాలంటే పదిమార్లు ఆలోచించాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారని సత్యమోహన్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని వేల మంది రైతులు ఇదే రీతిలో తక్కువ ధరలో రొయ్యలు అమ్ముకున్నారు.

కానీ ఆ తర్వాత వారం రోజులకే క్రమంగా మళ్లీ మార్కెట్లో ధరలు పెరుగుతుండడం వారి ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.

రొయ్యలు

పదేళ్లుగా ధర పెరగడం లేదు

ఆక్వా ఉత్పత్తులు దాదాపుగా విదేశీ ఎగుమతుల కోసమే అన్నట్టుగా మారింది. దేశీయ వినియోగం మీద దృష్టి పెట్టలేదు. దాంతో విదేశీ మార్కెట్లలో పరిస్థితిని బట్టి ధరల విషయంలో తీవ్ర ఒడిదొడుకులు వస్తున్నాయి.

ఓవైపు ఆక్వా సాగులో ముఖ్యమైన మేత ధరలు అమాంతంగా పెరిగాయి. 2019 నాటికి కిలో రూ. 45గా ఉంటే ప్రస్తుతం అది రెట్టింపు అయ్యింది.

చెరువులను సొంతంగా సాగు చేసే వారి కంటే లీజుకు తీసుకుని చేసే వారే ఎక్కువ ఉంటారు. ప్రస్తుతం చెరువుల లీజు కూడా మూడేళ్లలో 30 శాతం వరకూ పెరిగింది.

విద్యుత్ బిల్లులు కూడా పెరిగాయి. 10 ఎకరాల లోపు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద విద్యుత్ సరఫరా చేస్తోంది. యూనిట్ రూ.1.50 పైసలకూ అందిస్తున్నారు.

రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ సరఫరాలో ఆటంకం రాకుండా చూసేందుకు ఏరియేటర్లు తిప్పుతూ ఉండాలి. అందుకు విద్యుత్ వాడకం ఎక్కువ. కానీ విద్యుత్ సబ్సిడీ అందరికీ వర్తించకపోవడంతో పెట్టుబడి పెరుగుతోంది.

"పదిహేనేళ్లుగా రొయ్యల చెరువులు వేస్తున్నాం. అప్పుడు ఏ ధర ఉందో ఇప్పుడు కూడా అదే రేటు వస్తోంది రొయ్యకి. కొన్నిసార్లు మార్కెట్ డల్ అయితే అప్పట్లో కన్నా తక్కువ ధర కూడా వస్తోంది. మూడేళ్లలో ఏడుసార్లు మేత ధర పెరిగింది. కూలీల ఖర్చు పెరిగింది. అన్నీ పెరుగుతున్నాయి, కానీ రొయ్య రేటు మాత్రం పెరగనివ్వడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ స్థానికంగా ప్రోసెసింగ్ యూనిట్లు సిండికేట్‌గా మారిపోయి ధరలు నియంత్రిస్తున్నారు. ప్రభుత్వాలు ప్రకటించిన ధర కూడా అందుబాటులోకి రానివ్వడం లేదు" అంటూ కాకినాడ జిల్లా యూ కొత్తపల్లి మండలం నాగులాపల్లికి చెందిన ఆక్వా రైతు వి. సత్యానందరెడ్డి అభిప్రాయపడ్డారు.

రొయ్యలు నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్‌లు అందుబాటులోకి వస్తే రైతులకు ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం ఆలోచించి కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం మీద దృష్టి పెట్టాలని కోరారు.

రొయ్యలు

దేశీయ వినియోగం పెంచాలి...

రొయ్యల ఎగుమతుల ద్వారా దేశానికి విదేశీ మారకద్రవ్యం లభిస్తోంది. దేశం నుంచి ప్రధానంగా అమెరికా, యూరప్, చైనా వంటి ప్రాంతాలకు రొయ్యల ఎగుమతి జరుగుతోంది.

కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2019-20 లో 12,89,651 టన్నుల సముద్ర ఉత్పత్తులు ఎగుమతి చేశారు. సుమారుగా రూ. 46,662.85 కోట్ల ఆదాయం వచ్చింది. 6.68 బిలియన్ యూఎస్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం దక్కింది.

కోవిడ్-19 కారణంగా 2020-21లో 6.31 శాతం ఎగుమతులు తగ్గాయి. అప్పుడు ఆదాయం 5.96 బిలియన్ డాలర్లుగా ఉంది.

2021-22లో ఎగుమతులు మళ్లీ పెరిగి 12 లక్షల టన్నులు దాటింది. అందులో 8 లక్షల టన్నులు ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే ఎగుమతి అయ్యాయి.

రొయ్యలు

డాలర్ల పంటగా మారిన రొయ్యల సాగు భవిష్యత్తులో కూడా ఢోకా లేకుండా సాగాలంటే దేశీయ వినియోగం పెంచాల్సిన అవసరం ఉందని కృష్ణా జిల్లా గన్నవరం ప్రాంతానికి చెందిన ఆక్వా ఎగుమతిదారుడు గద్దె కిరణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

"కోవిడ్-19లో కూడా ఆక్వా రైతులకు ఉపశమనం కలిగించేలా విద్యుత్ సబ్సిడీలు అందించారు. సగటున రొయ్య ఉత్పత్తిలో కిలోకి రూ. 30 వరకూ విద్యుత్ ఖర్చు ఉంటుంది. ఇటీవల 10 ఎకరాలు పైబడిన వారందరకీ రాయితీలు తీసేశారు. మార్కెట్ ఒడిడొడుకులు కారణంగా రైతులు సమస్యల్లో పడుతున్నారు. రాబోయే రెండేళ్లు అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం ప్రభావం ఉంటుంది. ఎగుమతులు ఆశాజనకంగా ఉండే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో దేశీయ వినియోగం పెంచాలి" అంటూ ఆయన కోరారు.

అమెరికా కన్నా అయిదింతల జనాభా ఉన్న దేశంలో కేవలం లక్ష టన్నుల రొయ్యల వినియోగం ఉందని, అదే అమెరికాలో 10 లక్షల టన్నుల రొయ్యలు వినియోగిస్తున్నారని ఆయన వివరించారు.

దేశీయ వినియోగం మీద శ్రద్ధ పెడితేనే రొయ్య సాగు ఢోకా లేకుండా సాగుతుందని అంచనా వేశారు.

వీడియో క్యాప్షన్, చేపలు మనుషులను చంపాలనుకుంటాయా.. ఏ చేపలు ప్రమాదకరం?

ఆక్వాలోనూ క్రాప్ హాలిడే

ఆక్వా సాగుదారులు కూడా గిట్టుబాటు ధరలు లేనందున క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితులు వస్తున్నాయంటూ ప్రచారం సాగింది.

అయితే డిసెంబర్ మొదటి వారంతో పోలిస్తే మూడోవారంలో మళ్లీ ధరలు పెరుగుతున్న సంకేతాలు రావడంతో పరిస్థితులు మారుతున్నాయి.

అంతర్జాతీయంగా దేశీయ రొయ్యలకు డిమాండ్ లేదనే పేరుతో పెద్ద స్థాయిలో ప్రచారం సాగడంతో చాలామంది రైతులు తమ చెరువుల్లో ఉత్పత్తులను త్వరగా అమ్ముకోవడానికి సిద్ధమయ్యారు.

కొందరు రైతులు తదుపరి పంట వేయడానికి వెనుకాడారు. దాంతో కొన్నిచోట్ల రొయ్యల చెరువులు ఖాళీగా ఉంచేశారు. క్రాప్ హాలిడే తప్పదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

"రాష్ట్రంలో జీఎస్డీపీ పెరుగుదలకి, ఇతర అనేక విధాలుగా ఆక్వా తోడ్పడుతోంది. కానీ ఆక్వా సాగుదారులకు తగిన ప్రోత్సాహం లేదు. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం. క్రాప్ హాలిడే వంటి పరిస్థితులు రాకుండా చూడాలి. కేంద్ర ప్రభుత్వం, ఎంపెడా వంటివి ప్రకటనలకే పరిమితం. రైతులకు ఉపయోగపడడం లేదు. రైతులకు మద్ధతు ప్రకటించి రాష్ట్రం ప్రభుత్వం చేతులు దులుపుకోకూడదు. అది అమలు జరిగేలా చూడాలి. రైతులకు అన్యాయం జరగకుండా కొనుగోలుదారులను కట్టడి చేయాలి. రైతు బాగుంటేనే అన్ని రంగాలు నిలబడతాయి" అంటూ హేచరీ యజమాని కే రవికుమార్ అన్నారు.

ఈ సీజన్‌లో రొయ్యల చెరువులు వేయాలా లేదా అన్న సందేహాల కారణంగా సీడ్ ధర కూడా పడిపోయిందని తెలిపారు. ఈ పరిస్థితి నివారించి, అపోహలు తొలగించేలా ప్రయత్నం జరగాలని రవికుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.

వీడియో క్యాప్షన్, భారత్ ఆక్వా ఎగుమతుల్లో మూడో వంతు ఆంధ్రప్రదేశ్‌ నుంచే..

ధరలు తగ్గకుండా చూస్తాం...

రాష్ట్రంలో రొయ్యల సాగుదారుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ప్రభుత్వ చొరవ కారణంగానే అంతర్జాతీయ మార్కెట్ ఎలా ఉన్నా రైతులకు మళ్లీ ధరలు పెరగడానికి కారణమయ్యామని అంటున్నారు.

"రొయ్యల రైతుల సమస్యను ప్రభుత్వం అర్థం చేసుకుంది. తక్షణమే స్పందించింది. సీఎం ఆదేశాలతో పలు సమావేశాలు నిర్వహించాము. రైతు ప్రతినిధులు, ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు అందరినీ పిలిచాము. ధరలు నిర్ణయించాము. అమలు జరిగేలా యంత్రాంగం ఏర్పాటు చేశాము. క్రాప్ హాలిడే వంటి ప్రకటనలు రాజకీయంగా కొందరు గందరగోళం సృష్టించేందుకే. అలాంటి పరిస్థితి రాకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాం" అంటూ ఆయన బీబీసీకి వివరించారు.

ఆక్వా ఉత్పత్తుల వినియోగం రాష్ట్రంలో కూడా పెంచేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయని అప్పలరాజు తెలిపారు.

ఫిష్ ఆంధ్రా పేరుతో చేస్తున్న ప్రయత్నం ఫలిస్తే రొయ్యల రైతులకు కూడా మేలు జరుగుతుందని అభిప్రాయపాడ్డారు .

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)