Pearl Farming: నీటి తొట్టెల్లో నత్త గుల్లలతో ముత్యాలు పండిస్తున్న రైతులు..

నరేంద్ర గర్వ

ఫొటో సోర్స్, NARENDRA GARWA

ఫొటో క్యాప్షన్, నరేంద్ర గర్వ
    • రచయిత, ప్రీతి గుప్తా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నరేంద్ర గర్వ 2016లో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాజస్థాన్‌లోని రెన్వాల్ గ్రామంలో నరేంద్రకు ఒక చిన్న పుస్తకాల దుకాణం ఉండేది. అది నష్టాల్లో నడిచింది.

ఆయన పెద్దగా చదువుకోలేదు. ఓ పక్క కుటుంబాన్ని పోషించాలి. దాంతో, డబ్బులు సంపాదించే మార్గాల కోసం ఇంటర్‌నెట్‌లో వెతకడం ప్రారంభించారు. ప్లాస్టిక్ బాటిల్స్‌లో కూరగాయలు పండించడం మొదలుపెట్టారు. అది లాభదాయకంగానే సాగింది.

కానీ, అంతకన్నా లాభదాయకమైన మరో పంట గురించి నరేంద్రకు తెలిసింది. అదే ముత్యాల పెంపకం.

"రాజస్థాన్ పొడి ప్రాంతం. నీటి సమస్యలు ఎక్కువ. నీటి వనరులు తక్కువగా ఉన్న చోట ముత్యాల సాగు కష్టమే. కానీ, ప్రయత్నించాలనుకున్నా" అన్నారు నరేంద్ర.

ముత్యాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సముద్రపు అడుగున ఆల్చిప్పల్లో ముత్యాలు సేకరించేవాళ్లు భారత్‌లో ఉన్నారు.

ముత్యాల సాగు ఎలా చేస్తారు?

ఆల్చిప్ప లేదా ముత్యపుచిప్ప (మోలస్క్) లోపలి పోరల్లో జరిగే రసాయన చర్యల వలన ముత్యం ఏర్పడుతుంది.

ఆల్చిప్ప లోపల అరగోనైట్, కాన్కియోలిన్ పొరలు ఏర్పడతాయి. ఈ రెండూ కలిసి నేకర్ అనే పదార్థాన్ని ఏర్పరుస్తాయి. దీన్నే మదర్ ఆఫ్ పర్ల్ (తల్లి ముత్యం) అని కూడా పిలుస్తారు.

ప్రకృతి సహజంగా ముత్యాలు ఏర్పడడం అరుదుగా జరుగుతుంటుంది. అందుకే, నత్తగుల్లలు లేదా మసెల్స్ (నల్ల నత్తలు) పెంచి వాటి ఆల్చిప్పల నుంచి ముత్యాలు తయారుచేస్తున్నారు.

ఆల్చిప్పలో రసాయన చర్యల కోసం ద్రావకాలను కృత్రిమంగా ప్రవేశపెడతారు. ఇది చాలా సున్నితమైన ప్రక్రియ. నత్తలతో, మసెల్స్‌తో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుందని నరేంద్ర వివరించారు.

"నా మొదటి ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. 500 నల్ల నత్తగుల్లలు కొంటే 35 మాత్రమే బతికాయి" అని చెప్పారాయన.

నత్తగుల్లలను కొనడానికి నరేంద్ర కేరళ వెళ్లారు. రాజస్థాన్ నుంచి 36 గంటలు రైలు ప్రయాణం చేసి, అంత దూరం వెళ్లి వాటిని కొనుక్కొచ్చారు. తన వద్ద దాచుకున్న సొమ్ము కాకుండా అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టారు.

వీటిని సాకడానికి తన ఇంటి వెనుక పెరట్లో 10 అడుగుల పొడవు, వెడల్పు ఉన్న తొట్టె కట్టించారు.

తొలి ప్రయత్నం విఫలమైనప్పటికీ, నరేంద్ర నిరాశపడలేదు. ముత్యాల పెంపకంలో అయిదు రోజులు కోర్సు చేశారు.

"నల్లగుల్లలను సాకడం అంటే చంటిపాపలను సాకినట్టే" అంటారు నరేంద్ర.

"వాటిని పెంచుతున్నప్పుడు నీటి నాణ్యతను పర్యవేక్షిస్తూ ఉండాలి. మంచి నాణ్యమైన ముత్యాలు, అధిక ఉత్పత్తి కావాలంటే ఇది చాలా ముఖ్యం" అని ఆయన వివరించారు.

నత్తగుల్లలు

ఫొటో సోర్స్, ROBERTUS PUDYANTO

ఫొటో క్యాప్షన్, నత్తగుల్లలు

ప్రస్తుతం నరేంద్ర 40 X 50 అడుగుల తొట్టెలో నత్తలను పెంచుతున్నారు. మల్టీవిటమిన్లు, పీహెచ్ స్థాయిని సరిచేయడానికి పటిక లాంటివి వాడుతుంటారు.

ఇప్పుడు నరేంద్ర చాలా మెళకువలు నేర్చుకున్నారు. ఆయన పెంచుతున్న నత్తగుల్లలు బతికి, అభివృద్ధి చెందే అవకాశాలు 30 శాతం నుంచి 70 శాతానికి పెరిగాయి.

ఈ సంవత్సరం నరేంద్ర సుమారు 3,000 ముత్యాలు ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు. వాటిని రూ. 400 నుంచి రూ. 900 మధ్యలో అమ్ముతారు.

భారత ప్రభుత్వం నీలి విప్లవం (బ్లూ రివల్యూషన్)లో భాగంగా పర్ల్ ఫిషింగ్‌ను ప్రోత్సహిస్తోంది. ఇది దేశంలో ఫిషింగ్ పరిశ్రమను ఆధునీకరించే ప్రణాళిక.

ఈ పథకం కింద, పర్ల్ ఫిషింగ్ కోసం తొట్టె లేదా చెరువు ఏర్పాటుకు అయ్యే సగం ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పటివరకు మత్స్య శాఖ 232 చెరువులకు ఆర్థిక సాయం అందించింది.

"ముత్యాల పెంపకం అత్యంత లాభదాయకమైన ఆక్వాకల్చర్ వ్యాపారం. ఈ దిశగా ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోంది" అని మెరైన్ ఫిషరీస్ జాయింట్ సెక్రటరీ జుజ్జవరపు బాలాజీ చెప్పారు.

ముత్యాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ముత్యాలు

'సముద్రపు ముత్యాలు కావాలి'

అయితే, ముత్యాల సాగును విమర్శించేవాళ్లూ ఉన్నారు. గుంజన్ షా కుటుంబం అయిదు తరాలుగా ముత్యాల వ్యాపారం చేస్తోంది. ముంబయిలోని బాబ్లా ఎంటర్‌ప్రైజెస్ అనే సంస్థను నిర్వహిస్తున్నారు గుంజన్.

"భారత్‌లో ముత్యాల సాగు పెరిగింది. అయితే, ఇలా కృత్రిమంగా పెంచుతున్న ముత్యాలన్నీ మంచి నాణ్యమైన ముత్యాలు అని చెప్పలేం" అంటున్నారు గుంజన్.

దేశంలో తక్కువ నాణ్యత కలిగిన ముత్యాల సాగు ఎక్కువైపోయిందని ఆయన అన్నారు.

"మనం చైనాతో పోటీ పడాలంటే సముద్రపు నీటిలో ముత్యాల సాగు చేపట్టేవాళ్లు పెరగాలి. భారతదేశంలో నత్తగుల్లలు చిన్నవిగా ఉంటాయి. చైనా హైబ్రిడ్ నత్తగుల్లలను పెంచుతుంది. అవి పెద్ద ముత్యాలను ఉత్పత్తి చేస్తాయి. దక్షిణ సముద్రపు నీటితో పెంచే ముత్యాలనే ప్రస్తుతం మార్కెట్‌లో అత్యంత విలువైన ముత్యాలుగా పరిగణిస్తున్నారు. ఈ ముత్యాలు అందమైన రంగుల్లో, రకరకాల పరిణామాలలో, ఆకారాల్లో వస్తున్నాయి. సౌత్ సీ ముత్యాల వరుస ఒక్కొక్కటీ 10,000 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువే ఖరీదు ఉంటుంది. వీటిని భారత్‌లో అరుదుగా ఉత్పత్తి చేస్తున్నారు" అని గుంజన్ చెప్పారు.

ప్రభుత్వం ఈ రకమైన ముత్యాల వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

మరోవైపు, ముత్యాల మార్కెట్లో పోటీ పడదగ్గ ముత్యాల సాగుకు కొంత సమయం పడుతుందని ప్రభుత్వం చెబుతోంది.

"ముత్యాల సాగు ప్రత్యేకమైన వ్యవసాయం. ఈ రంగం అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది. వచ్చే మూడేళ్లల్లో ఈ రంగం అభివృద్ది చెందేలా ప్రణాళిక వేస్తున్నాం. ముందు, స్థానిక వినియోగానికి సరిపడా ముత్యాలు ఉత్పత్తి చేశాక, ఎగుమతుల మీద దృష్టి పెట్టవచ్చు" అని బాలాజీ చెప్పారు.

ముత్యాలు

ఫొటో సోర్స్, REENA CHOUDARY

ఫొటో క్యాప్షన్, ముత్యాలు

నరేంద్ర గర్వ ఇప్పుడు ముత్యాల సాగులో శిక్షణ కూడా ఇస్తున్నారు. ఔత్సాహికులకు కోర్సులు ఆఫర్ చేస్తున్నారు.

28 ఏళ్ల రీనా చౌదరి నరేద్ర దగ్గర కోర్సు చేశారు. గత ఏడాది ఆమె ముత్యాల సాగు ప్రారంభించారు. నరేంద్ర లాగానే ఆమె కూడా తొలి ప్రయత్నంలో విఫలమయ్యారు.

"అన్ని నత్తగుల్లలు చచ్చిపోయాయి. ఒక్కటి కూడా ముత్యాలు ఉత్పత్తి చేయలేదు" అని రీనా చెప్పారు.

కానీ, ఈ సంవత్సరం ఆమె సుమారు 1,000 ముత్యాలు ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు.

అయితే, స్వతంత్రంగా వ్యాపారం ప్రారంభించడం రీనాకు పెద్ద ముందడుగు. ముఖ్యంగా వాళ్ల ప్రాంతంలో మహిళలు ఇంటి పనికే పరిమితమవుతారు. అలాంటిచోట సొంతంగా తన కాళ్ల మీద తాను నిలబడడం రీనాకు పెద్ద విషయం.

"నాలాంటి వాళ్లకి ఇది స్వేచ్ఛ. నా కాళ్ల మీద నేను నిలబడి డబ్బు సంపాదించడం, కుటుంబ వ్యవహారాల్లో నా మాట చెల్లించుకోవడం ఎలాగో నేర్చుకున్నా" అంటున్నారు రీనా.

వీడియో క్యాప్షన్, ముత్యాలను ఎలా పండిస్తారో తెలుసా.. ఈ యువ రైతు స్టోరీ చూడండి..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)