Venus: అక్కడ వజ్రాల వర్షం కురుస్తుంది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేసన్ రిలే
- హోదా, బీబీసీ ఎర్త్
వాతావరణం మనల్ని చాలా ఇబ్బందులు పెడుతుంటుంది. భూమిపై వాతావరణం తీవ్రంగా( వరద, కరవు, వేడి, చలి) పెరిగినా, అది మనకు చాలా మామూలుగానే అనిపిస్తుంది.
కానీ మనం గంటకు 8700 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్న ఒక గ్రహం పైకి వెళ్తే? ఇసుక కూడా కరిగిపోయే వాతావరణంలోకి వెళ్తే ఎలా ఉంటుంది?
వాతావరణం సరిగా ఉండడం, లేకపోవడం అనేది మన గ్రహంపైనే కాదు, వేరే గ్రహాలకు కూడా ఉంటుంది. సౌరమండలంలోని మిగతా గ్రహాలకు కూడా తమకంటూ ప్రత్యేక వాతావరణం ఉంటుంది.
అంతరిక్షంలో వాతావరణం మనం ఊహించలేనంత భయంకరంగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
శుక్రుడిపై నివాసం అసాధ్యం
భూమికి పక్కనే ఉన్న శుక్రగ్రహం నుంచే మొదలుపెడదాం. ఇక్కడ నివసించడం సౌర వ్యవస్థలో ఉన్న మిగతా అన్ని గ్రహాల కంటే కష్టం. శుక్రుడిని బైబిల్లో 'నరకం' అని కూడా చెప్పారు.
శుక్రుడిపై వాతావరణం ఒక దట్టమైన పొరలా ఉంటుంది. అందులో కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉంటుంది. ఈ గ్రహంపై వాతావరణ ఒత్తిడి భూమితో పోలిస్తే 90 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
కార్బన్ డయాక్సైడ్ నిండిన వాతావరణంలో సూర్యుడి వేడి చిక్కుకుపోతుంది. దాంతో ఈ గ్రహంపై ఉష్ణోగ్రత 460 డిగ్రీల వరకూ చేరుతుంది.
అందుకే ఒకవేళ మనం శుక్రుడిపై కాలు పెట్టామే అనుకోండి, కొన్ని క్షణాల్లోనే కుతకుత ఉడికిపోతాం.
అది అంత పెద్ద కష్టమేం కాదే అనుకుంటున్నారా, అయితే అక్కడ పడే వర్షం గురించి తెలిస్తే, మీ వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
శుక్రుడిపై సల్ఫ్యూరిక్ యాసిడ్ వర్షం కురుస్తుంటుంది. ఆ వర్షంలో తిరిగొద్దామని అనుకున్నారనుకోండి చర్మం తీవ్రంగా కాలి బొబ్బలెక్కిపోతుంది.
శుక్ర గ్రహంపై అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల ఆమ్ల వర్షం చినుకులు ఉపరితలంపై పడక ముందే ఆవిరైపోతుంటాయి.
ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటుంది.. శుక్రుడిపై మంచు కూడా ఉంటుంది. కానీ దాన్ని మనం ముద్దలు చేసి ఒకరిపై ఒకరు విసురుకోలేం. ఇది శుక్రుడి వాతావరణంలో ఆవిరై ఎగిరిన లోహాలు చల్లారిన తర్వాత అలా ఏర్పడుతాయి.

వజ్రాల వర్షం పడే గ్రహం
సౌర కుటుంబంలో మరోవైపు వాయువులతో ఏర్పడిన రెండు విశాలమైన గ్రహాలు ఉన్నాయి. అవే యురేనస్, నెప్ట్యూన్.
నెప్ట్యూన్ భూమికి అత్యంత దూరంలో ఉంది. అక్కడ వాతావరణం సున్నా నుంచి మైనస్ 200 డిగ్రీల వరకూ ఉంటుంది.
ఇక్కడ పేరుకుపోయిన మీథేన్ మేఘాలు ఎగురుతుంటాయి. ఇక్కడ సౌర కుటుంబంలో ఉన్న మిగతా గ్రహాల కంటే తీవ్రంగా పెను గాలులు వీస్తుంటాయి.
నెప్ట్యూన్ ఉపరితలం దాదాపు పూర్తిగా సమతలంగా ఉంటుంది. ఇక్కడ మీథేన్ సూపర్‌సానిక్ గాలులు అడ్డుకునేలా పర్వతాల్లాంటివి ఏవీ ఉండవు. అందుకే వాటి వేగం 2400 కిలోమీటర్ల వరకూ చేరుతుంది.
నెప్ట్యూన్ వాతావరణంలో గడ్డకట్టిన కార్బన్ ఉండడం వల్ల మీరు అక్కడికి వెళ్తే వజ్రాల వర్షం కురవడం కూడా చూడచ్చు.
కానీ మీపై పడుతున్న ఆ అమూల్యమైన రాళ్ల వల్ల గాయాలవుతాయేమో అని మీరు ఏమాత్రం కంగారు పడనక్కర్లేదు. ఎందుకంటే అక్కడున్న తీవ్రమైన చలి వల్ల మీరు అప్పటికే రాయిలా గడ్డకట్టుకుపోతారు.

ఫొటో సోర్స్, PA
భూమిలాంటి గ్రహం
టామ్ లాడెన్ అనే ఖగోళ శాస్ర్తవేత్త వార్విక్ యూనివర్సిటీలో గ్రహాల వాతావరణంపై పరిశోధనలు చేస్తున్నారు. ఇతర గ్రహాల్లో ఉన్న వాతావరణం, పరిస్థితుల గురించి అధ్యయనం చేయడం ఆయన పని.
"భూమి కాకుండా ఈ సౌర వ్యవస్థలో మనిషి జీవించడానికి తగిన వాతావరణం ఉన్న గ్రహం ఉందంటే, అది శుక్రగ్రహం పైనున్న వాతావరణమే" లాడెన్ అంటారు.
"శుక్రగ్రహంపై సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలకు పైన ఒక వాతావరణం ఉంటుంది. అక్కడ ఒత్తిడి దాదాపు మన గ్రహంలాగే ఉంటుంది" అన్నారు.
"మనం ఆ వాతావరణంలో ఊపిరి తీసుకోలేం. కానీ మనం ఒక పెద్ద హాట్ ఎయిర్ బెలూన్ లేదా గాలితో నిండిన ఏదైనా వస్తువులో ఉన్నట్టు ఊహించుకోవచ్చు. మీ దగ్గర ఆక్సిజన్ మాస్క్ ఉంటే, టీషర్ట్, షార్ట్ వేసుకుని అక్కడ హాయిగా ఉండచ్చు" అంటారు లాడెన్.
"అక్కడ ఉష్ణోగ్రత కూడా మన భూమిపై ఒక గదిలో ఉన్న ఉష్ణోగ్రతకు సమానంగా ఉంటుంది. అంటే మనం ఆక్సిజన్ మాస్క్ వేసుకుంటే, ఎలాంటి ప్రమాదం లేకుండా శుక్రగ్రహం పైన పర్యటించి రావచ్చు.
లాడెన్ సౌర వ్యవస్థ బయట ఉన్న గ్రహాల గురించి, ముఖ్యంగా 189733బీ అనే ఖగోళ వస్తువు గురించి పరిశోధనలు చేస్తున్నారు.

అన్నిటికంటే భయంకరమైన వాతావరణం
భూమి నుంచి 63 కాంతి సంవత్సరాల దూరంలో నీలంగా ఉండే ఈ గ్రహంపై ఉన్న వాతావరణం అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తున్నారు.
చూడ్డానికి ఈ గ్రహం నీలంగా, అందంగా కనిపిస్తుంది. కానీ దీనిపై వాతావరణం చాలా భయంకరంగా ఉంటుంది.
ఇక్కడ అప్పుడప్పుడూ సెకనుకు 2 కిలోమీటర్లు లేదా గంటకు 8000 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీస్తుంటాయి. ( భూమిపై అత్యంత వేగంగా వచ్చిన తుఫాను గాలులు గంటకు 407 కిలోమీటర్లు)
ఈ గ్రహం మనకు నక్షత్రాలతో పోలిస్తే 20 రెట్లు ఎక్కువ దగ్గరగా ఉంది. అందుకే ఇది భూమి కంటే చాలా వేడిగా ఉంటుంది.
ఈ గ్రహంలో వాతావరణం ఉష్ణోగ్రత 1600 డిగ్రీల సెల్సియస్. అంటే, అది కరిగిన లావాతో సమానం.
"మన గ్రహంపై ఉన్న రాళ్లు ఆ గ్రహంపై కరిగి ద్రవంగా లేదా గ్యాస్‌గా మారిపోతాయి" అని లాడెన్ చెప్పారు.
"ఈ గ్రహంపై కరిగిన గాజు వర్షం కూడా కురుస్తుంది. ఎందుకంటే ఇక్కడ గాలితోపాటు ఎగిరే ఇసుక (సిలికాన్ డయాక్సైడ్) వాతావరణంలో వేడికి కరిగిపోయి గాజులా మారిపోతుంది".
భూమి ఆకారం, ద్రవ్యరాశి ఉన్న గ్రహాలు కూడా ఉన్నాయి. అవి చిన్నగా ఉండే 'ఎం డ్వార్ఫ్' లేదా 'రెడ్ డ్వార్ఫ్' నక్షత్రాల చుట్టూ తిరుగుతుంటాయి.

ఒకవైపు ఎడారి, ఒక వైపు మంచు ఖండం
'ఎమ్ డ్వార్ఫ్' లేదా 'రెడ్ డ్వార్ఫ్' అనేవి నక్షత్రాలన్నిటిలో చిన్నగా, చల్లగా ఉండే నక్షత్రాలు. కానీ ఇది నివసించడానికి తగినవా, కావా అనేది వేరే విషయం.
గ్రహాలపై వేడి ఉండాలన్నా, వాటి ఉపరితలంపై నీళ్లు ద్రవస్థితిలో ఉండాలన్నా, అవి తమ నక్షత్రాలకు దగ్గరగా ఉండడం చాలా అవసరం.
నక్షత్రాలకు ఒక గ్రహం దగ్గరగా ఉండడం వల్ల భూమికి చంద్రుడి వల్ల ఏయే ప్రయోజనాలు ఉంటాయో అవన్నీ ఉంటాయి.
అంటే గ్రహానికి ఒక వైపు పగలు, మరో వైపు రాత్రి శాశ్వతంగా ఉంటాయి.
మనం దానితో ఒక కంప్యూటర్ మోడల్ తయారు చేసి చూస్తే, పగలు ఉన్న భాగం నుంచి తుపాన్ల లాంటివి రాత్రి ఉన్న భాగంలోకి వస్తుండడం మనకు కనిపిస్తుంది.
పగలు ఉన్న భాగంలో ప్రవహించే నీళ్లు వేడికి ఆవిరై మేఘాలుగా మారుతాయి. గాలి వాటిని కరిగించి రాత్రి ఉన్న భాగంలోకి తీసుకెళ్తుంది. అక్కడ ఉన్న చల్లదనం వల్ల మంచు కురుస్తుంది.
అంటే మనకు గ్రహానికి ఒక వైపు ఎడారి, మరోవైపు అర్కిటిక్ కనిపిస్తుంది.
నిజానికి మన ఇంటిని ( భూమి) మించిన చోటు అసలెక్కడా ఉండదు.
అందుకే "గృహమే కదా స్వర్గసీమ" అంటారు.
ఇవి కూడా చదవండి:
- హెరాక్లియాన్: సముద్రగర్భంలో కలిసిన ఈజిఫ్టు ప్రాచీన నగరం కథ
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మోనా లీసాకు ప్రాణం పోశారు
- సద్దాం హుస్సేన్ సైన్యం దాడుల్లో కాలిపోయిన బాలుడు మళ్లీ అమ్మను ఎలా కలుసుకున్నాడు
- నా కార్టూన్లే నా ప్రాణాలు కాపాడాయి.. కొత్త జీవితాన్ని ఇచ్చాయి.. ఇదీ నా కథ
- స్టీఫెన్ హాకింగ్: తప్పక తెలుసుకోవాల్సిన 11 విషయాలు
- భారతదేశానికి వచ్చినపుడు ‘డ్యాన్స్’ చేసిన హాకింగ్!
- అత్యాచారాల గురించి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏం చెబుతారు? ఎలా చెబుతారు?
- అభిశంసన: వెంకయ్య నాయుడు నోటీసులు స్వీకరించకపోతే ఏం జరుగుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








