భారతదేశానికి వచ్చినపుడు ‘డ్యాన్స్’ చేసిన హాకింగ్!

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
2001లో స్టీఫెన్ హాకింగ్ ఒక సదస్సులో పాల్గొనేందుకు భారతదేశానికి వచ్చారు. ఆ సదస్సుకు సమన్వయకర్తగా వ్యవహరించిన ప్రొఫెసర్ సునీల్ ముఖి నాటి విశేషాలను బీబీసీతో పంచుకున్నారు.
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ తన 76వ ఏట కన్నుమూశారు.
ప్రపంచంలో అనేకమందికి ప్రేరణగా నిలిచిన హాకింగ్ తన 59వ జన్మదినాన్ని ముంబైలో జరుపుకొన్నారనే విషయం చాలా మందికి తెలియదు.
2001లో స్టీఫెన్ హాకింగ్ మరో 8 మంది శాస్త్రవేత్తలతో కలిసి 'టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్' భారతదేశంలో నిర్వహించిన 'స్ట్రింగ్స్ 2001' అనే అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి ముంబై వచ్చారు. ఆ సదస్సులో ఆయనకు సరోజినీ దామోదరన్ ఫెలోషిప్ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
అంతకు ముందు హాకింగ్ 1959లో మొదటిసారి భారతదేశానికి వచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
బాలీవుడ్ పాటలకు హాకింగ్ ‘డ్యాన్స్’
పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్)కు చెందిన ప్రొఫెసర్ సునీల్ ముఖి ఆ సదస్సు సమన్వయకర్తలలో ఒకరు. హాకింగ్ మరణం నేపథ్యంలో ఆయన నాటి విశేషాలను గుర్తు చేసుకున్నారు.
''స్టీఫెన్ హాకింగ్ గురించి ఎంతో చదివిన నాకు అలాంటి మేధావిని కలుసుకోవడం ఉత్సుకత కలిగించింది. అలాంటి ప్రతిభావంతుని మరణం మానవాళికే తీరని నష్టం'' అన్నారు ముఖి.
ఆ సదస్సుకు హాజరైన హాకింగ్ చాలా సరదాగా ఉండేవారని ముఖి తెలిపారు. అవయవాలు చచ్చుబడినా, తన గౌరవార్థం ఒబెరాయ్ టవర్స్‌లో ఏర్పాటు చేసిన డిన్నర్‌లో హాకింగ్ పాల్గొన్నారు. హాకింగ్ కోసం ఒబెరాయ్ టవర్స్‌లో ఒక సూట్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేయించారు.
ఆ సందర్భంగా బాలీవుడ్ పాటలకు అనుగుణంగా హాకింగ్ తన వీల్ చెయిర్‌ను తిప్పుతూ 'డ్యాన్స్' కూడా చేశారని ముఖి గుర్తు చేసుకున్నారు.
''దురదృష్టవశాత్తూ ఆయన డ్యాన్స్ రికార్డు చేయడానికి అప్పుడు మాలో ఎవరి వద్దా స్మార్ట్ ఫోన్ లేదు'' అన్నారు ముఖి.
అప్పుడు భారతదేశంలో కుంభమేళా జరుగుతోంది. చాలా మంది హాలీవుడ్ నటులు భారతదేశం వచ్చి దానిలో పాల్గొన్నారు.
ఎవరో రిపోర్టర్ ఆయనను ''మీరు కూడా కుంభమేళా చూస్తారా?'' అని ప్రశ్నించారు.
దానికి ఆయన, ''నేను నటుణ్ని కాను, సైంటిస్టును. నేను ఇక్కడికి ఒక సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చాను'' అని సంభాషణను శాస్త్రసంబంధమైన ప్రశ్నల వైపు మళ్లించారు.
దేవుడున్నాడా లేడా అన్న దానికి సమాధానంగా హాకింగ్, ''నేను ప్రకృతి నియమాలనే దేవునిగా భావిస్తాను'' అన్నారు.
హాకింగ్ భారత పర్యటన దేశంలోని అనేక మంది వికలాంగులకు గొప్ప ప్రేరణ ఇచ్చిందని ముఖి తెలిపారు. వికలాంగ కార్యకర్త జావేద్ అబిబి, 90 శాతం శరీరం చచ్చుబడిన హాకింగ్ కోసం ఒక రిసెప్షన్ ఏర్పాటు చేయాలనుకున్నారు కానీ సమయాభావంతో అది కుదరలేదని హిందూ పత్రిక వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
హాకింగ్ కోసం ప్రత్యేక వాహనం రూపొందించిన మహీంద్ర అండ్ మహీంద్ర
భారతదేశానికి వచ్చిన వెంటనే హాకింగ్ చేసిన మొదటి పని - తన కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనంలో డ్రైవ్‌కు వెళ్లడం. ఆయన వీల్ ఛైర్ పట్టేలా మహీంద్ర అండ్ మహీంద్ర సంస్థ ఒక ప్రత్యేక వాహనాన్ని తయారు చేయించింది.
ముంబైలోని ప్రఖ్యాత హ్యాంగింగ్ గార్డెన్స్‌కు వెళ్లిన హాకింగ్, అక్కడ షూ హౌజ్ వద్ద ఫొటోలకు ఫోజిచ్చారు.
హాకింగ్ ప్రజల మధ్య ఉండేందుకు ఇష్టపడేవారని ముఖి తెలిపారు.
హాకింగ్ టైపింగ్ వేగం ముఖిని ఆశ్చర్యపరిచేది. ఆయనతో మాట్లాడాలనుకున్న వారు ఆయన పక్కన నిలబడి స్ర్కీన్‌పై ఆయన టైప్ చేస్తున్న పదాలను చూడాల్సి వచ్చేది.

ఫొటో సోర్స్, Getty Images
తన భారత పర్యటనలో హాకింగ్ - కాస్మాలజీ, బ్లాక్ హోల్స్, అంతరిక్షంపై అనేక చోట్ల ప్రసంగించారు.
రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి కేఆర్ నారాయణన్‌ను కలిశారు. 1959 పర్యటనకు, నాటి పర్యటనకు భారతదేశంలో వచ్చిన మార్పులను ఆయనతో పంచుకున్నారు.
దిల్లీలో జంతర్ మంతర్, కుతుబ్ మీనార్‌లను హాకింగ్ సందర్శించారు. ఆ సందర్భంగా హాకింగ్ - సైన్స్, గణితశాస్త్రం భారత్ సహజ లక్షణాలు అని వ్యాఖ్యానించారు.
ఇమ్లీ గేట్ నుంచి 72 మీటర్ల ఎత్తు ఉన్న కుతుబ్ మీనార్‌ను చూసిన హాకింగ్, ''నేను దిల్లీని చూడాలనుకున్నాను. ఇంతకు ముందు నాకు దీని గురించి తెలీదు. కానీ ఇది చాలా అద్భుతంగా ఉంది'' అన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








