మనం 2026లో ఉంటే, వీళ్లు 2976కు స్వాగతం పలుకుతున్నారు.. ఎవరీ అమెజిగ్ ప్రజలు?

ఫొటో సోర్స్, APP/NurPhoto via Getty Images
- రచయిత, వెడేలి చిబెలుషి
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెజిగ్ ప్రజలు తమ కొత్త సంవత్సరం 2976కు స్వాగతం పలుకుతూ ఉత్తర ఆఫ్రికా వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు.
అలా అని వీరంతా టైమ్ ట్రావెల్ చేసి ఓ వెయ్యేళ్లు ముందుకు వెళ్లలేదు. అయినప్పటికీ వాళ్లు ప్రపంచం కన్నా దాదాపు వెయ్యేళ్ల ముందున్నారు. ఎందుకంటే, వాళ్లు అనుసరించే క్యాలెండర్ 950 బీసీలో మొదలవుతుంది.
అదే సంవత్సరం ఈజిప్టు సింహాసనాన్ని కింగ్ షెషోంక్ అధిష్ఠించారు.
యెన్నాయర్ అని పిలిచే అమెజిగ్ కొత్త సంవత్సరం జనవరి 12 నుంచి 14 మధ్య మొదలవుతుంది. వాళ్లు నివసించే అల్జీరియా, మొరాకో, ట్యునీషియా, లిబియా వంటి ప్రాంతాలను బట్టి వేర్వేరు తేదీల్లో ఉంటుంది.


ఫొటో సోర్స్, APP/NurPhoto via Getty Images
రంగురంగుల దుస్తుల్లో..
అక్కడి కుటుంబాలన్నీ గత కొద్దిరోజులుగా విందులు చేసుకుంటూ, చలి మంటలు వెలిగిస్తూ, సంప్రదాయ పాటలు పాడుకుంటూ సందడి చేస్తున్నాయి
పల్లెల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా 'అసెగ్గాస్ అమెగ్గాజ్' అంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు అనే నినాదాలు మార్మోగుతున్నాయి. ఈ సందర్భంగా వారంతా సంప్రదాయబద్ధమైన, రంగురంగుల ఎంబ్రాయిడరీ దుస్తులతో మెరిసిపోతున్నారు.
అమెజిగ్ అంటే స్వేచ్ఛాజీవులు లేదా గౌరవనీయులైన ప్రజలు అని అర్థం. అమెజిగ్ జాతి ప్రజలు ఉత్తర ఆఫ్రికా ప్రాంతపు అసలైన ఆదిమ నివాసులు. లిఖితపూర్వక చరిత్ర మొదలైనప్పటి నుంచి వీరు అక్కడే ఉంటున్నారు.
అధికారిక గణాంకాలు లేకపోవడం వల్ల అమెజిగ్ జనాభా కచ్చితమైన సంఖ్య తెలియదు. కానీ, ఉత్తర ఆఫ్రికా వ్యాప్తంగా కోట్ల సంఖ్యలో అమెజిగ్ ప్రజలు ఉన్నారని అంచనాలు ఉన్నాయి.
అల్జీరియా, మొరాకోలో వీరు అధిక సంఖ్యలో ఉన్నారు. మొరాకో జనాభాలో వీరు 40 శాతంగా ఉన్నట్లు అంచనా.
యెన్నాయర్ సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఒక్క చోట చేరుతారు. ప్రకృతితో అమెజిగ్ ప్రజలకు ఉన్న గాఢమైన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ జీవితంలో కొత్తదనాన్ని కోరుకుంటూ ఈ వేడుకలు జరుపుకుంటారు.

ఫొటో సోర్స్, APP/NurPhoto via Getty Images
తీరొక్క వంటకాలు
అమెజిగ్ ప్రజలు వైవిధ్యమైన సమూహాలకు చెందినవారు కావడం వల్ల, ప్రాంతాన్ని బట్టి వారు యెన్నాయర్ పండుగ రోజున తినే సంప్రదాయ వంటకాలు మారుతుంటాయి.
మొరాకో హై అట్లాస్ ప్రాంతంలో అవర్కెమన్ అనే వంటకాన్ని తింటారు. పప్పుధాన్యాలు, మసాలాలు, తృణ ధాన్యాల మిశ్రమంతో చేసే ఈ ఆహారమే కొత్త సంవత్సర వేడుకల ప్రత్యేక ఆహారం.
అల్జీరియాలో డ్రై ఫ్రూట్స్, నట్స్‌తో తయారు చేసే త్రెజె అనే స్నాక్‌ను ఆహారం అనంతరం తింటారు.
యెన్నాయర్ అనేది కేవలం కుటుంబ పండుగే కాదు. ఊరంతా కలిసి ఊరేగింపులు, సంగీత కచేరీలు, కార్నివాల్స్‌తో వీధుల్లో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
ఈ కమ్యూనిటీ ప్రజలు చరిత్రలో చాలాకాలం పాటు అణచివేతకు గురయ్యారు. అందుకే తమ సంస్కృతిని వారు ఇంత గర్వంగా ప్రదర్శించుకుంటారు.

ఫొటో సోర్స్, APP/NurPhoto via Getty Images
భాష, సంస్కృతికి తిరిగి గొప్ప గుర్తింపు
అరబ్బులు 7వ శతాబ్దంలో ఉత్తరాఫ్రికాను ఆక్రమించారు. వారు తమతో పాటు అరబిక్ భాషను, ఇస్లాం మతాన్ని తీసుకొచ్చారు.
తర్వాత అమెజిగ్ భాష, సంస్కృతి కంటే అరబిక్ భాష, సంస్కృతులకు అధికారికంగా ఎక్కువ ప్రాధాన్యత దక్కింది.
ఉదాహరణకు లిబియాలో 'కల్నల్ మువమ్మర్ గడాఫీ' పాలనా కాలంలో అమెజిగ్ భాష తమాజైట్‌ను పాఠశాలలో నిషేధించారు. కనీసం తల్లిదండ్రులు వారి పిల్లలకు అమెజిగ్ పేర్లు పెట్టుకోవడానికి కూడా అనుమతి లేదు.

ఫొటో సోర్స్, APP/NurPhoto via Getty Images
అయితే, అమెజిగ్ ఉద్యమకారులు, కార్యకర్తలు చేసిన కృషి ఫలితంగా గత పదేళ్లలో వారి భాషకు, సంస్కృతికి గొప్ప గుర్తింపు లభించింది.
2011లో మొరాకో తమాజైట్‌ను అధికారిక భాషగా గుర్తించింది.
2017 నుంచి అల్జీరియా, 2023 నుంచి మొరాకో దేశాలు యెన్నాయర్ రోజున ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














