నకిలీ మద్యం కేసు: మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్

ఫొటో సోర్స్, UGC
- రచయిత, బళ్ల సతీశ్, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మద్యం కేసును విచారిస్తున్న సిట్ బృందం ఈరోజు ఉదయం విజయవాడ ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటికి వెళ్లింది. ముందుగా సోదాలు నిర్వహించిన తరువాత రమేశ్, ఆయన అనుచరుడు రామును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జోగి రమేశ్ 2022 లో గృహ నిర్మాణ మంత్రిగా పని చేశారు. 2009లో, 2019లో రెండుసార్లు పెడన ఎమ్మెల్యేగా గెలిచారు.
గతంలో కాంగ్రెస్‌లో పనిచేసి, తరువాత వైయస్సార్సీపీలో చేరారు.
వైయస్సార్సీపీ హయాంలో తెలుగుదేశం ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో జోగి రమేశ్ విచారణ ఎదుర్కొన్నారు.


ఫొటో సోర్స్, Screengrab/UGC
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మద్యం కేసులో దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేసింది.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న జనార్దన రావు వాంగ్మూలంలో జోగి రమేశ్ పేరు చెప్పడంతో, రమేశ్ ను అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు.
విజయవాడ తూర్పు ఎక్సైజ్ కార్యాలయానికి ఆయన్ను తరలించారు.
ఆ క్రమంలో ఆయన అనుచరులు జోగి ఇంటి దగ్గర చేరి ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు.

ఫొటో సోర్స్, UGC
ఈ నకిలీ మద్యంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ వచ్చిన ఆయన అక్టోబరు 27వ తేదీన విజయవాడ కనకదుర్గ దేవాలయానికి వెళ్లారు.
అమ్మవారి దర్శనం చేసుకుని, బయటకు వచ్చిన తరువాత ఈ కేసుతో తనకు సంబంధం లేదంటూ చేతిలో హారతి ఉంచుకుని ప్రమాణం చేశారు.
ఇదే కేసులో సీబీఐ విచారణ జరపాలంటూ శనివారం హైకోర్టుకు వెళ్లారు రమేశ్.
జోగి రమేశ్ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం తో పాటు చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి యత్నించారన్న ఆరోపణలపై పోలీసు కేసులు ఉన్నాయి.
ఇప్పటికే ఆ కేసులకు సంబంధించి మంగళగిరి పోలీస్ స్టేషన్ కి పలుమార్లు విచారణకు హాజరయ్యారు.
ఆ కేసుల్లో అరెస్టు కాకుండా హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
2024లో కూటమి ప్రభుత్వం రాగానే విజయవాడ సమీపంలోని అంపాపురం లో అగ్రిగోల్డ్ భూముల కుంభకోణం వ్యవహారంలో జోగి రమేశ్ కుమారుడు రాజీవ్ ప్రమేయం ఉందన్న ఆరోపణలపై అతన్ని అప్పట్లో సిఐడి అధికారులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














