ఆర్మీ అధికారి కావడం ఎలా? ఏయే పరీక్షలు రాయాలి, ఎవరెవరు అర్హులు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రియాంక ఝా
- హోదా, బీబీసీ ప్రతినిధి
వరల్డ్ పాపులేషన్ రివ్యూ నివేదిక ప్రకారం, భారతదేశ సైన్యం ప్రపంచంలోని ఐదు అతిపెద్ద సైన్యాలలో ఒకటిగా ఉంది. ఈ నివేదిక జనాభా, ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం వంటి క్లిష్టమైన గణాంకాలను సులభంగా అర్థమయ్యే రీతిలో వివరిస్తుంది.
ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ కలిపితే 2024 నాటికి భారత్‌లో 15 లక్షల మంది సైనికులు ఉన్నారని అంచనా. ఇంతటి భారీ సైనికదళంలో చేరేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అయితే సైన్యాధికారి కావాలనుకుంటే మాత్రం ఎన్‌డీఏ(నేషనల్ డిఫెన్స్ అకాడమీ), సీడీఎస్(కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్) ద్వారానే సాధ్యమవుతుంది.
మరి ఈ పరీక్షలలో సులభంగా విజయం సాధించడం ఎలా, అభ్యర్థులను ఎప్పుడు ఎంపిక చేస్తారు, వీరిలో ఆర్మీ ఎటువంటి లక్షణాలను కోరుకుంటుంది?
ఈ ప్రశ్నలకు రిటైర్డ్ మేజర్ జనరల్ సంజీవ్ డోగ్రా నుంచి సమాధానాలు తెలుసుకున్నాం. ఆయన గతంలో డిప్యూటీ కమాండెంట్ లాంటి కీలకమైన పదవులతోపాటు ఎన్‌డీఏలో చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ హోదాలో పనిచేశారు.


ఫొటో సోర్స్, Getty Images
ఎన్‌డీఏ, సీడీఎస్‌కు ఏం కావాలి?
ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ కోసం ఎన్‌డీఏ, సీడీఎస్ అభ్యర్థులను ఎంపిక చేసి, వారికి అధికారులయ్యేలా శిక్షణ ఇస్తాయి.ఎన్‌డీఏ శిక్షణా కేంద్రం పుణెలోని ఖడక్‌వస్లాలో ఉంది.
ఏటా రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ)ఎన్‌డీఏ, సీడీఎస్ ప్రవేశపరీక్షలు నిర్వహిస్తుంది. ఎన్‌డీఏ పరీక్షకు మొదటి నోటిఫికేషన్ ఈ ఏడాది జనవరిలో విడుదలవగా… రెండోది జూన్‌లో విడుదలైంది.
ఇక సీడీఎస్ పరీక్షల నోటిఫికేషన్ ఏప్రిల్, సెప్టెంబర్‌లో విడుదలైంది.
ఎన్‌డీఏ, సీడీఎస్ పరీక్షల్లో తేడా ఏంటంటే.. ఎన్‌డీఏ పరీక్ష రాయాలంటే అభ్యర్థులు 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 16 ఏళ్లు దాటి, 20 ఏళ్లు నిండనివాళ్లు, అవివాహితులైన స్త్రీ,పురుషులు అర్హులు. ఇంటర్మీడియట్ చదువుతున్నవారు కూడా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇక సీడీఎస్ పరీక్ష రాయాలంటే మాత్రం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఈ రెండు అకాడమీలకు కావాల్సిన అర్హతలలోనూ కొన్ని తేడాలు ఉన్నాయి .
సీడీఎస్‌కు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయోపరిమితి 19 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరు రాయవచ్చు?
వయసుతో పాటు ఈ కింది నిబంధనలను ఎన్‌డీఏ పరీక్ష రాసే అభ్యర్థులు తప్పనిసరిగా కలిగి ఉండాలి.
- భారతీయ పౌరుడై ఉండాలి.
- నేపాల్ పౌరులు(కొన్నిషరతులకు లోబడి)
- 1962 జనవరి 1 కంటే ముందు భారత్‌కు వచ్చిన టిబెటన్ శరణార్థులు
- పాకిస్తాన్, బర్మా, శ్రీలంక, కెన్యా, ఉంగాండా, టాంజానియా, జాంబియా, ఇథియోపియా, వియత్నాం దేశాల నుంచి వలస వచ్చి శాశ్వతంగా నివాసం ఉండాలని కోరుకునే భారతీయ మూలాలున్నవారు.
ఎయిర్‌ఫోర్స్, నేవీలో అర్హత పొందాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లో 12వ తరగతి పూర్తి చేయాలి.
నోటిఫికేషన్‌లో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థులు శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండాలి. ఎటువంటి వ్యాధులు, వైకల్యం లేకుండా ఆరోగ్యంగా ఉండాలి.
క్రమశిక్షణా చర్యల కింద ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ట్రెయినింగ్ అకాడమీ నుంచి గతంలో రిజైన్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి వీలులేదు.

ఫొటో సోర్స్, Sunil Ghosh/Hindustan Times via Getty Images
సీడీఎస్ పరీక్షకు అర్హతలేంటి?
సీడీఎస్ పరీక్షను కూడా ఏడాదికి రెండుసార్లు యూపీఎస్‌సీ నిర్వహిస్తుంది. ఇక ఎన్‌డీఏ అభ్యర్థులకు వర్తించే పౌరసత్వ నిబంధనలే సీడీఎస్ అభ్యర్థులకూ వర్తిస్తాయి.
విద్యార్హతల విషయానికొస్తే ఎవరైనా ఇండియన్ మిలిటరీ అకాడమీ, చెన్నైలోని ఓటీఏలోకి వెళ్లాలనుకుంటారో వారు ఏదైనా సబ్జెక్టులో డిగ్రీ చేసి ఉండాలి.
ఇక ఇండియన్ నేవల్ అకాడమీ విషయానికి వస్తే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేయాల్సి ఉండగా.. ఎయిర్ ఫోర్స్ అకాడమీ అభ్యర్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో 12వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఇతర టెక్నికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు… ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్ పూర్తి చేసి ఉండాలి.

ఫొటో సోర్స్, X/@praful_patel
పరీక్ష ఎలా ఉంటుంది?
నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రవేశ పరీక్షలో రాత పరీక్షలతో పాటు, ఇంటెలిజెన్, పర్సనాలిటీ టెస్టు ఉంటుంది.
రెండు రాత పరీక్షలు ఉంటాయి.
- మ్యాథమేటిక్స్
- జనరల్ ఎబిలిటీ టెస్టు
సీడీఎస్ ఎగ్జామ్‌లో కూడా ఓ రాత పరీక్ష, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. రాతపరీక్షలో ఇంగ్లీష్ టెస్టులు, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్ ఉంటాయి.
అయితే ఓటీఏ(ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ)లో మాత్రం మ్యాథ్స్ ఉండదు.
తగిన కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థుల జాబితాను యూపీఎస్‌సీ సిద్ధం చేస్తుంది.
ఈ అభ్యర్థులు సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు(ఎస్‌ఎస్‌బీ) ముందు ఇంటెలిజెన్స్, పర్సనాలిటీ టెస్టుల కోసం హాజరవ్వాల్సి ఉంటుంది. ఎస్‌ఎస్‌బీ ఐదు రోజుల పాటు జరిగే ప్రక్రియ.
సీడీఎస్ ఓటీఏ అభ్యర్థులు.. షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ)కు అర్హులు అవుతారు. వారి సర్వీసు కాలం పదేళ్లుగా ఉంటుంది. వాళ్లు శాశ్వత కమిషన్ కావాలనుకుంటే మాత్రం అందుకోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మూడేళ్ల ఎన్‌డీఏ ట్రెయినింగ్ తర్వాత… అభ్యర్థులు వాళ్లు ఎంపిక చేసుకున్న అకాడమీ ట్రెయినింగ్ కోసం వెళ్లాల్సి ఉంటుంది. ఈ ట్రెయినింగ్ ఎన్‌డీఏ క్యాడెట్లకు ఒక సంవత్సర కాలంపాటు ఉంటుంది.అంటే… నాలుగేళ్ల శిక్షణ తర్వాత మాత్రమే ఎన్‌డీఏ క్యాడెట్లు కమిషన్‌డ్ ఆఫీసర్లు అవుతారు.వారికి డిగ్రీ అందుతుంది..
ఇక సీడీఎస్ ట్రెయినింగ్ వ్యవధి అది జరుగుతున్న అకాడమీని బట్టి వేరువేరుగా ఉంటుంది.
ఉదాహరణకు, ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ), ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్‌ఏ), ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి 18 నెలలు ఉండగా.. ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీకి మాత్రం దాదాపు 11 నెలలు ఉంటుంది.
ఆర్మీకి సెలెక్ట్ అయిన క్యాడెట్లు.. ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ)కి వెళ్లాల్సి ఉండగా… ఎయిర్ ఫోర్స్‌కు ఎంపికైన అభ్యర్థులు ఎయిర్‌ఫోర్స్ అకాడమీ(ఏఎఫ్ఏ)కి వెళ్లాల్సి ఉంటుంది. నేవీకి ఎంపికైన వాళ్లు… ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్‌ఏ)కి వెళ్లాల్సి ఉంటుంది.
ఎన్‌డీఏలో శిక్షణ పూర్తి చేసుకున్నవారికి జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ అందుతుంది. అలాగే సీడీఎస్ చేసేవారికి డిప్లోమా ఇన్ మేనేజ్‌మెంట్ అందుతుంది.
అభ్యర్థులు ఏమేం దృష్టిలో పెట్టుకోవాలి ?
రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్టు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలతో ఈ నియామక ప్రక్రియ ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎలాంటి నైపుణ్యాలు ఉండాలి
ఎన్‌డీఏలో చేరాలనుకునేవారికి ఎలాంటి నైపుణ్యాలు ఉండాలని మేజర్ జనరల్(రిటైర్డ్) సంజీవ్ డోగ్రాను అడగగా… ఈ ఎంపిక ప్రక్రియలో అకాడమిక్స్ మాత్రమే కాదని, నాయకత్వ నైపుణ్యాలు ఉండాలి అని వివరించారు. ఈ క్యాడెట్లే క్రమంగా మిలిటరీ లీడర్లు అవుతారని చెప్పారు.
ఆయన చెప్పిన ప్రకారం… నాయకత్వ నైపుణ్యాలను మూడు మార్గాల్లో అంచనా వేస్తారు.
లీడర్ అంటే ఎవరు: ఇందులో నైతికత, నిజాయతీ వంటి ప్రధాన వ్యక్తిత్వ అంశాలను చూస్తారు.
లీడర్‌కు ఏం తెలిసి ఉండాలి: ఇందులో జ్ఞానానికి సంబంధించినది. వర్తమాన వ్యవహారాలపై ఎంత పట్టు ఉంది, జనరల్ అవేర్‌నెస్ ఎంత ఉంది అనేది పరిశీలిస్తారు.
లీడర్ ఏం చేయాలి: ఇందులో అభ్యర్థి ప్రవర్తన, టెస్టులో అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేదాన్ని బట్టి అంచనా వేస్తారు.
ఎస్‌ఎస్‌బీ ఐదు రోజుల ప్రక్రియలో అభ్యర్థుల్లో ఆఫీసర్-లైక్-క్వాలిటీస్(ఓఎల్‌క్యూ)ను అంచనా వేస్తారని సంజీవ్ డోగ్రా వివరించారు.
దీంట్లో మూడు పద్ధతులు ఉంటాయి.
ఉదాహరణకు అభ్యర్థుల ఆలోచనా తీరు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి సైకాలజికల్ టెస్టు ఉంటుంది.
బిహేవియర్, టీమ్‌వర్క్‌ను అంచనా వేయడానికి గ్రూప్ టాస్కులు నిర్వహిస్తారు.
స్పీచ్, థాట్స్‌ను పరిశీలించేందుకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఉత్తీర్ణులైనవారికి మెడికల్ ఫిటెనెస్‌ను పరిశీలిస్తారు.
రాతపరీక్ష, ఎస్‌ఎస్‌బీ స్కోర్లతో ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఆర్మీ కలిపి మెరిట్ లిస్టును తయారు చేస్తారు. దాని నుంచి ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఆర్మీలో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడానికి కావల్సిన క్యాడెట్లను ఎంపిక చేస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
"టాపర్ల కోసం చూడదు"
ఇండియన్ ఆర్మీకి టాపర్ల కోసం చూడదని, అంతకుమించి, దానికి బాధ్యతాయుతమైన, క్రమశిక్షణ కలిగి అభ్యర్థుల కోసం చూస్తుందని సంజీవ్ డోగ్రా చెప్పారు.
మనం మనలానే ఉండాలని ఆయన అంటారు. మన వ్యక్తిత్వం కాని లక్షణాన్ని ప్రదర్శించకూడదని ఆయన అంటారు.
అందువల్ల అభ్యర్థులు నిజాయతీగా, బాధ్యతాయుతంగా ఉండాలి. కష్టపడేతత్వం, క్రమశిక్షణతో ఉండాలి. ఏదైనా హాబీని ఏర్పరుచుకోవడంతో పాటు, ఏదైనా ఆటలో ఆసక్తిని ఏర్పరుచుకోవాలి.
పుస్తకాలు చదవాలి. ప్రజలతో సంబంధాలు ఏర్పరుచకోవాలి. మొబైల్ స్క్రోల్ చేస్తూ సమయాన్ని వృథా చేయకూడదు.
"ఏ పిల్లలైతే ఆర్మీలో జాయిన్ అవ్వాలని కలలు కంటున్నారో వారు ఈరోజు నుంచి నాయకుడిలా నైతిక విలువలను పెంపొందించుకోవాలి. సంపూర్ణ వ్యక్తిత్వ మెరుగదలపై దృష్టి సారించాలి" అని సంజీవ్ డోగ్రా అన్నారు.
ఇంటర్వ్యూలో సెలెక్టర్లకు తమలోని మంచి లక్షణాలు అర్థమయ్యేలా వ్యవహరించాలని, సంజీవ్ డోగ్రా అన్నారు. ఎందుకంటే సైన్యం శిక్షణలో వారు ఎవరినైనా తమకు నచ్చిన విధంగా మలచుకోగలరని ఆయన చెప్పారు. ఇది క్యాడెట్లు తమ అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా చెప్పడానికి ఉపకరిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఫీజు ఎలా ఉంటుంది?
ఎన్‌డీఏ, సీడీఎస్ ట్రెయినింగ్‌కు ఎలాంటి ఫీజు ఉండదని ఎన్‌డీఏ నుంచి ఆఫీసర్‌గా చేరిన ఓ అధికారి చెప్పారు.
క్యాడెట్ల శిక్షణ, బస, వైద్య చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.
కానీ, ఈ ఏడాది ఎన్‌డీఏ ఎగ్జామ్ నోటిఫికేషన్ ప్రకారం.. మూడేళ్ల శిక్షణా కాలంలో దుస్తులు, పాకెట్ అలవెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ మొదలైనవాటి కోసం దాదాపు రూ.35,000లను చెల్లించాలి.
మూడేళ్ల ఎన్‌డీఏ శిక్షణ తర్వాత ప్రత్యేకించిన అకాడమీ చేరుకున్న క్యాడెట్లకు స్టైపెండ్ ఉంటుంది. సీడీఎస్ ట్రెయినీలకు కూడా ఇదే ఉంటుంది.
సీడీఎస్, ఎన్‌డీఏ ట్రెయినీలు ప్రతి నెల రూ.56,000లను స్టైపెండ్‌గా పొందుతారు.
ఇక గ్రోత్ విషయానికి వస్తే… సీడీఎస్, ఎన్‌డీఏలో ఏది ఉత్తమం అంటే మాత్రం కచ్చితంగా ఎన్‌డీఏ ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు.
దీనికి వెనక ఉండే లాజిక్ ఏంటంటే.. ఎన్‌డీఏలో చేరేవారి వయసు చాలా తక్కువగా ఉంటుంది. సీడీఎస్ క్యాడెట్లతో పోలిస్తే ప్రమోషన్లతో హయ్యర్ ర్యాంక్స్ చేరుకోవడానికి వారికి దాదాపు మూడు నుంచి నాలుగేళ్లు పడుతుంది.
ఇతర మార్గాలున్నాయా?
ఎన్‌డీఏ, సీడీఎస్ కాకుండా ఆర్మీలో అధికారిగా చేరడానికి కొన్ని ఇతర మార్గాలు కూడా ఉన్నాయి.
పీసీఎం విద్యార్థుల కోసం ఆర్మీలో ఓ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ఉంటుంది. జడ్జ్ అడ్వకేట్ జనరల్(జేఏజీ) వంటి వేదికల ద్వారా లా గ్రాడ్యుయేట్లు కూడా చేరవచ్చు.
నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్ కోసం ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్టు(ఐఎన్‌ఈటీ) ఉంటుంది. ఇది గ్రాడ్యుయేట్లకు పనికొస్తుంది.
ఎయిర్‌ఫోర్స్ కోసం ఎయిర్ ఫోర్స్ కమిషన్ అడ్మిషన్ టెస్టు(ఏఎఫ్‌సీఏటీ) ఉంటుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













