హెచ్ 1 బీ వీసా: ‘అమెరికా కలలు’ ఇక ఏమవుతాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘అమెరికాలో భారతీయులకు ఏడాది జీతం సుమారు 90వేల డాలర్ల నుంచి 1.40 లక్షల యూఎస్ డాలర్ల మేర ఉంది. నైపుణ్యాలనుబట్టి ఇందులో ఇంకా ఎక్కువతక్కువలు ఉంటాయి. కానీ, ఇకపై హెచ్1 బీ వీసా కోసం అదనంగా లక్ష డాలర్లు చెల్లించడమంటే కంపెనీలు పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు'' అని అంటున్నారు యూఎస్ఏలో ఉంటున్న ఐటీ సీనియర్ కన్సల్టెంట్ జలగం సుధీర్.
సుధీర్ 2000 సంవత్సరంలో అమెరికాకు, తర్వాత అక్కడి నుంచి వివిధ దేశాలకు వెళ్లారు. ప్రస్తుతం అమెరికాలోని ఆస్టిన్‌లో ఉంటున్నారు.
హెచ్1 బీ వీసాల ఫీజును పెంచుతున్నట్లుగా అమెరికా ప్రకటించిన తర్వాత ఇప్పుడు అమెరికా 'కలలు' కనేవారి చర్చంతా దాని చుట్టూనే నడుస్తోంది.
ట్రంప్ తీసుకువచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం, ప్రతి ఒక్క హెచ్1 బీ వీసా దరఖాస్తుదారు వార్షిక ఫీజు కింద లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. భారతీయ కరెన్సీ ప్రకారం, సుమారు 88 లక్షలు ఉంటుంది.
అయితే, ఈ లక్ష డాలర్ల ఫీజు ఏటా చెల్లించే వార్షిక ఫీజు కాదని, ఇకపై దరఖాస్తు చేసుకుని వీసాలు పొందే వారు చెల్లించే 'వన్ టైం' ఫీజు అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివెట్ ప్రకటించారు.


ఫొటో సోర్స్, Aaron Schwartz/CNP/Bloomberg via Getty Images
భారతీయుల పెరుగుదలతో అవకాశాలెలా ఉన్నాయంటే..
డోనల్డ్ ట్రంప్ తీసుకువచ్చిన ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, ఈ నెల (సెప్టెంబరు) 21 నుంచే అమలులోకి వచ్చింది.
అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ వివరాల ప్రకారం అమెరికాలో హెచ్-1బీ వీసాను 1990లో ప్రవేశపెట్టారు.
‘‘ప్రత్యేక వృత్తు’’లలో ఉన్నత చదువులు చదువుకున్న విదేశీ నిపుణులకు వీసాలు అందించే ప్రోగ్రామ్ ఇది. వీసా పొందేవారికి కనీసం డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యార్హత ఉండాలి.
మ్యాథమేటిక్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, మెడికల్ సైన్సెస్ లో పనిచేసే నైపుణ్యం గల ఉద్యోగులకే వీసాలు అందిస్తారు.
సాధారణంగా హెచ్1 బీ వీసా అనేది మూడేళ్ల కాలానికి ఇస్తారు. దాన్ని ఆరేళ్ల వరకు పొడిగించుకునే వీలుంది.
''మొదట నాకు హెచ్1 బీ వీసా వచ్చినప్పుడు 48 వేల యూఎస్ డాలర్ల వార్షిక ప్యాకేజీ ఉండేది. అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు భారతీయ విద్యార్థులు లక్షలాదిగా వస్తుండంతో అవకాశాలకు కష్టపడాల్సి వస్తోంది'' అని చెప్పారు జలగం సుధీర్.
అందుకే వేరే దేశాలలో ఉన్న అవకాశాలపైనా విద్యార్థులు, యువత దృష్టి పెట్టాల్సి ఉంటుందనేది ఆయన అభిప్రాయం.
''కెనడా పర్మినెంట్ రెసిడెంట్, కెనడా విజిట్ విసా, కెనడా వర్క్ వీసా, ఇంగ్లండ్ వర్క్ పర్మిట్, ఇంగ్లండ్ బిజినెస్ వీసా, ఇంగ్లండ్ వర్కింగ్ హాలిడే మేకర్ వీసా.. ఇలా అనేక వీసాలు ఆయా దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించుకుని గతంలో నేను పనిచేశాను'' అని వివరించారు.
గతంలో అన్ని ఫీజులు కలుపుకొని హెచ్1 బీ వీసా కోసం 1500 డాలర్లు చెల్లిస్తున్నట్లుగా భారతీయ ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు. ఇది భారతీయ కరెన్సీలో సుమారు రూ. 1.32 లక్షలు.
భారతీయుల వాటాయే ఎక్కువ
యూఎస్ సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ నివేదిక ప్రకారం, 2024లో అనుమతి లభించిన హెచ్1 బీ దరఖాస్తుదారుల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని తేలింది. ఇందులో 71 శాతంమంది భారతీయులున్నారు.
అన్ని దేశాల నుంచి 3,99,395 మంది హెచ్1 బీ వీసాదారులు ఉన్నట్లు యూఎస్ సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ నివేదిక స్పష్టం చేస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రత్యామ్నాయాలపై దృష్టి
ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీలు ప్రత్యామ్నాయాలవైపు దృష్టి పెట్టే అవకాశం ఉందని ఐటీ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
''పని కేంద్రీక్రతం చేయడం ద్వారా కొంతమేర లబ్ది పొందేందుకు కంపెనీలు ఆలోచిస్తాయి'' అని హైదరాబాద్ కు చెందిన ఐటీ రంగ నిపుణుడు కిరణ్ చెరుకూరి బీబీసీతో చెప్పారు.
హెచ్1 బీ వీసాల ఫీజును కంపెనీలు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఆ స్థాయిలో ఫీజు చెల్లించే అవకాశం తక్కువని చెబుతున్నారు.
''కంపెనీలు దరఖాస్తులు ఏ మేరకు సమర్పిస్తాయనేది చూడాల్సి ఉంది'' అని కిరణ్ చెప్పారు.
మరోవైపు, గత రెండు, మూడు రోజులుగా కంపెనీల ఆలోచన విధానంలో మార్పులు కనిపిస్తున్నాయని జలగం సుధీర్ అన్నారు. హెచ్1 బీ వీసాలు పొందుతున్న వారిలో తెలుగువారు ఎక్కువగా ఉన్నారని ఆయన తెలిపారు.
''వీసా నిబంధనల తర్వాత కంపెనీల ఆలోచన సరళి మారుతోంది. కొత్త నియామకాల కంటే ఉన్న ఉద్యోగులతోనే పని చేయించుకోవాలనే ఆలోచన కనిపిస్తోంది. నైపుణ్యాలు మరింత పెంచుకోవాలని చెబుతున్నాయి'' అని వివరించారు.
అమెరికన్లకు బాగా శిక్షణ ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
అయితే, ఈ వీసాల నిబంధనల విషయంలో పాత వారికి వర్తించదని వైట్‌హౌస్ నుంచి వచ్చిన ప్రకటన తర్వాత కొంత ఊరట లభించిందని చెప్పారు సుధీర్.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో భారతీయ విద్యార్థులే ఎక్కువ
ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం అత్యధికంగా భారత్, చైనా, దక్షిణ కొరియా, కెనడా, తైవాన్, వియత్నాం, నైజీరియా, బంగ్లాదేశ్, బ్రెజిల్ సహా ఎన్నో దేశాల నుంచి విద్యార్థులు అమెరికాకు చదువుకునేందుకు వెళుతున్నారు.
భారతీయ విద్యార్థులు 'స్టెమ్'( సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మ్యాథమాటిక్స్) కోర్సులు చేసి నిపుణులుగా మారుతున్నారని అభిప్రాయపడ్డారు కిరణ్ చెరుకూరి.
‘‘ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఎఫ్1 వీసాల నుంచి హెచ్1బీ వీసాల కోసం వెళ్లే వాళ్లకు ఇబ్బంది ఉండకపోవచ్చు’’ అని చెప్పారాయన
అయితే, అమెరికా వెళుతున్న విద్యార్థులలో భారత్, చైనా వారే ఎక్కువ.
2023-24లో అమెరికాకు 11,26,690 మంది విద్యార్థులు చదువుకునేందుకు వెళితే, వారిలో 3,31,602 మంది భారతీయ విద్యార్థులు, 2,77,398 మంది చైనా నుంచి ఉన్నారు.
ఐదేళ్లలో అమెరికాకు వెళ్లిన విద్యార్థులు...
అయితే, 2022-23తో పోల్చితే 2023-24 సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య తగ్గినట్లుగా ఓపెన్ డోర్స్ నివేదిక స్పష్టం చేస్తోంది.
అమెరికా విధించిన నిబంధనలతో భారతీయులపై ప్రభావం ఎలా ఉంటుందనేది తెలియాలంటే ఆరు నెలల వరకు వేచి చూడాలని బీబీసీతో చెప్పారు జలగం సుధీర్
''కంపెనీలు కూడా తగినంత నైపుణ్యం గల సిబ్బంది లేకపోతే భారత్‌లో ఆఫ్ షోర్ సెంటర్లు, డాటా సెంటర్లు పెట్టే అవకాశాలు లేకపోలేదు'' అని అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














