అమెరికా అక్రమ వలసదారులను ఈ ‘భయంకరమైన’ జైల్లో వేయనున్నారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వెనెస్సా బుష్‌ష్లటర్, నాథన్ విలియమ్స్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
అమెరికా నుంచి బహిష్కరణకు గురైన వారితో పాటు అమెరికా పౌరసత్వం కలిగిన నేరస్థులను తమ దేశంలోని జైలులో ఉంచడానికి సిద్ధమేనని ఎల్ సాల్వడార్ ప్రతిపాదించింది.
సెంట్రల్ అమెరికా దేశమైన ఎల్ సాల్వడార్‌లో ఆ దేశ అధ్యక్షుడు నయీబ్ బుకెలెను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కలిసిన తర్వాత ఈ డీల్ ప్రకటించారు.
ముఠాలపై తన కఠిన విధానాలకు గాను బుకెలెకు ఓటర్ల నుంచి మద్దతు లభించినా మానవ హక్కుల సంఘాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి.
తన జైలు వ్యవస్థలో కొంత భాగాన్ని అవుట్‌సోర్సింగ్ కోసం అమెరికాకు ఇస్తున్నట్లు బుకెలె చెప్పారు.

అమెరికా ఏమన్నది?
బుకెలెకు రూబియో కృతజ్ఞతలు తెలుపుతూ ‘ఇంతవరకూ ఏ దేశం కూడా ఇలాంటి స్నేహపూర్వకమైన ప్రతిపాదన చేయలేదు’ అని పేర్కొన్నారు.
అమెరికాలోని ప్రమాదకరమైన నేరస్థులను ఎల్ సాల్వడార్ జైళ్లలో ఉంచడానికి బుకెలె ప్రతిపాదించినట్లు రూబియో విలేకరులతో చెప్పారు. ఈ జాబితాలో అమెరికా పౌరసత్వం, చట్టపరమైన నివాసం గల నేరస్థులూ భాగమేనని ఆయన చెప్పారు.
ఎంఎస్-13, ట్రెన్ డి అరగువా వంటి ముఠా సభ్యులు సహా ఏ దేశం నుంచి అయినా బహిష్కరణకు గురైన వలసదారులు, నేరస్థులను ఎల్ సాల్వడార్ తీసుకుంటుందని రూబియో చెప్పారు.
అమెరికాకు ఇచ్చిన ఆఫర్‌ను బుకెలె ఎక్స్ వేదికగా ధ్రువీకరించారు.
దోషులుగా తేలినవారిని (అమెరికా పౌరులు సహా) మాత్రమే సెకోట్ జైలులోకి తీసుకుంటామని బుకెలె చెప్పారు. దీని కోసం అమెరికా నుంచి తీసుకునే రుసుము తక్కువేనని అయితే, ఎల్ సాల్వడార్‌కు ఈ ఒప్పందం ముఖ్యమైనదని ఆయన తెలిపారు.
జైలు ఆర్థికంగా నిలకడగా ఉండటానికి ఇది సహాయపడుతుందని బుకెలె స్పష్టంచేశారు.
2019లో అధికారం చేపట్టిన బుకెలె, అప్పటి నుంచి నేరాలపై ఉక్కు పాదం మోపడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు.
ఇందులో భాగంగా కట్టుదిట్టమైన భద్రతతో జైలును నిర్మించారు. దీనిపేరే సెకోట్ (ఉగ్రవాద నిర్బంధ కేంద్రం).
ఇది అత్యంత ప్రమాదకరమైన ముఠా సభ్యులను ఖైదు చేయడానికి, శిక్షించడానికి ఏర్పాటు చేసినది.
ఈ జైలు ప్రారంభోత్సవాన్ని ప్రభుత్వం వేడుకలా నిర్వహించింది. ఈ జైలులో 40వేల మంది ఖైదీలను ఉంచవచ్చు. గుండు చేయించి, పచ్చబొట్లు వేసిన ఖైదీలను చొక్కా లేకుండా జైలు కారిడార్లలో ఊరేగించిన ఫోటోలు, వీడియోలను అప్పట్లో విడుదల చేశారు.

ఫొటో సోర్స్, Reuters
బుకెలెకు ప్రజాదరణ
ఈ జైలు గురించి ఇప్పటికే అనేక విమర్శలున్నాయి. కిటికీలు కూడా లేని జైల్లో వందలమంది ఖైదీలను ఉంచిన తీరును హక్కుల సంఘాలు గతంలో తప్పుపట్టాయి.
కానీ, నేరస్థులపై బుకెలె ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సాల్వడార్‌లో బాగా ప్రజాదరణ పొందాయి. చాలా సంవత్సరాల తర్వాత ముఠాల గొడవ లేకుండా ప్రశాంతంగా బతకగలుగుతున్నామని అక్కడి ప్రజలు అంటున్నారు.
అయితే, బుకెలె చర్యల వల్ల అనేకమంది అమాయకులు జైలుపాలయ్యారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. చాలామందిపై తప్పుడు కేసులు పెట్టారని వారు అంటున్నారు.
దేశంలో ముఠాల హింసను రాజ్య హింసతో అణచివేయడాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తప్పుపట్టింది.
మరోవైపు బుకెలె గత ఫిబ్రవరిలో 84 శాతానికి పైగా ఓట్లు సాధించి, రెండోసారి ఎన్నికయ్యారు. తనపై వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు.
అమెరికా సీనియర్ దౌత్యవేత్త రుబియో కూడా ఇటీవల తన విదేశీ పర్యటనకు రెండో దేశంగా ఎల్ సాల్వడార్‌నే ఎంచుకున్నారు.
రుబియో మొదట పనామా వెళ్లారు. ఆ సమయంలోనే 'పనామాపై చైనా ఆధిపత్యం తగ్గించాలి' అని వ్యాఖ్యానించిన ఆయన, ఇందుకోసం అనేక మార్పులు తీసుకురావాల్సి ఉందని ప్రకటించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














