మాజీ మంత్రి పెద్దిరెడ్డి 'ఫారెస్ట్ హౌస్' వివాదమేంటి, అధికారులు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ, ఆంధ్రప్రదేశ్, వైఎస్ జగన్

ఫొటో సోర్స్, Peddireddy Ramachandra Reddy/facebook

ఫొటో క్యాప్షన్, మంగళంపేట పరిధిలో అటవీ భూములు ఆక్రమించుకున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫామ్‌హౌస్ వివాదంలో చిక్కుకున్నారు. అది ఫామ్‌హౌస్ కాదు, అటవీ భూములను ఆక్రమించి కట్టిన ఫారెస్ట్ హౌస్ అంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి.

అసలు ఆ ఇంటిని కూలీలు ఉండడం కోసం కట్టామని పెద్దిరెడ్డి మీడియా సమావేశంలో చెప్పడంపై కూడా విమర్శలొచ్చాయి. ‘కూలీల కోసం ఫారెస్ట్ హౌస్ కట్టారట’ అంటూ వ్యంగ్య పోస్టులు, మీమ్స్ వచ్చాయి.

అయితే, తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని పెద్దిరెడ్డి అన్నారు. తాను ఆక్రమించినట్లు చెబుతున్న భూములను తాను 2001లోనే కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట సమీపంలోని అటవీ భూములను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించారని, అక్కడున్న తన వ్యవసాయ క్షేత్రం వరకు నిబంధనలకు విరుద్ధంగా రొంపిచర్ల మార్కెట్‌ కమిటీ నిధులతో రోడ్డు వేశారని జనవరి 29న ఈనాడు కథనం ప్రచురించింది.

ఆ వెంటనే ఇందులో నిజానిజాలు తేల్చాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జాయింట్ కమిటీని ఏర్పాటు చేసింది.

చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, ఐఎఫ్ఎస్ అధికారి యశోదా బాయిలను జాయింట్ కమిటీలో సభ్యులుగా నియమించింది. ప్రస్తుతం జాయింట్‌ కమిటీ దర్యాప్తు కొనసాగుతోంది.

పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, Pawan Kalyan/facebook

ఫొటో క్యాప్షన్, అటవీ భూముల ఆక్రమణల ఆరోపణలపై ఆ శాఖ బాధ్యతలు చూస్తున్న పవన్ కల్యాణ్ దర్యాప్తుకు ఆదేశించారు

పవన్ కల్యాణ్‌ సీరియస్

అటవీ భూముల ఆక్రమణ వార్తలపై అటవీశాఖ బాధ్యతలు చూస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమగ్ర విచారణకు ఆదేశించారు. అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారు, అక్కడ ఉన్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ చేపట్టాలని ఆయన ఆదేశించారు.

పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను పరిశీలించాలని, అవి ఏ మేరకు ఆక్రమణలకు గురయ్యాయో తేల్చాలని సూచించారు.

అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా? అలా చేసి ఉంటే అందుకు బాధ్యులెవరు? వాటి ద్వారా ఎవరు లబ్ధి పొందారనే విషయాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు.

రంగంలోకి అధికారులు..

మంగళంపేట సమీపంలోని పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రం వరకు వేసిన రోడ్డుపై జిల్లా జాయింట్ కలెక్టర్‌ విద్యాధరి, డీఎఫ్‌‌వో భరణి ఆధ్వర్యంలో జనవరి 31న ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వే చేశారు.

ఆ రోడ్డులో ఎంతభాగం అటవీ శాఖ పరిధిలోకి వస్తుందనే విషయం నిర్ధరించుకునేందుకు మొదట రోవర్‌ ద్వారా సర్వేకు ప్రయత్నించారు. కానీ, సాంకేతిక సమస్యలు ఎదురుకావడంతో తర్వాత టేపుతో కొలిచారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, Peddireddy Ramachandra Reddy/facebook

ఫొటో క్యాప్షన్, తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని, అవి అటవీ భూములు కాదని పెద్దిరెడ్డి చెబుతున్నారు

పెద్దిరెడ్డి ఏం చెప్పారు?

చిత్తూరు జిల్లా మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని అటవీ భూములను ఆక్రమించుకున్నట్టు తనపై వచ్చిన ఆరోపణలను మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖండించారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని, తాను ఆక్రమించినట్లు చెబుతున్న భూములను 2001లోనే కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.

''కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీకి చెందిన వెంకటరమణ రెడ్డి మాపై ఫిర్యాదు చేశారు. ఆనాడు ఫారెస్ట్, రెవెన్యూ శాఖ సంయుక్తంగా సర్వే నిర్వహించి ఎలాంటి ఆక్రమణ జరగలేదని చెప్పాయి'' అని పెద్దిరెడ్డి వివరించారు.

చంద్రబాబు సీఎం అయ్యాక మళ్లీ ఫిర్యాదు చేసినా, అప్పుడు కూడా ఎలాంటి ఆక్రమణలు చేయలేదని గుర్తించారని, కోర్టులో పిటిషన్ వేసినా కూడా ఆ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిందని పెద్దిరెడ్డి మీడియా సమావేశంలో చెప్పారు.

''అక్కడేదో అధునాతన గెస్ట్‌హౌస్ కట్టామని అంటున్నారు. 2001లో ఆ భూములు కొన్నప్పుడే, అక్కడ పనిచేసేవాళ్లకి ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలని చెప్పి, అక్కడ కట్టడం జరిగింది'' అని పెద్దిరెడ్డి అన్నారు.

'ఎడ్ల బండ్లు వెళ్లే రోడ్డును మార్చాం'

వ్యవసాయ క్షేత్రం వరకు వేసిన రోడ్డు గురించి కూడా ఆయన స్పందించారు.

''గతంలో బండ్లు పోయేందుకు వీలుగా రోడ్డు ఉండేది. అయితే, దాన్ని పక్కా రోడ్డుగా మార్చేందుకు తాము దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు. ఆ రోడ్డు వేయడం వల్ల ఇతర రైతులకు కూడా ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతో అటవీశాఖ కూడా అనుమతులు ఇచ్చింది. దానిపై తారు రోడ్డు వేసుకోడానికి 2022లో అనుమతులు వచ్చాయి'' అని పెద్దిరెడ్డి చెప్పారు.

ఈ రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు ఇచ్చిన సమయంలో ఆ శాఖా మంత్రిగా పెద్దిరెడ్డి ఉన్నారు.

ఇక ప్రస్తుతం జరుగుతున్న విచారణపై అటవీ శాఖ అధికారులను బీబీసీ సంప్రదించింది.

''ప్రభుత్వ ఆదేశాల మేరకు దానిపై దర్యాప్తు చేస్తున్నాం. పూర్తిస్థాయి నివేదిక ప్రభుత్వానికి ఇవ్వడానికి కొంత టైం పడుతుంది. భూ ఆక్రమణలు జరిగాయా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేం'' అని తన వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడని అటవీ శాఖ అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)