సంతోషంగా ఉండేందుకు సైన్స్ చెబుతున్న 7 చిట్కాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బీబీసీ ఫ్యూచర్ బృందం
సంతోషం అంటే ఏమిటసలు?
ఎన్నోసార్లు మనకు మనం వేసుకునే ప్రశ్ననే ఇది. దీనికి సరైన సమాధానం మనకు అంత సులువుగా దొరకదు.
ఎలాంటి బాధలు లేకుండా బతకడమా? లేదా నిత్యం సమస్యలు పీడిస్తున్నప్పటికీ ప్రశాంతంగా జీవించగలగడమా? అనే సందేహాలు వస్తుంటాయి.
అయితే, మనమందరం మన అలవాట్లను మార్చుకుని, జీవితాలను మరింత సంతోషకరంగా మార్చుకోవచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
2025లో మీరు సంతోషంగా ఉండేందుకు మీకు ఉపయోగపడే 7 రకాల చిట్కాల గురించి తెలుసుకుందాం..
1. వయసు పెరుగుతున్నా కొద్ది స్నేహాలను పెంచుకోవాలి
అన్ని వయసుల్లోనూ స్నేహం అత్యంత ప్రయోజనకరం. కానీ, యుక్త వయసులో స్నేహం సంతోషానికి ఒక చిరునామాగా మారుతుంది.
పెద్దవారు బాగా తెలిసిన వ్యక్తులతోనే సమయాన్ని కేటాయిస్తూ సోషల్ కనెక్షన్లను పరిమితం చేసుకుంటూ ఉంటారు.
కొత్త స్నేహాలకు ఆహ్వానం పలికేందుకు సిద్ధంగా ఉండటం మంచి విషయమని పరిశోధకులు చెప్పారు.
ఎందుకంటే, కుటుంబ బంధాల కంటే భిన్నమైన ప్రయోజనాన్ని ఈ స్నేహాలు ఇస్తాయని తెలిపారు.
స్నేహమనేది స్వచ్ఛమైనది. ఏ సమయంలోనైనా స్నేహం చేయొచ్చు. ఎక్కువ సరదాను అందించి, తక్కువ టెన్షన్లను అందించేది స్నేహమే.

కొత్త వ్యక్తులను కలుసుకునేందుకు పెద్ద వారికి కాస్త కష్టమయ్యే అడ్డంకులు ఉన్నప్పటికీ, కొన్ని విధాల్లో స్నేహాలు చేసుకోవడం సులభతరం చేసుకోవాలి.
మన వ్యక్తిత్వం మరింత పరిణతితో ఉన్నప్పుడు, సామాజికంగా మనం మరింత మందితో స్నేహం చేసే అవకాశం పొందుతాం. ఆనందాన్ని పొందే దిశగా జీవితాన్ని మలుచుకున్నప్పుడు, మనం మరింత ఆహ్లాదకరంగా ఉంటాం.
వయసు పెరిగే కొద్ది మెరుగైన స్నేహాలను పొందే ప్రయత్నాన్ని కొనసాగించినప్పుడు, మానసిక శ్రేయస్సుకు మించిన ప్రయోజనాలు ఉంటాయి.
దీనివల్ల శారీరక ఆరోగ్యంతోపాటు కాగ్నిటివ్ ఫంక్షన్ మెరుగుపడుతుంది.
వయసు పెరుగుతున్నా కొద్ది మన మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేసే విధానంలో కుటుంబంతో పాటు స్నేహం కూడా కీలకమైన అంశంగా ఉంటుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
2. ప్రాక్టీస్ చేయాలి
దయ చూపించడం నిజమైన స్నేహానికి పునాది లాంటిది.
''బాధను పంచుకోవడం'' అనే లాటిన్ పదం నుంచి ఇది వచ్చింది.
స్నేహితులకు సాయం అవసరమైనప్పుడు మీరు చూపించే దయ, సాయమనే బంధాన్ని మరింత బలంగా మార్చేందుకు సాయపడుతుంది.
తక్కువ మందికి తెలిసిన భిన్నమైన భావోద్వేగ స్థితి కూడా ఉంది. అదే సంతోషం.
''సంతోషాన్ని పంచుకోవడం'' కూడా స్నేహానికి పునాదినే.
పలు అధ్యయనాల ప్రకారం.. సంతోషాలను పంచుకోవడం తక్కువ ప్రాధాన్యత కలిగిన అంశంగా ఉన్నట్లు తెలిసింది.
స్నేహాలను కొనసాగించడంలో దయ, కరుణ ఎంత ముఖ్యమో.. అంతే ప్రాధాన్యత దీనికి కూడా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
స్నేహితులు చెప్పే గుడ్ న్యూస్‌లకు సపోర్టు ఇవ్వడం, వాటి గురించి అడగడం కూడా స్నేహాన్ని పటిష్ఠం చేస్తుంది.
స్పందించాలా లేదా అన్నట్టు ప్రవర్తించడం లేదా స్నేహితుని విజయాన్ని అంత యాక్టివ్‌గా అభినందించకపోవడం ఆ బంధాన్ని ప్రమాదంలో పడేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
3. స్వచ్ఛందంగా ముందుకెళ్లాలి
మీలో మీరు నిమగ్నమైపోవడం కంటే ఎవరి కోసమైనా ఏదైనా చేసినప్పుడు, మంచి అనుభూతి పొందుతుంటారని చెబుతుంటారు. పరోపకారం గురించి మరింత తెలిసినప్పుడు, అది నిజమనే అనిపిస్తుంది.
వాస్తవంగా, దీర్ఘకాలిక రుగ్మతలు, ఒత్తిడి వంటి వాటితో బాధపడే వారు స్వచ్ఛందంగా (వలంటీర్‌గా) ముందుకెళ్లి సాయపడటం మానసికంగా వారికి ఉపయోగపడుతుందని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి.
2002లో చేపట్టిన ఒక అధ్యయనంలో.. దీర్ఘకాలిక రుగ్మతలతో ఇబ్బంది పడుతున్న వలంటీర్లు ఇతరులకు సాయం చేసినప్పుడు తక్కువ బాధను అనుభవించారని తేలింది.
జంతువుల పట్ల, మొక్కల పట్ల కేర్ చూపించడం కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, ఇది ముఖ్యంగా పెద్దవారికి శ్రేయస్కరంగా మారుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
కొంతమంది వైద్యులు ఇప్పుడు వలంటీర్‌గా ముందుకెళ్లి సేవ చేయడాన్ని 'సోషల్ ప్రిస్క్రైబింగ్'గా చెబుతున్నారు.
4. పూర్వీకుల గురించి తెలుసుకోవాలి
మన కుటుంబాల్లోని పెద్దవారితో తరచూ సంభాషించడం మానసికంగా పలు ప్రయోజనాలను అందిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రతికూలతలను అధిగమించేందుకు కుటుంబ నేపథ్యాలను తెలుసుకోవాలి. ఉదాహరణకు.. ఒక తరం నుంచి మరో తరానికి కుటుంబ నేపథ్యాలు, వారి గాథలు తెలిసినప్పుడు సాధికారిత పొందుతుంటాం.
కుటుంబ చరిత్ర గురించి తెలుసుకున్నవారు అత్యంత ఎక్కువ సంతృప్తితో, మానసిక శ్రేయస్సుతో జీవిస్తుంటారని పరిశోధకులు గుర్తించారు.
మీ కుటుంబ చరిత్ర గురించి పరిశోధన చేసేటప్పుడు, జీవితం మీ నియంత్రణలో ఉంటుంది.
పూర్వీకుల విజయాలు, పోరాటాల ద్వారా ప్రస్తుత జీవితం సాధ్యమైందని తెలుసుకున్నప్పుడు, ఇది మీకొక దృక్పథాన్ని, కృతజ్ఞతా భావాన్ని అందిస్తుంది.
5. ఒక జాబితాను రాసుకోవాలి
మనకు జరిగిన మూడు విషయాలను మనం రాసుకోవాలి. అలా రాసుకున్నప్పుడు మన మానసిక స్థితి మెరుగుపడుతుంది.
జీవితాన్ని మలుపుతిప్పే క్షణాలు అంటే ఏదైనా ముఖ్యమైన పరీక్ష రాసినప్పుడు లేదా బిడ్డకు జన్మనిచ్చినప్పుడు లేదా పాత స్నేహితుల వద్దకు వెళ్లడం లేదా సూర్యాస్తమయం వంటి అందమైన క్షణాన్ని ఆస్వాదించడం వంటివి కావొచ్చు.
ఈ విషయాలను ఒక దగ్గర రాసుకోవడం ద్వారా మనలో సంతోషం మెరుగుపడుతుందని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
6. ఆనంద క్షణాలను అన్వేషించాలి
వీచే గాలి, రేడియోలో వచ్చే అద్భుతమైన మ్యూజిక్, మీముందున్న విశాలమైన రోడ్డు.. ఈ అనుభూతులతో డ్రైవింగ్ చేసినప్పుడు, దానివల్ల పొందే ఆనంద క్షణం మరొకటి దొరకదని పరిశోధకులు చెబుతున్నారు.
ఎలుకలు కూడా ఈ వాహన సౌఖ్యాన్ని ఆస్వాదించాయి. ల్యాబ్‌లో ఒక చిన్న ప్లాస్టిక్ కారుపై ఎలుకల గ్రూప్‌కు డ్రైవింగ్‌ను నేర్పించారు రిచ్‌మాండ్ యూనివర్సిటీ పరిశోధకులు. ఆ తర్వాతే దీన్ని వెల్లడించారు.
ఎలుకలు కొత్త నైపుణ్యాలను నేర్చుకున్న తర్వాత వెంటనే అవి ఎంతో ఉత్సాహంతో కార్ట్‌లపై ఎగరడం ప్రారంభించాయి. ఆ తర్వాత ప్రయాణానికి సిద్ధమైన సంకేతాలను ఇచ్చాయి.
కొన్ని ఎలుకలు ఉత్సాహంతో జంప్ చేశాయని, ముందుగానే తమ ఆనందాన్ని వ్యక్తం చేసినట్లు పరిశోధకులు చెప్పారు.
ఇది సరికొత్త పరిశోధనలకు తెరతీసింది. రివార్డుల కోసం వేచిచూసేలా కొన్ని ఎలుకలకు పరిశోధకులు శిక్షణ ఇచ్చారు.
ఆ తర్వాత ఎలుకల ఆశావహాన్ని పరిశీలించారు. రివార్డుల కోసం వేచిచూసేలా శిక్షణ ఇచ్చిన ఎలుకలు మరింత ఆశావహంతో ఉన్నట్టు తేలింది.
ఇది మనుషుల్లో కూడా పనిచేస్తుందేమోనని పరిశోధకులు భావించారు.

ఫొటో సోర్స్, Getty Images
7. ఏదీ చేయకపోవడం
ఈ సలహా మీకు కాస్త ఆశ్చర్యం కలిగించవచ్చు. సంతోషంగా ఉండేందుకు ఎక్కువగా ఆలోచించడం, ఆందోళన చెందడం కూడా సంతోషానికి అవరోధమని పరిశోధకులు చెబుతున్నారు.
సినిమా చూడటానికి ముందే దాని నుంచి ఎక్కువ సంతోషాన్ని కోరుకునే ప్రజలు, సినిమా చూసిన తర్వాత ఆనందం కంటే నిరాశనే ఎక్కువగా ఫీలవుతున్నారు.
సంతోషం గురించి ఎక్కువగా అంచనాలు పెట్టుకోవడం, దాని గురించి రాయడం, చదవడం, దాని ప్రాధాన్యత తెలుసుకోవడం వంటివాటి ద్వారా కొందరు ప్రతికూల ప్రభావాన్ని పొందుతారని కూడా ఒక థియరీ ఉంది. ఇది వారిలో నిరుత్సాహాన్ని కలగజేస్తుందని చెబుతోంది.
కాలిఫోర్నియా యూనివర్సిటీలో సైకాలజిస్ట్ అయిన ఐరిస్ మౌస్ ఇప్పటికే సంతోషాన్ని అనుభవించే కోరిక, అన్వేషణ ఒంటరితనాన్ని, డిస్‌కనెక్షన్లను పెంచుతుందని నిరూపించారు. జీవితం చివరకు హెచ్చుతగ్గులతో కూడి ఉంటుందని అంగీకరించాలని ఆమె సూచించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














