వృద్ధులైన తల్లిదండ్రులతో ఎలా ఉండాలి?

ఫొటో సోర్స్, Getty Images
‘సంఘర్షణతో కూడిన క్లిష్టమైన దశ వృద్ధాప్యం‘
వయసు పైబడిన తల్లిదండ్రుల సంరక్షణకు ఇప్పటితరం ఇంకా సిద్ధం కాలేదని, ఆ కారణంగా వృద్ధులైన తల్లిదండ్రుల విషయంలో వారి అభిప్రాయాలు విన్నాక, వృద్ధాప్యం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, సంఘర్షణతో కూడిన క్లిష్టమైన దశ అని నిపుణులు అంటున్నారు.
వయసు పెరిగేకొద్దీ మరొకరి సాయం అవసరమవుతుంది. రోజువారీ పనులు మొదలుకొని, ఆర్థికపరమైన అంశాల వరకు ప్రతి అంశంలోనూ వారికి సాయం కావాలి. ఆ బాధ్యత తీసుకునేవారిపై క్రమంగా భారం పెరుగుతూనే ఉంటుందని నిపుణులు అంటున్నారు.
“కొన్ని కేసుల్లో వృద్ధులైన తల్లిదండ్రుల డిమాండ్లు తీర్చడంలో వారి పిల్లలపై ఒత్తిడి, భారం పెరుగుతోంది. ముఖ్యంగా వారి ఆరోగ్య సమస్యలు లేదా ఇతర కార్యకలాపాల్లో పరిమితుల విషయంలో వారు అలా భావిస్తున్నారు” అని బ్రెజిల్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సావ్‌పాలోకు చెందిన సైకోజెర్మటాలజీ ప్రొఫెసర్, సైకాలజిస్ట్ డ్యూసివానియా ఫాల్కావో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
“సామాజిక, సాంస్కృతిక పరంగా జీవనశైలిలో వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ అనేది పిల్లల బాధ్యత అని, దానిని పిల్లలు కర్తవ్యంగా భావించాలి” అని ఫాల్కావో అన్నారు.
ఇటీవలి కాలంలో, సమాజంలో వృద్ధుల సంఖ్య పెరగడంతో, సవాళ్లు కూడా పెరిగాయి.
ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ప్రపంచ దేశాల్లో వృద్ధుల జనాభా శాతం పెరుగుతూనే ఉంది.
65 సంవత్సరాలు లేదా అంతకన్నా వయసు పైబడిన వృద్ధుల శాతం, మిగిలిన వయసు వారి కన్నా ఎక్కువే ఉందని గణాంకాలు చెప్తున్నాయి. వారి జీవితకాలం కూడా పెరిగింది.
ఫలితంగా పెద్దవారి సంక్షేమాన్ని చూసుకునే కాలం కూడా పెరిగినట్లే చెప్పాలి.
వృద్ధులైన తల్లిదండ్రులతో ఎలా వ్యవహరించాలి? అందులో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి అనేది కూడా ముఖ్యమే.
వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల సంతానం నడుచుకునే తీరును కుటుంబ వ్యవస్థ, సాంస్కృతిక, సామాజిక, మతపరమైన అంశాలు ప్రభావితం చేస్తాయని నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మొండి తల్లిదండ్రులు వర్సెస్ తమ మాటే నెగ్గాలనుకునే పిల్లలు
జీవితపు ఆయా దశల్లో ఉన్న తల్లిదండ్రులు, వారి సంతానం ఒకరి దశను మరొకరు అర్థం చేసుకునే విషయంలోనే ప్రధాన సవాళ్లు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
ఆ సమయంలో పిల్లలు తమ తల్లిదండ్రుల్లో శక్తి సన్నగిల్లడం, వయసు పైబడటాన్ని చూస్తారు. వారు అనారోగ్యం బారిన పడకుండా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు పడకూడదని ఆలోచిస్తారు.
మరోవైపు తల్లిదండ్రుల ఆలోచనాధోరణి మరోలా ఉంటుంది. తమకు వేరొకరి సాయం అవసరమని తెలిసినా, ఆ వాస్తవాన్ని గ్రహించేందుకు సిద్ధపడరు. ఎవరిపై ఆధారపడకుండా, స్వయం ప్రతిపత్తిని కోల్పోకుండా ఉండాలని ప్రయత్నిస్తుంటారని వృద్ధాప్య నిపుణులు ఫెర్నాండా అన్నారు.
“ఎక్కువ శాతం కేసుల్లో పిల్లలు, తల్లిదండ్రుల అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. తల్లిదండ్రుల నిర్ణయాలను స్వాగతించేందుకు పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు” అని ఫెర్నాండా అన్నారు.
వాటిలో అన్నిటికన్నా ఎక్కువగా తమ తల్లిదండ్రులు మొండిగా వ్యవహరిస్తున్నారని తాము చెప్పినమాట వినిపించుకోవడం లేదనే అభిప్రాయం పిల్లల నుంచి వ్యక్తమవుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
“మీరు ఎంతో ప్రేమించే వారు వృద్ధాప్యంలోకి ప్రవేశించడం, ఆ విషయంలో నియంత్రణ లేకపోవడాన్ని చూసి ఏం చేయలేక మీకూ ఆందోళనగా అనిపిస్తుంది. అయితే, ఆ ఆందోళన వెనుక మొండితనం ఉంటుంది” అని నిపుణులు అంటున్నారు.
వయసు పెరిగేకొద్దీ కొంతమంది మొండిగా ప్రవర్తిస్తుంటారని వారు చెప్తున్నారు.
ఒంటరితనం, ప్రేమించిన వారు, స్నేహితులు, కుటుంబ సభ్యుల్ని కోల్పోవడం, ప్రాణభయం, జీవితం పట్ల విరక్తి వంటివి అందుకు కారణం.
ఇంకా చెప్పాలంటే, ఇతరులపై, నిజానికి తమ సంతానంపై ఆధారపడేందుకు కూడా కొంతమంది ఆందోళ చెందుతారు.
“మీరొకసారి ఊహించుకోండి, 50 ఏళ్లపాటు మీ జీవితాన్ని మీరే స్వేచ్ఛగా జీవించేసి ఉంటారు. మీకు అవసరమైనవి సూపర్‌మార్కెట్‌కు వెళ్లి తెచ్చుకునేవారు. మీ పనులన్ని మీరే చేసుకునేవారు. వ్యక్తిగత శుభ్రత పట్ల జాగ్రత్తగా ఉండేవారు. అలాంటి మీరు వీటన్నిటి కోసం ఇతరులపై ఆధారపడితే ఎలా అనిపిస్తుంది?” అని అడిగారు ఫెర్నాండా.
స్వతంత్రతను కోల్పోవడానికి ఇష్టపడని వారిలో చాలామంది కార్ డ్రైవింగ్ వంటివి ఆపరు. డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి విముఖత చూపించడమే కాక, గతంలో స్వతంత్రంగా తమ పనులు ఎలా చేసుకున్నారో, అలానే కొనసాగడానికి ప్రయత్నిస్తారు.
అలాంటి సందర్భాల్లోనే పిల్లలకూ వారికీ మధ్య సంఘర్షణ మొదలవుతుంది. ఇద్దరి మధ్యా భిన్నాభిప్రాయాలు వచ్చేస్తాయి. ఇక్కడే ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
చాలా సమయాల్లో వారు ఉన్న దశను, వారి మానసిక స్థితిని అర్థం చేసుకుని ముందుకు సాగడం ముఖ్యం. వయసు పెరిగే కొద్దీ తల్లిదండ్రుల అవసరాలను గుర్తించడం ముఖ్యం.
ఈ దశలోనే తరాల మధ్యనున్న అంతరాల కారణంగా, తల్లిదండ్రులు, సంతానం మధ్య దూరం పెరిగి ఆ ప్రభావం వారి బంధంపై పడుతుందని, అదే అన్నింటికన్నా ప్రధాన సమస్య అని స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ రియో డి జెనీరో ప్రొఫెసర్ రెనాటో వెరాస్ అన్నారు.
“ఈ సమస్యను అధిగమించాలంటే, తల్లిదండ్రులు తమ సంతానంతో ఎక్కువగా మాట్లాడటం, తరాల మధ్యనున్న అంతరాన్ని వివరించడం” ముఖ్యం అన్నారు.
“ఇది చాలా ముఖ్యమైనది. అంతే క్లిష్టమైనది. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలతో చర్చించరు. తాము అనుకున్నదే సరైనది అని నమ్మే సంతానం వల్ల సమస్య మరింత జటిలమవుతుంది” అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వారి పాత్రల్ని అర్థం చేసుకోవాలి..
“స్వతంత్రంగా ఉండాలని తపించే తల్లిదండ్రులకు సహకరించడాన్ని సంతానం అర్థం చేసుకోవాలి. వారి నిర్ణయాలను గౌరవించాలి. అంగీకరించాలి. అదే వారి బంధం సానుకూల దృక్పథంతో ముందుకు సాగేలా చేస్తుంది” అన్నారు ఫాల్కావో.
వృద్ధుల పట్ల ఉన్న అభిప్రాయాలు, ఆపోహలను వీడాలి.
అయితే, చాలామంది స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడితే మరికొంతమందికి తమకు తోడు కావాలని కోరుకోవచ్చు.
పలు సందర్భాల్లో, ప్రత్యేకించి, తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతల విషయానికొస్తే, పురుషుల కన్నా స్త్రీలపైనే ఎక్కువ భారం పడుతుంది. వారిలో ఒత్తిడి పెరగొచ్చు.
పెద్దలు వయసు పెరిగే కొద్దీ వారు చిన్నపిల్లల్లా మారతారని అంటుంటారు.
దీనిపై ఫెర్నాండా మాట్లాడుతూ, “పిల్లలు తెల్లటి కాన్వాస్‌లాంటివాళ్లు, ప్రతీదీ నేర్చుకుంటారు. కానీ వృద్ధులు అలా కాదు. అన్నింటిలోనూ అనుభవం గడించి ఉంటారు. అందుకే ఇద్దరినీ ఒకేలా చూడలేం. రెండూ వేర్వేరు దశలు” అన్నారు.
“గుండెపోటుకు గురైన తండ్రి, అల్జీమర్స్‌తో బాధపడుతున్న తల్లి..ఇలాంటి సందర్భాలు చెప్పిరావు. అనుకోకుండా చోటుచేసుకున్న పరిణామాల వల్ల కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది. పిల్లలపై ప్రభావం పడుతుంది. ఖర్చులు పెరుగుతాయి” అన్నారు.
“చెప్పాలంటే, తల్లిదండ్రుల సంరక్షణ పట్ల ఎక్కువ దృష్టిపెట్టే సంతానం చాలా తక్కువ ఉండొచ్చు. మీ తండ్రి లేదా తల్లికి జ్వరం లేదా అనారోగ్యం వచ్చిన కారణంగా పనికి సెలవు పెట్టారంటే, వారిని ప్రశంసించాల్సిందే” అన్నారు ఫెర్నాండా.

ఫొటో సోర్స్, Getty Images
వృద్ధాప్యం సాఫీగా సాగాలంటే..
వృద్ధాప్యంలో తల్లిదండ్రుల నుంచి ఇలాంటి సవాళ్లే ఎదురవుతాయని కచ్చితంగా అంచనా వేయడం కష్టం.
“వృద్ధాప్యాన్ని చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. వాతావరణం, ఆరోగ్య సదుపాయాలు, జన్యుపరమైన సమస్యలు.. ఇలా చాలానే ఉంటాయి. వృద్ధాప్యంలో ఉన్నంత మాత్రాన అనారోగ్యం బారిన పడతామని, మరణం సంభవిస్తుందని అనుకోవాల్సిన అవసరం లేదు” అని నిపుణులు అంటున్నారు.
శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు, బలహీనతలు, పనితీరులో మార్పులు, సామర్థ్య తగ్గడం వంటి ఆరోగ్యం సహకరించినంత కాలం పెద్ద సమస్యలా భావించకూడదు. వృద్ధాప్య దశను కూడా సౌకర్యవంతంగా గడిపేందుకు ప్రయత్నించాలి.
ఏ సమయంలోనైనా సరే, తల్లిదండ్రులకు పూర్తి సహకారం అందించేందుకు సంతానం సిద్ధంగా ఉండాలి.
“వయసు పైబడటం, అనారోగ్యం, మరణం.. వృద్ధాప్యమనేది భౌతిక స్థితి లేదా కాగ్నిటివ్ డిపెండెన్స్ అనే దశ అని మనం అర్థం చేసుకోవాలి” అన్నారు ఫెర్నాండా.
ఆయన మాట్లాడుతూ “ప్రస్తుతం చాలామంది వృద్ధులు ఆరోగ్యంగా, కష్టపడి పనిచేయడాన్ని మనం చూస్తున్నాం. ఇది మనకు కొత్తే. సంస్కృతి మారేందుకు సమయం పడుతుంది. వృద్ధులైన తల్లిదండ్రులతో సమన్వయం చేసుకునే తీరు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది” అన్నారు.
ఈ దశలో సంతానం తమ తల్లిదండ్రులకు మద్దతుగా నిలుస్తూ, దీర్ఘకాలిక వ్యాధుల పట్ల శ్రద్ధ వహించేలా ప్రోత్సాహం అందిస్తే, వారి జీవనశైలి చక్కగా సాగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.
అదే సమయంలో, తల్లిదండ్రులు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేలా ప్రోత్సాహం అందిస్తూ, కొత్తవి నేర్చుకునేందుకు పుస్తకపఠనంపై ఆసక్తి కలిగేలా చూడాలి.
“ఈ దశలో తల్లిదండ్రులకు మానసికంగా తోడ్పాటునందించడం ముఖ్యం. అంటే, వారి మానసిక స్థితిని కూడా తెలుసుకోవాలి. డిప్రెషన్, ఒంటరితనం, ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతుంటే వెంటనే వైద్యుల సాయం తీసుకునేలా ప్రోత్సహించాలి” అన్నారు ఫాల్కోవా.

ఫొటో సోర్స్, Getty Images
బలమైన బంధాలు.. ప్రణాళికలు..
జీవితపు చివరి దశను ప్రశాంతంగా గడపడానికి ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం ముఖ్యమని బీబీసీతో మాట్లాడిన వారు చెప్పారు.
“వైద్య సంరక్షణ, ఆర్థికపరమై నిర్ణయాలు..ఇలాంటి ముందస్తు ప్రణాళికల గురించి ముందుగానే తల్లిదండ్రులతో చర్చించే సంతానం, ఈ దశను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడరు” అని ఫాల్కావో అన్నారు.
కానీ కుటుంబాల్లో ఈ చర్చ సాధ్యం కాకపోవచ్చు. చివరికి సమస్యల్ని సృష్టించొచ్చు.
“వృద్ధాప్య దశపై అవగాహన చాలా ముఖ్యం. అది భవిష్యత్తులో ఎదుర్కోబోయే సవాళ్ల పట్ల మనల్ని సన్నద్ధుల్ని చేస్తుంది. ఆ ఫలితంగా నిస్సందేహంగా మంచి జీవితాన్ని గడపచ్చు” అన్నారు ఫాల్కావో.
“పెద్దవారితో కలిసి ఉండటం, వారి సంరక్షణ బాధ్యతల వల్ల బంధాలు మరింత బలంగా మారతాయి. చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి” అన్నారు ఫెర్నాండా.
“ఒకరి జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, వయోభారంతో ఎదురయ్యే సమస్యలు, పరిమితులు....ఇవన్ని ప్రత్యక్షంగా చూస్తారు కాబట్టి, వారి వృద్ధాప్యంలో ఏయే అంశాల్లో శ్రద్ధ వహించాలో ముందే తెలుసుకోగలరు” అన్నారు.
వృద్ధులకు ప్రాధాన్యతనిస్తూ, నిర్ణయాల్లో వారిని భాగం చేసే కుటుంబాల్లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధాలు మరింత బలపడతాయని ఫాల్కావో చెప్పారు.
వృద్ధులైన తల్లిదండ్రులతో బలమైన బంధం ఉన్న సంతానం వారి పిల్లల పట్ల కూడా అదే ప్రేమానురాగాలు చూపిస్తారని పరిశోధనలు చెప్తున్నాయి.
“మనం గుర్తించాల్సిన మరో ముఖ్యమైన అంశమేంటంటే, సవాళ్లు ఎదురైనప్పటికీ జీవితపు చివరి దశ కూడా కొత్తగా ఏదైనా చేసేందుకు, నేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తుంది” అన్నారు ఫాల్కావో.
“వృద్ధాప్యంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని, పరిష్కరించేలా సానుకూల విధానాన్ని ఎంచుకోవడం, ఆ దశ గురించి ముందుగానే మేల్కోవడం వంటివి ఆరోగ్య, సంతృప్తికరంగా జీవితానికి దోహదపడతాయని మర్చిపోవద్దు”.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














