కోటిన్నర జీతం, ఇల్లు, ఇతర సౌకర్యాలు.. ఈ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పాల్ హేస్ట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఏడాదికి కోటి 57 లక్షల రూపాయలు జీతం ఇస్తాం. మీరు స్కాట్లండ్‌లోని అందమైన ప్రదేశానికి వెళతారా అంటే మీరేమంటారు?
యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) మారుమూల ప్రాంతంలోని హెబ్రిడెస్ దీవుల సముదాయంలో భాగమైన యిఇస్ట్, బెన్‌బెక్యుల దీవుల్లో పనిచేసే డాక్టర్లకు ఈ జీతం ఇస్తామని చెబుతున్నారు.
ఈ దీవులకు దగ్గర్లోనే ఉన్న రమ్ అనే మరో దీవిలో తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువు చెప్పే టీచర్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ పని చేయడానికి ఆసక్తి చూపించే టీచర్లకు 68 వేల పౌండ్ల జీతం ఇస్తామని చెబుతున్నారు. భారత కరెన్సీలో ఇది 71.47 లక్షల రూపాయలు.
స్కాట్లండ్‌లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నియామకాల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అధిక వేతనాలను ఆఫర్ చేస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
స్థానికులకు సంబంధించింత వరకు ఇవి ఉద్యోగాల కంటే చాలా ఎక్కువ. స్కాట్లండ్ దీవుల్లోని ప్రజలతో కలిసి జీవించేందుకు కొత్త వారిని అక్కడకు తీసుకు రావడంతో పాటు వారికి అవసరమైన సేవలను పొందడం కూడా ఇందులో కీలకమైన అంశం.
“ఎవరైనా వస్తారేమోనని మేము ఎప్పుడూ ఆశగా ఎదురు చూస్తుంటాం. ఓ వ్యక్తి, అతడి కుటుంబం గురించి కూడా” అని పశ్చిమ దీవుల నేషనల్ హెల్త్ సర్వీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గోర్డన్ జెమీసన్ చెప్పారు.
“ఇక్కడకు వచ్చే వారి వృత్తి నిపుణుల జీవిత భాగస్వాములకు కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మేము ప్రయత్నిస్తున్నాం” అని ఆయన చెప్పారు.
“మారుమాల ప్రాంతంలోని ఓ దీవికి వచ్చి, ఇక్కడ ఉన్న ప్రజలతో కలిసి ఉండాలని, ఇక్కడ ఉద్యోగం చేయాలని అందరూ అనుకోరు”.
“ముఖ్యంగా ఆరోగ్యరంగంలో నిపుణులకు, ఉద్యోగానికి సంబంధించి యుఇస్ట్, బెన్‌బెక్యులా లాంటి ప్రదేశాలను అంతగా ఇష్టపడరు”.

ఫొటో సోర్స్, BENBECULA MEDICAL PRACTICE
బెన్ బెక్యులాకు అవసరమైన వైద్య సేవల దృష్ట్యా, ఈ మారుమూల ప్రాంతాల్లో పని చేసేవారిని ప్రోత్సహించేందుకు నేషనల్ హెల్త్ సర్వీస్ ఇక్కడకు వచ్చే వారికి 40 శాతం అధిక జీతం ఇస్తామని చెబుతోంది.
గ్రామీణ వైద్యం విషయంలో అభిరుచి, సాహసం చేయాలని ఆసక్తి ఉన్న వైద్యులు ఇక్కడకు రావాలని ఎన్‌హెచ్ఎస్ ఆహ్వానిస్తోంది.
ఇక్కడకు వచ్చిన వైద్యులు ఆరు దీవుల్లోని 4,700 మందికి సేవలు అందించాల్సి ఉంటుంది.
జీతంతో పాటు బ్రిటన్‌లోని అందమైన ప్రాంతాల్లో పని చేసే అవకాశం రావడం బోనస్ అని హెల్త్ బోర్డ్ చెబుతోంది.
ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు తాము ఉన్న ప్రాంతం నుంచి దీవులకు వచ్చేందుకు అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీంతో పాటు వీరిని “గోల్డెన్ హలో” పేరుతో ఆహ్వనిస్తూ అందుకు 10వేల యూరోలను అందిస్తోంది.
“ఈ ఉద్యోగ బాధ్యతలను కోరుకునే వారికి నిర్దిష్ట వ్యక్తిత్వం ఉండాలి. అలాంటి వారికి ప్రోత్సహాకాలు అవసరం” అని గుడ్ మార్నింగ్ స్కాట్లండ్ కార్యక్రమంలో జెమీసన్ బీబీసీ రేడియోతో చెప్పారు.
“అందుకే అలాంటి వారిని సత్కరిస్తున్నాం. ఇది అందరికీ దక్కే గౌరవం కాదు. ఈ మారుమూల ప్రాంతంలో వైద్య సేవలు అందించే అనుభవాన్ని పొందేందుకు ప్రపంచవ్యాప్తంగా కూడా కొంమతంది ఎదురు చూస్తున్నారు” అని తెలిపారు.
దీవుల్లో వైద్య సేవలు అందించేందుకు అవసరమైన వైద్యులు, నర్సుల ఎంపిక విషయంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నామని జేమీసన్ చెప్పారు.
అధిక జీతం ఇవ్వడం వల్ల కొంతమంది ఇక్కడ సేవలు అందిస్తూ ఇక్కడే స్థిరపడతారని భావిస్తున్నట్లు చెప్పారు.
“ఇక్కడకు వచ్చే వారు సుస్థిరంగా సేవలు అందించడంతో పాటు ఇక్కడి ప్రజలతో కలిసి జీవించాలని అనుకుంటున్నాం” అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రమ్ దీవిలోని కిన్‌లోచ్ అనే ఊరిలో 40 మంది మాత్రమే జీవిస్తున్నారు. రమ్ దీవిలోని ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు చదువుకుంటున్నారు. వారి వయసు ఐదు నుంచి 11 ఏళ్ల లోపే.
ఇక్కడ పని చేసేందుకు వచ్చే హెడ్ టీచర్‌కు 62వేల పౌండ్లు( రూ.65లక్షలు) ఇస్తామని హైల్యాండ్ కౌన్సిల్ చెబుతోంది. దీంతో పాటు మారుమూల ప్రాంతంలో పని చేస్తున్నందుకు గాను అదనంగా మరో 5,500 పౌండ్లు ఇస్తామని ప్రకటించింది.
ఈ ఉద్యోగం చేసేందుకు కొంతమంది ముందుకు వచ్చినట్లు కౌన్సిల్ తెలిపింది. అయితే నియామక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని వివరించింది.
ప్రధాన భూభాగం నుంచి 90 నిముషాల పడవ ప్రయాణం చేస్తే రమ్ దీవి వస్తుంది. ఇక్కడ కొన్ని హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల ద్వారా విద్యుదుత్పత్తి జరుగుతోంది.
ఈ దీవిలో ఎర్ర జింకల సంఖ్య ఎక్కువ. దీవిలో ఎక్కువ భూమి స్కాటిష్ ప్రభుత్వ స్వాధీనంలో ఉంది. నాలుగేళ్ల క్రితం కిన్‌లోచ్‌లో నాలుగు ఇళ్లు నిర్మించారు.
తాము ఇస్తున్న పారితోషకాల వల్ల కొంతమంది యువకులు, వారి కుటుంబాలు దీవులకు వస్తాయని భావిస్తున్నామని, వారికి ఈ దీవులు చాలా సౌకర్యవంతంగా ఉంటాయని రమ్ దీని కమ్యూనిటీ ట్రస్ట్ చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
అర్డ్నముర్చన్ ద్వీపకల్పంలోని కిల్చోన్ ప్రైమరీ స్కూల్‌లో 15 మంది పిల్లలకు చదువు చెప్పేందుకు టీచర్ నియామకానికి 53 వేల పౌండ్లు ఇస్తామని ప్రకటన ఇచ్చిన తర్వాత రమ్ దీవిలో స్కూలు టీచర్ కోసం ప్రకటన ఇచ్చారు.
2022లో షెట్‌ల్యాండ్ దీవికి 16 మైళ్ల దూరంలో ఉన్న మరో దీవిలోని ప్రాథమిక పాఠశాలలో పని చేసేందుకు వచ్చే టీచర్‌కు 62 వేల పౌండ్ల జీతంతో పాటు త్రీ బెడ్‌రూమ్ ఇల్లు ఇస్తామని ప్రకటించారు. ఈ దీవిలో 28 మంది ఉంటున్నారు.
స్కూల్ ఉన్న ప్రాంతం, ఆ దీవిలో జనాభా, మౌలిక వసతులు లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని టీచర్లను నియమించుకోవడానికి జీతంతో పాటు రకరకాల ఇతర ప్రోత్సాహకాలు అందిస్తున్నామని హైల్యాండ్ కౌన్సిల్ చెబుతోంది.
“పర్మనెంట్ పోస్టులకు ఎంపికైన ఉద్యోగుల రీ లొకేషన్ ప్యాకేజ్ అందిస్తున్నాం. అందులో అద్దె, ప్రయాణ ఖర్చులు కూడా ఉన్నాయి” అని స్థానిక అధికారులు చెప్పారు.
“దీవులకు అవసరమైన పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన అప్లికేషన్లను ఆహ్వానిస్తున్నాం. అలాగే కొత్తగా ఎంపికైన హెడ్ టీచర్లకు సంపూర్ణ నాయకత్వ కార్యక్రమం కింద శిక్షణ ఇచ్చేందుకు కొంత నిధులు కేటాయించాం. ఇతర స్కూళ్లలోని టీచర్లకు కూడా ఇలాంటి శిక్షణ ఇస్తాం” అని కౌన్సిల్ అధికార ప్రతినిధి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- సుక్కా పగడాలమ్మ: పాతపట్నం ఎమ్మెల్యేగా ఆరేళ్ళున్నారు, ఉపాధి హామీ పథకం కింద కూలీ పనికి ఎందుకు వెళ్ళారు?
- ఆంధ్రప్రదేశ్: ఏడాదిలో 341 రోజులు అప్పులే, మినిమం బ్యాలెన్స్ కూడా లేకుండా ఏపీ ఏం చేస్తోంది?
- బెంగళూరు: భారత ఐటీ కేంద్రంలో నీటి సంక్షోభం ఎందుకు తీవ్రం అవుతోంది?
- ప్రకృతి ఒడిలో ఉన్నట్లు అనిపించే అద్భుతమైన 8 ఇళ్లు.. వీటిలో ఒకటి జైపుర్‌లో!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














