ప్రకృతి ఒడిలో ఉన్నట్లు అనిపించే అద్భుతమైన 8 ఇళ్లు.. వీటిలో ఒకటి జైపుర్‌లో!

ఇళ్లు, డిజైనింగ్, ఆర్కిటెక్టులు

ఫొటో సోర్స్, DAN GLASSER

ఫొటో క్యాప్షన్, పర్యావరణ అనుకూల ఇళ్ల డిజైనింగ్‌లో కొత్త ప్రయోగాలు
    • రచయిత, డామినిక్ ల్యుటెన్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

“తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఇల్లు. కొద్దిపాటి శ్రమతో ఇళ్ల నిర్మాణం, సౌరశక్తిని అధికంగా వినియోగించుకునే అవకాశం, ఇంటి లోపల ఉష్ణోగ్రతలను సౌకర్యవంతంగా ఉంచడం’’ - వరల్డ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్‌లో ఇళ్లకు సంబంధించి ఉత్తమ డిజైన్ల ఎంపికకు ప్రాథమిక నమూనా ఇది.

“ఎక్కువగా వాటి మన్నిక మీద దృష్టి పెట్టాం. పర్యావరణ హిత సామగ్రితో నిర్మించారా లేదా అనేది కూడా చూశాం. ప్యాసివ్ హౌస్ డిజైన్ విధానానికి పెద్ద పీట వేశాం” అని ఈ కార్యక్రమం డైరెక్టర్ పాల్ ఫించ్ బీబీసీతో చెప్పారు.

అంతర్జాతీయంగా ఇళ్ల నిర్మాణం, ఇళ్లలో వాడుతున్న ఇంటీరియర్‌ విషయంలో వస్తున్న మార్పుల్ని గుర్తించి, ప్రోత్సహించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఏటా మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో ఇళ్ల డిజైన్ల పోటీతోపాటు ఇన్‌సైడ్ వరల్డ్ ఫెస్టివల్ ఆఫ్ ఇంటీరియర్స్ పోటీ కూడా ఉంటుంది.

ఎంపిక చేసిన 550 మంది తమ ప్రాజెక్టుల్ని కమిటీకి సమర్పిస్తారు. ఈ 550 మందిలో ఆర్కిటెక్టులతో పాటు ఇంటీరియర్ డిజైనర్లు, ఇంజినీర్లు ఉంటారు.

ఇందులో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసే ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుంది. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరూ దీన్ని ప్రత్యక్షంగా పరిశీలించవచ్చు కూడా.

పోటీల చివరి రోజున తుది దశకు ఎంపికైన ఆర్కిటెక్టులు తమ ప్రాజెక్టుల్ని మరో కమిటీకి సమర్పిస్తారు. ఇందులో వరల్డ్ బిల్డింగ్ ఆఫ్ ద ఇయర్, లాండ్‌స్కేప్ ఆఫ్ ద ఇయర్, ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఆఫ్ ద ఇయర్, ఇంటీరియర్ ఆఫ్ ద ఇయర్ విభాగాల్లో అవార్డుల కోసం తుది దశ పోటీ జరుగుతుంది.

ఈ పోటీలు ఇటీవల సింగపూర్‌లోని మరీనా బే బీచ్‌లో జరిగాయి.

“తుది దశకు ఎంపికైన ఇళ్లు, విల్లాలు వాటికున్న అడ్డంకులను అధిగమించేందుకు ఊహాత్మక విధానాన్ని అనుసరించాయి. ఇబ్బందులను అవకాశాలుగా మార్చాయి” అని ఫించ్ చెప్పారు.

“ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించే సామగ్రికి ఎంత ఖర్చు చేయవచ్చనే దాని గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు” అని ఆయన అన్నారు.

“పర్యావరణపరమైన ప్రయోజనాల దృష్ట్యా చెక్కకు గిరాకీ పెరుగుతోంది. ఆర్కిటెక్టులు కూడా ఇప్పుడు ఉన్న వాటిని కూల్చేసి, కొత్త వాటిని కట్టడం కంటే వాటిని అవసరమైనట్లు మార్చుకునే ట్రెండ్‌ వైపు మొగ్గు చూపుతున్నారు” అని ఫించ్ తెలిపారు.

వరల్డ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్‌లో గుర్తింపు పొందిన 8 ప్రాజెక్టులు ఇవే.

వేసవి, ఆస్ట్రేలియా, సిడ్నీ, ఎండలు

ఫొటో సోర్స్, ANSON SMART

ఫొటో క్యాప్షన్, సిడ్నీలోని 19 వాటర్‌లూ స్ట్రీట్‌లో ఎస్‌జేబీ నిర్మించిన ఈ ఇల్లు వేసవిలోనూ చల్లగా ఉంటుంది.

1. ఆస్ట్రేలియా, సిడ్నీ 19 వాటర్‌లూ స్ట్రీట్

2023 వరల్డ్ ఆర్కిటెక్చరల్ ఫెస్టివల్‌లో వరల్డ్ ఇంటీరియర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న ఈ ఇంటిని సిడ్నీకి చెందిన ఎస్‌జేబీ సంస్థ నిర్మించింది.

ఒకదానికొకటి పొంతన లేకుండా రకరకాల డిజైన్లున్న కిటికీలు, ఇంటికి మధ్యలో, చాలా ఎత్తులో ముందు వాకిలి, ఇటుక ముక్కలను అడ్డం, నిలువుగా పేర్చుతూ కట్టిన గోడలు ఈ ఇంటి ప్రత్యేకత.

సినిమాల్లో కొద్ది పాటి స్థలాన్ని పెద్దగా చేసి చూపించడంపై యూనివర్సిటీలో రాసిన థిసీస్ నుంచి ఈ డిజైన్‌ను సృష్టించారు ఎస్‌జేబీ డైరెక్టర్ ఆడమ్ హాడ్డో.

ఆధునిక భవన నిర్మాణ శైలిలో ఏకరూపత మీద మీద వ్యంగ్యాస్త్రాలు విసురుతూ జాక్వెస్ టటి నిర్మించిన “మాన్ ఓంక్లే”, “ప్లే టైమ్” సినిమాల ఆధారంగా ఆయన ఈ డిజైన్ రూపొందించారు.

భవన నిర్మాణంలో ఉపయోగించిన సామగ్రిని మళ్లీ వాడుకోవడం, దీర్ఘ కాల మన్నికపై ప్రధానంగా దృష్టి పెట్టినందుకు ఈ ప్రాజెక్టుకు అవార్డు లభించింది.

ముందు వైపు ఉన్న కిటికీలు ఈ ఇంటికి ఎయిర్ కండిషనర్ అవసరం లేకుండా చేస్తాయి.

జైపుర్, స్థానిక క్వారీలు, ఇసుక రాయి

ఫొటో సోర్స్, BARATH RAMAMRUTHAM

ఫొటో క్యాప్షన్, రాజస్థాన్‌లోని జైపుర్‌లో స్థానిక క్వారీ నుంచి తీసిన ఇసుకరాళ్లతో నిర్మించిన ఇల్లు

2. సాలిడ్ స్టోన్ హౌస్, జైపుర్, భారత్

ఈ ప్రాజెక్టు నిర్మాణంలో వాడిన శాండ్ స్టోన్‌ను చాలా కాలంగా స్థానిక ఆర్కిటెక్టులు నిర్లక్ష్యం చేశారు. ఇక్కడ విరివిగా లభించే ఈ రాయి గట్టిగా ఉంటుంది, దీర్ఘకాలం చెక్కు చెదరకుండా ఉంటుంది.

“మాకు మేమే కొన్ని సూచనలు చేసుకున్నాం, కేవలం రాయితోనే ఈ ఇల్లు కట్టాలనుకున్నాం. ఇది ఒక నిర్మాణ స్థలం కంటే పురావస్తు తవ్వకాల మాదిరిగా కనిపించాలని అనుకున్నాం. ఇక్కడ కనుక్కోవడం, తయారు చేయడం మధ్య గీత అస్పష్టంగా ఉంటుంది” అని చెప్పారు ఈ ఇంటిని నిర్మించిన మాలిక్ ఆర్కిటెక్చర్ యజమాని అర్జున్ మాలిక్.

జైపుర్‌లోని ఓ క్వారీ నుంచి సంప్రదాయ వస్తువులతో బయటకు తీసిన రాళ్లతో ఇంటిని నిర్మించారు.

శాండ్ స్టోన్ వాడకం వల్ల ఇంటి లోపల, బయట ఇది ఒకేలా కనిపిస్తుంది.

ఇటలీ, భూకంపాలు, ఫామ్‌హౌస్

ఫొటో సోర్స్, DAN GLASSER

ఫొటో క్యాప్షన్, భూకంపాలను తట్టుకుని నిలబడేలా నిర్మించిన ఇల్లు

3. వార్డ్ హౌస్, సర్నానో, ఇటలీ

స్వీడన్ దంపతులకు చెందిన ఈ హాలిడే హోమ్‌ స్థానిక ట్రెండ్‌కు అద్దం పడుతోంది. నిర్మాణ స్థలంలో లభించిన, మళ్లీ ఉపయోగించుకోగల వస్తువులతో దీన్ని కట్టారు.

ఇటలీలోని సర్నానో పట్టణానికి సమీపంలో సిబిల్లిని పర్వతాలకు ఎదురుగా ఉన్న ఫామ్ హౌస్ 2016లో సంభవించిన భూకంపం కారణంగా దాదాపు శిథిలావస్థకు చేరుకుంది. ఆ శిధిలాలతోనే ఈ ఇంటిని నిర్మించారు.

పర్షియన్ ఆర్కిటెక్ట్ కార్ల్ ఫ్రెడ్రిక్ స్వెన్ స్టెట్ ఈ డిజైన్ రూపొందించారు. దీని అసలు నిర్మాణం ఫామ్‌హౌస్ లోపలి, వెలుపలి అవశేషాల మధ్య ఉంది.

దీన్ని బయట నుంచి చూస్తే ఇల్లులాగా అనిపించదు. డిజైనింగ్‌లో చేసిన కొన్ని మార్పుల వల్ల అసాధారణంగా ముక్కలు ముక్కలు కత్తిరించినట్లుగా కనిపిస్తుంది.

ఈ ఇంటిని భారీ భూకంపాలను తట్టుకుని నిలబడేలా నిర్మించారు. ఇంటి లోపల, బయటి ప్రాంతానికి మధ్య భారీ కిటికీలు ఉన్నాయి. ఇంట్లో ఏ మూల నుంచైనా ప్రకృతిని వీక్షించవచ్చు. ఇంటి ముందున్న ఈత కొలనులో కాంతి ఇంటిని రాత్రి ఒకలాగా పగలు మరోలా కనిపించేలా చేస్తుంది.

ఆస్ట్రేలియా, త్రీ స్ప్రింగ్స్ రెసిడెన్షియల్ గ్యాలరీ

ఫొటో సోర్స్, PETER BENNETS

ఫొటో క్యాప్షన్, త్రీ స్ప్రింగ్స్ రెసిడెన్షియల్ గ్యాలరీలో అరలు అరలుగా ఉన్న పైకప్పు ప్రత్యేకం.

4. త్రీ స్ప్రింగ్స్ రెసిడెన్షియల్ గ్యాలరీ, బునురొంగ్ ల్యాండ్, ఆస్ట్రేలియా

మెల్‌బోర్న్ సమీపంలోని ఈ ఇంటిని స్థానికంగా ఉండే కేజీఏ ఆర్కిటెక్చర్స్ రూపొందించింది. ఆస్ట్రేలియన్ తరహా కళాత్మకత ఉట్టి పడుతున్న నిర్మాణం ఇది.

భారీగా కనిపిస్తున్న ఈ ఇంటిలో తలుపుల్ని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా దర్వాజాలు ఏర్పాడు చెయ్యలేదు. ఇంటి నిర్మాణంలో ఉపయోగించిన పార్టీషన్లలోనే వాటిని ఏర్పాటు చేశారు.

ఇంటి ఎదురుగా ఉన్న పెద్ద గార్డెన్ కనిపించేలా పెద్ద పెద్ద కిటికీలు, మొజాయిక్ తరహా ఫ్లోరింగ్, వాటి మీద చెక్కలు, అద్దాలతో తో ఏర్పాటు చేసిన గోడలు ఇంటికి అందాన్ని తీసుకొచ్చాయి.

ఇంటి లోపల, చుట్టుపక్కల సహజ రంగులను ప్రతిబింబించేందుకు అవసరమైన చోట గోడల్ని మట్టితో కట్టారు.

బ్రెజిల్, సావ్ పౌలో

ఫొటో సోర్స్, FRAN PARENTE

ఫొటో క్యాప్షన్, ఇంట్లోకి ధారాళంగా గాలి, వెలుతురు వచ్చేలా స్టూడియో మెట్రిక్ రూపొందించిన డిజైన్

5. ఎల్‌ఆర్‌ఎం హౌస్, సావ్‌పావ్‌లో, బ్రెజిల్

దీర్ఘచతురస్రాకారంలో అడ్డం, నిలువు సమానంగా కనిపించేలాా నిర్మించిన ఇల్లు ఇది. పక్కనే ఉన్న భవనాల మధ్య ఇరుకైన స్థలంలో పొడవుగా కనిపిస్తుంది.

తక్కువ స్థలంలో పెద్దదిగా కనిపించే అనుభూతిని సృష్టించేలా సావ్‌పాలోలోని స్టూడియో ఏజీ ఈ డిజైన్‌ను రూపొందించింది. ఎక్కువగా గ్లాసును అమర్చడం, ఇంటిని తోటతో అనుసంధానించి, రెండు అదనపు అంతస్తులు నిర్మించడం ద్వారా అద్భుతమైన నిర్మాణాన్ని సృష్టించింది ఈ సంస్థ.

పొడవైన గ్రౌండ్ ఫ్లోర్‌లో కిచెన్, లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్ ఉన్నాయి. వంటగది బయటకు వస్తే ఆరు బయట విశాలమైన డైనింగ్ హాల్ వస్తుంది.

మేడ మీద బెడ్‌రూమ్‌లు, పైన ఉన్న మరొక అంతస్తులో ఆఫీసు, జిమ్, స్నానాల గది, అవుట్‌డోర్ పూల్ ఉన్నాయి.

అద్దాలతో నిర్మించిన గోడలు ప్రైవసీని కల్పించడంతోపాటు ధారాళంగా వెలుతురు ప్రసరించేలా చేస్తాయి.

న్యూజిలాండ్

ఫొటో సోర్స్, SIMON WILSON

ఫొటో క్యాప్షన్, ప్రకృతిలో నివసిస్తున్న అనుభూతి కలిగించేలా ఇంటి నిర్మాణం

6. మావిటిపానా హౌస్, వైహేకే ఐలాండ్, న్యూజిలాండ్

ప్రకృతికి దగ్గరగా ఉండాలని, ఎండలు ఎక్కువగా ఉండే బహిరంగ ప్రదేశాలకు బదులుగా ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపేందుకు వీలుగా వెల్లింగ్టన్‌కు చెందిన దంపతులు ఈ ఇంటిని నిర్మించుకున్నారు. దీనిని మెక్ కే కర్టిస్ ఆర్కిటెక్చర్స్ డిజైన్ చేసింది.

నిటారుగా ఉన్న వాలు పైభాగంలో నిర్మించిన ఈ ఇల్లు మావిటిపానా బే అందాలన్నింటినీ చూపిస్తుంది.

రెండు అంతస్తుల భవనంలో సహజమైన వెంటిలేషన్, బీచ్ అలల శబ్దం లోపలికి వినిపించేలా ఖాళీలతో కూడిన చెక్క షట్టర్లను బిగించారు.

రియో డి జనీరో, బ్రెజిల్

ఫొటో సోర్స్, FRAN PARENTE

ఫొటో క్యాప్షన్, పర్యావరణ అనుకూల సామగ్రితో రియో డి జనీరోలో నిర్మించిన స్డూడియో అపార్ట్‌మెంట్

7.అపార్ట్‌మెంట్ ఓర్లా, రియోడి జనీరో, బ్రెజిల్

ఈ అపార్ట్‌మెట్ ప్రధాన ఆకర్షణల్లో ఒకటి ఆకట్టుకునే ఇపనెమా బీచ్ విశాల దృశ్యం.

ఇద్దరు చిన్న పిల్లలున్న జంట నివసించేందుకు ఈ ఇంటిని సావ్‌పాలోలోని ఆర్కిటెక్ట్ స్టూడియో ఆర్థర్ కాసాస్ నిర్మించింది.

ఇంటి నిర్మాణంలో సహజ పదార్థాలను విస్తృతంగా ఉపయోగించారు. గదిలో రాళ్లతో ఫ్లోరింగ్, చెక్కతో చేసిన గోడలు, ఇసుక శిలలు, కర్టెన్లు, అలంకరణ వస్తువులు అన్నింటినీ ప్రత్యేకంగా ఎంపిక చేసి తెచ్చారు. లోపలకు అడుగు పెట్టగానే రిలాక్స్‌డ్‌గా అనిపించడం ఈ ఇంటి ప్రత్యేకత.

విశాలంగా కనిపించే సముద్రం, ప్రశాంతమైన రంగులు క్షణాల్లో శక్తిని పుంజుకునేలా చేస్తాయి.

వాంకోవర్, ఫ్లాగ్ హౌస్

ఫొటో సోర్స్, FERNANDO GUERRA

ఫొటో క్యాప్షన్, ప్రకృతిలో కలిసిపోయిన ఫ్లాగ్ హౌస్‌

8. ఫ్లాగ్ హౌస్, కెనడా

బ్రెజిలియన్ ఆర్కిటెక్చర్ సంస్థ స్టూడియో ఎంకే27 ఫ్లాగ్ హౌస్‌ను రూపొందించింది. ఇది కెనడాలోని వాంకోవర్‌కు ఉత్తరాన ఉన్న విస్లర్‌లోని హాలిడే హోమ్.

బ్రెజిల్‌లో ఎంకే 27 నిర్మించిన ప్రాజెక్టులను చూసిన తర్వాత ఓ జంట తమ ఇంటిని డిజైన్ చేసే బాధ్యతను ఆ సంస్థకు అప్పగించింది.

1970లలో మార్సియో కోగన్ స్థాపించిన స్టూడియో, ఉష్ణమండల వాతావరణానికి అనుగుణంగా ఆధునిక విల్లాలను నిర్మించడంలో గుర్తింపు పొందింది. అయితే విస్లర్‌లో వాతావరణ పరిస్థితులు భిన్నం. అయినప్పటికీ ఈ సంస్థ నిరుత్సాహ పడకుండా ఈ ఇంటిని ప్రత్యేకంగా మార్చింది.

అడ్డంగా పొడవుగా ఉన్న ఈ ఇల్లు, ప్రకృతిలో పూర్తిగా కలిసిపోతుంది.

ఇది రెండు చతురస్రాకార నిర్మాణాలను కలిగి ఉంటుంది, ఒకటి మరొకదానిపై విశ్రాంతి తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఎత్తైన చెట్ల మధ్య విశాలమైన గ్లాస్-ఫ్రంటెడ్ లివింగ్ స్పేస్‌తో చేపట్టిన నిర్మాణం ఇది. పై అంతస్తులో సగం గాలిలో తేలాడుతున్నట్లు కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)