బీఈ, బీటెక్ మధ్య తేడా ఏమిటి, అది కెరీర్‌ను ప్రభావితం చేస్తుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రియాంక ఝా
- హోదా, బీబీసీ ప్రతినిధి
దీప్తిమాన్ పుర్బే హైదరాబాద్‌లోని ఒక పెద్ద కంపెనీలో ఇంజనీరింగ్ మేనేజర్.
పంకజ్ బిష్త్ పుణె యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత నాసిక్‌లోని ఒక పెద్ద టెక్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం చేస్తున్నారు.
వారిద్దరివీ ఒకే తరహా ఉద్యోగాలే. వారిద్దరూ ఇంజనీర్లే. ఇద్దరు చదివిందీ ఎలక్ట్రికల్ బ్రాంచే. అయితే, ఇక్కడ కోర్సులు భిన్నమైనవి. ఒకరిది బీటెక్ అయితే, మరొకరిది బీఈ.
ఎవరైనా సైన్స్ విభాగంలో చదువుకున్నా లేకపోయినా, తర్వాత ఇంజనీరింగ్ చేసినా, చేయకపోయినా... అందుకు సంబంధించిన బీఈ, బీటెక్ అనే రెండు కోర్సుల పేర్లను మాత్రం కచ్చితంగా వినే ఉంటారు.
అయితే, ఈ రెండు కోర్సుల పేర్లు వేర్వేరుగా ఉండటంలో లాజిక్ ఏమిటి? నిజంగా, ఈ రెండు డిగ్రీలు ఒకేలా ఉంటాయా, లేదా కోర్స్ అధ్యయన విధానం, కోర్స్ ఉద్దేశంలో ఏమైనా తేడా ఉందా?
ఈ రెండు కోర్సుల మధ్య గందరగోళాన్ని కెరీర్ కనెక్ట్ సిరీస్‌లోని ఈ ఎపిసోడ్ ద్వారా తొలగించడానికి ప్రయత్నిస్తాం.


ఫొటో సోర్స్, Getty Images
బీఈ, బీటెక్ కోర్సుల మధ్య తేడా ఏమిటి?
బీఈ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అని, బీటెక్ అంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అని అందరికీ తెలిసిందే. అయితే, ప్రాక్టికల్ నాలెడ్జ్ కంటే థియరిటికల్ నాలెడ్జ్‌పై ఎక్కువ ఫోకస్ ఉంటుందనే విషయంలో మాత్రమే బీఈ.. బీటెక్ కంటే భిన్నంగా ఉంటుంది.
స్టాటిస్టిక్స్, డేటా సైన్స్‌లో సుపరిచితులైన ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ షలబ్ బీఈ, బీటెక్ మధ్య తేడా గురించి ఏమంటారంటే.. బీఈ అనేది గతంలో ఉపయోగించిన పదమని, ప్రస్తుతం కొన్ని సంస్థలు మాత్రమే దీన్ని ఉపయోగిస్తున్నాయని చెప్పారు. అయితే, ఈ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు ఉండాల్సిన అర్హత నిబంధనల్లో కానీ, వీటి చదువులో కానీ వ్యత్యాసమేమీ లేదన్నారు.
దీప్తిమాన్ పుర్బే ప్రస్తుతం ఉబెర్ సంస్థలో ఇంజనీరింగ్ మేనేజర్‌గా పనిచేస్తూనే, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) గ్వాలియర్‌లో గెస్ట్ ఫ్యాకల్టీగా కూడా సేవలందిస్తున్నారు.
''గతంలో బీఈని నాలెడ్జ్ ఓరియెంటెడ్ కోర్సుగా పరిగణించేవారు. ఇందులో థియరిటికల్ ప్రిన్సిపల్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టేవారు. అంటే, 'వస్తువులు లేదా యంత్రాలు ఎందుకు పనిచేస్తాయి' అనే అంశంపై అవగాహన కల్పించేవారు. దానికి భిన్నంగా బీటెక్‌ను ప్రాక్టికల్, స్కిల్ ఓరియెంటెడ్ కోర్సుగా భావిస్తారు. ఇందులో 'వస్తువులు లేదా యంత్రాలు ఎలా పనిచేస్తాయి' అనే దానిపై శిక్షణ ఇస్తారు'' అని ఆయన వివరించారు.
ఇదే విషయాన్ని పంకజ్ బిష్త్ కూడా సమర్థిస్తూ, మన దేశంలో బీఈ, బీటెక్ రెండింటినీ సమానంగానే పరిగణిస్తున్నారని చెప్పారు.
బీఈ కోర్సును 2014లో పూర్తి చేసిన పంకజ్ బిష్త్, ప్రస్తుతం జియో సంస్థలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
''బీఈ సిలబస్ కొంచెం ట్రెడిషనల్‌గా ఉంటుంది. ఈ కోర్సు ఎక్కువగా పాత విశ్వవిద్యాలయాల్లో అందుబాటులో ఉంటుంది. ఈ కోర్సులో ఫండమెంటల్స్ అంటే ప్రాథమిక అంశాలపై ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. మరోవైపు బీటెక్ సిలబస్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటుంది. ఇందులో ల్యాబ్స్, ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లకు ప్రాధాన్యత ఎక్కువ. ఐఐటీ, ఎన్ఐటీలతో పాటు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రధానంగా బీటెక్ కోర్సునే అందిస్తారు'' అని పంకజ్ బిష్త్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
మరి వేర్వేరు పేర్లు ఎందుకు?
దేశంలో ఇంజనీరింగ్ విద్యను అందించే సాంకేతిక విద్యా సంస్థలన్నింటినీ ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) పర్యవేక్షిస్తుంది.
ఏఐసీటీఈ గణాంకాల ప్రకారం, దేశంలో 2023-24 విద్యాసంవత్సరంలో డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) స్థాయిల్లో ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తున్న సంస్థలు మొత్తం 8,264 ఉన్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో మరో 211 కొత్త సంస్థల చేరడంతో ఆ జాబితాలో సంఖ్య 8,475కి చేరింది.
2023-24 విద్యా సంవత్సరంలో, దాదాపు 30.79 లక్షల మంది ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు పొందారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఐఐఆర్ఎఫ్) 2025 ర్యాంకింగ్స్ ప్రకారం, దేశంలో అగ్రశ్రేణి ఇంజనీరింగ్ విద్యాసంస్థగా ఐఐటీ బాంబే నిలిచింది.
అయితే, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల విభాగంలో అగ్రశ్రేణి ఇంజనీరింగ్ సంస్థగా బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్ పిలానీ) నిలిచింది.
ఇప్పటికీ బీఈ డిగ్రీని ప్రదానం చేస్తున్న ప్రముఖ విద్యాసంస్థల్లో బిట్స్ పిలానీ, కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీ, చెన్నైలోని అన్నా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ, బెంగళూరులోని ఆర్‌వీ కాలేజీ, పుణె యూనివర్సిటీ, ముంబయి యూనివర్సిటీ ఉన్నాయి.
సాధారణంగా బీఈ లేదా బీటెక్ అనేది ఆ డిగ్రీని ఏ విశ్వవిద్యాలయం అందిస్తోంది అనే అంశంపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఎందుకంటే, అనేక పాత యూనివర్సిటీలు ఈ కోర్సును బీఈ అని పిలుస్తుండగా, సాంకేతిక విద్యాసంస్థలు దీన్ని బీటెక్ అని పిలుస్తున్నాయి.
కేవలం పేరు ఆధారంగా విద్య నాణ్యతలో ఎటువంటి వ్యత్యాసం ఉండదు. బీఈ, బీటెక్ రెండూ నాలుగేళ్ల కోర్సులే. అలాగే వాటిలో ప్రవేశానికి విద్యార్థులకు ఉండాల్సిన అర్హత నిబంధనలు కూడా ఒక్కటే.
- ఇంటర్మీడియెట్ లేదా 12వ తరగతిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి.
- ఆ తర్వాత, ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్ వంటి ప్రవేశ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
బీఈ, బీటెక్ కోర్సుల్లోని కోర్ సబ్జెక్టులు కూడా ఒకేలా ఉంటాయని దీప్తిమాన్ పుర్బే చెప్పారు. అంటే ఒక ఇంజనీరింగ్ బ్రాంచ్‌కు, మరో ఇంజనీరింగ్ బ్రాంచ్‌కు వేర్వేరుగా ఉండే ప్రధాన సబ్జెక్టులలో ఎటువంటి మార్పు ఉండదు.
- మొదటి సంవత్సరంలో ఉండే సబ్జెక్టులు: మేథ్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ మెకానిక్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్. ఈ సబ్జెక్టులను అన్ని ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల విద్యార్థులు తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది.
- ఆ తర్వాత, రెండో సంవత్సరం నుంచి నాలుగో సంవత్సరం వరకూ కొన్ని ప్రధాన బ్రాంచ్‌లలో సబ్జెక్టులు ఇలా ఉంటాయి:
- కంప్యూటర్ సైన్స్: డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (డీబీఎంఎస్)
- మెకానికల్: థర్మో డైనమిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, కైనమాటిక్స్ ఆఫ్ మెషీన్స్
- ఎలక్ట్రికల్: సర్క్యూట్ థియరీ, కంట్రోల్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్

ఫొటో సోర్స్, Getty Images
ఎవరికి ఏ కోర్సు సరైనది?
''వాస్తవ ప్రపంచంలో బీఈ, బీటెక్ మధ్య ఉన్న వ్యత్యాసం పూర్తిగా చెరిగిపోయింది. ప్రస్తుతం ఈ రెండింటిలో ఏ కోర్సు పూర్తిచేసినా, తర్వాత లభించే కెరీర్ అవకాశాలలో ఎటువంటి తేడా లేదు'' అని దీప్తిమాన్ పూర్బే అన్నారు.
ఒక కోర్సు కంటే మరో కోర్సు తక్కువని కానీ, ఎక్కువని కానీ చెప్పలేం. అంతేగాకుండా, మాస్టర్స్ డిగ్రీ (ఎంటెక్/ఎంఎస్) లేదా ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు కూడా రెండు కోర్సుల పేర్లను కలిపే పేర్కొంటున్నారు. కాబట్టి, ఈ రెండు కోర్సులకు సమానమైన విలువ ఉంటుంది.
అయితే, విద్యార్థులు ఏదైనా కళాశాలలో ప్రవేశం పొందడానికి ముందు తప్పనిసరిగా గమనించాల్సిన ముఖ్యమైన అంశాలను దీప్తిమాన్ పూర్బే సూచిస్తున్నారు.
- కేవలం డిగ్రీ పేరు చూసి కోర్సును ఎంచుకోకూడదు. దానికి బదులుగా, ఆ కోర్సు ఏ యూనివర్సిటీలో లభిస్తోంది, ఏ బ్రాంచ్ వస్తోంది అనే అంశాల ఆధారంగానే విద్యార్థి నిర్ణయం తీసుకోవాలి.
- విద్యాసంస్థలో మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, బోధనా సిబ్బంది అనుభవమేమిటి, ప్లేస్‌మెంట్‌ల రికార్డు ఎలా ఉంది, రీసెర్చ్ అవకాశాలు ఎలా ఉన్నాయి, మీరు ఎంచుకుంటున్న కోర్సు అక్కడ ఎలాంటి వాతావరణంలో బోధిస్తున్నారు అనే విషయాలను తప్పనిసరిగా గమనించాలి.
- ఒకవేళ బీఈ, బీటెక్ రెండింటిలోనూ ఒకే రకమైన బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంటే, అప్పుడు ఈ రెండు కోర్సులను సమానంగానే భావించి, పైన చెప్పిన మిగతా అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సరైన నిర్ణయం తీసుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
భవిష్యత్తు ఎదుగుదలలో తేడాలు ఉంటాయా?
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, డేటా అనలిస్ట్ లేదా మరే ఇతర బ్రాంచ్ ఇంజనీర్ కోసమైనా సరే ఖాళీలు ఉంటే, జాబ్ డిస్క్రిప్షన్‌లో అవసరమైన అర్హతగా ఎప్పుడూ బీఈ/బీటెక్ అనే రాసి ఉంటుంది.
ఏ డిగ్రీతోనైనా ఒకే తరహా ఉద్యోగం పొందిన ఏ ఇద్దరికీ శాలరీ ప్యాకేజీలలో కూడా ఎటువంటి తేడా ఉండదు. వాస్తవానికి జీతం అనేది పూర్తిగా సదరు అభ్యర్థి ఇంటర్వ్యూలో ఎలా రాణించారు, సమస్యా పరిష్కార నైపుణ్యాలు ఎలా ఉన్నాయి, వారు ఏ పోస్టుకు ఎంపికయ్యారు అనే అంశాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఈ విషయాలపై డిగ్రీ పేరు తాలూకా ప్రభావం శూన్యమనే చెప్పవచ్చు.
''నేటి కాలంలో ట్రెండ్ అనేది బీఈ, బీటెక్ మీద ఆధారపడి లేదు, అది మీరు ఎంచుకునే బ్రాంచ్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఐటీ రంగం పుంజుకుంటోంది కాబట్టి, అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఆ బ్రాంచ్ వచ్చేలా చూసుకోవాలి. ఒకవేళ మెకానికల్ రంగానికి డిమాండ్ ఉంటే, దాని గురించి ఆలోచించాలి. మార్కెట్ అవసరాలకు తగ్గటుగా బ్రాంచ్ ఎంచుకోవడమే ముఖ్యం'' అని పంకజ్ బిష్త్ సూచించారు.
ఏ కంపెనీ కూడా ఫలానా పోస్టుకు కేవలం బీఈ ఉన్నవారో లేదా బీటెక్ ఉన్నవారు మాత్రమే కావాలనే నిబంధన పెట్టవని ఆయన అన్నారు.
''నేను ఇప్పటివరకూ నాలుగు కంపెనీలు మారాను. మీరు బీఈ చదివినా, బీటెక్ చదివినా ఆ కంపెనీ అవసరాలకు తగ్గ నైపుణ్యాలు మీ దగ్గర ఉంటే వారు మిమ్మల్ని తప్పక తీసుకుంటారు. బీటెక్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ఏ ఉద్యోగానికైనా బీఈ వారు కూడా నిరభ్యంతరంగా దరఖాస్తు చేసుకోవచ్చు'' అని పంకజ్ బిష్త్ అభిప్రాయపడ్డారు.
భవిష్యత్తు ఎదుగుదల (ఫ్యూచర్ గ్రోత్) గురించి దీప్తిమాన్ మరికొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు.
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యుగంలో కంపెనీలు అభ్యర్థుల డిగ్రీ కంటే వారికున్న నైపుణ్యాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి.
- ప్రస్తుతం మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, న్యూరల్ నెట్‌వర్క్స్ వంటి ప్రత్యేక నైపుణ్యాల వైపు కంపెనీలు మొగ్గు చూపిస్తున్నాయి.
- మీ వద్ద బీఈ ఉన్నా, బీటెక్ ఉన్నా మీ కెరీర్ ఎదుగుదల అనేదీ పూర్తిగా మీ ఫోర్ట్‌ఫోలియో, కోడింగ్ నైపుణ్యాలు, మ్యాథ్‌మెటిక్స్‌పై మీకున్న అవగాహన మీదే మీ కెరీర్ గ్రోత్ పూర్తిగా ఆధారపడి ఉంటుంది.
''బీఈ, బీటెక్ మధ్య తేడాల గురించి చర్చ కేవలం విద్యాపరమైంది మాత్రమే. వాస్తవం ఏమిటంటే, ఇవి ఒకే గమ్యస్థానానికి తీసుకెళ్లే రెండు వేర్వేరు దారులు'' అని దీప్తిమాన్ అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














