CUET: కోర్సు ముఖ్యమా, కాలేజీనా? మంచి కాలేజీలో సీటు రాకపోతే.. సందేహాలు - సమాధానాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రియాంక
- హోదా, బీబీసీ ప్రతినిధి
సీయూఈటీ(CUET) అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, మంచి కాలేజీలో అడ్మిషన్ కోసం విద్యార్థుల్లో ఆందోళన మొదలవుతుంది.
ఏ కాలేజీని ఎంచుకోవాలి, ఏ కోర్సు తీసుకోవాలి? కావాల్సిన కాలేజీలో అడ్మిషన్ రాకపోతే తర్వాత ఏం చేయాలి? వంటి అనేక ప్రశ్నలు తలెత్తుతాయి.
వీటన్నింటికీ, విద్యార్థులు సరైన ప్రాసెస్‌ను తెలుసుకోవడం, కటాఫ్ ట్రెండ్‌పై అవగాహన కలిగి ఉండటం ముఖ్యం.
మంచి కాలేజ్ లేదా కోరుకున్న కోర్సులో సీటు ఎలా పొందవచ్చనే విషయాల్లో విద్యార్థులకు సాయపడేందుకు బీబీసీ కొంతమంది నిపుణులతో మాట్లాడి, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కనుగొనేందుకు ప్రయత్నించింది.


ఫొటో సోర్స్, Getty Images
ముఖ్యమైన ఫ్యాక్టర్స్
ఫలితాలు వచ్చాక, తమ స్కోర్ ఆధారంగా అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజ్ లేదా కోర్సులో అడ్మిషన్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు.
దీని తరువాత, అన్ని యూనివర్సిటీలు వాటి సొంత కటాఫ్ జాబితాను విడుదల చేస్తాయి.
కెరీర్ కౌన్సెలింగ్‌లో 20 ఏళ్లకు పైగా అనుభవమున్న తులికా కపూర్ కృష్ణ ప్రకారం, "విద్యార్థులు తమకు అనువైన కాలేజీ కోసం వెతకాలి."
ఏ కోర్సులో అయినా అడ్మిషన్ తీసుకునే ముందు విద్యార్థులు అనేక విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి అని తులికా సూచించారు. ఉదాహరణకు..
"మనకు నిజంగా ఆ కోర్సుపై ఆసక్తి ఉందా, ఇప్పటివరకు ఆ సబ్జెక్ట్‌లో మన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? టీచింగ్ ఫ్యాకల్టీ బాగున్న కళాశాలలో ఆ కోర్సు అందుబాటులో ఉందా? ఆ కాలేజీ వాతావరణం, క్రమశిక్షణ, ప్లేస్‌మెంట్స్.. ఇవన్నీ విద్యార్థికి ఉపయోగపడే విషయాలు" అని తులికా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కాలేజ్ లేదా కోర్సు.. దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి?
కొన్ని సందర్భాల్లో, ఒక విద్యార్థికి మంచి కోర్సులో సీటు వచ్చినా, ఆ కాలేజ్ తనకు నచ్చకపోవచ్చు. మరికొన్నిసార్లు పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటుంది. అంటే, కోర్సు నచ్చకపోవచ్చు. కానీ ఆ కాలేజీకి మంచి బ్రాండింగ్ ఉంటుంది.
అయితే, విద్యార్థులు కాలేజీ కంటే కోర్సుకే ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
సెంటర్ ఫర్ కెరీర్ డెవలప్‌మెంట్ సంస్థ కెరీర్ కౌన్సెలింగ్ రంగంలో అనుభవమున్న సంస్థగా పేరుపొందింది. ఈ సంస్థ వ్యవస్థాపకులు జితిన్ చావ్లా కూడా విద్యార్థులకు ఇచ్చే సూచన ఏమిటంటే.. కాలేజీ కన్నా కోర్సుకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి అని.
"ప్రతి విద్యార్థికి టాప్ 8-9 కాలేజీల పేర్లు తెలిసే ఉంటాయి. ప్రతి ఒక్కరూ వాటిలోనే అడ్శిషన్ పొందాలని కోరుకుంటారు. కానీ, వాటిలో కాకుండా మరో ఇతర మంచి కాలేజీలో సీటు వచ్చినప్పుడు మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. అందరి డిగ్రీ ఒక్కటే" అని ఆయన అంటున్నారు.
"ఉదాహరణకు, దిల్లీ యూనివర్శిటీ (డీయూ) విషయానికొస్తే, డిగ్రీపై ఏ కాలేజీ అని పేరు రాసి ఉండదు. యూనివర్సిటీ పరిధిలోని ప్రతి విద్యార్థి డిగ్రీ సర్టిఫికెట్ ఒకేలా ఉంటుంది." అన్నారాయన.
''ఇది స్కిల్స్(నైపుణ్యాల) యుగం. విద్యార్థిలో ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయనే దానిపైనే వారి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. కోర్సుతో పాటు ఏదైనా ఇంటర్న్‌షిప్ చేశారా? ఇంకా ఏదైనా అదనపు కార్యక్రమాల్లో పాల్గొన్నారా? ఏవైనా ఆన్‌లైన్ కోర్సులు చేశారా? వంటి విషయాలు చాలా కీలకం'' అని జితిన్ అభిప్రాయపడ్డారు.
" మీరు బిజినెస్‌కి సంబంధించిన కోర్సులు చేస్తున్నట్లయితే.. దానితో పాటు డిజిటల్ మార్కెటింగ్ కోర్సు చెయ్యొచ్చు. ఫైనాన్స్‌పై ఆసక్తి ఉంటే, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ అనుబంధ సంస్థ, బీఎస్ఈ ఇన్‌స్టిట్యూట్ ఉంది. అందులో ఏదైనా ఒక కోర్సు చేయొచ్చు. ఇలా అదనపు నైపుణ్యాలు పెంచుకుంటేనే మీ ప్రొఫైల్ స్ట్రాంగ్‌గా ఉంటుంది."
తులికా కపూర్ కృష్ణ మాట్లాడుతూ, "కళాశాల కంటే కోర్సుకే ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే, మీకు ఆసక్తి లేని లేదా అంతగా రాణించలేని కోర్సు చేసి డిగ్రీ తీసుకున్నా, దానివల్ల ఉపయోగం ఏముంటుంది?" అని అన్నారు.
"ఈ రెండింటి మధ్య సమతుల్యం అవసరం. కాలేజీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా అడ్మిషన్ తీసుకోవడం సరైంది కాదు. ఆ కాలేజీకి ఎంత గుర్తింపు ఉందో, అక్కడ ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి" అని తులికా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మొదటి జాబితాలో పేరు లేకపోతే?
ఈసారి దేశంలోని 49 కేంద్ర విశ్వవిద్యాలయాలతో(సెంట్రల్ యూనివర్సిటీలు) పాటు, 36 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 24 డీమ్డ్, అనేక ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు సీయూఈటీలో భాగమయ్యాయి .
దిల్లీ యూనివర్సిటీ సహా అనేక పెద్ద విశ్వవిద్యాలయాల మొదటి కటాఫ్ జాబితాలు విడుదల చేస్తాయి. ఆ జాబితాలో పేరు లేకపోయినా విద్యార్థులకు ఇంకా వేరే అవకాశాలున్నాయి.
"మొదటి లిస్ట్‌లో పేరు లేకపోతే, వేరే యూనివర్సిటీలను చూడండి. అంబేడ్కర్ యూనివర్సిటీ ఉంది. ఐపీ యూనివర్సిటీ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీలూ ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీలను కూడా పరిశీలించండి. ఉదాహరణకు, ముంబయిలో బిజినెస్ మేనేజ్‌మెంట్ స్టడీస్ కోర్స్ సుమారు 100 కాలేజీల్లో అందుబాటులో ఉంది. కానీ, దిల్లీలో ఆ కోర్సు అందించే కాలేజీల సంఖ్య తక్కువ. కాబట్టి, విస్తృత అవకాశాలను పరిశీలించడం ముఖ్." అని జితిన్ చావ్లా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తక్కువ స్కోర్ వస్తే?
కోర్సుని బట్టి, గుడ్ స్కోర్.. బ్యాడ్ స్కోర్ అనేది మారుతూ ఉంటుంది.
"ఉదాహరణకు సైకాలజీ కోర్సులో అడ్మిషన్ పొందాలంటే 1000కి 850 స్కోర్ లేదా అంతకుమించిన స్కోర్ సరిపోవచ్చు. కానీ, కొన్ని ఇతర కోర్సులకు.. టాప్ కాలేజీల్లో సీటు రావాలంటే అంతకంటే ఎక్కువ స్కోర్ అవసరం కావొచ్చు" అని జితిన్ అన్నారు.
అయితే, ఒకవేళ ఎవరికైనా 600-650 స్కోర్ వస్తే? తన స్కోర్ పెంచుకోవడానికి వచ్చే ఏడాది మళ్లీ సీయూఈటీ రాయాలా? లేదా వారికి వేరే మార్గముందా?
తులికా కపూర్ ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ, ''అటువంటి పరిస్థితుల్లో, మరో సెంట్రల్ యూనివర్సిటీ లేదంటే ప్రైవేట్ యూనివర్సిటీ లేదా డీమ్డ్ యూనివర్సిటీలను ఎంచుకోవచ్చు'' అన్నారు.
జితిన్ చావ్లా కూడా ఇలాంటి సలహానే ఇస్తున్నారు. విద్యార్థులకు తక్కువ స్కోర్ వచ్చినా.. వచ్చే సంవత్సరం వరకూ ఎదురుచూడకుండా చదువు కొనసాగించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ కోర్సుతో పాటు కొన్ని అదనపు కోర్సులు చేసి తమ ప్రొఫైల్‌ను మెరుగ్గా మార్చుకోవాలని సూచించారు.
చివరగా, ''మీ కెరీర్ లక్ష్యంగా ఏమిటనేది అతి ముఖ్యమైన విషయం'' అన్నారు తులికా.
మనం కెరీర్‌లో ఎదగడానికి ఉపయోగపడే విషయాలను నేర్చుకోవడమే విద్య ముఖ్యోద్దేశం. అదే లేకపోతే, దేనివల్లా ఉపయోగం ఉండదని ఆమె అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














