'నా భార్య మృతదేహాన్ని గంటన్నర పాటు మోసుకెళ్లాను', ఇరాన్ హృదయవిదారక గాథలు

ఇరాన్ నిరసనలు

ఫొటో సోర్స్, User generated content

ఫొటో క్యాప్షన్, జనవరి 8న తెహ్రాన్‌లోని కషానీ గుండా నిరసనకారులు కవాతు చేశారు.
    • రచయిత, సారా నమ్‌జూ, రోజా అస్సాదీ
    • హోదా, బీబీసీ పర్షియన్

(హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలచివేయవచ్చు)

తెహ్రాన్‌లో జనవరి 8న జరిగిన నిరనసల్లో పాల్గొని ఇంటికి వెళ్తున్న సమయంలో రెజా తన భార్య మరియంకు రక్షణగా ఆమె చుట్టూ చేతులు అడ్డుపెట్టారు.

"అకస్మాత్తుగా నా చేతుల్లో బరువు తగ్గిపోయినట్టు అనిపించింది. నా చేతుల్లో ఆమె జాకెట్ మాత్రమే ఉంది" అని రెజా తన కుటుంబ సభ్యుల్లో ఒకరితో చెప్పగా.. ఆయన ఆ తర్వాత బీబీసీ పర్షియన్‌తో మాట్లాడారు.

మరియంను కాల్చి చంపారు, ఆ బుల్లెట్ ఎక్కడి నుంచి దూసుకువచ్చిందో కూడా వారికి అర్థం కాలేదు. మరియం మృతదేహాన్ని రెజా గంటన్నర పాటు మోసుకువెళ్లారు. గుండెలవిసే వేదనలో ఆయన అలిసిపోయి, ఓ సందులో కూర్చుండిపోయారు.

కొద్దిసేపటి తర్వాత, సమీపంలోని ఓ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. ఆ ఇద్దరినీ అక్కడివాళ్లు తమ గ్యారేజ్‌లోకి తీసుకువెళ్లారు. అక్కడ ఓ తెల్ల షీట్ పరిచి, మరియం మృతదేహాన్ని దాంట్లో చుట్టారు.

ఈ నిరసనల్లో పాల్గొనడానికి వెళ్లే కొద్దిరోజుల ముందు దేశంలో ఏం జరుగుతోందో తన ఏడు, పద్నాలుగేళ్ల పిల్లలకు మరియం వివరించారు.

"నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్లే తల్లిదండ్రులు కొన్నిసార్లు తిరిగి రాలేకపోవచ్చు" అని ఆమె చెప్పారు.

"నా రక్తం, మీ రక్తం మరెవరి కన్నా కూడా విలువైనది కాదు" అన్నారు. భద్రతా కారణాల రీత్యా రెజా, మరియం పేర్లను మార్చాం.

ఇరాన్‌లో చెలరేగుతున్న నిరనసలపై అధికారుల తీవ్రమైన అణచివేత మొదలైన తర్వాత.. ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాని వేలాది నిరసనకారుల్లో మరియం ఒకరు.

గత మూడు వారాలుగా 12 మంది పిల్లలు సహా 2,400 మంది నిరసనకారులు చనిపోయారని ధ్రువీకరించగలిగినట్టు అమెరికాకు చెందిన ఇరానియన్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ న్యూస్ ఏజెన్సీ(హెచ్ఆర్‌ఏఎన్ఏ) తెలిపింది.

అయితే, మృతుల సంఖ్య నిర్ధరించడం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే...ఇరాన్‌లోని అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ అందుబాటులో లేదు. మృతుల సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరగవచ్చని భావిస్తున్నారు.

మానవ హక్కుల సంస్థలకు ఇరాన్‌లో నేరుగా అనుమతి లభించడం లేదు. ఇతర అంతర్జాతీయ వార్తా సంస్థల్లానే బీబీసీ కూడా క్షేత్ర స్థాయిలో అక్కడి నుంచి రిపోర్ట్ చేయలేకపోతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇరాన్, నిరసనలు

ఫొటో సోర్స్, Islamic Republic of Iran Broadcasting via WANA via Reuters

ఫొటో క్యాప్షన్, ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ కాలిపోయిన బస్సును చూపిస్తూ, ఆ ఫుటేజ్ జనవరి 10న తెహ్రాన్‌లో చిత్రీకరించినట్లు తెలిపింది.

పాలనకు వ్యతిరేకంగా నిరసనలు

ఇరాన్ ప్రభుత్వ అధికారులు కూడా మృతుల సంఖ్యను వెల్లడించడం లేదు.

అయితే, 100 మంది భద్రతా సిబ్బంది మరణించారని, "అల్లరిమూకలు, టెర్రరిస్టులు" అని వారు సంబోధిస్తున్న నిరసనకారులు పదుల కొద్దీ మసీదులు, వివిధ నగరాల్లోని బ్యాంకులకు నిప్పంటించారని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.

డాలర్‌తో పోలిస్తే ఇరానియన్ కరెన్సీ పతనమైన నేపథ్యంలో.. ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో డిసెంబరు 29న ఈ నిరసనలు మొదలయ్యాయి. ఇరాన్‌లోని ఇతర పట్టణాలకు, నగరాలకు విస్తరించి దేశ పాలకులకు వ్యతిరేకంగా మారాయి.

భద్రతా బలగాలు క్రూరమైన అణచివేత మొదలుపెట్టిన తర్వాత, ఈ నిరసనలు మొదలైన తర్వాత, జనవరి 7న 34 మంది నిరసనకారులు చనిపోయినట్టు రిపోర్టులు వచ్చాయి.

సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ పాలన అంతం కావాలని నినదిస్తూ దేశవ్యాప్తంగా వేలాది మంది గురువారం, శుక్రవారం వీధుల్లో నిరసనలకు దిగడంతో ఆయా రోజుల్లో తీవ్రమైన అణచివేత జరిగిందని తెలుస్తోంది.

ఇరాన్, తెహ్రాన్, నిరసనలు

ఫొటో సోర్స్, User generated content

ఫొటో క్యాప్షన్, జనవరి 8న కషానీ, తెహ్రాన్

ఇరాన్‌ లోపల జరుగుతున్న దానిపై బీబీసీ పర్షియన్‌కు పదుల సంఖ్యలో సమాచారం అందింది. అనేక తీవ్ర పరిణామాల ముప్పు ఎదుర్కోవాల్సి ఉన్నప్పటికీ.. నిరసనకారులకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసను ప్రపంచానికి తెలియాలని తాము కోరుకుంటున్నామని పలువురు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

"మా చుట్టుపక్కల ప్రాంతంలో నెత్తుటేరులు పారాయి. వాళ్లు చాలా మందిని చంపారు" అని బీబీసీ పర్షియన్‌తో ఒకరు అన్నారు.

భద్రతా బలాగాలు "చాలామందిని తలపై, ముఖాలపై కాల్చాయి" అని మరొకరు తెలిపారు.

ఈ నిరసనలు 31 ప్రావిన్సులకు విస్తరించాయి. అలాగే ఇప్పటివరకు అందిన సమాచారాన్ని బట్టి, పెద్ద నగరాల్లో జరిగినట్లుగానే, చిన్న నగరాలు, పట్టణాల్లోనూ నిరసనకారులు చనిపోయారని స్పష్టంగా తెలుస్తోంది.

ఉత్తర ఇరాన్‌లో 50 వేల జనాభా కలిగిన టోనెకాబాన్ పట్టణానికి చెందిన 18 ఏళ్ల సొరేనా గోల్గున్ గత వారం ప్రాణాలు కోల్పోయారు. యూనివర్సిటీ విద్యార్థి అయిన ఆయన్ను భద్రతా బలాగాలు "గుండెల్లో కాల్చాయి"అని తన కుటుంబ సభ్యుల్లో ఒకరు చెప్పారు.

ఇరాన్

ఫొటో సోర్స్, User generated content

ఫొటో క్యాప్షన్, జనవరి 8న నజాఫ్ అబాద్‌లోని హోజ్ ఎల్మియే మత సంస్థ వెలుపల ఒక ప్రదర్శన జరిగింది.

'నగరం బయటే ఖననం చేయాలన్నారు'

సొరేనా మాదిరిగానే, చనిపోయిన నిరసనకారుల్లో చాలామంది జీవితంపై ఎన్నో కలలతో ఉన్న యవతీయువకులున్నారు.

రొబినా అమీనియన్ అనే 23 ఏళ్ల ఫ్యాషన్-డిజైన్ విద్యార్థి గతవారం తెహ్రాన్‌లో జరిగిన కాల్పుల్లో మరణించారు. ఆమె మిలాన్‌లో తన చదువును పూర్తి చేయాలనుకున్నారు. రొబీనా మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఆమె తల్లి తన ఇంటి నుంచి దాదాపు ఆరు గంటలు ప్రయాణించి, ఇరాన్‌కు పశ్చిమంగా ఉండే కేర్మాన్‌షా నగరానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమె నిర్జీవంగా ఉన్న తన కూతురిని తీసుకెళ్లారు.

కూతురి మృతదేహాన్ని ఆమె ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నగరం బయట ఉండే ఓ మారుమూల శ్మశానంలో ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులెవరూ లేకుండా రొబీనాకు అంత్యక్రియలు నిర్వహించాలని భద్రతా బలగాలు ఆమెను ఆదేశించాయి.

చనిపోయిన వారిలో నిరసనకారులే కాదు. కేర్మాన్‌షాకు చెందిన 24 ఏళ్ల నర్సు నవీద్ సలేహీ వంటి ఇతరులు మృతుల్లో ఉన్నారు. తన పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆమెపై కాల్పులు జరిగాయి. అనేకమంది నిరసనకారుల మృతదేహాలను తెహ్రాన్‌లోని కహ్రిజక్ ఫోరెన్సిక్ మెడికల్ సెంటర్‌కు తరలించారు.

సోరెనా గోల్గున్, ఇరాన్

ఫొటో సోర్స్, Family of Sorena Golgun

ఫొటో క్యాప్షన్, కాలేజీ విద్యార్థి అయిన సోరెనా గోల్గున్‌(18)ను టోనెకాబోన్‌లో భద్రతా దళాలు కాల్చి చంపాయని ఆయన కుటుంబం తెలిపింది.

"యుద్ధం జరుగుతున్నట్టే అనిపించింది"

ఆ దృశ్యాలు చాలా హృదయ విదారకరంగా ఉన్నాయని సహనంద్ అనే వ్యక్తి తెలిపారు. తన అసలు పేరు చెప్పడానికి నిరాకరించిన ఆయన తమ ప్రాంతం నుంచి దాదాపు 1,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, సరిహద్దు ప్రాంతానికి చేరుకుని, తమ పొరుగు దేశాల మొబైల్ డేటాను వాడి, ఆ వీడియోలను పంపగలిగారు.

తాను రెండు వేలకు పైగా మృతదేహాలు నేలమీద పడి ఉండటం చూశానని సహనంద్ చెప్పారు. దీన్ని బీబీసీ స్వయంగా ధ్రువీకరించడం లేదు.

అయితే, కహ్రిజక్‌కు చెందిన రెండు కొత్త వీడియోల్లో… ఒక దాంట్లో 186 మంది మృతదేహాలు, మరో ఫుటేజీలో 178 మృతదేహాలు ఉన్నట్టు బీబీసీ వెరిఫై, బీబీసీ పర్షియన్ లెక్కించింది.

అయితే, ఈ రెండు వీడియోల్లో ఒకే మృతదేహాలను రెండుసార్లు చూపించే అవకాశం ఉంది కాబట్టి, దీనిపై నిర్ధరణకు రాలేము. కానీ, మృతదేహాల సంఖ్య అంతకుమించి ఉండే అవకాశం ఉంది.

గత వారం జరిగిన ఘటనలు "యుద్ధాన్ని" తలపించాయని తన గుర్తింపు వెల్లడించడానికి ఇష్టపడని ఓ యువతి బీబీసీ పర్షియన్‌తో చెప్పారు. నిరసనకారులు "అంతకుముందుతో పోలిస్తే చాలా ఐక్యంగా ఉన్నారు" అని చెప్పారామె. కానీ, ఆనాటి ఘటనలు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు.

చాలా మందిలాగే తాను కూడా అధికారులు కొత్త అణచివేతలు మొదలుపెడతారనే భయంతో ఈ వారం దేశం నుంచి పారిపోయాననని చెప్పారు.

"ఇరాన్‌లో ఉన్నవారికి ఏం జరుగుతోందోనని భయపడుతున్నాను" అని ఆమె అన్నారు.

(ఈ కథనం ఫర్జాద్, హసన్ సోల్హోజు అందించిన అదనపు సహకారంతో)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)