ఇరాన్‌లో అమెరికన్లను బందీలుగా పట్టుకున్నప్పుడు ఏం జరిగింది?

తెహ్రాన్‌, అమెరికా రాయబార కార్యాలయం

ఫొటో సోర్స్, Arnaud DE WILDENBERG/Gamma-Rapho via Getty Images

ఈ ఘటన 1979 నవంబర్ 4 నాటిది. ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇస్లామిక్ స్టూడెంట్లు దాడి చేసి, 90 మందికి పైగా అమెరికన్లను బందీలుగా తీసుకున్నారు.

దేశం విడిచి వెళ్లిపోయిన ఇరాన్ రాజు షాను అమెరికా తమకు అప్పగించాలని, ఆయనపై ఇరాన్‌లో విచారణ జరపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

అమెరికా రాయబార కార్యాలయాన్ని విద్యార్థులు తమ గుప్పిట్లోకి తీసుకోవడాన్ని అటు ఇరాన్ రివల్యూషనరీ గార్ట్స్‌గానీ, ఇటు పోలీసులుగానీ ఆపే ప్రయత్నం చేయలేదు.

పైగా ఇరాన్ టెలివిజన్ చానెళ్లు దీన్ని లైవ్‌గా చూపిస్తూ... విద్యార్థుల చర్యలకు తమ మద్దతును తెలిపాయి. రాయబార కార్యాలయం లోపలున్న ఒక వ్యక్తి ఫోన్ ద్వారా రిపోర్టర్లతో మాట్లాడారు.

విద్యార్థులు చేపట్టిన ఈ చర్య కేవలం తమ బల ప్రదర్శనేనని, బందీలందరూ సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. రెండు వారాల ముట్టడి తర్వాత.. అమెరికా రాయబార కార్యాలయం నుంచి 13 మంది మహిళలను, నల్లజాతీయులైన బందీలను విడిచిపెట్టారు విద్యార్థులు. మిగిలిన వారు 444 రోజులపాటు బందీలుగానే ఉండాల్సి వచ్చింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఖుమేనీ-అమెరికా మధ్య చర్చల నేపథ్యం

ఇరాన్‌లో నెలల తరబడి కొనసాగిన రాజకీయ, మతపరమైన ఘర్షణల ఫలితమే అమెరికా రాయబార కార్యాలయంపై దాడి. కానీ, వీటి మూలాలు దశాబ్దాల నాటివి.

1964లో అయతుల్లా రూహుల్లా ఖుమేనీని ఇరాన్ నుంచి షా బహిష్కరించారు. ఫలితంగా ఆయన ఇతర దేశాల్లో జీవించేవారు. బందీల సంక్షోభం నెలకొన్నప్పుడు, ఖుమేనీ ఫ్రాన్స్‌లో ఉన్నారు.

అయతుల్లా రూహుల్లా ఖుమేనీ నేతృత్వంలో అప్పటి ఇరాన్ రాజు షా రెజా పహ్లావీకి వ్యతిరేకంగా మొదలైన నిరసనలు.. ఇరాన్‌లో పెద్ద విప్లవానికి దారి తీశాయి.

కార్మికుల సమ్మె కారణంగా చమురు సరఫరాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా పశ్చిమ దేశాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి.

15 ఏళ్ల పాటు దేశ బహిష్కరణలో ఉన్న అయతుల్లా.. తిరిగి ఇరాన్‌కు రావాలని చాలా ఆత్రుతతో ఉన్నారు. అయితే, సైన్యాన్ని చూస్తే అయతుల్లా రూహుల్లా ఖుమేనీకి భయమేసింది.

సైన్యంలోని ఉన్నతాధికారులకు ఆయనంటే గిట్టేది కాదు. అంతకంటే ఆందోళనకర విషయం ఏంటంటే, ఈ అధికారులు ప్రతిరోజూ అమెరికా ఎయిర్ ఫోర్స్ జనరల్ రాబర్ట్ ఈ. హ్యూజర్‌ను కలిసేవారు

మిలటరీ అధికారులు ఈ తిరుగుబాటు గురించి ఎక్కువగా ఆలోచించవద్దని, అప్పటి ప్రభుత్వంతో సహకరించాలని చెబుతూ.. ఆర్మీ జనరల్ రాబర్ట్ ఈ. హ్యూజర్‌ను అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అక్కడకు పంపించారు.

బందీలు, ఇరాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రజలు, మీడియా ముందు నుంచి అమెరికా బందీలను తీసుకెళుతున్న దృశ్యం

అమెరికాను 'సైతాను'గా అభివర్ణించే.. 'ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్' వ్యవస్థాపకుడు అయతుల్లా రూహుల్లా ఖుమేనీ 1979 జనవరి 27న వాషింగ్టన్‌కు ఒక రహస్య సందేశం పంపించారు.

ఈ సందేశంలో.. ''ఇరాన్ సైన్యాధికారులు మీరు చెప్పింది వినొచ్చు. కానీ, ఇరాన్ ప్రజలు నా ఆదేశాలను పాటిస్తారు'' అని ఖుమేనీ పేర్కొన్నారు.

ఇరాన్‌లో తనని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సైన్యంపై తన పలుకుబడిని జిమ్మీ కార్టర్ ఉపయోగిస్తే.. దేశంలో శాంతిని, స్థిరత్వాన్ని పునరుద్ధరిస్తానని ఆ సందేశంలో ఖుమేనీ అన్నారు.

ఇరాన్‌లో అమెరికా జాతి ప్రయోజనాలను, అమెరికా పౌరులను రక్షిస్తామని కూడా ఖుమేనీ వాగ్దానం చేశారు.

వైట్‌హౌస్‌కు పంపిన తొలి వ్యక్తిగత సందేశంలో.. ''27 ఏళ్లుగా మీ మిత్రుడిగా ఉన్న వారిని కోల్పోతుండటంపై మీరు భయపడాల్సిన పని లేదు. స్నేహాన్ని కొనసాగిస్తాం'' అని అయతుల్లా పేర్కొన్నారు.

ఇరాన్ మొత్తం మానవాళికి శాంతి, ప్రశాంతతను అందించే మానవతా దృక్పథం కలిగిన ఒక గణతంత్ర దేశంగా ఉంటుందని అయతుల్లా ఖుమేనీ అన్నారు.

అంతేకాక, ''మీతో మాకు ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదన్నది అర్థం చేసుకోవాలి'' అని వివరించారు.

అయతుల్లా ఆ రోజు పంపిన సందేశం, నాడు దేశంలో నెలకొన్న పరిస్థితులకు ఒక పరిష్కారం దిశగా నడిపించాయి.

ఫ్రాన్స్‌లో ఖుమేనీ మిలటరీ కమాండర్, అమెరికా ప్రభుత్వ ప్రతినిధుల మధ్య రెండు వారాల పాటు నేరుగా చర్చలు జరిగిన తర్వాత.. ఈ పురోగతి లభించింది.

జిమ్మీ కార్టర్ ఒత్తిడి మేరకు ఇరాన్ అప్పటి నియంత మొహమ్మద్ రెజా షా పహ్లావీ ఒక ప్రజాదరణ లేని అధినేతగా, నాలుగు లక్షల మంది సైన్యాన్ని విడిచిపెట్టి.. విదేశాలకు వెళ్లిపోవాల్సి వచ్చింది.

తర్వాత ఆయనెప్పుడూ ఇరాన్‌కు రాలేదు. వారం తిరిగేలోపే 1979 ఫిబ్రవరిలో అయతుల్లా ఖుమేనీ ఇరాన్‌లో ప్రవేశించారు. తెహ్రాన్ వీధుల్లో గుమికూడిన లక్షల మంది ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఆయనకు స్వాగతం పలికి, శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇరాన్‌లో అధికారాన్ని చేపట్టిన తర్వాత, విద్యార్థుల నిరసనలకు తన మద్దతును ప్రకటించారు అయతుల్లా ఖుమేనీ.

అయతుల్లా ఖుమేనీ అప్పటి ప్రధానమంత్రి షాపూర్ భక్తియార్‌ను తొలగించి, ఆయన స్థానంలో మెహ్దీ బజార్‌గాన్‌ను నియమించారు. ఏప్రిల్‌లో ఇరాన్‌ను ఇస్లామిక్ రిపబ్లిక్‌గా ప్రకటించారు.

అప్పట్లో పదవీచ్యుతుడైన రాజు మొహమ్మద్ రెజా షాకు పెద్ద కొడుకైన రెజా పహ్లావీ.. ఇరాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని ఇటీవల పిలుపునిచ్చారు. ఆయన ప్రస్తుతం అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నివసిస్తున్నారు.

ప్రస్తుతం జరుగుతోన్న నిరసనల్లో.. కొందరు ఆందోళనకారులు ఆనాటి షా పాలనను మళ్లీ తీసుకురావాలని కోరుతున్నారు.

ఇరాన్ షా పెద్ద కొడుకు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, వాషింగ్టన్‌లో నివసిస్తోన్న ఇరాన్ షా పెద్ద కొడుకు

సీఐఏ గూఢచారుల ఉత్కంఠభరిత క్షణాలు

అయతుల్లా ఖుమేనీ అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత కూడా ఉద్రిక్తతలు కొనసాగాయి. 1980 ఏప్రిల్‌లో బందీలను కాపాడే ఆపరేషన్‌ను చేపట్టారు. కానీ, అది విఫలమైంది. ఎనిమిది మంది అమెరికా సైనికులు మరణించారు.

బందీల విషయంలో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుండగానే.. రాయబార కార్యాలయంలోని ఆరుగురు అమెరికన్లు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్ వచ్చే లోపే, వెనుక డోర్ నుంచి తప్పించుకున్నారు.

వారు పారిపోయి, కెనడా అంబాసిడర్ ఇంట్లో ఆశ్రయం పొందారు.

మరోవైపు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్, ఇంటర్నేషనల్ మీడియా ఆ ఆరుగురు ఎక్కడున్నారో కనుగొనే ప్రమాదం ఏర్పడింది.

దీంతో బందీలందర్ని సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌పై కూడా తీవ్రమైన ఒత్తిడి నెలకొంది.

సీఐఏలో పనిచేసిన టోనీ మెండెజ్ ఈ ఆరుగురు బందీలను ఇరాన్ నుంచి ఎలాగైనా తప్పించే మార్గం కనుగొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికోసం తొలుత ఆయన ఎలాంటి అనుమానం రాకుండా ఇరాన్‌లోకి ప్రవేశించాల్సి ఉంది.

టీచర్‌గా ఆయన ఇరాన్‌లోకి వెళ్లడం అసాధ్యం. ఎందుకంటే, అప్పుడు అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ మూసివేసి ఉన్నాయి.

మరోవైపు, దేశంలో ఆందోళనకర పరిస్థితి ఉంది. ఆయిల్ కంపెనీ టెక్నిషియన్‌ లేదా అగ్రికల్చర్ ఎక్స్‌పర్ట్‌ ముసుగులో ఆయన ఇరాన్‌లోకి ప్రవేశించడం అసాధ్యం.

తన జేబులో ఉన్న 10 వేల డాలర్లతో 1980 జనవరిలో ఆయన లాస్‌ ఏంజెలెస్‌కు వెళ్లారు.

హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీతో సుదీర్ఘ కాలం పనిచేసిన చరిత్ర సీఐఏకు ఉంది.

స్క్రీన్ రైటర్‌గా నియమితులై, తన పని చేయడం మొదలు పెట్టారు.

తన నకిలీ ప్రొడక్షన్ కంపెనీ 'స్టూడియో 6' కోసం మెండెజ్ ఆఫీసు స్పేస్‌ను కూడా తయారు చేసుకున్నారు. 'అర్గో' సినిమాకు స్క్రీన్‌ప్లే కేవలం రెండు రోజుల్లోనే రాశారు.

ప్రసిద్ధ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 'స్టార్ వార్స్'ను ఇది పోలి ఉంటుందని చెప్పారు.

రాబోయే ఫిల్మ్‌పై ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించేందుకు ది హాలీవుడ్ రిపోర్టర్, వెరైటీ వంటి పలు ప్రముఖ మేగజీన్లను స్టూడియో 6 సంప్రదించింది.

ఇరాన్ ప్రభుత్వం ఎప్పుడైనా తన నేపథ్యం గురించి ప్రశ్నిస్తే.. అది పూర్తిగా అసలైనదిగా వారు నమ్మేలా ఉండాలని మెండెజ్ కోరుకున్నారు.

సీనియర్ సీఐఏ అధికారులు, కెనడా, అమెరికా ప్రభుత్వాల ప్రతినిధులను ఒప్పించి, తన ప్లాన్‌కు ఆమోదం పొందించుకునేందుకు మెండెజ్‌కు కొన్ని వారాల సమయం పట్టింది.

ఒకవేళ ఇది విఫలమైతే, రెండు ప్రభుత్వాలను పెద్ద ఇబ్బందిలోకి నెట్టేస్తుంది, అంతేకాక, ఆరుగురు బందీల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి.

మెండెజ్ భార్య జోవన్నా సీఐఏ ఉద్యోగి అయినప్పటికీ, తెహ్రాన్ వెళ్లేందుకు మెండెజ్ తయారైనప్పుడు, తన భర్త ఏమి చేయబోతున్నాడో ఆమెకు అర్థం కాలేదు.

ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్‌కు ప్లాన్ వివరించారు. ఆయన ''గుడ్ లక్'' అనే ఒక ప్రత్యేక నోట్ పంపారు.

ఆ ఆపరేషన్ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత 'అర్గో' అనే హాలీవుడ్ సినిమా థియేటర్లలోకి వచ్చింది.

అమెరికా బందీలు

ఫొటో సోర్స్, H. KOTILAINEN/AFP via Getty Images

444 రోజుల తర్వాత ముగిసిన బందీల సంక్షోభం

బందీల విషయంలో నెలకొన్న సంక్షోభం వల్ల అమెరికా, ఇరాన్ మధ్యలో దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే, దౌత్య సంబంధాలపై తెర వెనుక చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఓడిపోయేంత వరకు, బందీలను విడిచిపెట్టడానికి సిద్ధంగా లేమని, వారిని బంధించిన ఇరాన్ విద్యార్థులు చెప్పారు.

ఈ విషయంలో అల్జీరియన్లు మధ్యవర్తిత్వం వహించారు.

చివరికి రోనాల్డ్ రీగన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 1981 జనవరి 20న బందీల సంక్షోభం ముగిసింది.

444 రోజుల తర్వాత బందీలుగా ఉన్న 52 మంది అమెరికన్లు విడుదలయ్యారు. పశ్చిమ జర్మనీ మీదుగా వారు అమెరికా చేరుకున్నారు.

అప్పటి అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ప్రత్యేక రాయబారిగా నియమించిన జిమ్మీ కార్టర్, రాయబార కార్యాలయ సిబ్బందిని స్వాగతించడానికి వెళ్లారు.

బందీలుగా ఉన్న పురుషులు, మహిళలపై జరిగిన అసహ్యకరమైన ప్రవర్తన, హింసకు సంబంధించి పలు కథనాలు ఆ తర్వాత వెలుగులోకి వచ్చాయి.

బందీల ఇళ్ల నుంచి వచ్చిన లేఖలు వారి ముందే తగులబెట్టేశారని, వారిని బాగా కొట్టినట్లు ఆ కథనాల ద్వారా తెలిసింది.

ఆ తర్వాత షా మళ్లీ ఇరాన్‌కి రాలేదు. 1980 జూలైలో ఈజిప్ట్‌లో కన్నుమూశారు. 1989 జూన్‌లో అయతుల్లా ఖుమేనీ కూడా మృతి చెందారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)