అష్రఫ్ పహ్లావి: ఈ ఇరాన్ యువరాణి అధికారం కోసం అమెరికా నిఘా సంస్థకు సహకరించారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వకార్ ముస్తఫా
- హోదా, జర్నలిస్ట్, పరిశోధకులు
'నువ్వు మనిషివా లేక ఎలుకవా?' అని ఇరాన్ షాను ఆయన కవల సోదరి, యువరాణి అష్రఫ్ పహ్లావి ప్రశ్నించారు.
మే 1972 నాటి 'సెంటర్స్ ఆఫ్ పవర్' అనే అమెరికన్ ఇంటెలిజెన్స్ డాక్యుమెంట్ ప్రకారం, ఇరాన్ షాను రాజకీయాలకు దూరంగా ఉండి, జాతీయ ఐక్యతకు చిహ్నంగా మారాలని అమెరికా రాయబారి సలహా ఇచ్చినప్పుడు, ఇరాన్ షా నవ్వుతూ ‘‘నిన్ననే అష్రఫ్ నువ్వు మనిషివా, ఎలుకవా’’ అని అడిగిందని చెప్పారు.
స్టీఫెన్ కింజర్ తన 'ఆల్ ది షాస్ మెన్' పుస్తకంలో "యువరాణి అష్రఫ్ తన సోదరుడిని తిట్టడం అందరికి తెలుసు" అని రాశారు.
ఇరాన్‌ను పాలించిన ఈ రాజవంశాన్ని రెజా పహ్లావి స్థాపించారు. సైనిక కమాండర్ అయిన రెజా పహ్లావికి 1925 డిసెంబర్ 15న షాగా పట్టాభిషేకం జరిగింది.
రెజా పహ్లావి, తజుల్ ములుక్ దంపతులకు 1919 అక్టోబర్ 26న యువరాణి అష్రఫ్ ములుక్ జన్మించారు. అంతకు ఐదుగంటల ముందే ఆమె సోదరుడు మొహమ్మద్ రెజా జన్మించారు. వీరిద్దరూ పుట్టిన సమయంలో రెజా పహ్లావి కేవలం సైనిక కమాండర్ మాత్రమే.
అయితే, కొన్నేళ్ల తర్వాత మొహమ్మద్ రెజా 'ఇరాన్ షా' అయ్యారు.
చాలాకాలంగా రహస్యంగా ఉంచిన ఒక సీఐఏ(అమెరికా నిఘా సంస్థ) డాక్యుమెంట్ ప్రకారం, రెజాకు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేదు. ఇది మొదట 2000లో న్యూయార్క్ టైమ్స్‌లో ప్రచురితమైంది. రెజా పహ్లావి వ్యక్తిత్వంలోని అన్ని లక్షణాలు కుమారులకు రాలేదని అందులో రాశారు.


ఫొటో సోర్స్, Getty Images
హిజాబ్ వదిలేయడం
ఆ డాక్యుమెంట్ ప్రకారం, సింహాసనాన్ని అధిష్టించిన తొలినాళ్లలో, మొహమ్మద్ రెజాకు తన సొంత కుటుంబం నుంచి గౌరవం లభించలేదు. ఆయన తల్లి కూడా చిన్నచూపు చూశారు.
'‘తల్లి కూడా ఆయనపై కుట్ర పన్నారని, తన మరో కుమారుడు అలీని గొప్ప వారసుడిగా ప్రచారం చేసినట్లు రిపోర్టులున్నాయి. ఒకానొక సమయంలో (యువరాణి) అష్రఫ్ పాలకురాలు కాకపోవడం బాధాకరమని కూడా తల్లి అన్నారు''
వాషింగ్టన్ పోస్ట్‌కు చెందిన బ్రియాన్ మర్ఫీ ప్రకారం, 1930ల ప్రారంభంలో సాంప్రదాయ హిజాబ్‌ను విడిచిపెట్టిన మొదటి ఇరానియన్ మహిళలలో అష్రఫ్ పహ్లావి, ఆమె సోదరి షమ్స్, వారి తల్లి ఉన్నారు.
ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికాలోని వివరాల ప్రకారం, 1951 నుంచి 1953 వరకు ఇరాన్ ప్రధాన మంత్రిగా ఉన్న మొహమ్మద్ మొసద్దేక్ బ్రిటిష్ ఆక్రమిత చమురు నిల్వలను జాతీయం చేసినప్పుడు, ఇరాన్‌లో తీవ్రమైన రాజకీయ, ఆర్థిక సంక్షోభం తలెత్తింది.
"మొసద్దేక్, షా మధ్య కొనసాగిన అధికార పోరాటంలో 1953 ఆగస్టులో మొసద్దేక్‌ను అధికారం నుంచి తొలగించడానికి షా ప్రయత్నించారు. దీంతో మొసద్దేక్ మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి షా, ఆయన సోదరి అష్రఫ్ పహ్లావిని దేశం విడిచి వెళ్లాలని బలవంతం చేశారు"
"కానీ, కొన్ని రోజుల్లోనే అమెరికన్, బ్రిటీష్ ఏజెన్సీల సహాయంతో సైనిక తిరుగుబాటు ద్వారా మొసద్దేక్ ప్రత్యర్థులు, ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టి, షా తిరిగి అధికారంలోకి వచ్చేలా చేశారు"
1953లో జరిగిన ఈ రాజకీయ సంఘటనను 'ఆపరేషన్ అజాక్స్' అని పిలుస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
'ఆపరేషన్ అజాక్స్'
ఆపరేషన్ అజాక్స్‌లో యువరాణి అష్రఫ్ పహ్లావి కీలక పాత్ర పోషించారు. తిరుగుబాటును ప్రారంభించడానికి అమెరికన్, బ్రిటీష్ నిఘా సంస్థలను అనుమతించాలని ఆమె మొహమ్మద్ రెజా షాను ఒప్పించారు. షా మొదట్లో ఈ చర్యను వ్యతిరేకించారు, అనుమతి ఇవ్వడానికి నిరాకరించారు. 1953 ప్రారంభంలో సీఐఏ ఏజెంట్లు అష్రఫ్‌ను ఆమె సోదరుడితో మాట్లాడమని అభ్యర్థించారు.
చరిత్రకారుడు స్టీఫెన్ కింజర్ తన పుస్తకం ఆల్ ది షాస్ మెన్‌లో "ఆ సమయంలో అష్రఫ్ ఫ్రాన్స్‌లోని క్యాసినో, నైట్‌క్లబ్‌లలో జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆమెను కలవడానికి సీఐఏ అధికారి, కెర్మిట్ రూజ్‌వెల్ట్‌కు ముఖ్యమైన ఇరానియన్ ఏజెంట్ అసదుల్లా రషిడియన్ వచ్చారు.
ఆపరేషన్ అజాక్స్‌కు సహకారం అందించేందుకు అష్రఫ్ తొలుత అంగీకరించలేదు. కానీ, మరుసటి రోజు అమెరికన్, బ్రిటీష్ ఏజెంట్ల బృందం "మరింత ప్రభావవంతమైన " ఆఫర్‌ను అందించడానికి వచ్చింది.
ఈ బృందానికి సీనియర్ బ్రిటీష్ నిఘా అధికారి నార్మన్ డ్రిబిషర్ నాయకత్వం వహించారు, ఆయన ఒక మింక్ కోటు, నగదు ప్యాకెట్‌ను తీసుకువచ్చారు. ఆయన చెప్పినదాని ప్రకారం, బహుమతులు చూసిన వెంటనే "అష్రఫ్ కళ్లు వెలిగిపోయాయి, ఆమె అయిష్టత ముగిసింది".
''ఫ్రాన్స్‌లో ప్రవాసం నుంచి తిరిగి రావడానికి నాకు బ్లాంక్ చెక్ ఇచ్చారు. కానీ, ఆ డబ్బును తిరస్కరించి, నా ఇష్టానుసారం ఇరాన్‌కు తిరిగి వచ్చాను'' అని అష్రఫ్ పహ్లావి తన ఆత్మకథ 'ఫేసెస్ ఇన్ ఏ మిర్రర్’లో తెలిపారు.
అష్రఫ్ పహ్లావి తన సోదరుడిని ఒప్పించడానికి ప్రయత్నించకపోయినా 1953 తిరుగుబాటు జరిగి ఉండేదని కొంతమంది చరిత్రకారులు భావిస్తున్నారు.
తిరుగుబాటు నిర్ణయంలో షా పాల్గొనలేదని, దాని పద్ధతిపై ఆయనతో సంప్రదించలేదని, మొసాదిక్ స్థానంలో ఎవరు వస్తారని కూడా అడగలేదని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ స్టడీస్‌లో ప్రచురితమైన ఒక వ్యాసంలో రచయిత మార్క్ గెసోరెవ్‌స్కీ తెలిపారు.
తిరుగుబాటు అనేది మొసద్దేక్‌ను బలహీనపరిచి, తొలగించడానికి యునైటెడ్ స్టేట్స్, దాని మిత్రదేశాలు చేసిన కుట్ర అని, షా కేవలం ఒక సంకేత పాత్రను పోషించారని తెలిపారు.
మొసద్దేక్‌కు రాజద్రోహం నేరం కింద మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. శిక్ష పూర్తయిన తర్వాత ఆయన జీవితాంతం గృహ నిర్బంధంలో గడపవలసి వచ్చింది.
ఇరాన్ తన చమురు ప్లాంట్లపై నామమాత్రపు స్వయంప్రతిపత్తిని నిలుపుకున్నప్పటికీ, 1954 ఒప్పందం ప్రకారం, ఉత్పత్తి, అమ్మకాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్న అంతర్జాతీయ కన్సార్టియానికి చమురు ఆదాయంలో 50 శాతం వెళ్లింది.

ఫొటో సోర్స్, Getty Images
మూడుసార్లు వివాహం
అష్రఫ్ ఉన్నత విద్యను అభ్యసించాలనుకున్నారు కానీ, 1937లో 18 సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్నారు. ఆమె మూడుసార్లు వివాహం చేసుకున్నారు, ముగ్గురూ విడాకులు తీసుకున్నారు. ఆమెకు ముగ్గురు పిల్లలు.
న్యూయార్క్ టైమ్స్‌కు 1980లో ఇచ్చిన ఇంటర్వ్యూలో అష్రఫ్ "నేను ఎప్పుడూ మంచి తల్లిని కాదు, ఎందుకంటే నా జీవనశైలి పిల్లలతో గడిపే సమయం ఇవ్వలేకపోయింది" అని అన్నారు.
అష్రఫ్‌పై రాజకీయ ప్రత్యర్థులు అవినీతి ఆరోపణలు చేశారు. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిర్ణయాలు కూడా తరచుగా విమర్శల పాలయ్యాయి.
అమెరికన్ డాక్యుమెంట్స్ ప్రకారం, యువరాణి అష్రఫ్ చాలా సంవత్సరాలుగా రాయల్ కోర్టుకు సంబంధించిన దాదాపు అన్ని కుంభకోణాలకు కేంద్రంగా పనిచేశారు.
భారీగా సంపాదన
అష్రఫ్ పహ్లావిపై ఆర్థిక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కానీ,"అనేక సంస్థల పరిపాలనలో చురుకుగా ఉండటం" దీనికి కారణమనేది అష్రఫ్ వాదన.
మొసద్దేక్ తనను పారిస్‌కు బహిష్కరించినప్పుడు తన వద్ద పరిమిత ఆర్థిక వనరులున్నాయని అష్రఫ్ చెప్పారు. తరువాతి సంవత్సరాల్లో చాలా సంపదను కూడబెట్టాననీ చెప్పారు.
వాషింగ్టన్ పోస్ట్‌కు చెందిన బ్రియాన్ మర్ఫీ కథనం ప్రకారం, అష్రఫ్ తన తండ్రి రెజా షా నుంచి వారసత్వంగా పొందిన భూమి విలువ పెరగడం, వారసత్వ వ్యాపారం నుంచి వచ్చే ఆదాయంతోనే సంపద పెరిగినట్లు ఆమె చెప్పుకున్నారు.
కానీ, నిక్కీ కెడ్డీ రాసిన 'రూట్స్ ఆఫ్ రివల్యూషన్: యాన్ ఇంటర్‌ప్రెటివ్ హిస్టరీ', ఫరీదూన్ హువేదా రాసిన 'ది ఫాల్ ఆఫ్ ది షా' పుస్తకాల ప్రకారం, అష్రఫ్ సంపద వెనుక ఉన్న ఒక కథ ఏమిటంటే.. చమురు ధరల పెరుగుదల కారణంగా ఇరాన్ పారిశ్రామిక అభివృద్ధిని చూసింది. ఆ సమయంలో అష్రఫ్ పహ్లావి, ఆమె కుమారుడు షహ్రామ్ చమురు కంపెనీలలో పది శాతం లేదా అంతకంటే ఎక్కువ వాటాలను పొందారు. ప్రతిగా, వారు ఆ కంపెనీలకు కార్యకలాపాలు, ఎగుమతి-దిగుమతి లైసెన్సులు లేదా ఒప్పందాలకు ప్రభుత్వ ఆమోదం పొందడంలో సహాయపడ్డారు.
"ప్రభుత్వ లైసెన్సులు కొన్ని ప్రభావవంతమైన కంపెనీలకు మాత్రమే ఇస్తారని చెబుతారు, దీని కారణంగా లైసెన్స్ పొందడం ప్రతి వ్యాపారవేత్తకు ఖరీదైన వ్యవహారం"
న్యూయార్క్ టైమ్స్ తన 1979 నాటి కథనంలో ''1978 సెప్టెంబర్ 17 నాటి ఒక డాక్యుమెంట్ ప్రకారం, రూ. ఏడు లక్షల ఎనిమిది వేల డాలర్లను( భారత కరెన్సీలో రూ.6.18 కోట్లు) తన బ్యాంకు ఖాతా నుంచి స్విట్జర్లాండ్‌లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ జెనీవాలోని తన ఖాతాకు బదిలీ చేయాలని అష్రఫ్ కార్యాలయం నుంచి దరఖాస్తు చేశారు.
ఇది నిఘా కోడ్ SAIPA (S-on, A-ultesse, I-mperiale, P-rincesse, A-shraf) కింద తెరిచారు. ఇది వారి ఫ్రెంచ్ సంక్షిప్తీకరణ, దీని అర్థం: "ప్రిన్సెస్ అష్రఫ్, మిసెస్ ఆఫ్ ఇంపీరియల్ ప్రెస్టీజ్"
'ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ది పహ్లావి డైనాస్టీ'లో రాసినదాని ప్రకారం, అష్రఫ్ పహ్లావిని మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో ముడిపెట్టడానికి హుస్సేన్ ఫర్దోస్ట్ ప్రయత్నించారు.
దీనిపై, అష్రఫ్ తన మెమ్వా(పుస్తకం)లో "నా ప్రత్యర్థులు నన్ను స్మగ్లర్, గూఢచారి, మాఫియా సహచరురాలు, డ్రగ్స్ అమ్మకందారు అని కూడా ఆరోపించారు" అని తెలిపారు.
అష్రఫ్ 1980లో న్యూయార్క్ టైమ్స్‌కి రాసిన ఒక వ్యాసంలో.. తన సంపద అక్రమంగా సంపాదించినది కాదని తెలిపారు. ఇరాన్ మరింత సంపన్నంగా, అభివృద్ధి చెందుతున్న కొద్దీ తనకు వారసత్వంగా వచ్చిన భూముల విలువ పెరగడంతో సంపద వచ్చిందని తెలిపారు.
"నా తండ్రి మరణం తర్వాత, నాకు కాస్పియన్ సముద్రం దగ్గర దాదాపు మూడు లక్షల డాలర్లు(రూ.2.6 కోట్లు), పది లక్షల చదరపు మీటర్ల భూమి వారసత్వంగా వచ్చింది. జుర్జన్, కెర్మాన్‌షాలో కొన్ని ఆస్తులు కూడా పొందాను, అవి తరువాత చాలా విలువైనవిగా మారాయి" అని తెలిపారు అష్రఫ్.

ఫొటో సోర్స్, Getty Images
అందంగా లేనంటూ..
అష్రఫ్ పహ్లావి యవ్వనంలో ఆత్మవిశ్వాసంగా ఉండేవారు కాదు.
"నా ముఖం నాకు అద్దంలో నచ్చలేదు. నాకు వేరొకరి ముఖం, అందమైన రంగు, పొడవైన ఎత్తు కావాలి. ప్రపంచంలో నాకంటే పొట్టిగా ఉన్నవారు చాలా తక్కువమంది ఉన్నారని భావించాను" అని ఆమె పుస్తకాల్లో రాశారు.
బహుశా ఈ భావనే ఆమె ధైర్యానికి కారణమై ఉండొచ్చు.
"ఇరవై సంవత్సరాల కిందట, ఫ్రెంచ్ జర్నలిస్టులు నాకు బ్లాక్ పాంథర్ అని ముద్దుపేరు పెట్టారు" అని అష్రఫ్ తెలిపారు.
"నాకు ఆ పేరు చాలా నచ్చింది నిజం చెప్పాలంటే, కొన్ని విధాలుగా అది నా స్వభావానికి సరిపోతుంది. పాంథర్ మాదిరే నా స్వభావం ఉత్సాహంగా, తిరుగుబాటుగా, ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. బహిరంగ సమావేశాలలో నన్ను నేను నియంత్రించుకోవడానికి తరచుగా కష్టపడాల్సి ఉంటుంది. కానీ, కొన్నిసార్లు నా దేశ శత్రువులపై దాడి చేయడానికి నాకు బ్లాక్ పాంథర్ గోళ్లు ఉంటే బాగుండేదనిపించింది" అని రాశారు అష్రఫ్.
మొహమ్మద్ రెజా షా తనకు అత్యంత సన్నిహిత మిత్రుడని ఆమె చెప్పారు.
"మేం పెద్దవాళ్లం కావడానికి చాలాకాలం ముందే, ఆయన స్వరం నా జీవితంలో బలమైనదిగా మారింది" అని అష్రఫ్ తన మెమ్వా(పుస్తకం)లో రాశారు.
మహిళల హక్కులు
అష్రఫ్ పహ్లావి తన సోదరుడి పాలనలో ఇరాన్‌లో, ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులకు బలమైన మద్దతుదారు.
కానీ, రచయిత్రి కే బాయిల్ ఆమె గురించి ఒక వ్యాసంలో "యువరాణి అంతర్జాతీయ 'సోదరభావం' గురించి మాట్లాడుతుండగా, ఇరాన్‌లో సొంత సోదరీమణులలో దాదాపు 4,000 మంది రాజకీయ ఖైదీలుగా ఉన్నారు" అని రాశారు.
ఇరాన్‌లోని మహిళల దయనీయ స్థితిపై ఆందోళన వ్యక్తం చేసినట్లు అష్రఫ్ పహ్లావి తన పుస్తకాలలో రాశారు.
"వారు ఒంటరిగా ఉన్నారు, రెండవ తరగతి పౌరులుగా పరిగణిస్తున్నారు. చాలామంది మహిళలు జైలు పాలయ్యారు లేదా బహిష్కరణకు గురయ్యారు" అని తెలిపారు.
1979 విప్లవం తర్వాత, తన సోదరుడు మొహమ్మద్ రెజా షాకు ఆశ్రయం పొందేందుకు సహాయం చేయమని అమెరికన్ బ్యాంకర్ డేవిడ్ రాక్‌ఫెల్లర్‌ను అష్రఫ్ పహ్లావి అభ్యర్థించారు. విప్లవం ప్రారంభంలో షాకు మద్దతు ఇవ్వనందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ కర్ట్ వాల్డ్‌హీమ్‌లను అష్రఫ్ విమర్శించారు.

ఫొటో సోర్స్, Getty Images
బహిష్కరణ, మరణం
విప్లవం తర్వాత, అష్రఫ్ న్యూయార్క్, పారిస్‌లలో గడిపారు. ఆమె అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ 2016 జనవరి 7న మొనాకోలో 96 సంవత్సరాల వయసులో మరణించారు.
ప్రిన్సెస్ అష్రఫ్ తరువాతి జీవితం షేక్స్‌పియర్ విషాదం కంటే తక్కువేమీ కాదని అసోసియేటెడ్ ప్రెస్(ఏపీ) రాసింది.
"విప్లవం తర్వాత పారిస్ వీధిలో ఆమె కుమారుడిని కాల్చి చంపేశారు. ఆమె కవల సోదరుడు క్యాన్సర్‌తో మరణించారు. ఒక మేనకోడలు 2001లో లండన్‌లో డ్రగ్స్ అధిక మోతాదుతో మరణించారు. 10 సంవత్సరాల తర్వాత ఒక మేనల్లుడు బోస్టన్‌లో ఆత్మహత్య చేసుకున్నారు"
"నా సోదరుడి మరణం తరువాత, ప్రజలు చెబుతున్నట్లు నిజంగా 65 బిలియన్ డాలర్లు మా దగ్గర ఉంటే, రెప్పపాటులో ఇరాన్‌ను తిరిగి పొందేవాళ్లం" అని అష్రఫ్ చెప్పనట్లు ఏపీ రిపోర్టు చేసింది.
అష్రఫ్ కాలక్రమేణా, ప్రజా జీవితంలో ఎక్కువగా కనిపించలేదు కానీ, 1994లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ అంత్యక్రియలకు హాజరయ్యారు.
తన జీవితం గురించి తనకు ఎలాంటి విచారం లేదని అష్రఫ్ చెప్పేవారు: "నేను నా జీవితాన్ని మళ్లీ జీవించగలిగితే ప్రతిదీ మళ్లీ చేస్తాను. అంతా అయిపోయింది, ఇప్పుడు జ్ఞాపకాలు మాత్రమే. కానీ ఆ 50 సంవత్సరాలు అద్భుతంగా, గర్వంగా ఉన్నాయి" అని ఆమె అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














