చంద్రుడిపై నగరం నిర్మిస్తా.. పదేళ్లలో కట్టేయొచ్చు: ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, లూయిస్ బరుచ్
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
- చదివే సమయం: 5 నిమిషాలు
వచ్చే పదేళ్లలో చంద్రుడిపై ‘సెల్ఫ్ గ్రోయింగ్ సిటీ’ నిర్మించాలనే ప్రణాళిక ఉందని అపరకుబేరుడు ఎలాన్‌మస్క్ ఇటీవల వెల్లడించారు.
ఎక్స్, టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థల అధినేతగా ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా పేరుగాంచిన మస్క్ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో లో పోస్ట్ చేశారు. ఈ పోస్టును 4 కోట్ల మందికి పైగా చూశారు.
మార్స్‌పై నగరం నిర్మించే లక్ష్యాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టి, ఇప్పుడు చంద్రుడిపై దృష్టి సారిస్తున్నామని ‘స్పేస్ ఎక్స్’ ప్రకటించింది.

చంద్రమండలంపై ఎందుకు?
చంద్రుడిపై నగరాభివృద్ధి ఆలోచనను ఎక్స్‌లో పంచుకున్న మస్క్, ఆ నగర ఎలా నిర్మిస్తారనే బ్లూప్రింట్‌ను వెల్లడించలేదు.
అయితే చంద్రుడిపై లభించే వనరులనే ఉపయోగించుకుంటూ క్రమంగా శాశ్వత మానవ నివాసాలు విస్తరించేలా చేయాలని యోచిస్తున్నట్టు మస్క్ చెప్పారు.
"ఈ లక్ష్యాన్ని పదేళ్లలోపు సాధించవచ్చు. కానీ ఇదే పని అంగారకుడిపై అయితే 20 ఏళ్లకంటే ఎక్కువ పడుతుంది" అని మస్క్ వెల్లడించారు.
"మనిషి చైతన్యాన్ని, జీవితాన్ని నక్షత్రాల వరకు విస్తరింపచేయడం'' అనే స్పేస్ ఎక్స్ లక్ష్యంలో మార్పు లేదని మస్క్ తెలిపారు.
సౌరవ్యవస్థలో గ్రహాలన్నీ ఒకే రేఖలోకి వచ్చే సమయంలో మాత్రమే మార్స్‌పైకి ప్రయాణం సాధ్యమవుతుంది. ఇది ప్రతి 26 నెలలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. పైగా, ఆ ప్రయాణానికి ఆరు నెలలు పడుతుందని మస్క్ చెప్పారు.
కానీ దీనికి భిన్నంగా ప్రతి పదిరోజులకోసారి చంద్రుడిపైకి ఓ మిషన్ పంపొచ్చు. ప్రయాణ సమయం కూడా రెండు రోజులు మాత్రమే అంటారు మస్క్.
అంటే దీనర్థం ''అంగారకుడిపై కంటే చంద్రుడిపై నగర నిర్మాణం వేగంగా చేయచ్చు'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, NASA
మార్స్ లక్ష్యం ఇంకా ఉందా?
అంగారకుడిపై నగరం నిర్మించాలనే మస్క్ దీర్ఘకాల లక్ష్యం మేరకు స్పేస్ ఎక్స్ మిషన్ ముందుకువెళుతోంది. అయితే ''ఇదంతా ఐదు నుంచి ఏడేళ్లలో ప్రారంభిస్తాం. కానీ నాగరికత భవితను రక్షించడమే అత్యంత ముఖ్యమైన పని. అయితే ఈ పని చంద్రుడిపైనే సాధ్యమయ్యే అవకాశం ఎక్కువ'' అన్నారు.
మస్క్ ప్రకటన తరువాత ఆయన అభిమానులు, ఫాలోవర్స్ చంద్రమండలంపై నగరం ఎలా ఉంటుందనే ఊహాచిత్రాలను గీసి పంచుకోవడం ప్రారంభించారు. కొందరు దీని కోసం మస్క్ కృత్రిమమేథ సాధనం గ్రోక్‌ను ఉపయోగించారు.
మస్క్ ప్రకటనకు ముందు స్పేస్ ఎక్స్ మూన్ మిషన్లకే తొలిప్రాధాన్యం ఇచ్చి, తరువాత మార్స్‌పైకి ప్రయత్నాలు మొదలుపెడతామని ఇన్వెస్టర్లకు చెప్పిందని ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఈనెల మొదట్లో ప్రచురించిన తన కథనంలో పేర్కొంది.
ఇది స్పేస్ ఎక్స్ ప్రాథమిక గమ్యం మార్సేనంటూ దీర్ఘకాలంగా చెప్పుకొస్తున్న మస్క్ ప్రకటనకు పూర్తిగా భిన్నమైనది. గతంలో ''మేం నేరుగా మార్స్‌పైకే వెళతాం. చంద్రుడు కేవలం దృష్టి మరలింపే'' అని మస్క్ పేర్కొన్నారు.
అయితే విద్యుత్ వాహనాలు, స్వయంచాలక డ్రైవింగ్ వంటి ప్రాజెక్టుల విషయంలో కూడా మస్క్ గడువులు ప్రకటించి, అవి ఆలస్యమైన సందర్భాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, NASA
ఇదెలా సాధ్యం?
బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సర్రేకు చెందిన అంతరిక్ష పరిశోధకుడు డాక్టర్ సుంగ్‌వూ లిమ్, చంద్రుడిపై స్థావరం నిర్మించే స్పేస్‌ఎక్స్ ప్రణాళికను ప్రతిష్ఠాత్మకమైనదిగా అభివర్ణించారు.
''చంద్రుడి మట్టిని ఉపయోగించి ఆక్సిజన్, నీరు, నిర్మాణ సామగ్రి తయారు చేయవచ్చని ఆయన తెలిపారు. "సిద్ధాంతపరంగా ఇది సాధ్యమే" అన్నారు.
అయితే చంద్రుడి తీవ్ర వాతావరణ పరిస్థితులు , సన్నని ధూళి, తక్కువ గురుత్వాకర్షణ వంటి పరిస్థితుల్లో ఈ వ్యవస్థలు విశ్వసనీయంగా పనిచేస్తాయో లేవా అన్నది సవాలేనని చెప్పారు.
''అక్కడి పరిస్థితులను నమ్మే ముందు చంద్రుడి ఉపరితలంపై ఇంకా సరైన పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉంది'' అన్నారు.
ప్రభుత్వ అంతరిక్ష సంస్థలు ''జాగ్రత్త''గా అడుగులు వేస్తాయని, కానీ స్పేస్ ఎక్స్ ''పనితీరు వేరే విధంగా'' ఉంటుందని అన్నారు.
భారత్‌లో జీడీ గోయెంకా వర్సిటీలో సెంటర్ ఫర్ ఏరోస్పేస్ అండ్ ఎనర్జీ స్టడీస్ డైరక్టర్ డాక్టర్ ఉగూర్ గువెన్ మాట్లాడుతూ, చంద్రుడిపై ఏర్పాటు చేసే స్థావరాలు భవిష్యత్తులో మార్స్ మిషన్లకు ప్రయోజనకరమన్నారు.
''మీరు చంద్రుడిపై స్థావరం ఏర్పాటు చేసుకున్నారునుకోండి. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే మరో మిషన్ పంపొచ్చు''అన్నారు.ఇలాంటి మిషన్లు భూమిపై నుంచి పంపడానికి సాధారణంగా ''రెండు మూడురోజులు'' పడుతుందన్నారు.
అయితే ఇది సూదూర లక్ష్యమేనని డాక్టర్ లిమ్ హెచ్చరించారు. భూమి నుంచి పోషకాలు తీసుకువెళ్లకుండా ఆహారం పండించడం, పునర్వినియోగ వ్యవస్థల ఏర్పాటు చాలా క్లిష్టమని చెప్పారు. ఇందుకోసం దశాబ్దాలు పట్టొచ్చు. ఈ లక్ష్యం సాధ్యమే. కాకపోతే ఒకేసారి కాకుండా దశలవారీగా సాధ్యమవుతుంది''అన్నారు డాక్టర్ లిమ్.
ప్రొఫెసర్ క్లైవ్ నీల్ కూడా డాక్టర్ లిమ్ వాదనతో ఏకీభవించారు. నీల్ అమెరికాలోని ఇండియానాలోగల యూనివర్సిటీ ఆఫ్ నోత్రే డేమ్‌లో సివిల్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్ అండ్ ఎర్త్ సైన్సెస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
''అక్కడ లభ్యమయ్యే వనరులను వెలికితీసే స్పష్టమైన ప్రణాళిక లేకపోతే, స్వయం సమృద్ధి నగరాల నిర్మాణం అసాధ్యమని'' ఆయన బీబీసీకి చెప్పారు. అయితే, రాబోయే పదేళ్లలో చంద్రుడిపై ఒక చిన్న స్థావరాన్ని ఏర్పాటు చేసి, సొంతంగా ఆక్సిజన్, నీటిని ఉత్పత్తి చేసే అవకాశం ఉందని డాక్టర్ లిమ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
నాసా మాజీ వ్యోమగామి, అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ ప్రొఫెసర్ జెఫ్రీ హాఫ్‌మాన్ మాట్లాడుతూ ''స్పేస్ ఎక్స్, జెఫ్ బెజోస్‌కు చెందిన 'బ్లూ ఆరిజిన్' వంటి సంస్థలు చంద్రమండల ల్యాండర్లను విజయవంతంగా అభివృద్ధి చేస్తే, చంద్రుడిపై బేస్ క్యాంపులకు అవసరమైన సరకు రవాణా సులభమవుతుంది'' అన్నారు.
''అంగారకుడు ఇంకా చాలా దూరంలో ఉన్నాడు'' అని ఆయన బీబీసీతో వ్యాఖ్యానించారు. అయినా చంద్రుడిపై ఆవాసాలు నిర్మించిన అనుభవం మార్స్ యాత్రకు ఎంతో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. డాక్టర్ గువెన్ కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. చంద్రమండలంపై ఓ స్థావరం ఏర్పాటు చేసుకుంటే అంగారకుడి వద్దకు చేరుకోవడం మరింత సులభమవుతుంది. ఇది అంగారక యాత్రకు ఓ 'స్టార్టింగ్ పాయింట్'లా మారుతుందన్నారు.

ఫొటో సోర్స్, NASA
పెరుగుతున్న ‘అంతరిక్ష పోటీ’
ఈ దశాబ్దంలో చంద్రుడిపైకి మనుషులను పంపే విషయంలో అమెరికా చైనా నుంచి పోటీని ఎదుర్కొంటున్న తరుణంలో మస్క్ చంద్రమండలంపై నగర నిర్మాణంపై వ్యాఖ్యలు చేశారు.
నాసా 1972నాటి అపోలో 17 మిషన్ తర్వాత ఇప్పటివరకు ఎవరూ చంద్రుడిపై అడుగు పెట్టలేదు.
అయితే, ఈ దశాబ్దంలోనే చంద్రుడిపైకి మనుషులను పంపే విషయంలో అమెరికా, చైనాల మధ్య పోటీ తీవ్రమైంది.
ఇదే సమయంలో ఎలాన్ మస్క్ తన స్పేస్ ఎక్స్ సంస్థ ద్వారా కృత్రిమ మేధ స్టార్టప్ ఎక్స్‌ఏఐను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ ఒప్పందంతో స్పేస్ ఎక్స్ విలువ ఒక ట్రిలియన్ డాలర్ల మార్కును చేరింది.
అంతరిక్షంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేసి, భారీ స్థాయిలో ఏఐ కంప్యూటింగ్ నిర్వహించాలని మస్క్ భావిస్తున్నారని న్యూయార్క్‌లో మిషెల్లీ ఫ్లూరీ చెప్పారు.
తన వ్యాపారాలను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసే ఆలోచనలో ఉన్న ఆయన, దీని ద్వారా సుమారు 50 బిలియన్ డాలర్ల నిధులను సేకరించవచ్చని అంచనా.
అయితే, అంతరిక్షంలో వాయురహిత స్థితి వల్ల గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లను చల్లబరచడం పెద్ద సవాలుగా మారుతుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














