‘అంతరిక్షంలో చిక్కుకున్నప్పుడు.. మళ్లీ భూమిని చూడలేమా అనిపించింది’

సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్

ఫొటో సోర్స్, NASA

    • రచయిత, రీగన్ మోరిస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ నిరుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) చేరుకున్నప్పుడు, తాము ప్రయాణించిన బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్‌లోని థ్రస్టర్లు విఫలం కావడంతో డాకింగ్ చేయడానికి ముందుకు వెళ్లలేకపోయారు.

ఒకవేళ వారు డాకింగ్ చేయలేకపోతే, తిరిగి ఇంటికి రాగలరో లేదో కూడా వారికి తెలియదు.

''డాకింగ్ చేయడం చాలా ముఖ్యం. అయితే, డాకింగ్ చేయలేకపోయి ఉంటే మేం తిరిగి వచ్చేవాళ్లమో లేదో మాకు తెలియదు'' అని రెండు నెలల క్రితం సునీతా విలియమ్స్‌తో కలిసి విజయవంతంగా భూమికి తిరిగొచ్చిన విల్‌మోర్ బీబీసీతో చెప్పారు.

ఈ వ్యోమగాములిద్దరూ ఒక టెస్ట్ ఫ్లైట్‌లో అంతరిక్షంలోకి వెళ్లారు. 8 రోజుల యాత్ర కోసం బయల్దేరిన వీరిద్దరూ 10 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండాల్సి వచ్చింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్‌ఎస్) సురక్షితంగా క్యాప్సూల్‌ను డాక్ చేయడం వారి ముందున్న తొలి సవాలు.

అయితే, థ్రస్టర్లను రీస్టార్ట్ చేయడానికి భూమ్మీద నుంచి మిషన్ కంట్రోల్ సహాయం చేయడంతో వారు క్యాప్సూల్‌ను డాక్ చేయగలిగారు.

ఆ సమయంలో మేం మళ్లీ భూమిని చూడలేకపోవచ్చని అనుకున్నామని విల్‌మోర్ చెప్పారు.

ఒకవేళ డాకింగ్ చేయలేకపోతే ఏమై ఉండేదో అనేది తాము మాట్లాడుకోలేదని, సమస్యను ఎలా పరిష్కరించాలనే అంశంపైనే దృష్టి సారించామని వ్యోమగాములిద్దరూ చెప్పారు. ఇలా ఆలోచించేలా తాము శిక్షణ పొందామని తెలిపారు.

''మేమిద్దం ఒకరి మెదడులో ఏం జరుగుతుందో ఇంకొకరం అర్థం చేసుకోగలం. థ్రస్టర్ల వైఫల్యంతో ఏం కానుందో మాకు తెలుసు. అసలు అలా జరుగుతుందని ఊహించలేదు. అదే క్షణంలో ఇప్పుడు మన చేతుల్లో ఏం ఉంది? మనం ఏం చేయగలం? అనే ఆలోచించాం'' అని బీబీసీతో సునీతా విలియమ్స్ చెప్పారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం

బోయింగ్ కంపెనీ రూపొందించిన స్టార్‌లైనర్ అనే వ్యోమనౌకలో 2024 జూన్‌లో వీరిద్దరూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు.

ప్రయాణికులను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లేలా రూపొందించిన మొదటి స్పేస్ క్రాఫ్ట్ ఇది. ఈ కొత్త అంతరిక్ష వ్యోమనౌక పనితీరును పరీక్షించడంలో భాగంగా వీరిద్దరినీ ఇందులో పంపించారు.

అయితే, ఈ వ్యోమనౌక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు చేరుకోవడానికి ముందే ఇందులో ప్రొపల్షన్ సిస్టమ్‌లో లీకులు ఏర్పడటం, థ్రస్టర్స్ మూసుకుపోవడం వంటి సమస్యలు ఏర్పడ్డాయి.

ఫలితంగా, అనుకున్న ప్రణాళిక ప్రకారం వారిద్దరూ ఆ నౌకలో తిరిగి భూమ్మీదకు రాలేకపోయారు. అక్కడే చిక్కుకుపోయారు.

10 నెలల తర్వాత, ఈ ఏడాది మార్చి 18న స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్‌లో వారిద్దరూ భూమ్మీదకు తిరిగొచ్చారు.

ముందుగా అనుకున్న సమయం కంటే చాలా ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడిపారు. ఈ సవాలును వారు స్వీకరించారు.

''మమ్మల్ని నిరాశపరచరనే సంగతి మాకు తెలుసు. అందరూ మాకు అండగా నిలిచారు. మమ్మల్ని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు మాకు తెలుసు'' అని సునీతా విలియమ్స్ అన్నారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ వారిని అంతరిక్షంలో వదిలేశారంటూ డోనల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడంతో వీరికి సంబంధించి ఒక రాజకీయ వివాదం చెలరేగింది.

అయితే, తాము రాజకీయాలను పట్టించుకోలేదని, తమను అంతరిక్షంలో వదిలేసినట్లుగా భావించలేదని వీరిద్దరూ చెప్పారు.

''దాని గురించి ఇప్పుడు మాట్లాడలేం. కానీ, అంతరిక్ష ప్రయాణం చాలా కష్టమైనది'' అని విల్‌మోర్ అన్నారు.

సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్

ఫొటో సోర్స్, NASA

గురుత్వాకర్షణ లేని వాతావరణంలో తాము చేసిన వర్కవుట్ల కారణంగా భూమ్మీదకు వచ్చాక ప్రస్తుతం తామిద్దరం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నామని వారు చెప్పారు.

''దాదాపు 10 నెలల పాటు అంటే ప్రతీరోజూ నేను స్క్వాట్స్, డెడ్‌లిఫ్ట్స్ వ్యాయామాలు చేశాను. నా జీవితంలో ఎప్పుడూ లేనంత ఆరోగ్యంగా, బలంగా భూమ్మీదకు తిరిగొచ్చాను'' అని విల్‌మోర్ చెప్పారు.

విల్‌మోర్ మాటలతో సునీతా విలియమ్స్ ఏకీభవించారు.

''భూమ్మీదకు తిరిగొచ్చిన కొద్దిరోజులకే నేను రన్నింగ్‌కు వెళ్లాను. అంతరిక్షంలో ట్రెడ్‌మిల్‌పై ఫుల్ మారథాన్ చేసినప్పటికీ భూ వాతావరణంలోని బరువుకు సర్దుకోవడం అంత సులభం కాదు. శరీరాన్ని మళ్లీ గురుత్వాకర్షణ శక్తికి సర్దుబాటు చేయడం కొంచెం కష్టమైన కూడుకున్న పని'' అని సునీతా విలియమ్స్ చెప్పారు.

వీరు భూమ్మీదకు తిరిగొచ్చినప్పటి నుంచి నాసా, బోయింగ్ సంస్థలతో కలిసి, తమను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన వ్యోమనౌకలో ఏర్పడిన సమస్యలను పరిష్కరించడంపై పని చేస్తున్నారు.

''భవిష్యత్‌లో బోయింగ్ స్టార్‌లైనర్‌ను నడిపే అవకాశం వస్తుందని మేం ఆశిస్తున్నాం'' అని విల్‌మోర్ అన్నారు.

నౌకలో ఏర్పడిన సాంకేతిక సమస్యలు పరిష్కారం అయ్యాక మళ్లీ ఆ నౌకలో ప్రయాణిస్తామని వారిద్దరూ చెప్పారు.

''ఇది చాలా సామర్థ్యం గల అంతరిక్ష నౌక. ఇతర వ్యోమనౌకలతో పోల్చితే దీనిలో ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నాయి. భవిష్యత్‌లో వ్యోమగాములు ప్రయాణించడానికి ఇది మంచి అవకాశం'' అని సునీతా విలియమ్స్ వ్యాఖ్యానించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)