సునీతా విలియమ్స్ భూమిమీదకు ఎప్పుడు తిరిగొస్తారు, ఎలా తీసుకొస్తారు?

సునీత విలియమ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అంతరిక్షంలో అత్యధిక రోజుల గడిపిన మహిళగా సునీతా విలియమ్స్ చరిత్ర సృష్టించారు

వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ బుచ్ విల్‌మోర్ అంతరిక్షం నుంచి భూమ్మీదకు మార్చి 19, 20 తేదీల్లో తిరిగి రావొచ్చని నాసా తెలిపింది. వీరిద్దరూ దాదాపు పది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లోనే ఉంటున్నారు.

2024 జూన్ 5న టెస్ట్ మిషన్ కోసం స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో వీరిద్దరూ ప్రయాణించారు. ఎనిమిది రోజుల తర్వాత వారు తిరిగి భూమ్మీదకు రావాల్సింది.

కానీ స్టార్‌లైనర్ అంతరిక్షనౌక, ఐఎస్‌ఎస్‌ను చేరుకోగానే సమస్యలు తలెత్తాయి. అంతరిక్షనౌకను నడిపించే అయిదు థ్రస్ట్‌లు పనిచేయడం మానేశాయి. దానిలోని హీలియం కూడా అయిపోయింది. దీంతో అంతరిక్షనౌక మండే ఇంధనంపై ఆధారపడాల్సి వచ్చింది. ఫలితంగా ఇద్దరు వ్యోమగాముల రాక ఆలస్యమైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సునీత విలియమ్స్, బుచ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లు మార్చి 19 లేదా 20 తేదీల్లో భూమ్మీదకు తిరిగి రానున్నట్లు నాసా పేర్కొంది

61 ఏళ్ల విల్‌మోర్, 58 ఏళ్ల సునీతలను బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్షనౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించారు. బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్‌ ప్రయాణికులను అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్లేలా రూపొందించిన తొలి స్పేస్‌క్రాఫ్ట్ . ఈ కొత్త వ్యోమనౌక పనితీరును పరిశీలించడంలో భాగంగా సునీతా విలియమ్స్, విల్‌మోర్‌లను అంతరిక్షానికి పంపారు.

కానీ జూన్ 5న ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ నుంచి టేకాఫ్ అయినప్పటి నుంచి అది సమస్యలతో సతమతమైంది. ప్రొపల్షన్ సిస్టమ్‌లో లీకులు ఏర్పడటం, థ్రస్టర్స్ మూసుకుపోవడం లాంటి సమస్యలు ఏర్పడ్డాయి.

బోయింగ్‌ సంస్థకు చెందిన ఇంజినీర్లు, నాసా అధికారులు ఈ సాంకేతిక సమస్యలను అర్ధం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు వ్యోమగాములను ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సురక్షితం కాదని ఆగస్టు నెలాఖరు నాటికి ఒక నిర్ణయానికి వచ్చారు.

దీంతో ఈ ఇద్దరు వ్యోమగాములు లేకుండా బోయింగ్ స్టార్ లైనర్ సెప్టెంబర్ 7, 2024న భూమికి తిరిగి వచ్చింది.

అప్పటి నుంచి సునీత, విల్‌మోర్‌ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. వీరిని స్పేస్ ఎక్స్ డ్రాగన్‌లో భూమిమీదకు తీసుకురావాలని భావించారు.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇప్పుడు ఈ ఇద్దరు వ్యోమగాములను వెనక్కి తీసుకొచ్చే బాధ్యతను ఎలాన్ మస్క్‌కు అప్పగించారు. నాసా వెల్లడించిన వివరాల ప్రకారం, వీరిద్దరిని మార్చి 19, 20 తేదీల్లో వెనక్కు తీసుకురావచ్చు.

సునీతా విలియమ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అంతరిక్షంలో స్పేస్‌వాక్ చేస్తూ సునీతా విలియమ్స్

అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటే ఏమవుతుంది?

అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల కండరాల ద్రవ్యరాశి, ఎముకల సాంద్రత రెండూ తగ్గుతాయి. అంతరిక్షంలో ఎముకలకు బరువు ఉండదు. అవి భూమిపై అనుభవించే అదే ఒత్తిళ్లకు లోబడవు కాబట్టి వాటి సాంద్రత తగ్గుతుంది. దీని వల్ల ఎముకలు పెళుసుగా మారి, విరిగిపోయేలా తయారవుతాయని వైద్యులు చెబుతున్నారు.

గురుత్వాకర్షణ శక్తి లేకుంటే కండరాలు వేగంగా బలహీనపడతాయి. ఎముకలు భూమిపై కంటే చాలా వేగంగా కాల్షియం వంటి ఖనిజాలను కోల్పోతాయి. దీని ఫలితంగా ఎముకల సాంద్రత, కండరాల బలం తగ్గిపోతాయి. భూమికి తిరిగి వచ్చినప్పుడు ఇవి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని వైద్యులు అంటున్నారు.

"గురుత్వాకర్షణ శక్తి కారణంగా మన శరీరంలోని కణాలు, కండరాలు నిరంతరం రీసైకిల్ అవుతుంటాయి. అవి 6 నెలలకు పైగా గురుత్వాకర్షణకు గురికాకపోతే, బోన్ డెన్సిటీ (ఎముకల సాంద్రత) 25-30%, కండరాల సాంద్రత 50% వరకు తగ్గుతుంది. దీని కారణంగా, అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు ల్యాండ్ అయినప్పుడు ఎక్స్‌ట్రా వెహిక్యులార్ వర్క్ లేదా మాడ్యూల్ నుంచి బయటపడటం వంటి కొన్ని కార్యకలాపాలు కష్టం కావొచ్చు. ఈ ప్రభావాన్ని తగ్గించడానికి వాళ్లు నిరంతరం వ్యాయామం చేస్తూ తమ కండరాలు, ఎముకలను బలంగా ఉంచుకుంటారు.'' అని హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో సీనియర్ ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ ఆర్.ఎ.పూర్ణచంద్ర తేజస్వి గతంలో బీబీసీకి వివరించారు.

''వ్యోమగాములు 6 నెలల కంటే ఎక్కువకాలం అంతరిక్షంలో ఉంటే, వాళ్లు భూమికి తిరిగి వచ్చినప్పుడు బోన్ ఫ్రాక్చర్ రిస్క్‌ను ఎదుర్కొంటారు. వాళ్ల ఎముకల సాంద్రత తగ్గడం వల్ల వెన్నునొప్పి మొదలైన సమస్యలు ఎదురుకావచ్చు. దీన్ని ఎదుర్కోవడానికి, ఎముకల సాంద్రతను పెంచడానికి వాళ్లకు 3 నెలల పాటు సప్లిమెంట్స్ ఇస్తారు.'' అని తేజస్వి చెప్పారు.

సునీత విలియమ్స్ రికార్డ్

సునీతా విలియమ్స్ 9నెలలకు పైగా ఐఎస్ఎస్‌లోనే ఉంటున్నారు. ఇలా అంతరిక్షంలో ఏకబిగిన అత్యధిక సమయం ఉన్న తొలి మహిళగా సునీత రికార్డు నెలకొల్పారు.

అయితే, సునీతకు ఇది మొదటి రికార్డు కాదు. 2006-07లో తన మొదటి స్పేస్‌వాక్ సమయంలో ఆమె అంతరిక్షంలో 29 గంటల 17 నిమిషాల పాటు గడిపి, ఇప్పటివరకు అంతరిక్షంలో ఎక్కువ సేపు స్పేస్‌వాక్ చేసిన మహిళగా రికార్డు సృష్టించారు.

గతంలో ఈ రికార్డు ఆస్ట్రోనాట్ క్యాథరిన్ థార్న్‌టన్ పేరిట ఉండేది. ఆమె 21 గంటలకు పైగా అంతరిక్షంలో స్పేస్‌వాక్ చేశారు. సునీత ఈ రికార్డును అధిగమించి తన పేరున లిఖించుకున్నారు.

సునీత విలియమ్స్‌కు ఇది మూడో అంతరిక్ష యాత్ర. ఈ మూడు యాత్రల్లో కలిపి ఆమె తొమ్మిదిసార్లు అంతరిక్షంలో నడిచారు. ఈ సమయంలో ఆమె మొత్తం 62 గంటల 6 నిమిషాలు స్పేస్‌వాక్‌లో గడిపారు.

సునీత విలియమ్స్ ఒక రిటైర్డ్ నేవీ హెలికాప్టర్ పైలట్ కాగా విల్‌మోర్ మాజీ ఫైటర్ జెట్ పైలట్. ఆయన కూడా రెండుసార్లు అంతరిక్షంలోకి ప్రయాణించారు.

సునీతా విలియమ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కల్పనా చావ్లా తర్వాత సునీతా విలియమ్స్ భారత మూలాలున్న అమెరికా వ్యోమగామి

సునీతా విలియమ్స్ ఎవరు?

సునీత లిన్ విలియమ్స్ భారత మూలాలున్న రెండో అమెరికా వ్యోమగామి. కల్పనా చావ్లా తర్వాత, ఎక్స్‌పెడిషన్-14 బృందంలో భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌ను నాసా చేర్చింది.

అమెరికాలోని ఓహియోలో 1965లో సునీత జన్మించారు. ఆమె తండ్రి 1958లో అహ్మదాబాద్ నుంచి అమెరికా వచ్చి స్థిరపడ్డారు.

సునీత తల్లిదండ్రులు దీపక్ పాండ్యా, బోనీ పాండ్యా. సునీత భర్త మైఖేల్ విలియమ్స్ కూడా ఒక పైలట్. ప్రస్తుతం ఆయన ఒక పోలీస్ అధికారిగా పనిచేస్తున్నారు.

1998లో సునీత, నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. యూఎస్ నావల్ అకాడమీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన సునీత ఒక నిష్ణాతురాలైన ఫైటర్ పైలట్ అని స్థానిక జర్నలిస్ట్ సలీమ్ రిజ్వీ అన్నారు.

ఆమె 30 వేర్వేరు రకాల విమానాలపై 2700 గంటలకు పైగా విమానయానం చేశారు.

సునీత విలియమ్స్ మొదట ఒక నావల్ ఏవియేటర్‌గా పనిచేశారు.

సునీతా విలియమ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సునీతా విలియమ్స్ మిషన్‌కు సంబంధించిన సమాచాారాన్నిఅందిస్తున్న అధికారులు

సునీత జీతం ఎంత?

సునీత 2013లో విద్యార్థులతో మాట్లాడుతూ, తాను అంతరిక్షంలోకి సమోసాలను తీసుకెళ్లినట్లు చెప్పారు. అంతేకాకుండా చదువుకోవడానికి ఉపనిషత్తులు, భగవద్గీతను కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు.

భారతీయ ఆహారంపై ప్రశంసలు కురిపిస్తూ, అసలు ఎవరికీ ఈ ఆహారంపై విసుగు రాదని అన్నారు.

అమెరికా ప్రభుత్వ గ్రేడ్ పే ప్రకారం నాసాలో జీతం లభిస్తుంది. ఇందులో పౌర వ్యోమగాములకు జీఎస్-13, జీఎస్-15 గ్రేడ్ పే కింద జీతాలు ఇస్తారు.

అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు జీఎస్-01 నుంచి జీఎస్-15 గ్రేడ్ పే ప్రకారం ఇస్తారు. జీఎస్-15 అనేది అత్యధిక పే.

సునీత విలియమ్స్ కూడా గ్రేడ్ పే ప్రకారమే జీతం అందుకుంటారు.

జీఎస్-13: దీని ప్రకారం వార్షిక వేతనం 81,216 డాలర్లు (రూ. 70 లక్షలు) నుంచి 105,579 డాలర్లు (రూ. 92 లక్షలు)వరకు ఉంటుంది.

జీఎస్-14: వార్షిక వేతనం 95,973 డాలర్లు (రూ. 83 లక్షలు) నుంచి 124,764 డాలర్లు ( కోటి రూపాయలు) వరకు ఉంటుంది.

జీఎస్-15: వార్షిక వేతనం 112,890 డాలర్లు (రూ. 98 లక్షలు) నుంచి 146,757 డాలర్లు (రూ. 1.27 కోట్లు) వరకు ఉంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)