మొత్తం సైన్యంతో దక్షిణ భారతదేశం వైపు కవాతు చేసిన ఔరంగజేబు తిరిగి దిల్లీ రాలేకపోయారు, ఎందుకు?

మొఘల్ సామ్రాజ్యం, ఔరంగజేబు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఔరంగజేబు తన సైన్యంతో దక్షిణాది వైపు కవాతు చేశారు, దిల్లీ నిర్మానుష్యంగా మారిపోయింది.
    • రచయిత, రెహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఔరంగజేబు 1680లో తన సైన్యం మొత్తాన్ని తీసుకుని దక్షిణ భారతదేశం వైపు కవాతు చేశాడు. భారీ సైన్యం, ముగ్గురు కొడుకులు ఆయన వెంట నడిచారు.

రచయిత ఆడ్రీ ట్రష్కే రాసిన ఔరంగజేబు జీవిత చరిత్ర 'ఔరంగజేబు, ది మ్యాన్ అండ్ ది మిత్'లో.. ''గుడారాలతో సైన్యం ముందుకు కదలడం, అక్కడ మార్కెట్, చక్రవర్తి కారవాన్, ఆయనతో పాటు అధికారులు, సేవకులు మొత్తం ముందుకు సాగడం చూడదగిన దృశ్యం'' అని రాశారు.

''ఔరంగజేబు పాత మొఘల్ సంప్రదాయాన్ని అనుసరించేవారు, దాని ప్రకారం రాజధాని చక్రవర్తితో పాటే కదులుతుంది. అయితే, ఔరంగజేబు ఇతర మొఘల్ చక్రవర్తుల కంటే భిన్నం. ఎందుకంటే, ఆయన దక్షిణాదికి వెళ్లిన తర్వాత, మళ్లీ దిల్లీకి తిరిగిరాలేదు.''

ఆయన దక్షిణాదికి వెళ్లిన తర్వాత, దిల్లీ నిర్మానుష్యంగా మారింది. ఎర్రకోట గోడలపై దట్టమైన దుమ్ము పొర పేరుకుపోయింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఔరంగజేబు, మొఘల్ సామ్రాజ్యం

ఫొటో సోర్స్, Penguin Viking

వృద్ధాప్యంలో ఒంటరితనం

ఔరంగజేబు తన జీవితంలోని చివరి మూడు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలోనే గడిపారు. ఎన్నో యుద్ధాలు, రాజ్యాల ముట్టడికి నాయకత్వం వహించారు.

ఔరంగజేబు సైన్యంలోని హిందూ సైనికుడు భీమ్‌సేన్ సక్సేనా పర్షియన్‌లో రాసిన తన ఆత్మకథ 'తారిఖ్-ఎ-దిల్‌కుశా'లో ఇలా రాశారు. ''ఈ ప్రజలు చాలా దురాశాపరులుగా నేను గమనించాను. జీవితంలో ఏ లోటూ లేని ఔరంగజేబు ఆలంగిర్ లాంటి రాజుకి కోటలను జయించడంపైనే ఆసక్తి. కొన్ని రాళ్లను స్వాధీనం చేసుకోవాలనే కోరిక ఆయనలో ఎక్కువగా ఉండేది. ఆయన దాని కోసం పరిగెడుతున్నాడు'' అని రాశారు.

ఔరంగజేబు పాలనలో చివరి దశ ఆయనకు అంత సంతోషాన్ని ఇవ్వలేదు. భారత్‌ను ఎదురులేకుండా పరిపాలించాలన్న తన కోరిక నెరవేరేలా కనిపించడం లేదని ఆయన భావించారు.

చరిత్రకారుడు యదునాథ్ సర్కార్ తన పుస్తకం 'ది షార్ట్ హిస్టరీ ఆఫ్ ఔరంగజేబు'లో ఇలా రాశారు, ''ఔరంగజేబు వృద్ధాప్యంలో ఒంటరితనానికి గురయ్యారు. ఆయన సన్నిహితులందరూ ఒకరి తర్వాత మరొకరు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. తన సహచరుడైన, మంత్రి అసద్ ఖాన్ మాత్రమే బతికున్నాడు. తన సభను పరీక్షించి చూసినప్పుడు పిరికితనం, అసూయ, ఇతరులను దూషించే భావాలున్న యువ సభికులు కనిపించారు.''

మొఘల్ సామ్రాజ్యం, దిల్లీ, ఔరంగజేబు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 18వ శతాబ్దం ప్రారంభంలో రాసిన ఒక లేఖలో, కాందహార్‌ను జయించలేకపోయాడంటూ ఔరంగజేబు తన రెండో కుమారుడు మువజ్జమ్‌ను విమర్శించారు.

కుమారులు ప్రతిభావంతులు కాకపోవడం

ఔరంగజేబు మరణించే సమయానికి ఆయన కుమారులులో ముగ్గురు బతికి ఉన్నారు. మరో ఇద్దరు కుమారులు అంతకుముందే చనిపోయారు. వారిలో ఎవరికీ భారత దేశానికి చక్రవర్తి అయ్యేంత బలం, సామర్థ్యం లేవు.

18వ శతాబ్దం ప్రారంభంలో రాసిన ఒక లేఖలో, కాందహార్‌ను జయించలేకపోయాడంటూ ఔరంగజేబు తన రెండో కుమారుడు మువజ్జమ్‌ను విమర్శించారు.

ఔరంజేబు రాసిన ఈ లేఖ 'రుఖాయతే ఆలంగిరి' సంకలనంలో ఉంది. అందులో ఆయన 'పనికారాని కొడుకు కంటే కూతురు ఉండడం మంచిది' అని రాశారు.

ఆయన తన కొడుకును తిడుతూ ఇలా తన లేఖను ముగించారు, ''నీ ప్రత్యర్థులకు, దేవుడికి నీ మొఖం ఎలా చూపిస్తావ్?''

అయితే, తన కుమారులు తన వారసులు కాలేకపోవడానికి తానే కారణమని ఔరంగజేబు గ్రహించలేదు.

చరిత్రకారుడు మునిస్ ఫారూకీ తన 'ది ప్రిన్సెస్ ఆఫ్ ది మొఘల్ ఎంపైర్' పుస్తకంలో యువరాజుల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా ఔరంగజేబు వారి స్వయంప్రతిపత్తిని దెబ్బతీశారని రాశారు.

''1700 నాటికి ఔరంగజేబు తన కుమారుల కంటే మనవళ్లకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు అని ఆడ్రీ ట్రష్కే రాశారు. ‘అది ఆయన స్థానాన్ని మరింత బలహీనపరిచింది. ఔరంగజేబు కొన్నిసార్లు తన కుమారుల కంటే తన మంత్రివర్గానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారు. దీనికి పెద్ద ఉదాహరణ ఏంటంటే, ముఖ్యమంత్రి అసద్ ఖాన్, సైన్యాధ్యక్షుడు జుల్ఫికర్ ఖాన్ ఆయన చిన్న కుమారుడు కాంబక్ష్‌ని నిర్బంధించడం’ అని రాశారు.

కాంబక్ష్ చేసిన తప్పు ఏంటంటే, ఔరంగజేబు అనుమతి లేకుండా మరాఠా రాజు రాజారాంతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నించడం.

ఈ రాజారాం ఛత్రపతి శివాజీ కుమారుడు, శంభాజీ సవతి సోదరుడు.

ఔరంగజేబు, మొఘల్ సామ్రాజ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1704లో ఔరంగజేబు కుమారుడు అక్బర్-II ఇరాన్‌లో చనిపోయారు.

సన్నిహితుల మరణం

వృద్ధాప్యం మీదపడుతోంది, ఔరంగజేబు జీవితం అంధకారంగా మారుతోంది.

ఆయన కోడలు జహన్‌జేబ్ బానో 1705 మార్చిలో, గుజరాత్‌లో మరణించారు. రెబల్ అయిన తన కుమారుడు అక్బర్-II కూడా 1704లో ఇరాన్‌లో చనిపోయారు.

అంతకుముందు, 1702లో కవయిత్రి అయిన ఆయన కుమార్తె జేబ్-ఉన్-నిసా కూడా మరణించారు. ఆ తర్వాత, ఔరంగజేబు తోబుట్టువులలో బతికున్న ఒకేఒక్కడు గౌహర్ ఆరా కూడా మరణించారు.

దీంతో ఔరంగజేబు దిగ్భ్రాంతికి గురయ్యారు. 'షాజహాన్ పిల్లల్లో అతను, నేను మాత్రమే బతికున్నాం' అని ఆయన చెప్పారు.

ఔరంగజేబు కష్టాలు ఇక్కడితో ఆగలేదు. 1706లో, ఆయన కుమార్తె మెహర్-ఉన్-నిసా, అల్లుడు ఇజీద్ బక్ష్ కూడా దిల్లీలో మరణించారు.

ఔరంగజేబు మరణానికి కొద్దిరోజుల ముందు ఆయన మనవడు బులంద్ అఖ్తర్ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఆయన మనవళ్లలో మరో ఇద్దరు మరణించారు. అయితే, ఔరంగజేబు మరింత వేదనకు గురవుతారని ఆయన మంత్రివర్గం ఆయనకు ఈ విషయాన్ని తెలియనివ్వలేదు.

ఔరంగజేబు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఔరంగజేబు పాలన సమయంలో ఇటాలియన్ యాత్రికుడు నికోలావ్ మనుచీ భారత్‌కు వచ్చారు.

కరవు, ప్లేగు వ్యాధి

అంతేకాకుండా, ఆ సమయంలో దక్షిణాదిలో విజృంభిస్తున్న కరవు కూడా ఔరంగజేబు కష్టాలను పెంచింది.

ఔరంగజేబు కాలంలో భారత్‌ను సందర్శించిన ఇటలీ యాత్రికుడు నికోలావ్ మనుచీ తన 'స్టోరియా దో మోగోర్' పుస్తకంలో ఇలా రాశారు, ''1702, 1704 మధ్యకాలంలో దక్షిణాదిలో వర్షాలు పడలేదు. పైగా, ప్లేగు మహమ్మారి వ్యాపించింది. రెండేళ్లలో దాదాపు 20 లక్షల మంది చనిపోయారు. ప్రజలు ఆకలి బాధలు తట్టుకోలేక తమ పిల్లలను కేవలం పావలాకి అమ్మేందుకు కూడా సిద్ధమయ్యారు, కానీ కొనుక్కునే వారు లేరు''

''చనిపోయిన వారిని పశువుల్లా పాతిపెట్టారు. పాతిపెట్టే ముందు డబ్బులు ఏమైనా ఉన్నాయేమోనని వారి దుస్తుల్లో వెతికారు.''

"దుర్వాసన కారణంగా నాకు చాలాసార్లు వాంతి వచ్చినట్లు అనిపించేది, చుట్టూ ఈగలు, తినడం కూడా ఇబ్బందే'' అని మనుచీ రాశారు.

మనుచీ మాటల్లో చెప్పాలంటే, ''చెట్లు, పంటలు లేవు. వాటి బదులు పంటపొలాల్లో మనుషులు, పశువుల ఎముకలు తేలాయి. మూడు, నాలుగు రోజుల ప్రయాణంలో ఎక్కడా పొయ్యి వెలుగుతూ కనిపించలేదు''

ఔరంగజేబు, మొఘల్ సామ్రాజ్యం

ఫొటో సోర్స్, Vintage

ఫొటో క్యాప్షన్, ఇటలీ యాత్రికుడు రాసిన నికోలావ్ రాసిన పుస్తకం 'స్టోరియా దో మోగోర్'

చివరి వరకూ ఔరంగజేబుతో ఉన్న ఉద‌య్‌పురీ

చివరి రోజుల్లో, తన చిన్న కొడుకు కాంబక్ష్‌కు తల్లి అయిన ఉదయ్‌పురీ సాంగత్యాన్ని ఔరంగజేబు ఇష్టపడ్డారు.

మరణశయ్యపై నుంచి కాంబక్ష్‌కు రాసిన లేఖలో అనారోగ్యం సమయంలో ఉదయ్‌పురీ తన వెంటే ఉందని, మరణంలోనూ తనకు తోడుగా ఉంటుందని రాశారు.

సరిగ్గా అదే జరిగింది, ఔరంగజేబు మరణించిన కొద్దినెలలకే ఉదయ్‌పురీ కూడా ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు.

ఔరంగజేబు, మొఘల్ సామ్రాజ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తనకు కూడా తన తండ్రి షాజహాన్‌కు పట్టిన గతే పడుతుందన్న భయంతో కుమారులందరినీ పంపించాడు.

ఉత్తరాదిన తిరుగుబాటు స్వరాలు

చివరగా, అహ్మద్‌నగర్‌ను తన శిబిరంగా చేసుకున్నారు ఔరంగజేబు.

స్టాన్లీ లేన్ - పూల్ తన పుస్తకం 'ఔరంగజేబు అండ్ ది డికే ఆఫ్ ది మొఘల్ ఎంపైర్'లో ఇలా రాశారు.

''ఔరంగజేబు సుదీర్థకాలం లేకపోవడంతో ఉత్తరాదిలో గందరగోళం వ్యాపించింది. రాజ్‌పుత్‌లు బహిరంగంగానే తిరుగుబాటుకి సిద్ధమయ్యారు, ఆగ్రాకు సమీపంలో ఉన్న జాట్‌లు, ముల్తాన్ చుట్టూ ఉన్న సిక్కులు మొఘల్ సామ్రాజ్యాన్ని సవాలు చేయడం ప్రారంభమైంది. మరాఠాలు కూడా మొఘల్ సైన్యంపై రహస్యంగా దాడి చేసే ధైర్యాన్ని కూడగట్టుకున్నారు."

తన తండ్రి షాజహాన్‌కు చేసినట్లే, తనకు కూడా జరుగుతుందేమోనన్న భయంతో ఔరంగజేబు తన కుమారులందరినీ అక్కడి నుంచి పంపేశారు.

మరో చరిత్రకారుడు అబ్రహాం ఇరాలీ తన పుస్తకం 'ది మొఘల్ థ్రోన్ ది సాగా ఆఫ్ ఇండియాస్ గ్రేట్ ఎంపరర్స్‌'లో ఇలా రాశారు, ''ఔరంగజేబు పాలనలో సామ్రాజ్య విస్తరణ కూడా మొఘల్ అధికారాన్ని మరింత బలహీనపరిచింది. ఆయన పాలనలో సామ్రాజ్యం చాలా విస్తరించింది, దీంతో పాలన అసాధ్యంగా మారింది. ఔరంగజేబు కూడా స్వయంగా, అజ్మా -స్త్ హమా ఫసాద్-ఎ-బాకీ (అంటే, నా తర్వాత అరాచకమే) అని అన్నారు.''

మొఘల్ సామ్రాజ్యం, ఔరంగజేబు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1707 జనవరి 14న, చక్రవర్తి మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు.

ఔరంగజేబు అనారోగ్యం

ఇవన్నీ పక్కనబెడితే, ఔరంగజేబు ముందున్న అతిపెద్ద సమస్య వారసత్వ సమస్య.

మనుచీ ఇలా రాశారు, ''సింహాసనానికి హక్కుదారులైన చక్రవర్తి కుమారులు వృద్ధులయ్యారు. ఆ తర్వాత ఆయన మనవళ్ల వంతొచ్చింది, వాళ్ల గడ్డాలూ తెల్లబడ్డాయి, వారికీ 45 ఏళ్లు దాటాయి. హక్కుదారుల్లో 25, 27 ఏళ్లున్న ఔరంగజేబు మునిమనవళ్లు కూడా ఉన్నారు. వీళ్లందరిలో ఒక్కరు మాత్రమే ఔరంగజేబు వారసుడు కాగలరు. అధికారం కోసం జరిగే ఈ పోరాటంలో మిగిలిన వారి కాళ్లు, చేతులూ నరికేయొచ్చు, లేదా ప్రాణాలు కూడా కోల్పోవాల్సి రావొచ్చు.''

1705లో మరాఠా వాగింజెరా కోటను జయించిన తర్వాత ఔరంగజేబు తన దళాలకు విశ్రాంతి కోసం కృష్ణా నది సమీపంలోని ఒక గ్రామంలో శిబిరం ఏర్పాటు చేసుకున్నారు.

అక్కడ ఔరంగజేబు అనారోగ్యానికి గురయ్యారు. అదే ఏడాది అక్టోబర్‌లో తిరిగి దిల్లీ వెళ్లాలనే ఉద్దేశంతో అహ్మద్‌నగర్ వైపు కదిలారు, అదే ఆయన చివరి మజిలీగా నిరూపితమైంది.

1707 జనవరి 14న, 89 ఏళ్ల వయసులో చక్రవర్తి మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. కొద్దిరోజుల్లోనే కోలుకుని, పాలనా వ్యవహారాలు చూడడం ప్రారంభించారు. కానీ, ఈసారి తనకు ఎక్కువ సమయం లేదనే విషయం ఆయన గ్రహించారు. తన కుమారుడు ఆజంలో పెరుగుతున్న అసహనం ఆయన్ను కలవరపెట్టింది.

ఔరంగజేబు, మొఘల్ సామ్రాజ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తన చివరి రోజుల్లో ఔరంగజేబు తన కుమారులకు రెండు లేఖలు రాశారు.

కుమారులకు లేఖ

యదునాథ్ సర్కార్ తన పుస్తకంలో ఇలా రాశారు, "నాలుగు రోజుల తర్వాత, తన కుమారుడు ఆజంను మాల్వా గవర్నర్‌గా పంపారు. కానీ, తెలివైన యువరాజు తన తండ్రి శకం ముగింపుకి వచ్చిందని గ్రహించి, అక్కడికి వెళ్లేందుకు తొందరపడలేదు, మధ్యలో చాలా చోట్ల ఆగాడు. తన కుమారుడిని పంపిన నాలుగు రోజుల తరువాత, చక్రవర్తికి తీవ్ర జ్వరం వచ్చింది. అయినప్పటికీ, ఆయన ఆ రోజు కూడా సభకు వచ్చేందుకు పట్టుబట్టారు, రోజుకి ఐదుసార్లు ప్రార్థన చేశారు."

తన చివరి రోజుల్లో, తన కుమారులకు ఆయన రెండు లేఖలు రాశారు. అందులో ''అధికారం కోసం మీ ఇద్దరి మధ్య పోరాటాలు జరగకూడదని కోరుకుంటున్నా. కానీ, నా తదనంతరం, చాలా రక్తపాతం జరుగుతుందని నాకు అర్థమవుతోంది. మీకు ఆ దేవుడు ప్రజల కోసం పనిచేసే అవకాశాన్ని, పాలించే సామర్థ్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా'' అని రాశారు.

ఔరంగజేబు, మొఘల్ సామ్రాజ్యం

ఫొటో సోర్స్, Getty Images

1707 మార్చి 3న, ఔరంగజేబు తన పడక గది నుంచి బయటకు వచ్చారు.

''ఔరంగజేబు ఉదయాన్నే ప్రార్థన చేశాక.. నెమ్మదిగా ఆయన స్పృహ కోల్పోవడం మొదలైంది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. అయితే, ఆయన శరీరం బలహీనంగా ఉన్నప్పటికీ, ఆయన వేళ్ల మధ్యనున్న మాలలోని పూసలు మాత్రం కింద పడిపోలేదు. తన చివరి రోజు శుక్రవారం కావాలని ఆయన కోరుకునేవారు. ఆ కోరిక కూడా నెరవేరింది'' అని యదునాథ్ తన పుస్తకంలో రాశారు.

తన మృతదేహాన్ని శవపేటిక లేకుండా, ఇక్కడికి సమీపంలోనే ఏదో ఒక ప్రదేశంలో ఖననం చేయాలని, చనిపోయే ముందు ఔరంగజేబు కోరుకున్నారు.

ఔరంగజేబు మరణించిన రెండు రోజుల తర్వాత ఆయన కుమారుడు ఆజం అక్కడికి వచ్చారు. తన సోదరి జీనత్-ఉన్-నిసా బేగంకు సంతాపం తెలిపి, ఆమెను ఓదార్చిన తర్వాత తన తండ్రి మృతదేహాన్ని కొంతదూరం తీసుకెళ్లారు.

ఆ తర్వాత, ఔరంగజేబు మృతదేహాన్ని దౌల్తాబాద్ సమీపంలోని ఖుల్దాబాద్‌లో ఉన్న సూఫీ మతగురువు షేక్ జైన్-ఉద్-దిన్ సమాధి పక్కనే ఖననం చేశారు.

ఔరంగజేబు 89 ఏళ్లు జీవించారు.

''ఔరంగజేబుది అద్భుతమైన జ్ఞాపకశక్తి. ఒక్కసారి చూస్తే ఎవరినీ మరిచిపోయేవారు కాదు. అంతేకాకుండా, మాట్లాడే ప్రతి మాటనూ గుర్తుంచుకుంటారు. తన చివరి రోజుల్లో, ఒక చెవికి వినికిడి సమస్య, కుడి కాలులోనూ కాస్త ఇబ్బంది తలెత్తింది'' అని యదునాథ్ రాశారు.

ఔరంగజేబు, మొఘల్ సామ్రాజ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఔరంగజేబు తన కుమారుడు మువజ్జమ్‌ను వారసుడిగా ప్రకటించారు.

ఔరంగజేబు కుమారుల మధ్య యుద్ధం

ఔరంగజేబు, అప్పటికి పంజాబ్ గవర్నర్‌గా ఉన్న షా ఆలం(మువజ్జమ్‌)ను తన వారసుడిగా ప్రకటించినప్పటికీ ఔరంగజేబు మరణానంతరం ఆజం షా అక్కడికి చేరుకుని తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకున్నారు.

తన రాజ్యాధికార, అధికారిక ప్రతీకగా ఆగ్రా వైపు కవాతు చేశారు.

మనుచీ ఇలా రాశారు, ''మరోవైపు షా ఆలం కూడా తన తండ్రి మరణవార్త విని ఆగ్రా వైపు కదిలారు. ఆయన తన సోదరుడు ఆజం కంటే ముందుగా ఆగ్రా చేరుకున్నారు, అక్కడి ప్రజలు ఆయనకు ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఇద్దరు సోదరుల సైన్యం జజవూలో ఘర్షణ పడింది. కొన్నేళ్ల కిందట ఔరంగజేబు, ఆయన సోదరుడు దారా షికోహ్‌ తలపడింది కూడా అక్కడే. ఈ యుద్ధంలో షా ఆలం విజయం సాధించారు, ఆ మరుసటి రోజు జూన్ 20న సింహాసనాన్ని అధిష్టించారు.''

మొఘల్ సామ్రాజ్యం, దిల్లీ, ఔరంగజేబు

ఫొటో సోర్స్, Vintage

ఫొటో క్యాప్షన్, 1712లో షా ఆలం కూడా మరణించారు.

మొఘల్ సామ్రాజ్య పతనం

యుద్ధంలో ఓడిపోయిన ఆజం షా తన సోదరుడు షా ఆలం చేతికి చిక్కకముందే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ఔరంగజేబు మరణించిన ఐదేళ్ల తర్వాత, 1712లో షా ఆలం కూడా మరణించారు.

1712కి ముందు 150 ఏళ్లలో కేవలం నలుగురు మొఘల్ చక్రవర్తులు మాత్రమే దేశాన్ని పాలించారు, కానీ 1712 నుంచి 1719 వరకు ఏడేళ్లలో, నలుగురు మొఘల్ చక్రవర్తులు ఒకరి తర్వాత మరొకరు సింహాసనంపై కూర్చున్నారు.

క్రమంగా, మొఘల్ రాజవంశ ప్రాభవం క్షీణించడం మొదలైంది.

''ఔరంగజేబును విజయాలు వరించినప్పటికీ, ఆయన రాజకీయంగా విజయవంతం కాని రాజు. ఆయన తర్వాత, మొఘల్ సామ్రాజ్యం పతనం కావడానికి ఆయన వ్యక్తిత్వం మాత్రమే కారణం కాదు. ఆయన కారణంగానే మొఘలులు పతనమయ్యారని చెప్పడం కూడా బహుశా సరికాదు. అయితే, ఆ పతనాన్ని ఆపడానికి ఆయనేమీ చేయలేదనేది నిజం'' అని యదునాథ్ సర్కార్ రాశారు.

1707లో ఔరంగజేబు మరణానంతరం, మొఘల్ సామ్రాజ్యం తన పాతరోజులను తలచుకుంటూ, ఆ కలల్లోనే బతకడం కొనసాగించింది.

దాదాపు 150 ఏళ్ల పాటు మనుగడ సాగించిన మొఘల్ సామ్రాజ్యం, 1857లో బహదూర్ షా జాఫర్‌తో ముగిసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)