రైళ్లకు పేర్లు ఎవరు పెడతారు? ఎలా పెడతారు?

Godavari Express
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

గోదావరి, కృష్ణా, నాగావళి

గరీభ్ రథ్, రాజధాని, శతాబ్ధి

ముంబయి, చెన్నై, విశాఖ

తిరుమల, పూరి, సింహాద్రి

ఇవన్నీ నదులు, నగరాలు, పుణ్యక్షేత్రాల పేర్లు మాత్రమే కాదు భారతీయ రైల్వే ఆధ్వర్యంలో నడిచే ట్రైన్ల పేర్లు కూడా.

అయితే ట్రైన్లకు ఈ పేర్లు ఎవరు పెడతారు? పేర్లు పెట్టేటప్పుడు ఏ అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు?

అన్ని ట్రైన్లకు అధికారికంగా నామకరణం జరుగుతుందా? పేర్లు లేని ట్రైన్స్ ఉంటాయా? ఈ పేర్ల కథ వెనుక ఎలాంటి కసరత్తు జరుగుతుంది?

రైళ్లకు పేర్లు ఎలా పెడతారనేది ఈస్ట్ కోస్ట్ రైల్వే జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (జెడ్ఆర్యూసీసీ) సభ్యుడు కంచుమూర్తి ఈశ్వర్ బీబీసీతో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కంచుమూర్తి ఈశ్వర్
ఫొటో క్యాప్షన్, కంచుమూర్తి ఈశ్వర్

ఏ పేరు ఎందుకు పెట్టారు?

‘‘దేశంలో అతి పెద్ద రవాణా వ్యవస్థ అయిన రైల్వే... రోజూ వేలాది రైళ్లు నడుపుతూ లక్షలాదిమంది ప్రయాణికులకు వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తుంటుంది.

ఈ రైళ్లకు ప్రత్యేకమైన పేర్లుంటాయి. శతాబ్ది, రాజధాని, వందే భారత్, గరీభ్ రథ్, గోదావరి, తిరుమల వంటి పేర్లు వినే ఉంటారు.

ఈ పేర్లను పెట్టడం వెనుక ప్రజల సూచనలు, సలహాలతో పాటు అయా రైళ్లు తిరిగే ప్రాంతాల విశిష్టత, అయా రైళ్లను ప్రవేశపెట్టిన సందర్భాలు, ఆ రైళ్లు నడిచే ప్రాంతాల్లోని విశేషాలు, పుణ్యక్షేత్రాలు, నదులు ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు’ అని ఈశ్వర్ చెప్పారు.

గోదావరి ఎక్స్‌ప్రెస్: 1974 ఫిబ్రవరి 1న మొదలైన ఈ రైలు 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ రైలు వేసిన తొలి రోజుల్లో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలలో ఉన్న 9 స్టేషన్లకు ఈ రైలు సదుపాయం ఉండేది. దాంతో గోదావరి జిల్లాల ప్రజలే ఎక్కువగా ఇందులో రాకపోకలు సాగించేవారు. ఆ తర్వాత అధికారికంగా గోదావరి నది పేరుతో ఈ రైలుకు గోదావరి అని పేరు వచ్చింది.

గరీబ్ రథ్: దీనికి పేదల రథం అని అర్థం. పేదలకు కూడా ఎయిర్ కండిషన్డ్ ప్రయాణాన్ని తక్కువ ధరకే అందించాలనే లక్ష్యంతో 2005లో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది రైల్వే శాఖ. అందుకే పేదల కోసం ప్రవేశపెట్టిన రైలు కాబట్టి దీనికి గరీభ్ రథ్ అని పేరు పెట్టామన్నారు అప్పటి రైల్వేశాఖ మంత్రి లాలూప్రసాద్ యాదవ్.

దురంతో ఎక్స్‌ప్రెస్: దురంతో అంటే బెంగాలీ భాషలో అవాంతరాలు లేకుండా వెళ్లేది అని అర్థం. తక్కువ స్టేషన్లలో ఆగుతూ ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది ఈ రైలు. అందుకే ఈ రైలుకు దురంతో అని పేరు పెట్టారు.

శతాబ్ది ఎక్స్‌ప్రెస్: భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ శత జయంతి సందర్భంగా 1989లో ఇది మొదలైంది. అందుకే దీనికి శతాబ్ది అని పేరు పెట్టారు.

తిరుమల ఎక్స్‌ప్రెస్: విశాఖపట్నం - తిరుపతి నగరాల మధ్య తిరిగే రైలు ఇది. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులను దృష్టిలో పెట్టుకుని అందుబాటులోకి తెచ్చిన ట్రైన్ కావడంతో దీనికి తిరుమల అని పేరు పెట్టారు.

శబరి ఎక్స్‌ప్రెస్: హైదరాబాద్, త్రివేండ్రం మధ్య పరుగుల తీసే రైలు ఇది. శబరిమల వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు అనుకూలం. అందుకని శబరి పేరు పెట్టారు.

తిరుమల, పూరి, శబరి ఇలా ప్రత్యేకమైన పేర్లు తక్కువగానే ఉంటాయి. ఎక్కువ శాతం గమ్యస్థానమే ఆ రైళ్లకు పేర్లుగా మారుతుంటాయి. బెంగళూరు-చెన్నై మెయిల్, చెన్నై-జైపూర్ ఎక్స్‌ప్రెస్, హౌరా-ముంబయి మెయిల్ లాంటివి.

రైళ్లకు పేర్లు

పేర్లు పెట్టే ముందు..

‘ఏ రైలుకైనా పేరు పెట్టడంలో ఆ రైలు తిరిగే ప్రాంతాల్లోని ప్రజల అభిప్రాయాలకు తొలి ప్రాధాన్యం ఇస్తుంది రైల్వే శాఖ. అందుకే వారి సలహాలు, సూచనలు తీసుకుంటుంది రైల్వే శాఖ. ఏదైనా రైలుకు ఫలానా పేరు అయితే బాగుంటుందని ప్రజలు భావించినప్పుడు వారి ఆలోచనలను స్థానికంగా ఉండే రైల్వే స్టేషన్‌లోని సలహాల పెట్టెలో కానీ స్థానిక డివిజనల్ రైల్వే కార్యాలయంలో కానీ వినతి పత్రాలు ఇవ్వవచ్చు. ఎంపీల దృష్టికి తీసుకెళ్లొచ్చు.

విశాఖపట్నం, మహబూబ్‌నగర్ మధ్య నడిచే రైలు (12861/12862) కు వాల్తేరు ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టాలని డిమాండ్ ఉంది.

విశాఖపట్నం, ముంబయి మధ్య తిరిగే రైలు (18519/18520) కు రుషికొండ ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టాలనే వినతులు చాలానే వచ్చాయి. అవి విశాఖపట్నం నుంచి బయలుదేరే రైళ్లు కాబట్టి ముందు ఆ ప్రపోజల్స్‌ను కమిటీ తరపున వాల్తేరు డివిజన్‌కు పంపుతాం.

వాల్తేరు డివిజన్ అధికారులు వాటిని ఈస్ట్ కోస్ట్ జోన్ హెడ్ క్వార్టరైన భువనేశ్వర్‌కు పంపుతారు. వాటికి అవసరమైతే కలెక్టర్, స్థానిక ఎంపీల సిఫారసులు జతపర్చి రైల్వే మంత్రిత్వ శాఖకు పంపుతారు. అక్కడ అధికారులు చర్చించి పేర్లను నిర్ణయిస్తారు. వినతుల్లో వచ్చిన పేర్ల కంటే మంచిదేదైనా పేరు వారి వద్ద ఉంటే దానికి కూడా ప్రాధాన్యం ఇస్తారు.

నదుల పేర్లతో ఉండే సిఫారసులే ఎక్కువగా వస్తుంటాయి. అనకాపల్లిలో ఉన్న శారదానది పేరుతో శారదా ఎక్స్‌ప్రెస్ అని ఏదైనా రైలుకు పేరు పెట్టాలనే వినతులు వస్తుంటాయి.

నదులు పేర్లతోనే ఎక్కువ రైళ్లు ఇప్పటికీ ఉన్నాయి. గోదావరి ఎక్స్‌ప్రెస్, కృష్ణా ఎక్స్‌ప్రెస్, నాగావళి ఎక్స్‌ప్రెస్... ఇలా. గరీభ్ రథ్ అని లాలూ ప్రసాద్ యాదవ్ పెడితే... చంద్రబాబు నాయుడు జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు ఆ పేరును సూచించారు. జనాల్లో చర్చలో ఉండేవి, బాగా తెలిసిన పేర్లకే రైల్వే శాఖ ప్రాధాన్యం ఇస్తుంది’ అని ఈశ్వర్ చెప్పారు.

పల్నాడు రైలు

పేరు లేకుండా రైళ్లు తిరుగుతుంటాయా?

‘‘కొన్ని రైళ్లకు పేర్లు ఉండవు. సాధారణంగా స్పెషల్ ట్రైన్లకు పేర్లు ఉండవు. ఎందుకంటే వాటిని రద్దీని దృష్టిలో పెట్టుకుని వారంలో ఒకట్రెండు రోజులు నడుపుతారు. లేదా పరిమిత కాలానికే నడుపుతారు. కానీ స్పెషల్ ట్రైన్స్ కాకుండా రెగ్యులర్‌గా తిరిగే వాటికీ కొన్నిటికి పేర్లు లేవు.

అవి రైల్వే శాఖ సూచించే నెంబర్లతోనే ప్రయాణం సాగిస్తున్నాయి. వాల్తేరు డివిజన్ నుంచి నడిచే 17 రైళ్లది అదే పరిస్థితి అని కంచుమూర్తి ఈశ్వర్ చెప్పారు.

"రుషికొండ ఎక్స్‌ప్రెస్, సింహాచలం ఎక్స్‌ప్రెస్, కురుసుర ఎక్స్‌ప్రెస్, సాగరకన్య ఎక్స్‌ప్రెస్, గోస్తని ఎక్స్‌ప్రెస్, సౌత్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (కొత్తగా విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న రైల్వే జోన్ పేరు ఇదే)... ఇలా 17 పేర్లను సూచిస్తూ రైల్వే శాఖకు 2022 జులైలో అప్పటి వాల్తేరు డివిజన్ డీఆర్ఎం అనూప్ సత్పతి లేఖ రాశారు. ఇంకా నిర్ణయం రాలేదు" అని కంచుమూర్తి ఈశ్వర్ బీబీసీతో చెప్పారు.

రైల్వే నోటీసు
ఫొటో క్యాప్షన్, రైలుకు కొత్తగా పేరు పెడితే పత్రికలు, టీవీలలో ప్రకటనలు, వార్తల రూపంలో రైల్వే శాఖ తెలియజేస్తుంది.

పేర్లు లేకుండా కేవలం నెంబర్ల ఆధారంగా తిరిగే రైళ్లు ప్రతి డివిజన్‌లోనూ, జోన్‌లోనూ దేశ‌వ్యాప్తంగా ఉన్నాయి.

నెంబర్లను గుర్తు పెట్టుకోవడం చాలా కష్టమైన పని. దీని వలన ఆయా రైళ్ల కోసం ఎంక్వైరీ చేసేటప్పుడు, టిక్కెట్లు తీసుకోవలసి వచ్చేటప్పుడు ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కంచుమూర్తి ఈశ్వర్ తెలిపారు.

రైళ్లకు భారతీయ నగరాల పేర్లు

కొత్త రైలు పేరు ప్రజలకు ఎలా తెలుస్తుందంటే...

ప్రజల సూచనలు, అధికారులు, సంఘాల ప్రయత్నాల వలన రైళ్లకు పేర్లు వచ్చినా అది ప్రజలకు తెలియడం రైల్వేశాఖ బాధ్యతే.

రైలుకు కొత్తగా పేరు పెడితే దానిని పత్రికలు, టీవీలలో ప్రకటనలు.. వార్తల రూపంలో రైల్వే శాఖ తెలియజేస్తుంది.

అలాగే ఆయా రైళ్ల పేర్లకు ప్రచారం కూడా కల్పిస్తుంది. ఇక టిక్కెట్లపై పేరును ముద్రించడం వలన ప్రజలకు సులభంగా ఆ పేరును చేరవేస్తుంది.

అలాగే టిక్కెట్లు బుక్ చేసుకునే ఆన్‌లైన్ వేదికలో కొత్త పేరుతో టిక్కెట్లు ఇవ్వడం వలన ఆయా ట్రైన్ల పేరు ప్రజలకు సులభంగా చేరుతుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)