ఒక ఇంజినీర్ ట్రైన్ మిస్ కావడం వల్ల ఇంత పెద్ద ఆవిష్కరణ సాధ్యమైందని తెలుసా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లిన్ బ్రౌన్
- హోదా, బీబీసీ ట్రావెల్
రైలు మార్గాలు వేయడం అనేది భూతల ప్రయాణంలో కొత్త శకానికి నాంది పలికింది.
అంతేకాదు, మనుషులు కాలాన్ని చూసే విధానాన్ని కూడా శాశ్వతంగా మార్చివేసింది.
అమెరికా, కెనడా దేశాలలోని రైల్ రోడ్ కంపెనీలు 1883లో అక్కడి వేళల్లో చేసిన మార్పులు ప్రపంచవ్యాప్తంగా టైమ్ జోన్ అనే భావనకు దారితీసింది.
అంతకుముందు వేల ఏళ్లుగా సమయాన్ని కొలవడానికి సూర్యుడినే ఆధారంగా చేసుకునేవారు.
గడియారం కనిపెట్టే వరకు సమయాన్ని తెలుసుకోవడానికి సూర్యుడి గమనాన్నే పరిశీలించేవారు.
సూర్యుడు నడినెత్తికి వస్తే మధ్యాహ్నం అయిందని అనుకునేవారు.
మధ్య యుగాల నాటి సన్ డయల్స్ స్థానంలో మెకానికల్ క్లాక్స్ వచ్చాయి.
అయితే, పట్టణాల్లోని ఇలాంటి మెకానికల్ క్లాక్స్‌లో సమయాన్ని కూడా మళ్లీ సూర్యుడి గమనం ఆధారంగానే సరిచేసేవారు.
దీంతో ఒక్కో పట్టణంలో ఒక్కో సమయం ఉండేది.
1800 కాలం వరకు దాదాపు ఇలాంటి పరిస్థితి కొనసాగింది. అప్పట్లో ఉత్తర అమెరికాలో ఏకంగా 144 టైమ్ జోన్స్ ఉండేవి.
చరిత్రను పరిశీలిస్తే చాలామంది ప్రజలు తమ ఇళ్ల నుంచి ఎక్కువ దూరాలు ప్రయాణించేవారు కాదు. గుర్రాలు, ఒంటెలు, ఎడ్ల బళ్లు వంటివే అప్పట్లో ప్రయాణ సాధనాలు. దీంతో సుదూర ప్రయాణాలు ఉండేవి కాదు.
దీంతో సమయపాలన అవసరం అంతగా ఉండేది కాదు.
కానీ, రైలు మార్గాలు వచ్చాక ఈ సమస్య మొదలైంది.

1800ల మధ్యకాలంలో అమెరికా, కెనడాల్లో రైలు ప్రయాణాలు పెరిగాయని మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ బీఅండ్ఓ రైల్‌రోడ్ మ్యూజియం చీఫ్ క్యూరేటర్ జాన్ గోల్డ్‌మాన్ చెప్పారు.
ఉత్తర అమెరికా ఖండం అంతటా రైళ్లు సరకు రవాణా, ప్రయాణికుల రవాణా చేస్తుండేవని చెప్పారు.
దీంతో రైళ్ల సమయాల నిర్వహణలో సమస్యలు మొదలయ్యాయని గోల్డ్‌మాన్ చెప్పారు.
‘వేర్వేరు స్థానిక టైమ్ జోన్‌ల రైళ్ల నిర్వహణకు పెద్ద సమస్యలే తెచ్చిపెట్టింది. ప్రజలు తమ రైళ్లను మిస్ కావడం నుంచి, ఒకే ట్రాక్‌ను ఉపయోగిస్తున్నప్పుడు రైళ్లు ఢీకొనే అవకాశం కూడా ఉంది." అని గోల్డ్‌మాన్ అన్నారు.
ఇలా, అమెరికా, కెనడాలోని రైళ్ల నిర్వహణ కంపెనీలు టైమ్ జోన్‌ల విధానానికి నాంది పలికాయి.

ఫొటో సోర్స్, B&O Railroad Museum
1825లో ఆధునిక రైల్వే వ్యవస్ధ పుట్టిన బ్రిటన్‌లో కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది.
రైళ్లు నగరాలను, పట్టణాలను ఒకదానికొకటి అనుసంధానం చేయడం ప్రారంభించడంతో స్థానిక టైమ్ జోన్‌ల ఆధారంగా ప్రతి రైలుకు వేర్వేరుగా రాకపోకల సమయాల జాబితాను తయారు చేయడం కష్టంగా మారింది.
1847 నాటికి, అన్ని బ్రిటిష్ రైల్వే కంపెనీలు తమ నెట్‌వర్క్‌లలో ఒకే ప్రామాణిక ‘రైల్వే టైమ్’ ను అనుసరించాయి.
కొత్త సమయపాలన పద్ధతి 1880లో ఆ దేశమంతటా అమలైంది. ఇలా సమయాన్ని ప్రామాణీకరించిన మొదటి దేశంగా బ్రిటన్ చరిత్రకెక్కింది .
ప్రస్తుతం దీన్నే గ్రీన్‌విచ్ మీన్ టైమ్ అని పిలుస్తారు.
సమయాన్నిప్రామాణీకరించడం వల్ల రైళ్ల సామర్థ్యం మెరుగుపడింది. రైలు ప్రమాదాలు తగ్గాయి.
ఇదే ఆలోచన ఉత్తర అమెరికా వరకు వ్యాపించడానికి ఎక్కువ కాలం పట్టలేదు. కానీ అమెరికా, కెనడా విషయానికొచ్చేసరికి ఏకంగా ఒక ఖండం అంతటా సమయాన్ని ప్రామాణీకరించడానికి మార్గాన్ని కనిపెట్టాల్సి వచ్చింది.
1879లో సర్ శాన్‌ఫోర్డ్ ఫ్లెమింగ్ రైలును మిస్ అయ్యారు. కెనడాలో రైలు ఇంజనీర్ అయిన ఫ్లెమింగ్‌కు ఒక ఆలోచన వచ్చింది. అదే టైమ్ జోన్.
1883 నవంబర్ 18న అమెరికా, కెనడాల్లోని రైలు పరిశ్రమలు ఫ్లెమింగ్ ప్రతిపాదనను ఆమోదించాయి.
అయితే, ఉత్తర అమెరికా ఖండం పెద్దది కావడంతో నాలుగు ప్రధాన టైమ్ జోన్‌లు రూపొందించాలని నిర్ణయించారు. అవి ఈస్ట్, సెంట్రల్, మౌంటెయిన్, పసిఫిక్ ప్రామాణిక సమయాలు. ఇప్పటికీ ఇవి మారలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఏకీకృతమైన కొత్త టైమ్ జోన్ వ్యవస్థతో రైలుప్రమాదాలు జరిగే అవకాశం చాలా తక్కువ అని గోల్డ్‌మాన్ వివరించారు.
ఒక ఏడాది తర్వాత, వాషింగ్టన్‌లో ఇంటర్నేషనల్ ప్రైమ్ మెరిడియన్ కాన్ఫరెన్స్ ఏర్పాటుకు ఫ్లెమింగ్ సహాయపడ్డారు.
ఇక్కడే గ్రీన్‌విచ్ మెరిడియన్‌ను 0° రేఖాంశంగా గుర్తించి.. గ్రీన్‌విచ్ మెరిడియన్ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా సమయాలు ప్రామాణీకరించేందుకు ప్రతిపాదించారు.
అమెరికా ఫెడరల్ ప్రభుత్వం ఈ కొత్త టైమ్ జోన్‌లను 1918లో పూర్తి స్థాయిలో అమలులోకి తెచ్చింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














