'దెయ్యం సరస్సు'లోకి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయని షాక్ అవుతున్న జనం

డెత్ వ్యాలీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మియా టేలర్
    • హోదా, బీబీసీ న్యూస్

రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీకి రోయింగ్ ఔత్సాహికులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఈ అద్భుత అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటున్నారు.

ఫిబ్రవరి 19 తెల్లవారుజామున ప్యాట్రిక్ డొన్నెల్లీ ఫొటోలు తీయడానికి కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ నేషనల్ పార్క్‌లోని బ్యాడ్‌ వాటర్ బేసిన్‌కి వెళ్లారు.

సాధారణంగా ఈ బేసిన్ పొడిగా ఉంటుంది. కనుచూపు మేర వరకు విస్తరించి ఉంటుంది. కానీ, ఆ రోజు అక్కడి దృశ్యాన్ని చూసి ప్యాట్రిక్ బిత్తరపోయారు.

“వావ్, అది నిజంగా అద్భుత దృశ్యం’’ అని ప్యాట్రిక్ అన్నారు. బయో డైవర్సిటీ బేసిన్ డైరెక్టర్ ప్యాట్రిక్ డొన్నెల్లీ.

"ఉత్తర అమెరికాలో అత్యంత వేడిగా, పొడిగా ఉండే ప్రదేశం డెత్ వ్యాలీ. అకస్మాత్తుగా బిలియన్ల లీటర్ల నీరు అందులోకి వచ్చింది. ఆ ప్రదేశం పూర్తిగా మారిపోయింది’’ అని ఆయన చెప్పారు.

డెత్ వ్యాలీ

ఫొటో సోర్స్, POT

సరస్సు పుట్టుక

వేల ఏళ్ల కిందట ఉన్న ఒక పురాతన సరస్సు అవశేషమే డెత్ వ్యాలీలోని బ్యాడ్ వాటర్ బేసిన్.

ఇక్కడ సాధారణ సగటు వార్షిక వర్షపాతం రెండు అంగుళాలు. అయితే, గత ఆరు నెలల్లో ఇక్కడ అయిదు అంగుళాలకు పైగా వర్షం కురిసింది.

ఇక్కడ రెండుసార్లు వాన పడింది. ఆగస్టు 20వ తేదీన 2 అంగుళాల వర్షం కురవగా, ఇటీవలే ‘అట్మాస్పిరిక్ రివర్స్’ కారణంగా ఒకటిన్నర అంగుళాల వర్షపాతం పడింది.

మామూలుగా డెత్ వ్యాలీలో పడే వాన నీరు త్వరగా ఆవిరైపోతుంది. కానీ, ఇప్పుడు సరస్సు 10 కి. మీ పొడవు, అయిదు కి.మీ వెడల్పుతో ఉన్నట్లు ప్యాట్రిక్ గుర్తించారు. దీన్ని 'లేక్ మ్యాన్లీ' అని పిలుస్తారు.

నాసా ఈ ప్రాంతానికి చెందిన అద్భుతమైన ఫోటోలు తీసింది. వాటిలో వర్షాలకు ముందు, తర్వాతి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తాయి. పర్వతాలకు ఎడారి దిబ్బలతో కూడిన భూమికి మధ్య నీరు ఉన్నట్లుగా ఆ ఫోటోల్లో కనిపిస్తుంది.

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ఈ సరస్సు నీటి లోతు 12 అంగుళాలకు చేరింది. అంటే ఎడారిలా ఉండే ఈ ప్రాంతంలో ఇప్పుడు 'కయాకింగ్' వంటి ఆటలు ఆడుకునేందుకు కావాల్సినంత నీరు ఉంది.

బ్యాడ్ వాటర్ బేసిన్‌కు చాలా దగ్గరగా ఉన్న నగరం పహ్రంప్. ఇది 130 కి. మీ దూరంలో ఉంది.

ప్యాట్రిక్ ఈ నగరానికి వెళ్లి ఒక కయాక్‌ను కొన్నారు. డెత్ వ్యాలీలో కయాకింగ్ చేసే అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మేం ‘లేక్ మ్యాన్లీ’కి వెళ్లాం.

"నీరు చాలా తేటగా, నిశ్చలంగా ఉంది. నీటిపై సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. అదొక అద్భుతమైన దృశ్యం" అని ప్యాట్రిక్ అన్నారు.

డెత్ వ్యాలీ

ఫొటో సోర్స్, CENTER FOR BIOLOGICAL DIVERSITY

సరస్సు పునరుజ్జీవనం

సముద్ర మట్టానికి 85 మీటర్ల దిగువన ఈ పురాతన సరస్సు ఉంది. వేల ఏళ్ల క్రితమే ఈ సరస్సులోని నీరంతా ఆవిరైపోయింది. గోల్డ్ ప్రాస్పెక్టర్లు కాలిఫోర్నియాకు రాక ముందే ఈ సరస్సు అదృశ్యమైంది.

ఈ సరస్సు అదృశ్యమైన తర్వాత ఈ ప్రాంతంలో భారీ ఉప్పు నిక్షేపాల్ని గుర్తించారు.

20 ఏళ్ల క్రితం ఈ సరస్సు చివరిసారిగా నీళ్లతో కనిపించిందని నేషనల్ పార్క్ సర్వీస్ రేంజర్ అలిస్సా లెటర్‌మాన్ అన్నారు.

"2004- 2005 నాటి సరస్సు ఫోటోలు మా వద్ద ఉన్నాయి. ఆ ఫోటోల్లో సరస్సు నిండుగా ఉన్నట్లు కనిపిస్తుంది’’ అని ఆయన అలిస్సా వివరించారు.

ఈ అగ్నిపర్వత ప్రాంతంలో అంతరించిపోయిన సరస్సు పునరుద్ధరణ కోసం 20 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ ప్రాంతంలో ఎండ లేనప్పుడు కూడా ఉష్ణోగ్రత 49 డిగ్రీలకు చేరుకుంటుంది.

పర్యాటకులు ఏమాత్రం సమయం వృథా చేయకుండా ఇప్పుడు వచ్చిన అరుదైన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు.

పర్యాటకులు కయాకింగ్‌తో పాటు, బీచ్‌లో కుర్చీలు ఏర్పాటు చేసుకున్నారు. పిల్లలు సరస్సులో స్నానాలు చేస్తూ సరదాగా ఆడుకుంటున్నారు.

డెత్ వ్యాలీ

ఫొటో సోర్స్, Getty Images

ఈ సరస్సు ఎప్పటికీ ఇలాగే ఉంటుందా?

డెత్ వ్యాలీలోని నీళ్లలో ఈ ఆటలన్నీ ఎంతకాలం కొనసాగుతాయి? కానీ, ఇది స్వల్పకాలిక ఆనందమే అని భావిస్తున్నారు.

‘‘ఎందుకంటే ఇది చాలా వేగంగా ఆవిరైపోతుంది" అని లెటర్‌మాన్ చెప్పారు.

"ఇలా ఎంతకాలం ఉంటుందో మాకు తెలియదు. కానీ, ఈ సరస్సు కనుమరుగవుతోంది" అని లెటర్‌మాన్ అన్నారు.

ఇంకొన్ని వారాలు మాత్రమే ఇక్కడ కయాకింగ్ చేసుకునే వీలుంటుందని అంచనా వేశారు.

"ఇది చాలా అందమైన ప్రదేశం. సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో ఇది మరింత అందంగా మారుతుంది. ఎందుకంటే చుట్టూ ఉన్న పర్వతాల ప్రతిబింబాలు నీటిలో చూడటం చాలా బాగుంటుంది. పర్వతాల పైభాగంలో మంచు కురుస్తోంది. నీటిలో మంచు పర్వతాల ప్రతిబింబం మంత్రముగ్ధుల్ని చేస్తుంది. డెత్ వ్యాలీలో ఉన్నట్లుగా అసలు అనిపించడం లేదు" అని లెటర్‌మాన్ వివరించారు.

‘‘ఇలా బహుశా జీవితంలో ఒక్కసారే జరుగుతుందేమో. అందుకే వీలైనంత వరకు దీన్ని ఆస్వాదించాలనుకుంటున్నా’’ అని ప్యాట్రిక్ అన్నారు.

వీడియో క్యాప్షన్, కాలిఫోర్నియా డెత్ వ్యాలీలోకి నీరెలా వచ్చిందని అంతా ఆశ్చర్యపోతున్నారు...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)