దక్షిణ కొరియా మహిళలు పిల్లలను ఎందుకు కనడం లేదు, వారి సమస్యేంటి?

ఫొటో సోర్స్, JEAN CHUNG
- రచయిత, జీన్ మెకంజీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో జననాల రేటు తగ్గుతోంది. అయితే, దక్షిణ కొరియాలో తగ్గుతున్నంత వేగంగా ఎక్కడా తగ్గడం లేదు.
మంగళవారం వర్షం కురుస్తున్న సమయంలో యెజిన్ తన స్నేహితుల కోసం తన అపార్ట్‌మెంట్‌లో వంట చేస్తోంది. సియోల్ నగర శివార్లలో ఆమె ఒంటరిగా, ఆనందంగా జీవిస్తున్నారు.
వాళ్లంతా భోజనం చేస్తున్న సమయంలో ఓ మహిళ ఫోన్ తీసి అందులో కనిపిస్తున్న ఓ కార్టూన్‌ను చేతితో స్వైప్ చేశారు. తెరపైకి వచ్చిన ఓ డైనోసార్ “జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మీరు కూడా మాలాగే అంతరించిపోతారు” అని చెప్పి మాయమైంది.
దీంతో అక్కడున్న మహిళలంతా బిగ్గరగా నవ్వారు.
“ఇది తమాషాగా ఉండవచ్చు. కానీ చేదు నిజం. ఎందుకంటే మా జాతి అంతరించిపోవడానికి మేమే కారణమని మాకు తెలుసు” అని అంటున్నారు యెజిన్.
30 ఏళ్ల యెజిన్ ఒక టీవీలో ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు.
ఆమె ఒక్కరే కాదు, ఆమె స్నేహితులు కూడా ఎవరూ పిల్లల గురించి ఆలోచించడం లేదు. పిల్లలు లేని జీవితం గడపాలని భావిస్తున్న సమూహంలో వారు కూడా భాగంగా మారారు.
ప్రపంచంలో అతితక్కువ జననరేటు ఉన్న దేశం దక్షిణ కొరియా. అతి మరింతగా దిగజారుతోంది. జనన రేటు విషయంలో దక్షిణ కొరియా ఏటేటా తన రికార్డుల్ని తానే అధిగమిస్తోంది.
బుధవారం విడుదలైన గణాంకాలను బట్టి చూస్తే అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2023లో 8 శాతం పడిపోయి 0.72శాతానికి చేరుకుంది.
ఈ సంఖ్య ఒక మహిళ తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందనే దానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఒక దేశం తన జనాభాలో స్థిరమైన వృద్ధిరేటుతో కొనసాగాలంటే ఈ సంఖ్య 2.1 శాతం ఉండాలి.
దక్షిణ కొరియాలో ఇదే పరిస్థితి కొనసాగితే 2100 నాటికి కొరియా జనాభా ప్రస్తుతమున్న సంఖ్యలో సగానికి తగ్గిపోతుంది.

ఫొటో సోర్స్, JEAN CHUNG
జాతీయ అత్యవసర పరిస్థితి
దక్షిణ కొరియాలో జననాల రేటు తగ్గడం వల్ల ఏర్పడే పరిణామాలు భయం పుట్టించేలా ఉన్నాయి.
వచ్చే 50 ఏళ్లలో పని చేసే వారి సంఖ్య సగానికి పడిపోతుంది. సైన్యంలో పని చేయడానికి ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు ఉన్న వారి సంఖ్య 58 శాతానికి తగ్గుతుంది. దేశ జనాభాలో సగానికిపైగా 65 ఏళ్లకు పైబడిన వారు ఉంటారు.
ఇలాంటి పరిస్థితి ఏర్పడితే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుంది, పెన్షన్లు భారీగా పెరుగుతాయి. దేశ భద్రత విషయంలో ‘ఇది అత్యవసర పరిస్థితి’ అని చెబుతున్నారు అక్కడి రాజకీయ నాయకులు.
20 ఏళ్లుగా ప్రభుత్వాలు జననాల రేటుని పెంచేందుకు భారీగా నిధులు కేటాయిస్తున్నాయి. ఈ 20 ఏళ్లలో 286 బిలియన్ డాలర్లు ఖర్చు చేశాయి.
సౌత్ కొరియాలో పిల్లల్ని కనే దంపతులపై కనకవర్షం కురుస్తుంది. నెలవారీగా ఇచ్చే డబ్బుతో పాటు ఇళ్ల కొనుగోలులో రాయితీ, టాక్సీల్లో ఉచిత ప్రయాణం లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. పిల్లల్ని కనే వారికి ఆసుపత్రుల బిల్లుల్ని కూడా ప్రభుత్వమే కడుతోంది. పెళ్లి చేసుకున్న వారు కృత్రిమ గర్బధారణ ద్వారా పిల్లల్ని కనాలని భావిస్తే ఆ ఖర్చుల్ని కూడా ప్రభుత్వమే భరిస్తోంది.
పాలకులు ఆర్థికంగా ఎన్ని రకాల ప్రోత్సహకాలు ఇచ్చినా అవేవీ పని చెయ్యడం లేదు. దీంతో మరిన్ని ‘సృజనాత్మక’ ఆలోచనల్ని అమల్లోకి తెచ్చేందుకు నాయకులు మేథోమధనం జరుపుతున్నారు. అందులో ఒకటి సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి తక్కువ జీతాలకు ఆయాలను తీసుకురావడం, 30 ఏళ్ల లోపు వారికి ముగ్గురు పిల్లలుంటే అటువంటి పురుషులను సైన్యం విధుల నుంచి మినహాయింపు వంటివి.
ఆశ్చర్యకరంగా, పాలకులు తమకు ఏం కావాలో తెలుసుకోవడం లేదని యువతులు ఆరోపిస్తున్నారు. దీంతో, మహిళలు పిల్లల్ని ఎందుకు వద్దనుకుంటున్నారో తెలుసుకునేందుకు బీబీసీ బృందం కొరియా అంతటా పర్యటించింది.
యెజిన్ తన 25 ఏళ్ల వయసులో ఒంటరిగా జీవించాలని నిర్ణయించుకుని, కొరియాలో సామాజిక నిబంధనలనూ ధిక్కరించారామె. ఎందుకంటే ఒంటరిగా జీవించడమనేది జీవితంలో తాత్కాలిక దశగానే అక్కడ పరిగణిస్తారు. అంతేకాదు ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకోకూడదని, పిల్లల్ని కనకూడదనీ నిర్ణయించుకున్నారు.
"కొరియాలో పనులు, పిల్లల సంరక్షణను సమానంగా పంచుకోగలిగి, డేటింగ్ చేయదగిన వ్యక్తిని పట్టుకోవడం చాలా కష్టం" అని యెజిన్ బీబీసీతో చెప్పారు.
"ఒంటరిగా పిల్లలను పెంచే మహిళలను అంత బాగా చూడరు" అని ఆమె అంటున్నారు.
2022లో దక్షిణ కొరియాలో కేవలం 2 శాతం జననాలు మాత్రమే వివాహం కాకుండా జరిగాయి.

ఫొటో సోర్స్, JEAN CHUNG
'పని చక్రంలో చిక్కుకుని'
టెలివిజన్‌లో తన కెరీర్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు యెజిన్. పిల్లలను పెంచడానికి తనకు తగినంత సమయాన్ని దొరకదని ఆమె అనుకున్నారు. ఎందుకంటే కొరియన్ల పని గంటలు చాలా ఎక్కువ.
యెజిన్ 9-6 ఉద్యోగం (కొరియాలో 9-5కి సమానం) చేస్తారు. రాత్రి 8 గంటల వరకు ఆఫీసు నుంచి బయటకు వచ్చే అవకాశమే ఉండదని, దాని పైన ఓవర్‌టైమ్ కూడా చేయాల్సి రావొచ్చని యెజిన్ తెలిపారు.
ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత, ఇంటిని శుభ్రం చేయడానికి లేదా పడుకునే ముందు వ్యాయామం చేయడానికి మాత్రమే ఆమెకు సమయం ఉంటుంది.
"నేను నా ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నా, అది నాకు పరిపూర్ణతను తెస్తుంది కూడా. అదే సమయంలో కొరియాలో పని చేయడం కష్టం, ఇది పని అనే ఒక శాశ్వత చక్రంలో చిక్కుకున్నట్లే" అంటున్నారు యెజిన్.
ఖాళీ సమయంలో చదువుకోవాలని, ఉద్యోగంలో మెరుగుపడాలనే ఒత్తిడి కూడా తనపై ఉందని యెజిన్ చెబుతున్నారు.
"కొరియన్లు ఎలా ఆలోచిస్తారంటే.. స్వీయ-అభివృద్ధికి కృషి చేయకపోతే వెనుకబడిపోతారు. ఫెయిల్యూర్స్ అవుతారు. ఈ భయమే రెండింతలు కష్టపడేలా చేస్తుంది." అని ఆమె అన్నారు.
"కొన్నిసార్లు వారాంతాల్లో నేను IV డ్రిప్ (డీహైడ్రేషన్ చికిత్స) తీసుకుంటాను. ఇది నాకు సోమవారం తిరిగి పని చేయడానికి తగినంత శక్తినిస్తుంది" అని తెలిపారు యెజిన్.
తనతో మాట్లాడిన చాలామంది కూడా పని, పిల్లల విషయంలో ఇదే ఆందోళన పంచుకున్నారని ఆమె అంటున్నారు.
"పిల్లలుంటే ఉద్యోగాలను వదిలివేయాలనే ఒత్తిడి కంపెనీల నుంచి ఉంది" అని యెజిన్ అన్నారు.
తన సోదరి, ఆమెకు ఇష్టమైన ఇద్దరు న్యూస్ ప్రజెంటర్లకు ఇలాగే జరిగిందని ఆమె గుర్తుచేసుకున్నారు.

ఫొటో సోర్స్, JEAN CHUNG
'ప్రసూతి సెలవుల సమస్య'
ప్రసూతి తర్వాత ఉద్యోగాలను వదిలివేయవలసి వచ్చిన వారిని లేదా ప్రసూతి సెలవు తీసుకున్న తర్వాత ప్రమోషన్‌ల విషయం పెండింగ్‌లో ఉన్న ఘటనలూ చూశానని, ఇది తనకు ఎప్పుడూ బిడ్డ పుట్టకూడదని ఒప్పించేందుకు సరిపోతుందని హెచ్‌ఆర్ విభాగంలో పనిచేసిన 28 ఏళ్ల మహిళ ఒకరు చెప్పారు.
సాధారణంగా పిల్లల కోసం మొదటి 8 సంవత్సరాలలో పురుషులు, మహిళలు ఇద్దరు ఒక సంవత్సరం సెలవులు తీసుకోడానికి అర్హులు.
కానీ 2022 పరిశీలిస్తే కొత్త తల్లులలో 70 శాతం మంది ఉపయోగించుకొంటే, తండ్రులు మాత్రం కేవలం 7 శాతం మాత్రమే సెలవులు వాడుకున్నారు.
ఓయూసీడీ దేశాలలో కొరియన్ మహిళలు ఉన్నత విద్యావంతులు, అయినప్పటికీ దేశంలో లింగ వేతన వ్యత్యాసం ఉంది. మహిళలకు ఎక్కువమందికి పని కూడా ఉండటం లేదు.
ఇది మహిళల పట్ల ఉద్యోగం చేయండి లేదా కుటుంబ బాధ్యతలు తీసుకోండి అనే విధంగా ఉందని పరిశోధకులు అంటున్నారు. ఇలాంటి సమయంలో మహిళలు కెరీర్‌నే ఎంచుకుంటున్నారు.
నేను స్టెల్లా షిన్ అనే మహిళను ఆఫ్టర్‌స్కూల్ క్లబ్‌లో కలిశాను, అక్కడ ఆమె ఐదేళ్ల వయసుగల పిల్లలకు ఇంగ్లీష్ నేర్పుతున్నారు.
"పిల్లల్ని చూడండి, చాలా ముద్దుగా ఉన్నారు" ఆమె అంటున్నారు.
కానీ 39 సంవత్సరాల వయస్సులో కూడా స్టెల్లాకు తన పిల్లలు లేరు. ఇదేం అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని ఆమె చెప్పారు.
ఆమెకు పెళ్లయి ఆరేళ్లయింది, దంపతులిద్దరూ ఒక బిడ్డ కావాలనుకున్నారు, కానీ బిజీగా ఉన్నారు, జీవితాన్ని ఆస్వాదించారు, అయితే, సమయం దాటిపోయింది.
తన జీవినశైలి ఇక పిల్లలకు అసాధ్యమని ఆమె అనుకుంటున్నారు.
"తల్లిదండ్రులు బిడ్డను మొదటి రెండేళ్లు చూసుకోవాలంటే ఉద్యోగం మానెయ్యాలి, ఇది నన్ను చాలా నిరాశకు గురిచేస్తుంది" అని ఆమె అన్నారు.
"నేను నా వృత్తిని ప్రేమిస్తున్నాను, నన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను" అని స్టెల్లా అంటున్నారు.
స్టెల్లా తన ఖాళీ సమయంలో నడి వయసు మహిళల బృందంతో కే-పాప్ డ్యాన్స్ క్లాసులకు హాజరవుతున్నారు.
పిల్లలు పుట్టినప్పుడు రెండు మూడేళ్లు ఉద్యోగానికి సెలవు తీసుకోవడమనేది మహిళల్లో సాధారణం. తల్లిదండ్రుల సెలవును తన భర్తతో పంచుకోవచ్చా అని నేను స్టెల్లాను అడిగినప్పుడు, అలా జరగదని ఆమె కంటి చూపుతో తెలిపారు.
"నేను ఆయన కోసం వంట చేస్తే, తినకుండానే వెళ్లిపోతారు, ఆయనపై ఆధారపడలేను" అని స్టెల్లా చెప్పారు.
ఇటు కుటుంబం, వృత్తి మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉద్యోగం వదిలేయడం కష్టం, ఎందుకంటే ఇంటి ఖర్చులు భరించలేనంతగా ఉన్నాయని చెప్పారు స్టెల్లా.

ఫొటో సోర్స్, JEAN CHUNG
కొరియా జనాభాలో సగానికి పైగా ప్రజలు రాజధాని సియోల్, దాని చుట్టుపక్కల నివసిస్తున్నారు. ఇక్కడే అత్యధిక ఉద్యోగ అవకాశాలూ ఉన్నాయి. దీంతో అక్కడి అపార్ట్‌మెంట్‌లు, వనరులకు భారీ డిమాండ్ నెలకొంది.
స్టెల్లా, ఆమె భర్త క్రమంగా రాజధాని నుంచి దూరంగా నివసించాల్సి వస్తోంది. ఇప్పటికీ వారు స్వంత స్థలాన్ని కొనుగోలు చేయలేకపోతున్నారు.
దేశంలోనే జనన రేటుతో పోలిస్తే సియోల్‌లో అత్యల్పంగా 0.55కి పడిపోయింది. కొరియాలో ప్రైవేటు విద్య ఖరీదు కూడా. ఇంటి నిర్మాణం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య అయినప్పటికీ కొరియాలో విద్య ఖర్చు ప్రత్యేకం. నాలుగేళ్ల వయస్సు నుంచే పిల్లలు ఖరీదైన అదనపు పాఠ్యేతర (సంగీతం, టైక్వాండో వంటి ) తరగతులకు పంపిస్తారు.
ఈ విధానం చాలా విస్తృతంగా ఉంది, ఒకవేళ అలా చేయకపోతే విద్యార్థి విఫలమయ్యేలా చేసినట్లుగా భావిస్తారు.
ఇది అధిక-పోటీ ఉన్న దక్షిణ కొరియాలో ఊహించలేని భావన. దీంతో పిల్లల పెంపకంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దేశంగా కొరియా అవతరించింది.
2022 అధ్యయనం ప్రకారం కేవలం 2 శాతం మంది తల్లిదండ్రులు మాత్రమే పిల్లలను ప్రైవేట్ ట్యూషన్లో చేర్పించలేదు. అదే సమయంలో 94 శాతం మంది తల్లిదండ్రులు ఆర్థిక భారం అని చెప్పారు.
ఇలాంటి పాఠశాలలోనే పనిచేసే స్టెల్లా, ఈ భారాన్ని బాగా అర్థం చేసుకున్నారు.
తల్లిదండ్రులు ఒక విద్యార్థి కోసం నెలకు రూ.74,000 ($890) వరకు ఖర్చు చేయడం ఆమె చూస్తున్నారు. వీరిలో చాలామంది ఆ ఖర్చును భరించలేరు.
''అయితే ఈ తరగతులు లేకుంటే పిల్లలు వెనుకబడిపోతారు’’ అని ఆమె అభిప్రాయం వ్యక్తంచేశారు.
"నేను పిల్లల చుట్టూ ఉన్నప్పుడు, నాకూ ఒకరుంటే బాగుండేదనిపిస్తుంది, కానీ నాకు ఈ బాధలూ తెలుసు" అని స్టెల్లా అంటున్నారు.

ఫొటో సోర్స్, JEAN CHUNG
'నా జీవితమంతా చదువే'
కొంతమందిని ఈ అధిక ప్రైవేట్ ట్యూషన్ విధానం ఖర్చు కుదేలు చేస్తుంది.
దీనిపై మింజీ అనే మహిళ తన అనుభవాన్ని పంచుకోవాలనుకున్నారు, కానీ పబ్లిక్‌గా కాదు. ఆమె తీరప్రాంత నగరమైన బుసాన్ లో భర్తతో కలిసి జీవిస్తున్నారు.
తనకు పిల్లలు పుట్టరని తల్లిదండ్రులకు చెప్పడానికి ఆమె సిద్ధంగా లేరు. "వారు చాలా షాక్, నిరాశకు గురవుతారు" అని చెబుతున్నారు మింజీ.
మింజీ తన బాల్యం నుంచి 20 ఏళ్ల వరకు అస్సలు సంతోషంగా లేనంటున్నారు. "నేను నా జీవితమంతా చదువుతూనే గడిపాను'' అని చెప్పారు మింజీ.
మొదట మంచి యూనివర్సిటీలో ప్రవేశించడానికి, తరువాత సివిల్ సర్వెంట్ పరీక్షలకు, ఆపై 28 సంవత్సరాల వయస్సులో తన మొదటి ఉద్యోగం సాధించడానికి చదివారు.
అర్థరాత్రి వరకు క్లాస్‌రూమ్‌లలో గడిపిన తన చిన్ననాటి రోజులను మింజీ గుర్తుచేసుకున్నారు, ఆమెకు గణితం అస్సలు నచ్చకపోయేది, ఒక ఆర్టిస్ట్ కావాలని కలలు కన్నారు.
కలలు సాధించడానికి కాకుండా, సాధారణ జీవితం గడపడానికే పోరాడాల్సి వచ్చిందని మింజీ అంటున్నారు. ఇప్పుడు 32 ఏళ్ల వయస్సులో స్వేచ్ఛగా, ఆనందించగలుగుతున్నట్లు చెప్పారు. ఆమె ప్రయాణాలను ఇష్టపడతారు, డైవింగ్ నేర్చుకుంటున్నారు.
అయితే తన చిన్ననాటి కష్టాలను తన పిల్లలకు అందించడానికి మింజీ ఇష్టపడటం లేదు.
"పిల్లలు సంతోషంగా జీవించే ప్రదేశం కొరియా కాదు" అని ఆమె అభిప్రాయపడ్డారు.
ఆమె భర్తకు బిడ్డ అంటే ఇష్టం, దాని కోసం ఇద్దరూ గొడవపడతారు కూడా. చివరికి భార్య చెప్పినట్లే వింటారు.
అప్పుడప్పుడు గుండె వణుకుతుంటుందని, అది ఎందుకో అర్థం కాదని మింజీ అంటున్నారు.

ఫొటో సోర్స్, JEAN CHUNG
ఉద్యోగానికి వెళ్లలేకపోతున్నా..
జుంగ్యోన్ చున్ డేజోన్ నగరంలో ఉంటారు. ఆమె తన జీవితాన్ని "సింగిల్-పేరెంటింగ్ మ్యారేజ్" అని పిలుస్తారు.
తన ఏడేళ్ల కూతురిని, నాలుగేళ్ల కొడుకును పాఠశాల నుంచి పికప్ చేసుకుని, సమీపంలోని ప్లేగ్రౌండ్‌కు చేరుకుంటారు. తన భర్త ఉద్యోగం నుంచి తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది. పడుకొనే సమయంలోనే ఆయన ఇంటికి చేరుకుంటారు.
"నాకు అప్పట్లో పిల్లల పెంపకమే జీవితం అవుతుందనుకోలేదు. వెంటనే ఉద్యోగానికి వచ్చేస్తా అనుకున్నా" అని ఆమె చెప్పారు.
వెంటనే సామాజిక, ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి, ఆమె ఆశ్చర్యపడే విధంగా ఆమె సింగిల్ పేరెంట్‌గా మారిపోయారు.
ఆమె భర్త ట్రేడ్ యూనియన్‌లో పనిచేస్తారు, పిల్లల సంరక్షణ లేదా ఇంటి పనిలో ఆయన భార్యకు సహాయం చేయలేదు. "నాకు చాలా కోపం వచ్చింది" అని జుంగ్యోన్ అన్నారు.
"నేను బాగా చదువుకున్నాను, స్త్రీలు సమానమని చెప్పాను, కాబట్టి నేను దీనిని అంగీకరించలేను" అని చెప్పారు.
గత 50 ఏళ్లలో కొరియా ఆర్థిక వ్యవస్థ చాలా అభివృద్ధి చెందింది. మహిళలను ఉన్నత విద్య, శ్రామికశక్తిలోకి దేశం ప్రోత్సహిస్తోంది, వారి ఆశయాలను విస్తరించింది.
అయితే భార్య, తల్లి పాత్రలు ఒకే వేగంతో అభివృద్ధి చెందలేదు.
జుంగ్యోన్ ఇతర తల్లుల జీవితాలనూ పరిశీలించారు.
"బిడ్డని పెంచుతున్న నా ఫ్రెండ్ నిరాశలోనే ఉన్నారు, పక్క వీధిలోని ఫ్రెండ్‌దీ అదే పరిస్థితి. అంటే ఇది ఒక సామాజిక సమస్యన్నమాట" అని అనుకున్నారు జుంగ్యోన్ .
ఆమె తన అనుభవాలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడం ప్రారంభించారు.
"నా జీవితం నుంచి కథలు వస్తున్నాయి" ఆమె చెప్పారు.
దేశవ్యాప్తంగా ఆమె వెబ్‌టూన్ భారీ విజయాన్ని సాధించింది, జుంగ్యోన్ మూడు కామిక్ పుస్తకాలూ రాశారు.
ఇప్పుడు ఆమె కోపం, విచారం దశను దాటినట్లు చెప్పారు.
మహిళలకు ఇప్పుడు పిల్లలు ఉండకపోవడానికి కారణం వారి దాని గురించి ధైర్యంగా మాట్లాడుతుండటమేనని జుంగ్యోన్ అభిప్రాయపడ్డారు.
అయితే, మహిళలు మాతృత్వాన్ని తిరస్కరించడంపై జుంగ్యోన్ విచారం వ్యక్తంచేస్తున్నారు. ఇలా చేస్తున్న మొదటి తరం మాదేనని మింజీ తెలిపారు.

ఫొటో సోర్స్, JEAN CHUNG
ప్రభుత్వం ఏమంటోంది?
కొరియా జీవితంతో అలసిపోయిన యెజిన్ న్యూజిలాండ్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. లింగ సమానత్వంలో ఏ దేశాలు మెరుగైన ర్యాంకు పొందాయో ఆమె పరిశోధించి, ఆ దేశాన్ని ఎంపిక చేసుకున్నారు.
"అది పురుషులు, స్త్రీలు సమానంగా ఉండే ప్రదేశం, అందుకే బయలుదేరుతున్నా" అని యెజిన్ అంటున్నారు.
మీరు మనసు మార్చుకోవాలంటే మీరు కోరుకునేదేంటి? అని యెజిన్, ఆమె స్నేహితులను అడిగాను. మిన్‌సంగ్ సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది.
"నాకు పిల్లలు కావాలి. నేననుకుంటే నాకు 10 మంది ఉంటారు" అని ఆమె అన్నారు.
అయితే, మిమ్మల్ని ఆపేందేంటని మెకంజీ ఆమెను అడిగితే.. 27 ఏళ్ల తను ఒక బై సెక్సువల్ అని, స్వలింగ భాగస్వామితో రిలేషన్‌లో ఉన్నట్లు మిన్‌సంగ్ తెలిపారు.
దక్షిణ కొరియాలో స్వలింగ వివాహం చట్టవిరుద్ధం, అవివాహిత స్త్రీలు గర్భం దాల్చడానికి స్పెర్మ్ డోనర్‌లను సాయం తీసుకోనివ్వరు.
"ఏదో ఒక రోజు ఇది మారుతుంది, ఇష్టపడ్డ వ్యక్తిని వివాహం చేసుకుంటాను, పిల్లలుంటారు" అని ఆమె అంటున్నారు.
కొరియా అనిశ్చిత జనాభా పరిస్థితిపై ఆమె స్నేహితులు మాట్లాడుతూ ఎవరైన స్త్రీ తల్లి కావాలనుకుంటే వారికి అనుమతి దక్కడం లేదని చెబుతున్నారు.
అయితే, కొరియా రాజకీయ నాయకులు సంక్షోభం లోతు, సంక్లిష్టతను నెమ్మదిగా అంగీకరిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ నెలలో దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సుక్ యోల్.. సమస్య నుంచి బయటపడటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, కొరియా అధికంగా, అనవసరంగా పోటీపడుతోందని అంగీకరించారు.
తక్కువ జననాల రేటును ప్రభుత్వం నిర్మాణాత్మక సమస్యగా పరిగణిస్తుందని, అయితే దీనిని ఇంకా పరిశీలించాల్సి ఉందని ఆయన తెలిపారు.
ఈ నెల ప్రారంభంలో న్యూజిలాండ్ లో యెజిన్‌ని బీబీసీ కలిసింది, అక్కడ ఆమె మూడు నెలలుగా నివసిస్తోంది.
ఆమె తన కొత్త జీవితం, స్నేహితుల గురించి, ఆమె పబ్ కిచెన్లో పని చేయడం గురించి చెప్పారు.
"నా వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చాలా మెరుగ్గా ఉంది" అని యెజిన్ చెప్పారు. ఆమె వారంలో తన స్నేహితులను కలవడానికి ఏర్పాటు చేసుకోగలదు.
"ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో నన్ను చాలా గౌరవంగా చూస్తున్నారు, తక్కువగా జడ్జ్ చేస్తున్నారు" అని ఆమె తెలిపారు.
"ఇది నన్ను ఇంటికి వెళ్లనివ్వడం లేదు" అని యెజిన్ ముగించారు.
ఇవి కూడా చదవండి:
- సీతాదేవీ: రెండో పెళ్లి కోసం ఇస్లాం మతంలోకి మారిన ఈ పిఠాపురం యువరాణి కథ ఏంటి?
- ఐశ్వర్యా రాయ్ పేరును రాహుల్ గాంధీ పదేపదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు?
- విజయ్: ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ ఎందుకు పెట్టారు? అప్పట్లో ఆయన సినిమాలు చిక్కుల్లో ఎందుకు పడ్డాయి?
- మునావర్ ఫారూకీ: ఈ బిగ్‌బాస్ విజేత చుట్టూ ఎందుకింత చర్చ?
- పాకిస్తాన్లో భారతీయ టీవీ సీరియళ్లను నిషేధించినా ఆ ప్రభావం మాత్రం అలాగే ఎందుకు కొనసాగుతోంది
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














