మునావర్ ఫారూకీ: ఈ బిగ్‌బాస్ విజేత చుట్టూ ఎందుకింత చర్చ?

బిగ్ బాస్ షో

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, డోంగ్రీలో ప్రజలకు అభివాదం చేస్తున్న మునావర్
    • రచయిత, నసీరుద్దీన్
    • హోదా, సీనియర్ జర్నలిస్ట్

హిందీ బిగ్‌బాస్ షో సీజన్ 17 విజేతగా నిలిచారు స్టాండప్ కమెడియన్ ఫారూకీ. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫారూకీపై చర్చ జరుగుతోంది.

కొంతమంది అతడికి మద్దతునిస్తుంటే, మరికొందరు మాత్రం ట్రోల్ చేస్తున్నారు.

మునావర్ ఫారూకీ స్టాండప్ కమెడియన్‌గా దేశవ్యాప్తంగా షోలు నిర్వహిస్తుంటారు.

ఆయన షోల్లో చేసే వ్యాఖ్యల పట్ల ఎప్పడూ విమర్శలు, వివాదాలు చుట్టుముడుతుంటాయి. 2021లో ఓ వివాదంపై కేసు నమోదై, 35 రోజుల పాటు జైలులో ఉన్నారు.

గతంలో హైదరాబాద్‌లో ఆయన షో నిర్వహించే ప్రయత్నం చేయగా వీల్లేదంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరిక వీడియో ఒకటి రిలీజ్ చేశారు.

ఆ వీడియోలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదమై ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు బీజేపీ ఆయన్ను కొన్నాళ్లు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

ఇక బిగ్‌బాస్ షో సీజన్ 17లో మునావర్‌తోపాటు మరో 20 మంది పాల్గొనగా, 107 రోజులపాటు జరిగిన షోలో సీజన్ టైటిల్ మునావర్ ఫారూకీని వరించింది.

అయితే, ఆయన విజయంపై కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ జరిగాయి. ఎంతకీ ఆ వివాదమేంటి? ఎవరీ మునావర్ ఫారూకీ?

మునావర్ ఫారూకీ

ఫొటో సోర్స్, @MUNAWAR0018/X

ఫొటో క్యాప్షన్, బిగ్‌బాస్ సీజన్ 17 టైటిల్ గెలుచుకున్న మునావర్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.

ముంబయిలోని డోంగ్రీ నుంచి..

మునావర్ ఫారూకీ ముంబయిలోని డోంగ్రీలో నివసిస్తుంటారు. విజేతగా నిలిచాక ఇంటికి చేరుకునే సమయంలో డోంగ్రీ ప్రజల నుంచి ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం లభించింది. మునావర్‌ను చూసేందుకు భారీగా జనం గుమిగూడారు.

బిగ్‌బాస్ షోకు ఆదరణ ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజలు గుమిగూడటంతో డోంగ్రీ ప్రాంతంపై అందరి దృష్టి పడింది.

వాస్తవానికి ఇతరత్రా అంశాల విషయంలో డోంగ్రీ పేరు వార్తల్లో నానుతున్నప్పటికీ మునావర్ విజయంతో మరోసారి వార్తల్లో నిలిచింది.

డోంగ్రీకి చెందిన యువకుడు జాతీయ స్థాయి షోలో విజేతగా నిలవడంపై చర్చ జరిగింది.

సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా కొన్ని టీవీ ఛానెళ్లలోనూ దీనిపై డిబేట్‌లు నిర్వహించారు.

మరీ ముఖ్యంగా హిందువులు వర్సెస్ ముస్లింలు అనే ధోరణిలో ఈ డిబేట్‌లు జరిగాయి.

డోంగ్రీలో మునావర్‌కు లభించిన ప్రశంసలు, మద్దతును ఆధారంగా చేసుకుని, 'ముస్లింలు వారి విజేతను ఎంతలా ఆదరిస్తున్నారో చూడండి' అన్నట్లుగా కొందరు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు.

కానీ, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, కేవలం డోంగ్రీ ప్రజల కారణంగానే విజయం సాధ్యం అవుతుందా? అంటే, కాదు.

మునావర్ ఫారూకీ కళాకారుడు. ఒక కళాకారుడి ప్రదర్శనను ఆయన ప్రసంగాన్ని చూసే కోణంలో చూడకూడదు. అలా చూస్తే గనుక సామరస్యం సాధ్యంకాదు.

మునావర్ విజయాన్ని మతం కోణంలో చూడటమనేది సంకుచిత మనస్తత్వానికి అద్దం పడుతుందన్నది కొందరి భావన.

మునావర్ ఫారూకీ

ఫొటో సోర్స్, Getty Images

విమర్శలెందుకు?

భారత్ సెక్యూలర్ దేశమని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. అందుకనే, మునావర్ లాంటి వారికి తగిన గుర్తింపు లభిస్తోంది.

ఇటీవలి పరిస్థితులు మాత్రం ఆ లౌకికవాదాన్ని సంక్షోభంలో పడేస్తున్నాయన్న భావన కొందరిలో నెలకొంది.

అందులోనూ తమవారు ఉన్నతస్థానాలకు ఎదగాలి, ప్రముఖులుగా గుర్తించే స్థాయిని పొందాలనే బలమైన కోరిక ఉండటం సహజమే. సాధారణంగా మైనారిటీ వర్గాల్లో అలాంటి ఆశలు ఉండటం మామూలే. దీనిని మరో కోణంలో చూడాల్సిన పనిలేదు.

తమను చిన్నచూపు చూసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కొందరు భావిస్తున్నారు. అలాంటి సమయంలో మునావర్ సాధించిన విజయల్లాంటివి వారిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి.

ఇటీవలి కాలంలో మంచి గుర్తింపు, ప్రజాదరణ పొందిన వ్యక్తుల సంఖ్య అంతగా లేదనే చెప్పాలి. అంతేకాకుండా మునావర్ నేపథ్యం కూడా చూడాలి.

ఆ లెక్కన డోంగ్రీలో మునావర్‌కు లభించిన స్వాగతంపై విమర్శలు సరికాదు. ఆయన చుట్టూ గుమిగూడిన జనసమూహాన్ని పరిశీలిస్తే, ఆ విషయం అర్థమవుతుంది.

బిగ్ బాస్ షో

ఫొటో సోర్స్, MUNAWAR FARUQUI/FB

విమర్శలపై మునావర్ ఏమన్నారు?

టైటిల్ విజేతగా నిలిచిన అనంతరం మునావర్‌ను ఇంటర్వ్యూ చేసిన టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన కథనంలో, తనపై వస్తున్న విమర్శల పట్ల మునావర్ స్పందించారు.

మునావర్‌ను విజేతగా నిలిపేందుకు ఫిక్సింగ్ జరిగిందని సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై, “ఒకవేళ నేనే విజేతనని ముందే నిర్ణయిస్తే, అంతా నాకు అనుకూలంగానే జరిగేది కదా. అలా విమర్శలు చేసేవారు ఒకసారి సీజన్ మొత్తం చూడాలని నేను అభ్యర్థిస్తున్నాను. అప్పుడు వారికే అర్థమవుతుంది. అయినా, వారి అభిప్రాయాలను నేను మార్చలేను. ఎందుకంటే, బిగ్ బాస్ షోకు వెళ్లేటప్పుడు నా పట్ల ఉన్న ధృక్పథాన్ని మార్చడానికి ప్రయత్నించాలని అనుకున్నాను. కానీ, షో నుంచి బయటకు వచ్చాక అది సాధ్యంకాదని అర్థమైంది” అన్నారు.

జైలుకు వెళ్లి..

కామెడీ షోలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా జోక్స్ వేశారని అభియోగాలతో మునావర్‌పై కేసు నమోదైంది.

మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత కుమారుడు ఏకలవ్య గౌడ్ ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేసిన పోలీసులు జనవరి 1న మునావర్‌ను అరెస్టు చేశారు.

అనంతరం బెయిల్‌ కోసం ఆయన చేసుకున్న దరఖాస్తును హైకోర్టు కొట్టివేసింది, ఫిబ్రవరి 5వ తేదీన సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. సుమారు 35 రోజుల పాటు జైలులో ఉన్నారు.

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆయన షో ఉందంటూ బీజేపీ నేతల నుంచి విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో గతేడాది ఆగస్టులోనూ హైదరాబాద్‌లో ఆయన షో నిర్వహిస్తానని ప్రకటించగా, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. హైదరాబాద్‌లో షో నిర్వహించడానికి వీల్లేదని మునావర్‌ను హెచ్చరిస్తూ వీడియో చేశారు.

ఆ వీడియోలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. పోలీసులు రాజాసింగ్‌ను కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.

అటు బీజేపీ కూడా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. ఎన్నికల్లో బీజేపీ తరపున గోషామహల్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగి, గెలుపొందారు రాజాసింగ్.

ఈ కథనంలోని అభిప్రాయాలు వ్యాసక్తర వ్యక్తిగతం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)