లింగి లింగి లింగిడి పాటపై వివాదం ఏంటి? ఉత్తరాంధ్ర జానపదాల చుట్టూ అల్లుకున్న గొడవలేంటి?

లింగి లింగి లింగిడి పాట

ఫొటో సోర్స్, Youtube/AdityaMusicIndia

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

‘కోటబొమ్మాళి పీఎస్’ సినిమా ఇంకా విడుదల కాలేదు. కానీ, ఇందులోని ‘లింగి లింగి లింగిడి’ అనే పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. సెలబ్రిటీలు చాలా మంది ఈ పాటకు రీల్స్ కూడా చేశారు.

నిజానికి ఇదొక జానపద గేయం.

ఆంధ్ర, తెలంగాణలోని చాలా జానపదాలు ఇటీవల కాలంలో సినిమాల్లో తరచుగా వినిపిస్తున్నాయి.

సినిమా ప్రమోషన్లకు ఉపయోగపడేలా సందర్భానుసారంగా పూర్తి జానపదమో, ఒక చరణమో, కొన్ని పదాలో పాటల్లో ఉండేలా చూస్తున్నారు ప్రస్తుత సినీ దర్శకులు.

ఇలా జనాల్లో ఉన్న జానపదాలు సినిమాల్లో వాడటంపై వివాదాలు కూడా పెరుగుతున్నాయి.

ఈ మధ్య కాలంలో ఉత్తరాంధ్రకు చెందిన జానపదాలపై ఎక్కువగా వివాదాలు నడుస్తున్నాయి.

ఈ కథనంలో కూడా ఉత్తరాంధ్ర జానపదాల వరకే పరిమితం అవుతున్నాం.

కళింగాంధ్ర జానపదాలు

సినిమాల్లో ఉత్తరాంధ్ర జానపదాలు

ఉత్తరాంధ్రలోని కళింగపట్నానికి చెందిన మల్లేష్ ‘లింగి లింగి లింగిడి’ పాటను ఆలపిస్తూ తన జీవితం గడుపుతుంటారు.

‘అల వైకుంఠపురంలో’ సిత్తరాల సిరపడు పాట పాడిన బాడ సూరన్న కూడా జానపదాలు పాడుతూ ఊరూరా గంగిరెడ్లను తిప్పుతూ జీవనం సాగిస్తుంటారు.

ఉత్తరాంధ్రలో పుట్టిన జానపదాలైన సిత్తరాల సిరపడు (అల వైకుంఠపురంలో), నేనట్టాంటిట్టాంటడదాన్ని కాదు బావో పల్సరు బైక్ మీద రాను బావ (ధమాక), 'బావొచ్చాడో లప్ప బావొచ్చాడు' (పలాస), నాది నక్కిలీసు గొలుసు (పలాస), ఏం పిల్లడో ఏల్దమొస్తవా (మగధీర) ఇలా అనేక పాటలు, సినిమా బాణీలకు అనుగుణంగా మారిపోయిన జానపదాలే. ఈ జానపదాల కోసమే సినిమా చూసేటంతగా ఇవి పాపులర్ అయ్యాయి.

ఎన్నో ఏళ్లుగా జనాల్లో నానుతున్న ఈ జానపదాలు, సినీ రంగును అద్దుకోగానే వీటికి మరింత ప్రాచుర్యం లభిస్తున్న మాట వాస్తవమే.

కానీ, ఈ పాటలను పాడుతూ వీటిని మనుగడలో ఉంచిన స్థానిక కళాకారులు, గాయకులకు మాత్రం ఏమీ దక్కట్లేదనే వాదన కూడా ఉంది.

కనీసం తమ పేరు గానీ, తమ ఊరు గానీ ఎక్కడ ప్రస్తావించకుండా సినిమా వాళ్లు, యూట్యూబర్లు తమ సొంత పాటే అన్నట్లుగా వాడేసుకుంటున్నారని ఉత్తరాంధ్ర జానపద కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అసలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో పుట్టిన ఈ జానపదాలపై ఎవరికి హక్కులుంటాయి? ఎవరైనా వీటిని వాడుకోవచ్చా? ఇంత కాలం వీటిని బతికిస్తున్న కళాకారులకు, ఈ పాటలకు ఉన్న సంబంధం ఏంటి? వీటిపై వివాదాలు పరిష్కారం అవుతున్నాయా?

లింగి లింగి లింగిడి పాట
ఫొటో క్యాప్షన్, మల్లేష్

లింగి లింగి లింగిడి పాట ఎలా పుట్టిందంటే?

లింగి లింగి లింగిడి పాటను ఉద్దానం ప్రాంతంలో మల్లేష్ అనే 55 ఏళ్ల వ్యక్తి పాడుతూ కనిపిస్తారు. ఆ పాటనే ‘కోట బొమ్మాళీ పీఎస్’ సినిమాలో వాడారు. అయితే తనతో సినిమా వాళ్లు ఏమీ మాట్లాడలేదని, ఆ పాట సినిమాలో పెట్టిన తర్వాత ఎవరో చెప్తే తనకు తెలిసిందని మల్లేష్ బీబీసీతో చెప్పారు.

మల్లేష్ పాటను ‘కోటబొమ్మాళి పీఎస్’ సినిమాలో వాడటంపై ఆ చిత్ర దర్శకుడు మార్ని తేజను బీబీసీ ప్రశ్నించగా ఆయన బదులిచ్చారు.

“ఈ పాటకు అనేక ముక్తాయింపులు జోడించి దానికి ఒక సినీ పాట రూపం తెచ్చాం. దాన్ని రఘు కుంచెతో పాడించాం. ఈ పాటను గతంలో ఆయన అనేక టీవీ షోలలో కూడా పాడారు. ఏదీ ఏమైనా మల్లేష్‌తో మాట్లాడమని మా బృందంతో చెప్పాను” అని తేజ అన్నారు.

“నాకు తెలియకుండానే నా పాటను సినిమాలో పెట్టారు. విషయం తెలిసి నేను ఆ సినిమా వాళ్లను అడిగితే వచ్చి మాట్లాడతామని చెప్పారు. కానీ, ఇప్పటి వరకు వారు రాలేదు. ఫోను చేసినప్పుడు మాత్రం వస్తామని అంటున్నారు. లింగి లింగిడి పాట ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో ఉంది. కానీ, ప్రస్తుతం పాడుతున్న పాటలోని చాలా పదాలు నేను రాసినవే. అప్పుడప్పుడు ఆ పదాలను సమయానికి అనుగుణంగా మారుస్తూ ఆ పాటను ఈ రూపులో పాడుతున్నాను” అని ఆ పాటను మల్లేష్ పాడి వినిపించారు.

‘సిత్తరాల సిరపడు’ పాటకు పారితోషికం

ఇదే తాను పాడిన, రాసిన కొన్ని పాటలను చాలా మంది యూట్యూబర్లు, సినిమా వాళ్లు వాడుకుంటున్నారని, ఇది తెలిసి న్యాయ పోరాటానికి దిగుతున్నానని ‘సిత్తరాల సిరపడు పాట’ పాడిన బాడ సూరన్న బీబీసీతో చెప్పారు.

‘అలవైకుంఠపురంలో’ పాటకు తాను గానం మాత్రమే చేశానని, అందుకు గాను తనకు సినిమా వాళ్లు తగిన పారితోషికం ఇచ్చారని తెలిపారు.

తన పోరాటం తుది దశకు వచ్చిందని, దాని ఫలితాలు జానపద కళాకారులందరికి అందుతాయని బాడ సూరన్న బీబీసీతో చెప్పారు.

జాన పదాలు

‘హైజాక్ అవుతున్న ఉత్తరాంధ్ర జానపదం’

ఇటీవల కాలంలో ఉద్దానం జానపదం హైజాక్ అవుతుందని అని గిడుగు రామ్మూర్తి తెలుగుభాష, జానపద కళాపీఠం వ్యవస్థాపకులు బద్రి కూర్మారావు బీబీసీతో అన్నారు.

ఉత్తరాంధ్ర జానపదాలపై కూర్మారావు అనేక పరిశోధనలు చేశారు. ఈయన కళింగాంధ్ర జానపద గేయాలు, ఉత్తరాంధ్ర జానపద కళలు వంటి పుస్తకాలను రచించారు.

పలాస, సోంపేట, ఇచ్చాపురం ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా పెళ్లి ఊరేగింపుల్లో సన్నాయి, తుడుం మేళం, దరువులకు, నాట్లు కోతలు కాలంలోను, గైరమ్మ పండుగలోనూ జానపద పాటలు పాడుతూ వీటిని కాపాడుతున్నారని కూర్మారావు చెప్పారు.

“రార పిల్లాడా బిలాయెలుదమా, నేనట్టాంటిట్టాంటడదాన్ని కాదు బావో, నేనద్దు రూపాయి డబ్బులకు రాని మేస్త్రీ, నాదీ నక్లీసు గొలుసు, ఉంగరాల జుత్తోడు గాదెప్పా, ఊరందరికి పెద్దోడు గాదెప్ప, లింగి లింగి లింగిడి, పల్సర్ బైక్ వంటి పాటలు బాగా ప్రాచుర్యం లోకి వచ్చాయి. సోషల్ మీడియా ప్రభావంతో ఇవి మరింత వెలుగులోకి వచ్చాయి. అయితే వీటిని సినిమాల్లోనూ, సోషల్ మీడియాలోనూ వీటిని వాడుతున్న ఆ పాట ఏ ప్రాంతం నుండి వచ్చింది? ఎవరు పాడారు? ఎవరు సేకరించారు? వంటి విషయాలు చెప్పక పోవడం బాధాకరం” అని బద్రి కూర్మరావు ఆవేదన వ్యక్తం చేశారు.

నేను సేకరించి 2015లో ప్రచురించిన కళింగాంధ్ర జానపద గేయాలు పుస్తకంలో ప్రత్యేకంగా ఉద్దానం పాటలు కూడా ఉన్నాయి.

అయితే ఈ పాటలకు బీట్స్ పెట్టి, డీజే సౌండ్లతో హైలైట్ చేయడం మంచిదే అయినా నిజమైన కళాకారులుకు మాత్రం గౌరవం దక్కడం లేదు.

నాటి ముద్ద మందారం, అప్పుచేసి పప్పు కూడు, ఖుషీ సినిమాల నుంచి నేటి పలాస-1978 సినిమా వరకు ఉత్తరాంధ్ర, ఉద్దానం జానపద బాణీలు ఉపయోగించుకున్నారు.

బద్రి కూర్మారావు

ఈ జానపదాలు ఎవరివి?

జనాల్లోంచి పుట్టిన పాటలే జానపదాలు. వీటికి సినిమా పాటల్లాగా ఎటువంటి కొలతలూ లెక్కలూ ఉండవు. ప్రజల్లో పుట్టి వారి ద్వారానే ప్రచారం పొందుతూ, ఆయా ప్రాంతాల్లో ఏళ్లుగా వారి జీవనంలో కలిసిపోతాయి. ఇవి పాడుకోడానికి సులభంగా ఉండి అందరి నోళ్లలో నానుతాయి. దీంతో సినిమా పాటల రచయితలు కూడా ఈ జానపదాలను తమ సినిమాల్లో వాడేందుకు ఆసక్తి చూపుతున్నారు.

జానపదాలకు ఒక ట్యూన్ ఉంటుంది. దానికి కొంచెం మెరుగులు దిద్ది, ముక్తాయింపులు (పాటకు ఎక్కడో ఒక చోట కొత్త కొత్త పదాలు, బాణీలు చేర్చడం వంటివి) ఇస్తూ సినిమా వాళ్లు ఆ పాటలను వాడుతున్నారు.

‘‘గాజువాక పిల్లా మేం గాజులోళ్లం కాదా? సబ్బవరం పిల్లా మేం సబ్బులోళ్లం కాదా” పాట కూడా ఉత్తరాంధ్ర జానపదం నుంచి వచ్చినదే.

‘మగధీర’ చిత్రంలోని ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా’ అనే జానపద పల్లవిని వాడినందుకు గీత రచయిత వంగపండు ప్రసాదరావు అభ్యంతరం చెప్పారు. ఇది వివాదంగా మారింది.

“ఒకప్పుడు జానపదం, పుట్టిన ప్రాంతాలకే పరిమితమయ్యేది. కానీ, ఇప్పుడు పెరిగిన టెక్నాలజీతో ప్రపంచం మొత్తానికి అందుబాటులో ఉంటుంది. ఉత్తరాంధ్రలోని ఉద్దానం ప్రాంతం జానపదాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ ప్రాంతానికి చెందిన జానపదాలపై సినీ పరిశ్రమ దృష్టి పెట్టినట్లుంది” అని బద్రి కూర్మారావు బీబీసీతో చెప్పారు.

జానపదాలు

జానపదాల పుట్టుకకు ఆధారాలున్నాయా?

జానపదం అనేది జనుల నుంచి వచ్చినది. ఇది ఒక కళ అని అన్నారు శ్రీకాకుళానికి చెందిన ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు. అయితే అసలు జానపదం ఎలా పుట్టిందంటే దానికి నిర్ధిష్టమైన ఆధారాలంటూ ఏమి ఉండవన్నారు.

‘‘జానపదాలు, వాటి కళారూపాలు సమాజం నుంచి పుట్టుకొచ్చాయి. సమాజంలోని అనేక అంశాలను మేళవింపుగా చేసి అప్పుడు జరుగుతున్న పరిణామాలను జనులు పాటల రూపంలో పాడుకోవడం వలన పుట్టినవే ఈ జానపదాలు. ఇవి పలానా వ్యక్తివి అని చెప్పలేం.

ప్రతి జానపదానికి ఆధారాలు ఉండకపోవచ్చు. కానీ, ఇప్పటికీ జానపద బాణీల్లో పాటలు రాస్తున్న వారు ఉన్నారు. చదువు లేని గ్రామీణ ప్రాంత వాసుల నోళ్ల నుంచి పుట్టిన జానపదాలకు ఎటువంటి రికార్డు ఉండదు. తమ చుట్టూ జరిగే అంశాలను ఆట, పాట, మాట రూపంలో తీసుకుని వస్తుంటారు.

ఉదాహరణకు 1940 ప్రాంతంలో బ్రిటిష్ వారిని ఎదిరించి శ్రీకాకుళంలోని మందసాలో ప్రాణాలు ఆర్పించిన వీర గున్నమ్మ గురించి జనమే సొంతంగా పాటలు కట్టుకుని ఇప్పటికీ పాడుకుంటున్నారు. జానపద కళారూపాలకు తమ గానం, ఆట, పాట ద్వారా నిర్వచనం చెప్పిన కళాకారులు ఎందరెందరో ఉత్తరాంధ్రలో ఉన్నారు” అని అట్టాడ అప్పలనాయుడు బీబీసీతో అన్నారు.

జానపదం

‘వివాదాలెందుకు... ధర్మం పాటిస్తే చాలు’

‘‘జానపదాల్లో అనేక రకాలు ఉన్నాయి. పిల్లల పాటలు, వలపు పాటలు, మహిళల పాటలు, పని పాటలు, నవ్వుల పాటలు, సరసాల పాటలు, తత్వాలు, మేలు కొలుపులు, ఉద్యమ పాటలు ఇలా అనేకం ఉన్నాయి. వీటిలో చాలా పాటలు ఒక ప్రాంతానికే కాకుండా తెలుగు ప్రాంతమంతా కూడా పాకాయి.

గతంతో పోలిస్తే ప్రస్తుతం ఈ జానపదాలను సినిమాల్లో వాడుకోవడం ఎక్కువైంది. దీని వలన జానపదానికి ప్రాచుర్యం కూడా దక్కుతోంది. కానీ, ఆ విషయాన్ని సినిమా క్రెడిట్స్‌లో, యూట్యూబర్లు వారి క్రెడిట్స్‌లో చెప్పడం లేదు” అని కూర్మారావు చెప్పారు.

“ఒకరిద్దరు మాత్రమే ఈ ధర్మాన్ని పాటిస్తున్నారు. వంగపండు ప్రసాదరావు రచించిన పక్కా ఉత్తరాంధ్ర జానపద బాణీలను దాదాపు 30 సినిమాల్లో ఆయనకు క్రెడిట్స్ ఇచ్చి వాడుకున్నారు. కానీ, ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. జానపద గాయకులు, కళాకారులకు క్రెడిట్ ఇవ్వాలి. ఆర్థికంగా సహాయం చేసినా గొప్ప విషయమే. అంతేగానీ జానపదాలు అందరివి అని వ్యాఖ్యానిస్తూ సినిమా, సోషల్ మీడియాలో తమ పేర్లనే రచయితలుగా వేసుకోవడం సరికాదు. కనీస ధర్మం పాటించాలి. అప్పుడు వివాదాలు ఉండవు” అని కూర్మారావు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)