పారాసైట్ ఫీటస్: రక్తం తాగుతూ 10 నెలల పాప కడుపులో ఎదగని పిండం, ఎలా తెలిసిందంటే....

కడుపులో పిండం

ఫొటో సోర్స్, Sheikh Zayed Medical College

    • రచయిత, జుబైర్ ఆజం, ఆమెన్ ఖ్వాజా
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

(హెచ్చరిక: ఈ వార్తలోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలచివేయొచ్చు.)

పది నెలల షాజియా కడుపులో కణితిలా కనిపిస్తున్న కణజాలాన్ని తొలగించేందుకు ఆపరేషన్ చేపడుతున్నప్పుడు డాక్టర్ ముస్తాఖ్ అహ్మద్ షాక్‌కు గురయ్యారు. పాప కడుపులో ఆయనకు సరిగా రూపుదిద్దుకోని కాళ్లు కనిపించాయి. ఇలాంటి దృశ్యాన్ని ఆయన ఇదివరకెన్నడూ చూడలేదు.

‘‘నెలల నుంచి నొప్పితో ఏడుస్తున్న ఆ పాప కడుపులో కణితి కోసం మేం వెతుకుతున్నాం. అయితే, తన కడుపులో కాలి వేళ్లు, వెన్నెముక చూసి ఆశ్చర్యానికి గురయ్యాం. ఒక్క నిమిషం అసలు ఏమైందో మాకు అర్థంకాలేదు’’ అని ఆయన చెప్పారు.

‘‘పిల్లల శస్త్రచికిత్సా నిపుణుడిగా నా 15 ఏళ్ల కెరియర్‌లో ఇలాంటి కేసును ఎప్పుడూ నేను చూడలేదు’’ అని ఆయన అన్నారు.

షాజియా కడుపులోనున్నది ఆమె కవల పిండమని డాక్టర్ ముస్తాఖ్ చెప్పారు. బహుశా ఆ పిండం ఎనిమిది, తొమ్మిది వారాల వయసులో పెరగడం ఆగిపోయింది.

‘‘కాళ్లు, చేతుల రూపం మాకు కనిపించింది. కాలి వేళ్లు కూడా అందులో ఉన్నాయి. కళ్లు కూడా సగం రూపుదిద్దుకున్నాయి’’ అని ముస్తాఖ్ అన్నారు.

పాకిస్తాన్‌ పంజాబ్‌ రహీమ్ యార్‌ఖాన్‌లోని షేక్ జాయెద్ బోధనా ఆసుపత్రిలో ఈ శస్త్రచికిత్స నిర్వహించారు.

కడుపులో పిండం

ఫొటో సోర్స్, AFP

శిశువు కడుపులో పిండం

ఇలా శిశువు కడుపులో సరిగా రూపుదిద్దుకోని తన కవల పిండం ఉండటాన్ని ‘ఫీటస్ ఇన్ ఫీటు’ అని అంటారు. దీన్నే పారాసైటిక్ ఫీటస్ అని కూడా అంటారు.

ఇలా ఎందుకు జరుగుతుందో స్పష్టంగా తెలియదు. అయితే, పిండం అభివృద్ధి తొలి దశల్లోనే ఇలా జరుగుతుంది. ఇక్కడ ఒక పిండాన్ని మరో పిండం కప్పేస్తుంది.

లోపల ఉండే పిండం ఇక్కడ సరిగా రూపుదిద్దుకోదు. ఇది ‘పారాసైట్’లా మారుతుంది. అంటే మనుగడకు ప్రధాన పిండంపైనే ఇది ఆధారపడుతుంది. అయితే, ఇలాంటి కవలలు సాధారణంగా పుట్టగానే మరణిస్తుంటారు.

ప్రతి 5,00,000 ప్రసవాల్లో ఒక కేసులో ఇలా జరిగే అవకాశముంటుందని 2000లో అమెరికా అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఒక నివేదికలో వెల్లడించింది.

కడుపులో పిండం

ఫొటో సోర్స్, Sheikh Zayed Medical College

విపరీతమైన ఏడుపు

పుట్టిన నెల రోజుల నుంచి షాజియా కడుపు పెద్దగా కనిపించేది. తను విపరీతమైన నొప్పితో చాలా ఎక్కువసేపు ఏడ్చేదని ఆమె తల్లిదండ్రులు చెప్పారు.

‘‘అసలు సమస్య ఏమిటో మాకు అర్థమయ్యేది కాదు. కానీ, ఆమె కడుపు మాత్రం గట్టిగా ఉండేది’’ అని షాజియా తండ్రి మహ్మద్ ఆసిఫ్ తెలిపారు.

పొలాల్లో పశువులను చూసుకునే కూలీగా ఆయన పనిచేస్తుంటారు. తన భార్య, మరో ఇద్దరు పిల్లలను పట్టుకొని షిజియాను సాదిఖాబాద్‌లోని చాలా ఆసుపత్రులకు తిప్పారు. అయితే, ఇక్కడ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో పాపకు అసలు ఏమైందో తెలియలేదు.

షాజియా ఆరోగ్యం చేయిదాటిపోయే పరిస్థితికి రావడంతో ఆగస్టు 25న 30 కి.మీ. దూరంలోని రహీమ్ యార్‌ఖాన్‌లోని షేక్ జాయెద్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. కొన్ని గంటల తర్వాత వీరు డాక్టర్ ముస్తాఖ్‌ను కలిశారు.

‘‘పాప శరీరాన్ని పరిశీలించిన తర్వాత కడుపులో కణితి లాంటిది ఉన్నట్లుగా అనుమానం వచ్చింది. వెంటనే అల్ట్రాసౌండ్ చేశాం. అప్పుడే కడుపులో ఒక తిత్తి (సిస్ట్) లాంటి ఆకారం కనిపించింది. అది పిండం అయ్యుంటుందని నేనస్సలు అనుకోలేదు’’ అని ఆయన చెప్పారు.

మమహ్మద్ ఆసిఫ్

ఫొటో సోర్స్, Sheikh Zayed Medical College

ఫొటో క్యాప్షన్, పొలల్లో పశువులను చూసుకునే కూలీగా పాప తండ్రి మమహ్మద్ ఆసిఫ్ పనిచేస్తుంటారు

ఎంఆర్‌ఐ స్కాన్ నిర్వహించే స్థోమత ఈ కుటుంబానికి లేదు. ఆ స్కాన్‌తో అసలు కడుపులో ఏముందో మెరుగ్గా తెలుసుకోవచ్చు. దీంతో సర్జరీతో ఆ కణితిని తొలగిద్దామని పాప తల్లిదండ్రులతో ముస్తాఖ్ అన్నారు.

‘‘ఆ మాట విన్న వెంటనే వారు కాస్త భయపడ్డారు. అంత చిన్న పాపకు సర్జరీ ఎందుకో వారికి అర్థంకాలేదు. భావోద్వేగానికి కూడా గురయ్యారు’’ అని ఆయన తెలిపారు.

అయితే, సర్జరీకి మొదట షాజియా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఆమెను వారు ఇంటికి తీసుకెళ్లిపోయారు.

అయితే, కొన్ని రోజుల తర్వాత వారు మళ్లీ తిరిగివచ్చారు. పాప ఆరోగ్యం మరింత క్షీణించడంతో వారికి ఏం చేయాలో తెలియలేదు.

‘‘వారిది పేద కుటుంబం. రోజు గడవడమే వారికి కష్టం. అందుకే సర్జరీకి సాయం చేయాలని మేం భావించాం’’ అని డాక్టర్ ముస్తాఖ్ చెప్పారు.

ఆగస్టు 29న సర్జరీ రోజు షాజియా కడుపులో సరిగా రూపుదిద్దుకొని పిండాన్ని చూసి షాక్‌కు గురైన తర్వాత, దాన్ని తొలగించేందుకు చాలా క్లిష్టమైన శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని వారికి అర్థమైంది.

‘‘పోషకాహార లోపంతో బాధపడుతున్న ఆ పాప కడుపులో సరిగా రూపుదిద్దుకోని పిండం కనిపించడంతో మేం షాక్‌కు గురయ్యాం’’ అని ముస్తాఖ్ అన్నారు.

ఆ పిండం పారాసైట్‌లా మారి కడుపులోని ఒక పేగు ద్వారా రక్తం, పోషకాలను తీసుకుంటోంది. ఫలితంగా షాజియాకు సరిగా పోషకాలు అందడం లేదు.

శస్త్రచికిత్స అనంతరం షాజియా కోలుకుంటోందని, ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ ముస్తాఖ్ చెప్పారు.

‘‘ఇప్పుడు పాప ఏడుపు తగ్గింది. ఆపరేషన్ తర్వాత తన ఆరోగ్యం కూడా మెరుగైంది’’ అని ఆయన తెలిపారు.

శస్త్రచికిత్సకు నాలుగు రోజుల తర్వాత సెప్టెంబరు 4న ఆసుపత్రి నుంచి ఆమెను ఇంటికి పంపించారు. ఆమె కేసు వివరాలను ఒక సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు.

ముస్తాఖ్ అహ్మద్

ఫొటో సోర్స్, Mushtaq Ahmed

ఫొటో క్యాప్షన్, పాపకు ఆపరేషన్ చేపడుతున్నప్పుడు డాక్టర్ ముస్తాఖ్ అహ్మద్ షాక్‌కు గురయ్యారు

బేబీ ప్రెగ్నెన్సీ కాదు

చాలా అరుదైన కేసు కావడంతో షాజియాపై మీడియాలో చాలా ఆసక్తి నెలకొంది. అయితే, కొన్ని అభ్యంతరకర ప్రశ్నలకు సమాధానం చెప్పలేక షాజియా తండ్రి తన ఫోన్‌ను కూడా స్విచ్చాఫ్ చేశారు.

‘‘ఇది బేబీ ప్రెగ్నెన్సీనా అని పత్రికలు, టీవీ చానెళ్లవారు అడుగుతున్నారు. అలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నాం’’ అని ఆయన అన్నారు.

ఈ విషయంలో స్థానిక జర్నలిస్టులకు స్పష్టమైన సమాచారం అందించామని, షాజియా తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చామని హాస్పిటల్ బృందం తెలిపింది.

‘ఫీటస్ ఇన్ ఫీటు’కు ప్రెగ్నెన్సీతో సంబంధలేదనే విషయాన్ని వార్తల్లో స్పష్టంగా పేర్కొనాల్సిన అవసరముందని ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీఐఎంఎస్)లోని పీడియాట్రిక్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ నదీమ్ అఖ్తర్ అన్నారు.

‘‘చాలా మంది జర్నలిస్టులకు ఇది అర్థం కావడం లేదు. దీని వల్ల ఆ పాప తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు’’ అని ఆయన అన్నారు.

‘‘ఫీటస్ ఇన్ ఫీటు కేసుల్లో కడుపులోని పిండం ప్రెగ్నెన్సీ లేదా కణితుల్లా అన్నిసార్లూ పెరగదు. ఎక్కడ రూపుదిద్దుకుందో అక్కడే అంటే దిగువ కడుపులో అలానే ఉండిపోతుంది’’ అని ఆయన చెప్పారు.

ఫీటస్ ఇన్ ఫీటు

ఫొటో సోర్స్, PA

భారత్‌లోనూ

ఇలాంటి ఒక కేసు భారత్‌లోనూ వైరల్ అయింది. 36 ఏళ్ల వ్యక్తి కడుపు భారీగా పెరగడంతో శ్వాస కూడా తీసుకోవడం ఆయనకు కష్టమైంది.

తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆయన కడుపులో కణితి పెరగుతూ ఉండొచ్చని వైద్యులు భావించారు. అయితే, అనంతర పరీక్షల్లో కడుపులో అతడి కవల పిండం ఉన్నట్లు గుర్తించారు.

కడుపులోని ఆ పిండం కూడా పారాసైట్‌లా చాలా ఏళ్లు అలానే ఉండిపోయింది. ఇది బొడ్డు తాడులాంటి ఒక పేగుతో ఆ వ్యక్తి నుంచి రక్తాన్నీ తీసుకునేది.

గ్రామాలు, చిన్నచిన్న పట్టణాల్లో వైద్య సదుపాయాలు సరిగాలేని చోట కొంతమంది కడుపులో ఇలాంటి సరిగా ఎదగని పిండాలు ఉండే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)