ప్రి మెచ్యూర్ ట్విన్స్: తీవ్ర రక్తస్రావం అవుతున్నా బిడ్డ బయటకు రావొద్దని ఆ గర్భిణీ ఏం చేశారంటే...

గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు

ఫొటో సోర్స్, GUINNESS WORLD RECORDS

    • రచయిత, మ్యాక్స్ మట్జా
    • హోదా, బీబీసీ న్యూస్

ఒక గర్భిణికి 40 వారాలు నిండాక పుట్టాల్సిన కవలలు 22 వారాల్లోనే జన్మించి ‘‘మోస్ట్ ప్రి మెచ్యూర్ ట్విన్స్’’గా గిన్నిస్ బుక్‌ రికార్డులకు ఎక్కారు.

కెనడాకు చెందిన ఈ పిల్లలు అతి తక్కువ నెలలకే జన్మించిన కవలలు (మోస్ట్ ప్రి మెచ్యూర్ ట్విన్స్)గా గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్నారు.

కెనడా మహిళ షకీనా రాజేంద్రమ్‌కు కవలలుగా పాప, బాబు పుట్టారు. వారికి అడిహా, అడ్రియల్ నడరాజ అని పేర్లు పెట్టారు.

సాధారణంగా మహిళల పూర్తి గర్భధారణ సమయం 40 వారాలుగా (280 రోజులు) ఉంటుంది. అయితే, ఈ కవలలు ప్రసవ సమయం కంటే 126 రోజుల ముందుగానే పుట్టారు.

గతంలో ‘‘మోస్ట్ ప్రి మెచ్యూర్ ట్విన్స్’’ రికార్డు అమెరికాలోని లోవాకు చెందిన కవలల పేరిట ఉండేది. 2018లో ఆ రికార్డు నమోదైంది. లోవాకు చెందిన ట్విన్స్, ప్రసవ సమయానికి 125 రోజులు ముందుగా పుట్టారు.

గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుతో కవలలు

ఫొటో సోర్స్, GUINNESS WORLD RECORDS

తాజాగా అడిహా, అడ్రియల్ 126 రోజులు ముందుగా జన్మించి ఆ రికార్డును తిరగ రాశారు. అంటే 18 వారాల ముందుగానే వారు ఈ ప్రపంచంలోకి వచ్చారు. మొత్తం 22 వారాల పాటు గర్భంలో ఉన్నారు.

ఒకవేళ ఈ పిల్లలు 22 వారాలు నిండటానికి ఒక గంట ముందు జన్మించినా, ఆసుపత్రి వర్గాలు వారి ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నించి ఉండేవి కాదని గిన్నిస్ వర్గాలు తెలిపాయి.

21 వారాల 5 రోజులకే తనకు ప్రసవ నొప్పులు ప్రారంభమయ్యాయని తల్లి షకీనా రాజేంద్రమ్ చెప్పారు. అప్పుడు వైద్యులను సంప్రదిస్తే పిల్లలు బతికే అవకాశాలు లేవని చెప్పినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.

ఇది ఆమెకు రెండో ప్రెగ్నెన్సీ. ఒంటారియోలోని తన ఇల్లుకు సమీపంలో ఉండే ఇదే ఆసుపత్రిలో ఆమె తొలి ప్రెగ్నెన్సీని కూడా కోల్పోయారు.

కవలలు

ఫొటో సోర్స్, GUINNESS WORLD RECORDS

మరీ ఇంత త్వరగా అయ్యే ప్రసవాల్లో తామేమీ సహాయం చేయలేమని వైద్యులు చెప్పడంతో భగవంతున్ని వేడుకుంటూ కన్నీళ్లతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని షకీనా భర్త కెవిన్ నడరాజ తెలిపారు.

24 నుంచి 26 వారాల ముందు జన్మించే పిల్లలను రక్షించడానికి చాలా ఆసుపత్రులు ప్రయత్నించవు. కానీ, అదృష్టవశాత్తూ ఈ దంపతులు టొరంటోలోని మౌంట్ సినాయ్ ఆసుపత్రికి వెళ్లగలిగారు. ఆ ఆసుపత్రిలో నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనే పత్ర్యేక విభాగం ఉంటుంది.

ప్రసవ నొప్పులు మొదలైన రెండో రోజున (అంటే గర్భం దాల్చిన 21 వారాల 6వ రోజు) వైద్యులు తనతో చెప్పిన మాటలను షకీనా గుర్తు చేసుకున్నారు.

22 వారాలు నిండటానికి కనీసం కొన్ని నిమిషాల ముందు ప్రసవించినా పిల్లలను ప్రాణాలతో కాపాడలేమని వైద్యులు తనకు చెప్పారని షకీనా వెల్లడించారు.

వీడియో క్యాప్షన్, మగవాళ్లకు గర్భ నిరోధక పిల్స్ ఎందుకు లేవు?

దీంతో, తీవ్రంగా రక్తస్రావం అవుతున్నప్పటికీ మరికొన్ని గంటల పాటు పిల్లలను కడుపులోనే అదిమిపట్టుకోవడానికి తన శాయశక్తులా ప్రయత్నించానని షకీనా తెలిపారు.

అయితే, అర్ధరాత్రి దాటిన 15 నిమిషాలకు ఉమ్మనీరు బయటకు రావడంతో ప్రసవం అనివార్యమైంది.

అప్పటికి ఆమె గర్భధారణ సమయం 22 వారాలు పూర్తయి సుమారు రెండు గంటలు కావడంతో ప్రసవం చేశారు. ఇద్దరు కవలలు జన్మించారు.

తొలుత వారికి తీవ్రమైన వైద్య సమస్యలు వచ్చినప్పటికీ తర్వాత కోలుకున్నారు. ప్రస్తుతం ఏడాది వయస్సున్న వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.

‘‘చాలాసార్లు మా పిల్లలు చావు అంచుల వరకు వెళ్లడాన్ని మా కళ్లతోనే చూశాం. ఇప్పటికీ కూడా వారిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. కానీ వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు’’ అని షకీనా చెప్పారు.

అలబామాకు చెందిన కర్టిస్ మీన్స్ 21 వారాల ఒక రోజుకే జన్మించి అత్యంత త్వరగా జన్మించిన బేబీగా రికార్డు సృష్టించింది.

వీడియో క్యాప్షన్, ఇండియాలో అబార్షన్ చేయించుకోవడానికి నిబంధనలేమిటి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)