వయాగ్రా మాత్ర వేసుకుని మద్యం తాగిన వ్యక్తి మృతి... ఎందుకిలా జరిగింది?

వయాగ్రా పిల్

ఫొటో సోర్స్, SCIENCE PHOTO LIBRARY

వయాగ్రా, ఆల్కాహాల్ తీసుకున్న ఒక వ్యక్తి మరణించారని పరిశోధకులు వెల్లడించారు.

''నాగ్‌పుర్‌కు చెందిన 41ఏళ్ల వ్యక్తి రెండు వయాగ్రా బిళ్లలు తీసుకోవడంతోపాటు మద్యం సేవించారు. ఆ మరుసటి రోజు ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆ వ్యక్తి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు' అని జర్నల్ ఆఫ్ ఫొరెన్సిక్ అండ్ లీగల్ మెడిసిన్‌లో ప్రచురించారు.

బాధితుని మెదడులో రక్తస్రావం జరిగిందని వారు తెలిపారు.

వయాగ్రాతో మద్యం తీసుకోవడం, అప్పటికే బీపీ ఎక్కువగా ఉండటం వల్ల ఆ వ్యక్తి మరణించినట్లు పోస్ట్‌మార్టం నివేదిక తెలిపిందని పరిశోధకులు వెల్లడించారు.

ఇది చాలా అరుదైన కేసు అని, వైద్యుల సలహా లేకుండా వయాగ్రా తీసుకోవడం ఎంత ప్రమాదకరమో ఇది తెలియజేస్తోందని పరిశోధకులు పేర్కొన్నారు.

వయాగ్రా కొనాలంటే చాలా దేశాల్లో వైద్యుల ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి. అలాగే చాలా చోట్ల మందుల షాపుల్లో మందుల చీటీ లేకుండానే వయాగ్రా ఇచ్చేస్తుంటారు.

మరి దీన్ని ఎవరు తీసుకోవచ్చు?

వయాగ్రా కనెక్ట్ కేవలం అంగ స్తంభన సమస్యలు కలిగిన పురుషులకు మాత్రమేనని వైద్యులు తెలిపారు. వారు చెబుతున్న వివరాల ప్రకారం..

బ్రిటన్‌లో అయితే 18 ఏళ్ల లోపు పిల్లలకు దీనిని విక్రయించరాదు. అక్కడ ఫార్మసిస్టు అంగీకరిస్తే, మహిళలు తమ భాగస్వామి తరఫున వాటిని కొనుగోలు చేయవచ్చు.

శృంగారంలో పాల్గొనడానికి 'ఫిట్'గా లేని పురుషులకు దీనిని విక్రయించరాదు. తీవ్రమైన గుండెజబ్బులు, రక్తనాళ సమస్యలు ఉన్నవారు ఈ విభాగం కిందకు వస్తారు.

చిన్న చిన్న వ్యాయామాలకే అలసిపోయేవారు, రెండు అంతస్తుల మెట్లను ఎక్కేసరికి ఆయాసపడిపోయేవాళ్లు ఈ పిల్స్ తీసుకోరాదు.

దీన్ని కొనాలనుకునేవారు పరీక్షలు చేయించుకోవాలా?

కొనాలనుకున్నవారు అవసరమైతే ఒక ప్రైవేట్ రూంలో ఫార్మసిస్టుతో మాట్లాడొచ్చు. పలు ఫార్మసీలలో ఇప్పుడు ప్రైవేట్ కన్సల్టేషన్ సదుపాయం ఉంటోంది.

పిల్స్ కొనాలనుకుంటున్న వ్యక్తి ఆరోగ్యం గురించి, అతను వాడుతున్న ఇతర మందుల గురించి ఫార్మసిస్టు అడిగి తెలుసుకుంటాడు. అయితే కొంటున్నవారి లైంగిక జీవితం గురించి ఎలాంటి వ్యక్తిగత ప్రశ్నలూ అడగరాదు.

కొనాలనుకుంటున్న వారు శరీర పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు.

వయాగ్రా పిల్స్

ఫొటో సోర్స్, Getty Images

వయాగ్రా పని చేస్తుందా?

చాలాసార్లు పని చేస్తుంది. కానీ ఈ పిల్స్ అందరిపై ప్రభావం చూపించవు.

ఈ ఔషధం పురుషాంగంలోని రక్తనాళాలను రిలాక్స్ చేసి, రక్తం స్వేచ్ఛగా ప్రసరించేట్లు చేసి, అంగ స్తంభన జరగడానికి అవకాశం కల్పిస్తుంది.

శృంగారంలో పాల్గొనడానికి ఒక గంట ముందు ఈ పిల్ వేసుకోవాలి.

ఈ పిల్స్‌ను ఆహారంతో పాటు, ఆహారం లేకుండా కూడా తీసుకోవచ్చు. అయితే కడుపు నిండా ఆహారం తీసుకుని ఉంటే మాత్రం పిల్స్ కొంచెం ఆలస్యంగా పని చేయడం ప్రారంభిస్తాయి.

వీటిని ద్రాక్షపళ్లతో కానీ, ద్రాక్షరసంతో కానీ కలిపి తీసుకోకూడదు.. ఎందుకంటే అది ఔషధం పని తీరును ప్రభావితం చేస్తుంది.

రోజుకు ఒక 50 ఎంజీ పిల్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు.

ఒకవేళ మీకు అంగ స్తంభన జరిగి చాలా కాలం అయి ఉంటే, పిల్ పని చేయడానికి కొంత సమయం పట్టవచ్చు.

మద్యం ఎక్కువగా సేవించే వారిలో కూడా అంగ స్తంభనకు సమయం తీసుకుంటుంది.

వయాగ్రా

ఫొటో సోర్స్, Getty Images

పిల్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటే ఏం చేయాలి?

పిల్ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని లేదా ఎక్కువ సేపు ఉందని మీరు భావిస్తే, డాక్టర్ లేదా ఫార్మసిస్టుతో మాట్లాడండి.

ఈ ఔషధాన్ని తీసుకున్న వారు కొందరు అంగ స్తంభన బాధాకరంగా ఉందని, అది సుమారు నాలుగు గంటల పాటు ఉందని తెలిపారు.

ఇలా జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ ఇలాంటిది జరిగితే వెంటనే వైద్య సహాయం తీసుకోండి.

line

ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు?

  • తలనొప్పి
  • మత్తుగా ఉండడం
  • చూపు అస్పష్టంగా మారడం, కొందరికి దృశ్యాలు నీలి వర్ణంలో కనిపించొచ్చు.
  • మొహం వేడెక్కడం, ఎర్రబారటం
  • ముక్కు దిబ్బడ
  • వికారంగా ఉండడం

కింది తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే వెంటనే పిల్స్ నిలిపేసి, వైద్య సహాయం తీసుకోండి

  • ఛాతినొప్పి
  • హఠాత్తుగా కంటిచూపు తగ్గడం, లేదా దృష్టి కోల్పోవడం
  • అలర్జీ రియాక్షన్ (శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తుమ్ములు, పెదవులు, కనురెప్పలు, మొహం వాయడం)
  • ఫిట్స్ రావడం
line
వయాగ్రా

ఫొటో సోర్స్, Getty Images

ఇతర మందులతో కలిపి తీసుకునేప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు:

గుండెపోటుకు నైట్రేట్ పిల్స్ తీసుకునేవారు వయాగ్రా కనెక్ట్ తీసుకోరాదు. అలాగే అమిల్ నైట్రేట్ తీసుకునేవారు కూడా వీటికి దూరంగా ఉండాలి.

రయోసిగువట్, రిటోనేవిర్ అనే ఔషధాలు వాడే వారు కూడా వయాగ్రా తీసుకోరాదు.

మీరు ఏదైనా చికిత్స పొందుతుంటే దాని గురించి ఫార్మసిస్టులకు చెప్పి, మీరు వయాగ్రా వాడొచ్చా, లేదా అని అడగడం మర్చిపోవద్దు.

అంగ స్తంభన సమస్యల వెనుక గుండెజబ్బులు, కొలెస్టరాల్, మధుమేహ సమస్యలు ఉండవచ్చు కనుక ఫార్మసిస్టులు కూడా వయాగ్రా తీసుకునేవారికి డాక్టర్లతో ఫాలో-అప్ అపాయింట్‌మెంట్ తీసుకోమని సలహా ఇవ్వాలి.

ఎక్కడెక్కడ ఇవి లభ్యమవుతాయి?

కొన్ని ఔషధ సంస్థలు ఆన్‌లైన్‌లో కూడా వీటిని విక్రయిస్తున్నాయి.

విక్రయదారుడు మంచి పేరున్న వారు అయి ఉండేలా చూసుకోండి. గుర్తింపు పొందని విక్రయదారుల నుంచి వీటిని కొనడం సురక్షితం కాదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)