#UnseenLives: పీరియడ్స్ సమయంలో గుడికి వెళ్తే తేనెటీగలు కుడతాయా?

మనిషిని అల్లుకున్న తేనెటీగలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, డీఎల్ నరసింహ
    • హోదా, బీబీసీ కోసం

అది పశ్చిమ ప్రకాశంలోని నల్లమల అడవుల్లో కొలువై ఉన్న నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం. ఇక్కడకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు గుంపులుగా ఎడ్లబండ్లపై వస్తారు. ఇక్కడ చెట్లపై ఉన్న తేనెటీగలు అప్పుడప్పుడూ జనాన్ని కుడుతుంటాయి. ఆ సమయంలో ఆ గుంపులోని మగవారు తమతో వచ్చిన ఆడవారివైపు అనుమానంగా చూస్తారు. వారి ప్రమేయం లేకున్నా.. అవమానకరంగా.. "‘ముట్టు'లో వచ్చిన ఆడది ఎవరు?" అంటూ ప్రశ్నిస్తారు. ఇది ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతోంది.

ఈ అవమానం.. అనుమానం వెనుక దాగిన అసలు కథేంటి?

పీరియడ్స్ సమయంలో స్త్రీలు దేవాలయాల్లోకి వెళ్తే అది అపవిత్రం అని.. ఆలయం కూడా అపవిత్రమవుతుందని హిందూ భక్తుల నమ్మకం.

ఆ సమయంలో స్త్రీలు ఆలయ పరిసరాల్లోకి వెళ్తే తేనెటీగలు కుడతాయన్న నమ్మకం కూడా కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉంది. అలాంటివాటిలో నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం ఒకటి.

నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం

ఫొటో సోర్స్, DL Narasimha

ఫొటో క్యాప్షన్, నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జి. పుల్లలచెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం అతి పురాతనమైనది.

1,500 సంవత్సరాల క్రితం మయూర మహర్షి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని, రంగ అనే గిరిజన మహిళ తపస్సుకు మెచ్చి ఆమెను వివాహం చేసుకొని రంగనాయకుడయ్యాడన్నది స్థానికులు చెబుతున్న స్థలపురాణం.

ఆలయం వద్ద జలపాతం

ఫొటో సోర్స్, DL Narasimha

ఫొటో క్యాప్షన్, ఆలయం వద్ద జలపాతం

మయూర మహర్షి నెమలి ఆకారాన్ని ధరించి తన పొడవాటి ముక్కు, కాలిగోళ్ళ సహాయంతో ఆలయ సమీపంలో ఓ నీటి గుండాన్ని తవ్వి తన దాహాన్ని తీర్చుకున్నాడని, అందుకే దీన్ని నెమలి గుండంగా పిలుస్తుంటారనీ చెబుతున్నారు.

కాలక్రమంలో ఈ ప్రాంతం నెమలిగుండ్ల రంగనాయకస్వామి క్షేత్రంగా ప్రసిద్ధి గాంచింది.

ఆలయం వద్ద చెట్టుకు ఉన్న తేనెతుట్టె

ఫొటో సోర్స్, DL Narasimha

ఫొటో క్యాప్షన్, ఆలయం వద్ద చెట్టుకు ఉన్న తేనెతుట్టె

తేనెటీగలు ఈ క్షేత్ర పవిత్రతను కాపాడుతుంటాయని, ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో స్త్రీలను ఆలయంలోకి ప్రవేశించకుండా తేనెటీగలు అడ్డుకుంటాయని స్థలపురాణం కింద చెప్తారు. ఇదే విషయం విస్తృత ప్రచారం జరుగుతోంది.

ఈ విషయంపై ఆలయ అర్చకులు, భక్తుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ.

ఆలయం వద్ద భక్తులు

ఫొటో సోర్స్, DL Narasimha

ఫొటో క్యాప్షన్, ఆలయం వద్ద భక్తులు

శ్రీనివాసరాజు అనే భక్తుణ్ని పశ్నించగా.. ‘‘ఇక్కడ ఆలయ పరిసరాల్లోని చెట్లు, కొండలకు తేనెతుట్టెలున్నాయి. నెలసరిలో ఉన్న మహిళలు ఆలయ పరిసరాల్లోకి ప్రవేశిస్తే వారిపై ఈ తేనెటీగలు దాడిచేస్తాయన్నది వాస్తవం. నెల రోజుల క్రితం మా అన్నావదినా ఇక్కడకు వచ్చారు. వదిన పీరియడ్స్ సమయంలో ఉండటంతో తేనెటీగలు వారిని భయంకరంగా కుట్టాయి’’ అని ఆయన చెప్పారు.

మల్లీశ్వరి, లింగమ్మ, కేశమ్మ

ఫొటో సోర్స్, DL Narasimha

ఫొటో క్యాప్షన్, మల్లీశ్వరి, లింగమ్మ, కేశమ్మ

మల్లీశ్వరి, లింగమ్మ, కేశమ్మ అనే మహిళలను పలకరించగా.. తాము ప్రతివారం రంగస్వామి గుడికి వస్తామని, పీరియడ్స్ సమయంలో మాత్రం ఆలయానికి రామని తెలిపారు.

ఆ సమయంలో వచ్చిన ఆడవాళ్లను తేనెటీగలు కుట్టడం చూశామని, అందుకే తమకు భయమని వారు చెప్పారు. ఒక్కొక్కసారి పీరియడ్స్‌ సమయంలో ఉన్న ఆడవారితో వచ్చిన మగవారిని కూడా తేనెటీగలు కుడుతుంటాయని వారన్నారు.

నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం

ఫొటో సోర్స్, DL Narasimha

ఫొటో క్యాప్షన్, నెమలిగుండ్ల రంగనాయకస్వామి

‘సంతానం కలగాలంటే నెలసరి కచ్చితమైన విషయం. అది ఉంటేనే కదా పిల్లలను కనటానికి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక శాస్త్రాల ప్రకారం పిల్లలను కనటం పవిత్రమైన కార్యమేకదా? మరి అందుకు అవసరమైన పీరియడ్‌ను అపవిత్రమైనదిగా ఎందుకు భావించాల్సి వస్తోంది?’ అన్న ప్రశ్నకు ఆలయ ప్రధాన అర్చకుడు అన్నవరం సత్యనారాయణాచార్యులు ఇలా బదులిచ్చారు.

ఆలయ ప్రధాన అర్చకుడు అన్నవరం సత్యనారాయణాచార్యులు

ఫొటో సోర్స్, DL NARASIMHA

ఫొటో క్యాప్షన్, ఆలయ ప్రధాన అర్చకుడు అన్నవరం సత్యనారాయణాచార్యులు

"భగవంతుని సృష్టిలో అన్నీ పవిత్రమైనవే. మనిషి బతకటానికి ఆహారం స్వీకరించటం ఎంత ముఖ్యమో వ్యర్థాల (మల) విసర్జన కూడా అంతే ముఖ్యం. మల విసర్జన చేయకుంటే మనిషి ప్రాణాలకే ప్రమాదం. మరి మనిషిని రక్షించే మలవిసర్జన ప్రక్రియను పూజగదిలోనో, వంటగదిలోనో ఎందుకని చేయం? మలం అనారోగ్యకరమైనది, దుర్గంధం వెదజల్లుతుందనే కదా?’’

ఆలయం వద్ద భక్తులు

ఫొటో సోర్స్, DL Narasimha

ఫొటో క్యాప్షన్, ఆలయం వద్ద భక్తులు

‘‘స్త్రీ శరీరంలో కూడా ఆ నాలుగు రోజులు వ్యర్థ, అనారోగ్యకర, దుర్గంధ మలినాలు రక్తం రూపంలో విడుదలవుతాయి. వాటిని ఎక్కడబడితే అక్కడ విసర్జించటం క్షేమకరంకాదు. ముఖ్యంగా దేవాలయాలు, వాటి పరిసరాల్లో.. పూర్వీకులు ఏర్పాటుచేసిన సంప్రదాయాలు, పద్ధతుల్లో ఎక్కువ భాగం ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన విషయాలే దాగి ఉన్నాయి.’’

‘‘కనీసం అందరూ ప్రశాంతతకు, పవిత్రతకు నిలయాలుగా భావించివచ్చే దేవాలయలకైనా పీరియడ్స్ సమయంలో స్త్రీలు రాకుండా ఉంటే మంచిది. లేదంటే రంగనాయకస్వామి సైనికులైన తేనెటీగలు వాటి పని అవి చేస్తాయి."

ఆలయం వద్ద ఓ భవనం

ఫొటో సోర్స్, DL Narasimha

పీరియడ్స్ సమయంలో మహిళలు దేవాలయాల్లోకి వెళ్తే తేనెటీగలు కరుస్తాయన్నది కేవలం మూఢనమ్మకం మాత్రమేనని జనవిజ్ఞాన వేదిక అంటోంది.

రంగనాయకస్వామి ఆలయంలో ఆడవారితో పాటు మగవారిని కూడా తేనెటీగలు కరిచిన సందర్భాలు అనేకం ఉన్నాయని.. అలాంటి సందర్భాల్లో ఏదైనా ఇతర కారణాలవల్ల తేనెటీగలు చెదిరి కరిచి ఉంటాయని సమతా సభ్యురాలు సృజన అభిప్రాయపడ్డారు.

సమతా సభ్యురాలు సృజన

ఫొటో సోర్స్, DL Narasimha

ఫొటో క్యాప్షన్, సమతా సభ్యురాలు సృజన

నెలసరిలో ఉన్న స్త్రీలను పసిగట్టే లక్షణం తేనెటీగలకు ఉన్నట్లు ఎలాంటి శాస్త్రీయమైన ఆధారం లేదని ఆమె వివరించారు.

తాను వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలినని, తాను పని చేసే స్కూల్ ఆవరణలోని చెట్టుకు తేనెటీగలు ఉన్నాయని, తనతో పాటు ఇతర మహిళా టీచర్లు కూడా నెలసరి సమయంలో స్కూలుకు వెళ్తారని, ఎప్పుడూ తమను తేనెటీగలు కుట్టలేదని ఆమె చెప్పారు.

ఆలయం వద్ద కోనేరులో భక్తుల స్నానాలు

ఫొటో సోర్స్, DL Narasimha

నెలసరిలో ఉన్న స్త్రీలు ఆలయానికి వస్తే రక్తపు మరకలు పడి అపరిశుభ్రమవుతుందనో.. లేక నీటి గుండంలోకి దిగితే నీరు కలుషితమవుతుందన్న ఉద్దేశంతోనో పూర్వం తేనెటీగల భయాన్ని సృష్టించి ఉంటారని సృజన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)