అలెగ్జాండర్‌ మనవరాలితో చంద్రగుప్తుడి కుమారుడి వివాహం జరిగిందా, చరిత్రకారులు ఏమంటున్నారు?

చంద్రగుప్త మౌర్య

ఫొటో సోర్స్, Life Span publisher

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, రెహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చంద్రగుప్త మౌర్యుడి ప్రభావం ఎలాంటిదంటే సంస్కృతం, పాళీ, ప్రాకృతం, గ్రీకు, లాటిన్ భాషలలోని రచనలలో కూడా ఆయన ప్రస్తావన ఉంటుంది. ఈ రచనలలో మెగస్తనీస్ 'ఇండికా' కూడా ఉంది.

అయితే, మౌర్య రాజవంశానికి పునాది వేసిన చంద్రగుప్తుడి పాలన గురించి ప్రామాణికమైన వర్ణనను అందించే ఏ రచన అసలు కాపీ అందుబాటులో లేదు.

ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. మరోవైపు, చంద్రగుప్త మౌర్యుడి గురించి చరిత్రకారులలో ఏకాభిప్రాయం లేదు.

మౌర్యులు పిప్పలివనాన్ని పాలించిన క్షత్రియ వారసులుగా 'దిఘ నికాయ', 'దివ్యవదన' వంటి బౌద్ధ మూలాలు పేర్కొన్నాయి.

మరోవైపు, మౌర్య అనే పదం మయూర్‌లో మూలంగా ఉందని, అంటే వారు చాలా నెమళ్లు ఉన్న ప్రాంతం నుంచి వచ్చారని లేదా వారి జీవితాల్లో నెమళ్లు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని చాలామంది స్కాలర్స్(పండితులు) నమ్ముతారు.

కొంతమంది ఆయన నెమళ్లను పెంచుకునేవారని భావిస్తారు. మరికొందరు నెమళ్లను వేటాడేవారంటారు. కానీ, కచ్చితంగా చెప్పడం కష్టం.

విశాఖదత్తుడు తన ప్రసిద్ధ నాటకం 'ముద్రరాక్షస'లో చంద్రగుప్తుని కోసం 'వృషల' అనే పదాన్ని ఉపయోగించారు. కొంతమంది దానిని 'శూద్రుని కుమారుడు' అని అర్థం చేసుకుంటారు.

కానీ, రాధాకుముద్ ముఖర్జీ తన 'చంద్రగుప్త మౌర్య అండ్ హిజ్ టైమ్స్' పుస్తకంలో 'వృషల' అనేది గౌరవప్రదమైన పదం అంటే 'ఉత్తమ రాజు' అని రాశారు. అనేక పురాతన రచనలలో చాణక్యుడు చంద్రగుప్తుడిని వృషల అని సంబోధిస్తారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సికందర్‌, గ్రీకు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చంద్రగుప్తుడు మాట్లాడే శైలి సికందర్‌కు చిరాకు తెప్పించిందని గ్రీకు చరిత్రకారుడు జస్టిన్ రాశారు.

చంద్రగుప్తుడు, చాణక్యుడు ఎలా కలిశారు?

చంద్రగుప్త మౌర్యుడి జననంపై చాలా వాదనలున్నాయి. కానీ, ఆయన క్రీ.పూ. 4వ శతాబ్దంలో దాదాపు 21 సంవత్సరాలు పరిపాలించారనడంలో సందేహం లేదు.

చంద్రగుప్తుడు మొదట పంజాబ్‌లో స్థిరపడి, తరువాత తూర్పుకు వెళ్లి మగధను హస్తగతం చేసుకున్నారు. ఈ యుద్ధంలో చంద్రగుప్తుడికి చాణక్యుడు సహాయం చేశారు. చాణక్యుడిని చంద్రగుప్తుడు కలవడంపై ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది.

పురాతన రచనల ప్రకారం, మగధకు రాజైన ధనానందుడి ప్రవర్తనతో బాధపడిన చాణక్యుడు, ఒక రోజు అక్కడి గ్రామంలో పర్యటించారు. ఆ సమయంలో 11-12 సంవత్సరాల వయస్సు గల చంద్రగుప్తుడు పిల్లల ఆటలో ఒక ఆస్థానాన్ని ఏర్పాటు చేసుకొని, రాజు పాత్రలో నటించడం చూశారు.

దేవిక రంగాచారి తన 'ది మౌర్యాస్, చంద్రగుప్త టు అశోక' అనే పుస్తకంలో "చంద్రగుప్తుడు చెట్టు కాండం మీద కూర్చుని, ఆధారాలను పరిశీలిస్తూ న్యాయం చెబుతుండటం చాణక్యుడు చూశారు. ఇది చాణక్యుడిని ఆకట్టుకుంది. బాలుడిని తనతో పంపాలని సంరక్షకులను కోరారు చాణక్యుడు. అనంతరం, చంద్రగుప్తుడిని తనతో పాటు తక్షశిలకు తీసుకెళ్లారు. ఈ ప్రదేశం ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉంది, బాలుడిని గురుకులంలో చేర్చారు చాణక్యుడు. ఆ సమయంలో తక్షశిల అతిపెద్ద విద్యా కేంద్రంగా ఉండేది. దీంతో పాటు, బాలుడిని చాణక్యుడు పదే పదే పరీక్షిస్తూ, సవాళ్లకు ముందుగానే సిద్ధం చేశారు" అని రాశారు.

ఈ సమయంలో సికందర్ (అలెగ్జాండర్) భారతదేశంలో తన కార్యకలాపాలు ప్రారంభించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో నిపుణుడైన చాణక్యుడు, సికందర్‌ను కలవడానికి చంద్రగుప్తుడిని పంపారు.

"చంద్రగుప్తుడు మగధపై దాడి చేయడానికి సికందర్ సహాయం కోరడానికి వెళ్లారని ఎవరికీ తెలియదు. అయితే, ఈ సమావేశం సఫలం కాలేదు. సికందర్‌కు నచ్చని విషయం చెప్పారు చంద్రగుప్తుడు" అని గ్రీకు చరిత్రకారుడు ప్లూటార్క్ తన పుస్తకంలో రాశారు.

మరో గ్రీకు చరిత్రకారుడు జస్టిన్ తన పుస్తకంలో "చంద్రగుప్తుడి మాట శైలి సికందర్‌కు చాలా కోపం తెప్పించింది. చంద్రగుప్తుడిని చంపాలని ఆదేశించారు కూడా. అయితే, చంద్రగుప్తుడు తప్పించుకున్నారు. అక్కడి నుంచి పారిపోయిన తర్వాత, చంద్రగుప్తుడు అలసిపోయి నిద్రపోతున్నప్పుడు, ఒక పెద్ద సింహం ఆయన దగ్గరకు వచ్చింది. ఆయన శరీరం నుంచి కారుతున్న చెమటను నాలుకతో నాకి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత, చంద్రగుప్తుడు కొంతమందిని సమీకరించి తన సైన్యాన్ని ఏర్పాటు చేయడం ప్రారంభించారు" అని రాశారు.

జస్టిన్ పుస్తకం ప్రకారం, సికందర్ మరణం తరువాత, పంజాబ్, సింధ్ ప్రజలను చంద్రగుప్తుడు విడిపించారు.

దేవికా రంగాచారి, పుస్తకం

ఫొటో సోర్స్, S&S India

ఫొటో క్యాప్షన్, దేవికా రంగాచారి రచించిన 'మౌర్యులు, చంద్రగుప్తా టు అశోక' పుస్తకం

చాణక్యుడిపై ఆధారపడటం

చంద్రగుప్తుడి తదుపరి లక్ష్యం మగధ. అక్కడ చంద్రగుప్తుడి చిన్న సైన్యం ధనానందుడి భారీ సైన్యాన్ని ఎదుర్కొంది. అయితే, చంద్రగుప్తుడే విజయం సాధించారు.

ఈ యుద్ధం వివరణ బౌద్ధ గ్రంథం 'మిలింద పన్హో'లో కనిపిస్తుంది. దాని ప్రకారం, "భద్దసాల నాయకత్వంలో నందుడి సైనికులు చంద్రగుప్తుడిపై పోరాడారు. ఈ యుద్ధంలో ధనానందుడిని తప్ప నంద వంశంలోని సోదరులందరినీ చంపేశారు".

ఈ యుద్ధం అంతటా చంద్రగుప్తుడి నీడలా చాణక్యుడు ఉన్నారు.

దీని గురించి దేవిక రంగాచారి తన పుస్తకంలో "ఈ మొత్తం వ్యవహారంలో చాణక్యుడి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. చాలా చోట్ల, చంద్రగుప్తుడు నిశ్శబ్ద ప్రేక్షకుడిగా కనిపిస్తారు. చాణక్యుడు చెప్పినట్లు నడుచుకుంటూ, ఆయన ప్రణాళిక ప్రకారం మగధ రాజు అవుతారు. అయితే, ఒక అపరిచితుడిని అంతగా నమ్మడం అంత సులువు కాదు. కానీ, చంద్రగుప్తుడు ఆ సమయంలో చాలా చిన్నవాడు" అని తెలిపారు.

రాధాకుముద్ ముఖర్జీ

ఫొటో సోర్స్, Gyan Publishing House

ఫొటో క్యాప్షన్, రాధాకుముద్ ముఖర్జీ రాసిన చంద్రగుప్త మౌర్య అండ్ హిజ్ టైమ్స్

చాణక్యుడు, ధనానందుడి మధ్య ఘర్షణేంటి?

ధనానందుడిని సింహాసనం నుంచి తప్పించడానికి చాణక్యుడు చంద్రగుప్తుడి సాయం ఎందుకు తీసుకున్నారు? అసలు ధనానందుడితో ఉన్న శత్రుత్వం ఏమిటనే ప్రశ్న చాలామందిలో ఉంది.

ఒక వివరణ ఏమిటంటే, ఒకసారి చాణక్యుడు పాటలీపుత్రలోని ధనానందుడి ఆస్థానంలో భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో ధనానందుడు ఆస్థానంలోకి ప్రవేశించగానే ఆయన చూపు చాణక్యుడిపై పడింది.

దీప అగర్వాల్ తన 'చాణక్య - ది మాస్టర్ ఆఫ్ స్టేట్ క్రాఫ్ట్' పుస్తకంలో "రాజును చూసినప్పటికీ చాణక్యుడు తినడం కొనసాగించారు. రాజుకి ఇది నచ్చలేదు. చాణక్యుడిని భోజనం ఆపివేసి, వెంటనే ఆస్థానం నుంచి బయటకు వెళ్లిపోవాలని ఆదేశించారు"

"చాణక్యుడు మాట వినకపోవడంతో, రాజుకు కోపం ఎక్కువైంది. దీంతో, చాణక్యుడు కూడా కోపంతో లేచి నంద రాజవంశం మూలాలను పెకిలించే వరకు తన జుట్టుకు ముడి వేయనని శపథం చేశారు. ఆ తరువాత, చాణక్య తన ప్రతిజ్ఞను నెరవేర్చడానికి సహాయం చేయగల వ్యక్తి కోసం వెతికారు" అని రాశారు.

ధనానంద చిన్న కూతురు దుర్ధర

ఫొటో సోర్స్, Life Span publisher

దుర్ధరతో వివాహం

ఓటమి తర్వాత ధనానందుడు సింహాసనాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. చాణక్యుడు మళ్లీ తన జడను ముడేసుకోవడం ప్రారంభించారు.

దేవిక రంగాచారి తన పుస్తకంలో "ఓడిన రాజు చిన్న కుమార్తె దుర్ధరను వివాహం చేసుకోవాలని చంద్రగుప్తుడికి సూచించారు చాణక్యుడు. సింహాసనం నుంచి తండ్రిని తప్పించిన వ్యక్తిని కూతురు వివాహం చేసుకోవాలనే ఆలోచన వింతగా అనిపించింది. కానీ, ఈ ప్రతిపాదనకు రాజకీయ కారణాలున్నాయి. గతంలో కూడా ఇద్దరు శత్రు రాజులను వివాహం ద్వారా ఏకం చేసి, వారిలోని కోపాన్ని తొలగించే ప్రయత్నాలు జరిగాయి" అని తెలిపారు.

పాటలీపుత్ర కీర్తి

క్రీస్తుపూర్వం 320 నాటికి, చంద్రగుప్తుడు తన భారత ప్రత్యర్థులందరినీ ఓడించి గంగా మైదానాలపై నియంత్రణ సాధించారు. ఆ సమయంలో మగధ రాజధాని పాటలీపుత్రను ప్రపంచంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటిగా పరిగణించారు.

డైటర్ షిల్లింగ్‌లాఫ్ తన 'ఫోర్టిఫైడ్ సిటీస్ ఆఫ్ ఇండియా' పుస్తకంలో "పాటలీపుత్ర మొత్తం వైశాల్యం 33.8 కి.మీ. ఈజిప్టు నగరమైన అలెగ్జాండ్రియా వైశాల్యం ఇందులో సగం, రోమ్ వైశాల్యం కేవలం 13.72 చదరపు కిలోమీటర్లు. పాటలీపుత్ర నగరం ఏథెన్స్ కంటే 11 రెట్లు పెద్దది. మొత్తం నగరంలో 64 ద్వారాలు, 570 టవర్లు ఉన్నాయి. ఆ సమయంలో దాదాపు ఐదు లక్షల మంది పాటలీపుత్రలో నివసించేవారు" అని రాశారు.

సికందర్ వారసుడు సెల్యూకస్ తన సామ్రాజ్యాన్ని తిరిగి పొందడానికి తూర్పు వైపునకు వెళ్లినప్పుడు, ప్రయత్నం విఫలమైంది. క్రీస్తుపూర్వం 305లో చంద్రగుప్త మౌర్యుడి చేతిలో ఆయన భారీ ఓటమిని చవిచూశారు.

"చంద్రగుప్తుడు తన తొమ్మిది వేల ఏనుగులలో 500 ఏనుగులను సెల్యూకస్‌కు ఇచ్చారు. సెల్యూకస్ తన రాజ్యంలోని తూర్పు భాగాన్ని చంద్రగుప్తుడికి ఇచ్చారు. చంద్రగుప్తుడు తన కుమారులలో ఒకరికి సెల్యూకస్ కూతురితో వివాహం చేయడంతో రెండు వైపుల పొత్తు మరింత బలపడింది" అని చరిత్రకారుడు విలియం డాల్రింపుల్ తన 'ది గోల్డెన్ రోడ్' పుస్తకంలో తెలిపారు.

పాట్రిక్ ఆలివెల్లె తన 'సొసైటీ ఇన్ ఇండియా 300 బీసీ టు 400 బీసీ' పుస్తకంలో "ఆ కాలంలో శాంతి ఒప్పందాల కోసం చంద్రగుప్తుడు గ్రీకు స్త్రీని వివాహం చేసుకొని ఉండవచ్చు, అప్పట్లో అలా చేయడం ఆచారం కూడా. చంద్రగుప్తుడి వారసుల్లో గ్రీకు రక్తం ప్రవహించడం అసాధ్యం కాదు" అని రాశారు.

మౌర్య, చంద్రగుప్తుడి ప్రభుత్వం

ఫొటో సోర్స్, Life Span publisher

ఫొటో క్యాప్షన్, మౌర్య సామ్రాజ్య పరిపాలన చాలా పురోగతి సాధించిందని పుస్తకాలు చూపిస్తున్నాయి.

చంద్రగుప్తుడి ప్రభుత్వం ఎలా ఉండేది?

సెల్యూకస్ తన ప్రతినిధులలో ఒకరైన మెగస్తనీస్‌ను చంద్రగుప్త మౌర్య ఆస్థానానికి పంపారు. ఆయన తన 'ఇండికా' పుస్తకంలో ఆ కాలపు భారతదేశం గురించి వివరణాత్మక వర్ణనను ఇచ్చారు.

కాగా, మెగస్తనీస్ రాసిన అసలు కాపీ ఇప్పుడు అందుబాటులో లేదు. కానీ, దానిని ఉపయోగించి చాలామంది గ్రీకు, లాటిన్ రచయితలు ఆ కాలంలో భారతదేశం ఎలా ఉండేది రాశారు.

ఈ వివరణలు మౌర్య సామ్రాజ్య పరిపాలన చాలా పురోగతి సాధించిందని, దేశ ఆర్థిక కార్యకలాపాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉందని చూపిస్తుంది. రాజు ప్రభుత్వానికి అధిపతి. ఆయనకు సహాయం చేయడానికి 18 మంది 'అమాత్యులు(మంత్రులు)' ప్రభుత్వంలోని ప్రతి విభాగాన్ని గమనిస్తూ ఉండేవారు.

ఎ.ఎల్. బాషమ్, మౌర్య, చంద్రగుప్తుడి ప్రభుత్వం

ఫొటో సోర్స్, Picador India

ఫొటో క్యాప్షన్, ఎ.ఎల్. బాషమ్ రచించిన 'ది వండర్ దట్ వాజ్ ఇండియా' పుస్తకం

మౌర్య సైన్యం

చంద్రగుప్తుడి న్యాయ వ్యవస్థను మెగస్తనీస్ ప్రశంసిస్తూ, రాజు స్వయంగా బహిరంగ సభలో ప్రజలకు న్యాయం చేసేవారని రాశారు.

మెగస్తనీస్‌ను ఉటంకిస్తూ ఎ.ఎల్. బాషమ్ తన 'ది వండర్ దట్ వాజ్ ఇండియా' అనే పుస్తకంలో "చంద్రగుప్తుడు పాటలీపుత్రలో ఒక విలాసవంతమైన, భారీ రాజభవనంలో నివసించారు. ఆయన అందం, వైభవం నమ్మశక్యం కానివి. కానీ, ఆయన జీవితం అంత సంతోషంగా లేదు. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ తనను చంపేస్తారేమోనని భయపడేవారు"

"భద్రత కోసం పకడ్భందీ ఏర్పాట్లు చేశారు. పాటలీపుత్రం అన్ని వైపులా చెక్క గోడలతో పేర్చారు. బాణాలు వేయడానికి వీలుగా వివిధ ప్రదేశాలలో గోడలకు రంధ్రాలు చేశారు" అని రాశారు.

శత్రు సైన్యం నగరంలోకి ప్రవేశించకుండా గోడలకు ఆనుకుని 600 అడుగుల వెడల్పు గల కందకాన్ని తవ్వారు. పాటలీపుత్రను 30 మంది సభ్యుల ప్రభుత్వ బోర్డు పాలించింది.

చంద్రగుప్తుడికి భారీ సైన్యం ఉంది. దీనికి క్రమం తప్పకుండా జీతాలు, ఆయుధాలు అందుతాయి.

మెగస్తనీస్ ప్రకారం, చంద్రగుప్తుడి సైన్యంలో ఆరు లక్షల పదాతిదళం, ముప్పై వేల అశ్వికదళం, తొమ్మిది వేల ఏనుగులు ఉన్నాయి. మావటితో పాటు, ప్రతి ఏనుగుపై నలుగురు సైనికులు స్వారీ చేస్తుంటారు.

చంద్రగుప్త మౌర్యుడు ఎక్కువ సమయం రాజభవనంలోనే గడిపేవారు.

"చంద్రగుప్తుని భద్రతా బాధ్యత సాయుధ మహిళా అంగరక్షకులది. ప్రజల మధ్యకు వెళ్లినప్పుడు, ఆయన ఊదా, బంగారంతో ఎంబ్రాయిడరీ చేసిన అత్యుత్తమ మస్లిన్ దుస్తులను ధరించేవారు. తక్కువ దూరాలకు గుర్రంపై ప్రయాణించేవారు. కానీ, ఎక్కువ దూరం ప్రయాణించాలంటే ఏనుగుపై వెళ్లేవారు" అని జేడబ్ల్యూ మెక్‌క్రిండిల్ తన 'అన్సీంట్ ఇండియా ఆస్ డిస్క్రైబ్డ్ బై మెగస్తనీస్ అండ్ అరియన్' అనే పుస్తకంలో రాశారు.

"చంద్రగుప్తుడు పగటిపూట నిద్రపోరు. రాత్రిపూట తనను చంపేస్తారేమోనని బెడ్‌రూమ్‌ను మారుస్తూ ఉండేవారు. మసాజ్ సమయంలో కూడా ఆయన ప్రజల విన్నపాలను వినేవారు. ఏనుగులు, ఎద్దులు, ఖడ్గమృగాల పోరాటం చూడటానికి చంద్రగుప్తుడు ఇష్టపడేవారు. ఎద్దుల పందేలను చూసే అవకాశాన్ని ఆయన ఎప్పుడూ వదులుకోలేదు" అని ఆ పుస్తకంలో రాశారు.

చంద్రగుప్త మౌర్యుడు

ఫొటో సోర్స్, Life Span publisher

ఫొటో క్యాప్షన్, చంద్రగుప్త మౌర్యుడు క్రీ.పూ. 293లో మరణించారు.

సింహాసనం వదులుకోవడం

తన జీవితపు చరమాంకంలో, చంద్రగుప్త మౌర్యుడు శాంతిని వెతుక్కుంటూ జైన మతాన్ని ఆశ్రయించారు. సింహాసనాన్ని వదులుకుని తన కుమారుడు బిందుసారుడిని మగధకు రాజును చేశారు.

రోమిలా థాపర్ తన 'ఎర్లీ ఇండియా' పుస్తకంలో "చంద్రగుప్త మౌర్యుడు జైన సన్యాసి భద్రబాహుతో దక్షిణానికి వెళ్లారు. అక్కడ కర్ణాటకలోని శ్రావణ బెలగోళలో జైన పద్ధతిలో ఆకలితో గడుపుతూ జీవితాన్ని ముగించారు. ఆయన క్రీ.పూ. 293లో మరణించారు. ఆ సమయంలో ఆయన వయస్సు 50 ఏళ్లకు పైనే ఉంది" అని తెలిపారు.

ఒక విధంగా, ఆయన మొత్తం భారత ఉపఖండానికి రాజు. ఆయన సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. కళింగ (ఒడిశా), ఆంధ్ర, తమిళనాడు ఆయన సామ్రాజ్యంలో లేవు. కానీ నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)