చంద్ర గ్రహణం 2025: భారత్‌లో ఎప్పుడు, ఎక్కడ కనిపిస్తుంది.. మనం కళ్లతో నేరుగా చూడొచ్చా?

చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, ప్రకృతి, విశ్వం, అంతరిక్షం, ఖగోళం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గ్రహణం సమయంలో భూ వాతావరణంలో మేఘాలు లేదా ధూళి ఎంత ఎక్కువగా ఉంటే, చంద్రుడు అంత ఎర్రగా కనిపిస్తాడు. (ప్రతీకాత్మక చిత్రం)

ఖగోళ శాస్త్రవేత్తలు, అంతరిక్ష విషయాలను ఇష్టపడే వారికి ఆదివారం (సెప్టెంబర్ 7) చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు, భారత్‌తో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో పూర్తి చంద్రగ్రహణాన్ని చూడొచ్చు.

ఈసారి సంపూర్ణ చంద్రగ్రహణం 'బ్లడ్ మూన్'గా కనిపిస్తుంది. అంటే చంద్రుడు ఎరుపు రంగులో, సాధారణం కంటే పెద్దదిగా కనిపిస్తాడు.

ఈ ఖగోళ సంఘటన భారత్‌తో సహా తూర్పు ఆఫ్రికా, యూరప్, పశ్చిమ ఆస్ట్రేలియా, ఆసియాలోని చాలా దేశాలలో ప్రారంభం నుంచి చివరి వరకు స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ సంవత్సరం ఇదే చివరి చంద్రగ్రహణం. దేశవ్యాప్తంగా ఇది కనిపిస్తుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

భారత్‌లో ఎక్కడెక్కడ కనిపిస్తుంది?

ఈ సంపూర్ణ చంద్రగ్రహణం దేశంలోని చాలా రాష్ట్రాలలో కనిపిస్తుంది.

ఉత్తర భారతదేశం: దిల్లీ, చండీగఢ్, జైపూర్, లఖ్‌నవూ

పశ్చిమ భారతదేశం: ముంబయి, అహ్మదాబాద్, పుణే

దక్షిణ భారతదేశం: హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కొచ్చి

తూర్పు భారతదేశం: కోల్‌కతా, భువనేశ్వర్, గౌహతి.

దీంతో పాటు, భోపాల్, నాగ్‌పూర్, రాయ్‌పూర్‌తో సహా మధ్య భారత్‌లోని పలు నగరాల్లో కూడా కనిపిస్తుంది.

చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, ప్రకృతి, విశ్వం, అంతరిక్షం, ఖగోళం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆదివారం రాత్రి ప్రారంభంకానున్న చంద్రగ్రహణం దాదాపు ఐదున్నర గంటల పాటు ఉంటుంది.

ఏ సమయంలో కనిపిస్తుంది?

భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 7న, రాత్రి 8:58 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది.

పూర్తి చంద్రగ్రహణం (బ్లడ్ మూన్ దశ) రాత్రి 11:00 గంటల నుంచి 12:22 గంటల వరకు సంభవిస్తుంది.

చంద్రగ్రహణం ముగింపు సమయం అర్ధరాత్రి తర్వాత.. అంటే సెప్టెంబర్ 8న, తెల్లవారుజామున 2:25 గంటలకు ఉంటుంది.

చంద్రగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది?

చంద్రుడు సొంతంగా ప్రకాశించడు. సూర్యకిరణాలు చంద్రుడిని చేరుకున్నప్పుడు, అవి అక్కడి నుంచి ప్రతిబింబిస్తాయి. అందుకే చంద్రుడు ప్రకాశిస్తాడు లేదా మనం దానిని ప్రకాశిస్తున్నట్లుగా చూస్తాం.

సూర్యుని చుట్టూ భూమి కక్ష్యలో ఉన్నప్పుడు, చంద్రుడు - సూర్యునికి మధ్యలో భూమి వస్తుంటుంది. ఆ సమయంలో సూర్యకాంతి చంద్రుడిని చేరుకోలేదు. సూర్యుడు, భూమి, చంద్రుడు వాటి కక్ష్యలో ఒకే వరుసలో ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది.

ఆ సమయంలో భూమి నీడ చంద్రునిపై పడుతుంది. దీంతో, చంద్రునిపై నీడ ఉన్న భాగం చీకటిగా మారుతుంది. ఈ పరిస్థితిలో మనం భూమి నుంచి చంద్రుడిని చూసినప్పుడు, ఆ భాగం నల్లగా కనిపిస్తుంది. దీనినే 'చంద్ర గ్రహణం' అంటారు.

చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, ప్రకృతి, విశ్వం, అంతరిక్షం, ఖగోళం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో చంద్రగ్రహణం కనిపిస్తుంది.

బ్లడ్ మూన్ అంటే ఏంటి?

చంద్రగ్రహణం సమయంలో కొన్నిసార్లు చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులో కనిపిస్తాడు. దీనినే బ్లడ్ మూన్‌గా పిలుస్తారు.

నాసా ప్రకారం, సూర్యకిరణాలు భూ వాతావరణంలోకి ప్రవేశించిన అనంతరం కొంత వంగి ప్రయాణిస్తాయి. ఆ సమయంలో, ఎరుపు/నారింజ రంగు కంటే నీలం/ఊదా రంగు ఎక్కువగా వ్యాపిస్తుంది.

చంద్రుడు ఎరుపు రంగులో కనిపించడానికి కారణం "రేలీ స్కాటరింగ్" (Rayleigh Scattering) అనే ప్రక్రియ. ఇదే ప్రక్రియ కారణంగా ఆకాశం నీలం రంగులో, సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో సూర్యుడు ఎర్రని రంగులో కనిపిస్తాడు.

ఈ ప్రక్రియలో, తక్కువ తరంగదైర్ఘ్యం(వేవ్ లెంగ్త్) కలిగిన నీలి రంగు కాంతి వాయుకణాల ద్వారా ఎక్కువగా చెదిరిపోతాయి, అందువల్ల ఎరుపు రంగు కాంతి నేరుగా ముందుకు ప్రయాణించి మన కళ్లకు కనిపిస్తుంది.

చంద్రగ్రహణం సమయంలో సూర్యోదయం లేదా సూర్యాస్తమయంలో ఏర్పడిన ఎర్రటి కిరణాలు భూ వాతావరణం ద్వారా కాస్త వంగి, చంద్రుడి ఉపరితలానికి చేరుతాయి. అందుకే గ్రహణం సమయంలో చంద్రుడు మనకు ఎర్రగా కనిపిస్తాడు.

గ్రహణం సమయంలో భూ వాతావరణంలో మేఘాలు లేదా ధూళి ఎంత ఎక్కువగా ఉంటే, చంద్రుడు అంత ఎర్రగా కనిపిస్తాడు.

చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, ప్రకృతి, విశ్వం, అంతరిక్షం, ఖగోళం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చంద్రగ్రహణాన్ని బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్ ద్వారా చూడడం మంచిది.

గ్రహణాన్ని చూసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

చంద్రగ్రహణాలు వంటి ఖగోళ సంఘటనలను ప్రపంచవ్యాప్తంగా అనేక అబ్జర్వేటరీలు పర్యవేక్షిస్తాయి. దీనిని టెలిస్కోప్ ద్వారా చూడొచ్చు, లేదంటే కళ్లతో నేరుగా చూడొచ్చు.

మీ దగ్గర బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్ ఉంటే, వాటిని ఉపయోగించండి.

సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడటం హానికరం. కానీ, చంద్రకాంతి అంత ప్రకాశవంతంగా ఉండదు కాబట్టి, కళ్లతో చంద్రగ్రహణాన్ని చూడటంలో ఎలాంటి ప్రమాదం లేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)