ఆ 4 గ్రహశకలాలు భూమిని ఢీ కొంటాయా, సైంటిస్టులు ఏం చెబుతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూస్తున్నప్పుడో, లేదంటే భూమిని ఢీ కొంటాయనే వార్తలు వచ్చినప్పుడో ప్రజలు గ్రహశకలాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థలు, పరిశోధనా కేంద్రాలు వీటిని నిశితంగా గమనిస్తూ ఉంటాయి.
గ్రహశకలాలు అనేవి రాతి పదార్థాలతో తయారైన చిన్న ఖగోళ వస్తువులు. ఇవి సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థ ఏర్పడినప్పుడు మిగిలిన శిలారూప శేషాలు.
ఇలాంటి గ్రహశకలాలను ఇప్పటిదాకా పదిలక్షలకుపైగా గుర్తించారు. వీటిలో ఎక్కువ భాగం అంగారక, బృహస్పతి మధ్య ప్రాంతమైన 'మెయిన్ ఆస్టరాయిడ్ బెల్ట్'లో ఉన్నాయి.
ఈ గ్రహశకలాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి.
కానీ కొన్ని భూమికి దగ్గరగా వస్తాయి.
ఇవి జీవం పుట్టుకను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయని బ్రిటన్ లోని ఓపెన్ యూనివర్శిటీ ప్లానెటరీ అండ్ స్పేస్ సైన్సెస్ ప్రొఫెసర్ ఎమెరిటా మోనికా గ్రేడీ చెప్పారు.
"ఈ గ్రహశకలాలలో అనేక సేంద్రీయ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి జీవం ఏర్పడటానికి ముడి వనరులు కావచ్చు. జీవానికి అవసరమైన మూలకాలు గ్రహశకలాల ద్వారా భూమికి చేరడం వల్ల భూమిపై జీవం మొదలైందనే భావన కూడా ఉంది'' అని గ్రేడీ తెలిపారు.


ఫొటో సోర్స్, NASA/Ben Smegelsky
కొన్ని గ్రహశకలాలు భూమికి దగ్గరగా వచ్చే అవకాశం ఉండటంతో వాటిపై ఆసక్తి పెరుగుతోందని యూకేలోని ఏడిన్‌బ్రా యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీ రీసెర్చ్ ఫెలో అగాటా రోజెక్ చెప్పారు.
‘‘వాటి కక్ష్య గురించి మనకు స్పష్టమైన సమాచారం లభించే వరకు, అవి భూమిని ఢీకొనే అవకాశం ఉందా, ఏ సమయంలో ఢీకొనవచ్చో తెలుసుకోవడానికి వాటిని నిశితంగా పరిశీలిస్తాం’’ అని చెప్పారు.
"పెద్ద గ్రహశకలాలు ఎక్కడ ఉన్నాయో అవి ఏ దిశలో వెళుతున్నాయో మాకు కచ్చితంగా తెలుసు" అంటారు రోజెక్ . "మేం వాటి కదలికలను బాగా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు అసలైన ఆందోళన చిన్నవి, ఇంకా కనిపించని గ్రహశకలాల గురించే. వాటి కక్ష్యను ఇప్పటివరకు కచ్చితంగా అంచనా వేయలేకపోయాం'' అని పేర్కొన్నారు.
ప్రస్తుతం మూడు గ్రహశకలాలను పర్యవేక్షిస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటితో పాటు నాలుగో గ్రహశకలం కూడా ఉంది. దీని కోసం నాసా ప్రత్యేక మిషన్ ప్రారంభించింది.

ఫొటో సోర్స్, NASA
1) అపోఫిస్: 3 ఫుట్‌బాల్ మైదానాలంత సైజు
ఈజిప్టు పురాణాలలోని చీకటి శక్తికి ప్రతీకగా భావించే అపోఫిస్ పేరును 2004లో కనుగొన్న ఓ గ్రహశకలానికి పెట్టారు.
మొదట్లో అపోఫిస్ గ్రహశకలం భూమిని ఢీకొనే స్వల్ప అవకాశం ఉందని భావించారు. కానీ 'కనీసం మరో 100 ఏళ్ల వరకు అపోఫిస్ భూమిని ఢీకొనే ప్రమాదం లేదు' అని ఆ తరువాత నాసా స్పష్టం చేసింది.
"ఇది 2029 ఏప్రిల్ 13 న భూమికి కాస్త దూరంగా వెళుతుందని మాకు తెలుసు" అని అగాటా రోజెక్ చెప్పారు.
‘‘అపోఫిస్‌ను కనుగొన్నప్పటి నుంచి ముమ్మరంగా పర్యవేక్షిస్తుండటం వల్ల ఇది భూమికి చాలా దగ్గరగా వెళుతుందని తెలిసింది. ఇది దాదాపుగా మన జియోస్టేషనరీ ఉపగ్రహాలు ఎంత దూరంలో ఉన్నాయో అంతే దూరంలోకి వస్తుంది. భూమికి ఇంత దగ్గరగా రావడం ద్వారా ఈ గ్రహశకలం గురుత్వాకర్షణ శక్తి ప్రభావానికి లోనవుతుంది. దాని ఆకారం కూడా మారొచ్చని అనుకుంటున్నాం’’ అని రోజెక్ తెలిపారు.
ఈ గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చినప్పుడు భూ గురుత్వాకర్షణ కారణంగా దాని కక్ష్య ప్రభావితమవుతుందని నాసా తెలిపింది.
అపోఫిస్ సగటు వ్యాసం సుమారు 340 మీటర్లు, ఇది మూడు ఫుట్ బాల్ మైదానాలకు సమానం. ఇది భూ ఉపరితలానికి 32 వేల కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తుంది. ఇది మన కంటికి కూడా కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, ATLAS
2) 2024 YR4: ఇది చంద్రుడిని ఢీకొంటుందా?
నాసా అంచనా ప్రకారం '2024 వైఆర్-4' గ్రహశకలం పరిమాణం సుమారు 53 నుంచి 67 మీటర్లు అంటే 15 అంతస్తుల భవనం అంత పెద్దది. దీన్ని 2024లో గుర్తించారు. 2032లో ఇది భూమిని ఢీకొనే అవకాశం ఉందనే సమాచారంతో ఇటీవల వార్తల్లోకి వచ్చింది.
2024 వైఆర్-4 భూమిని ఢీకొనే అవకాశాలు 32 సార్లలో ఒక్కసారి ఉండొచ్చని కొందరు పరిశోధకులు ప్రాథమికంగా అంచనా వేశారు. కానీ ఈ అవకాశాన్ని నాసా తోసిపుచ్చింది.
ఒక గ్రహశకలం భూమిని ఢీకొట్టగలిగితే, అది ఢీకొనే అవకాశం ఎంత ఉందో నిర్ణయించడం అతిపెద్ద సవాలని మోనికా గ్రేడీ చెప్పారు. ఇందుకోసం దాని కక్ష్య, దిశను మరింత కచ్చితత్వంతో అర్థం చేసుకునేలా నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది.
అయితే, 2024 వైఆర్-4 చంద్రుడిని ఢీకొనే అవకాశం ఇంకా 3.8 శాతం ఉంది. కానీ, దీనివల్ల చంద్రుడి కక్ష్యపై ఎలాంటి ప్రభావం ఉండదని నాసా చెబుతోంది.

ఫొటో సోర్స్, NASA/Johns Hopkins APL/Steve Gribben
3) డిడిమోస్.. ఓ చిన్న చందమామ
డిడిమోస్ అనేది ఓ గ్రహశకలం. గ్రీకు భాషలో డిడిమోస్ అంటే ‘కవలలు’ అని అర్థం. డైమోర్ఫోస్ అనేది దాని చుట్టూ పరిభ్రమించే ఓ చిన్న చందమామ.
ఈ రెండు ఖగోళ వస్తువులు భూమికి ఎటువంటి ముప్పు కలిగించవని భావిస్తారు. కానీ అవి సాపేక్షంగా భూమికి సమీపంగా వెళతాయి.
వీటిని పరిశోధించడానికి 2022లో నాసా 'డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్' (డార్ట్) మిషన్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఓ చిన్న అంతరిక్ష యంత్రం డిమోర్పోస్‌ను ఢీకొని తనను తాను ధ్వంసం చేసుకుంది.
భవిష్యత్తులో ఏదైనా గ్రహశకలం భూమికి ప్రమాదం తెచ్చే అవకాశం ఉంటే, దాని మార్గాన్ని మార్చి భూమిని కాపాడవచ్చా అనేది పరీక్షించడమే ఈ ప్రయోగం ఉద్దేశం.
ఇక డిడిమోస్, డైమోర్ఫోస్‌ను ఈ ప్రయోగం కోసం ప్రత్యేకంగా ఎంపిక చేయడానికి కారణం అవి భూమార్గంలో లేకపోవడమే. అంటే అవి భూమిని ఢీకొట్టే ప్రమాదం లేదన్నమాట. పైగా వీటి కక్ష్యంలో ఏదైనా మార్పు జరిగినా భూమికి ఎలాంటి ప్రమాదం కలగదు.

ఫొటో సోర్స్, NASA
4) సైకి: భూ కేంద్రకం గుట్టు విప్పొచ్చు
'సైకి' గ్రహశకలాన్ని 1852లో కనుగొన్నారు. దీనిని ప్రధాన గ్రహశకలం బెల్ట్‌లోని అత్యంత ఆసక్తికరమైన వస్తువులలో ఒకటిగా పరిగణిస్తారని నాసా చెబుతోంది. గ్రీకు పురాణాలలో ఆత్మకు ప్రతీకగా చూసే ‘సైకి’ దేవత పేరును ఈ గ్రహశకలానికి పెట్టారు.
ఈ శకలం మనకు చాలా దూరంగా అంగారక , బృహస్పతి గ్రహాల మధ్య సూర్యుడి చుట్టూ తిరుగుతుంటుంది. ఈ గ్రహశకలం ప్రధానంగా లోహం, రాళ్లతో తయారైందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
సైకిలో ఉన్న చాలా లోహాలు బహుశా గ్రహాల కేంద్రభాగం నుంచి వచ్చాయని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. అంటే గ్రహాల నిర్మాణం తొలి దశలో ఏర్పడిన ఖగోళ వస్తువుగా భావిస్తున్నారు. దీనిని అధ్యయనం చేయడం ద్వారా, భూమి, ఇతర గ్రహాల కేంద్రకాలు ఎలా ఏర్పడ్డాయో అర్థం చేసుకోవడానికి సాయపడుతుందని భావిస్తున్నారు.
ఈ గ్రహశకలాన్ని అధ్యయనం చేయడానికి నాసా 2023 లో ఒక ప్రత్యేక మిషన్‌ను ప్రారంభించింది.
ఇక ఈ నెల మొదట్లో వెరా రూబిన్ అబ్జర్వేటరీకి చెందిన కొత్త టెలిస్కోప్ కేవలం 10 గంటల్లో 2000 కి పైగా కొత్త గ్రహశకలాలు, భూమికి దగ్గరగా ఉన్న ఏడు వస్తువులను గుర్తించినట్లు వెల్లడించింది.
సాధారణంగా, భూమిపైన ఉండే అన్ని పరిశోధనా సంస్థలు, అంతరిక్ష అబ్జర్వేటరీలు కలిసి ఏటా 20 వేల గ్రహశకలాలను కనుగొంటూ ఉంటాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














