వాస్కో డి గామా: భారత్‌కు సముద్ర మార్గం కనుగొన్న ఈ పోర్చుగీస్ నావికుడు అత్యంత క్రూరుడా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సిరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘పోర్చుగీస్ రాజ్యంలో కేలు పెరిగాడు. అతని మనసులో ఒక ఆశయం పాతుకుపోయింది. అది వాస్కో రక్తం’’
మలయాళం చిత్రం 'ఉరుమీ'లో.. హీరో పాత్ర ‘చిరక్కాల్ కేలు’ పరిచయానికి ముందు వచ్చే ఈ డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాలో కేలు జీవిత లక్ష్యం పోర్చుగీస్ నావికుడు వాస్కో డి గామాను హతమార్చడమే.
దీన్ని సాధించడం కోసం హీరో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటాడు.
విప్లవ సైన్యాన్ని పోగు చేస్తాడు. పోర్చుగీస్ సైన్యంపై పోరాడే సమయంలో తన ప్రాణ స్నేహితుడిని కోల్పోతాడు.
పోర్చుగీస్ నావికుడు వాస్కో డి గామాను చంపాలని ప్రయత్నించే 'చిరక్కాల్ కేలు' కల్పిత పాత్ర అయినప్పటికీ, దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ పాత్రలో పృథ్వీరాజ్ నటించాడు. కేరళలో 'ఉరుమీ' చిత్రం విడుదలైనప్పుడు అనూహ్య విజయం సాధించింది.
మలయాళ చిత్రాల్లో, జానపద గేయాల్లో, కథల్లో, కేరళ చరిత్ర పేజీల్లో భారత్‌కు సముద్ర మార్గాన్ని కనుగొన్న వాస్కో డి గామాను ఒక విలన్‌గా పేర్కొంటారు.
1497 మార్చి 25న పోర్చుగల్‌లోని లిస్బన్ నుంచి భారత్‌కు వాస్కో డి గామా సముద్ర యాత్ర ప్రారంభించారు.
ఎన్నో నెలల పాటు సాగిన సముద్రయానం తర్వాత భారత్‌కు చేరుకున్న తొలి యూరోపియన్ వాస్కో డి గామానే.
ఐరోపా చరిత్రలో వాస్కో డి గామాను ఒక 'హీరో'గా వర్ణిస్తుంటారు.
భారత్‌లో కొన్ని పాఠ్యపుస్తకాల్లోనూ వాస్కో డి గామా భారత వాణిజ్య సముద్ర యాత్రల గురించి సమాచారం అందుబాటులో ఉంది.

భారత్‌ను చేరుకోవాలనే ఐరోపా కల
'' భారత్‌తో ఐరోపాకు నేరుగా సంబంధాలను ఏర్పరిచిన వాస్కో డి గామా, దృఢమైన శరీరాకృతి, కఠినమైన స్వభావం ఉన్న వ్యక్తి. నిరక్షరాస్యుడు, క్రూరుడు, హింసాత్మక స్వభావం ఉన్నవాడు అయినప్పటికీ.. నమ్మకమైన, నిర్భయమైన వ్యక్తిగా ఆయనకు పేరు. భారత యాత్రకు నేతృత్వం వహించే అవకాశం ఆయనకు దక్కింది. ఇలాంటి క్లిష్టమైన పనిని ఒక సౌమ్యుడైన నాయకుడు పూర్తి చేయలేడు'' అని వాస్కో డి గామా గురించి ' ది గ్రేట్ డిస్కవరీస్' అనే పుస్తకంలో అమెరికా చరిత్రకారుడు చార్లెస్ ఈ. నోవెల్ రాశారు.
భారత్‌ను చేరుకోవాలనే పోర్చుగీస్ వారి కలను సాధ్య చేసే పనిని 1497 జనవరిలో వాస్కో డి గామాకు పోర్చుగల్ రాజు మాన్యువల్ 1 అప్పగించారు.
''భారత్‌ను తొలిసారి ఎవరు చేరుకుంటారనే పందెం అప్పటికే యూరోపియన్ దేశాల్లో శతాబ్దాలుగా సాగుతోంది. చిన్న దేశమైన పోర్చుగల్ సైతం తన శాయశక్తులా ప్రయత్నించేందుకు సిద్ధమైంది.'' అని రాశారు.
అయితే, అంతకుముందు అరబ్‌లు, పర్షియన్లు భారత్‌లో ట్రేడింగ్ పోస్టులను ఏర్పాటు చేశారు.
భారత్‌లోని దక్షిణాది ప్రాంతమైన మలబార్ (ఇప్పటి కేరళ)లోని ముస్లిం వర్తకుల నుంచి మసాలాలను (సుగంధ ద్రవ్యాలను) తొలిసారి ఐరోపా పొందింది.
''పోర్చుగీస్ వారు రావడానికి ముందు గుజరాత్, మలబార్, ఎర్ర సముద్రంలోని నౌకాశ్రయాలతో పాటు హిందూ మహా సముద్రంలో ఇస్లామిక్ సముద్ర వర్తకులు ఆధిపత్యం చెలాయించేవారు'' అని ది మొఘల్ ఎంపైర్‌లో జాన్ ఎఫ్. రిచర్డ్స్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
''1492లో కొలంబస్ అమెరికాలో కాలు మోపారు. ఆయన చనిపోయేంత వరకు కూడా, ఆసియాలో కొంత భాగాన్ని కనుగొన్నానని, దానికి దగ్గర్లోనే భారత్ ఉందని ఒప్పించేందుకు ప్రయత్నం చేశారు. అందుకే, తాను వెళ్లిన ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను ఆయన భారతీయులు అని పిలిచారు.'' అని 'ది వాయేజస్ అండ్ అడ్వెంచర్స్ ఆఫ్ వాస్కో డి గామా' అనే పుస్తకంలో జార్జ్ ఎం. డాలీ రాశారు.
దీంతో, యూరోపియన్లు భారత్‌ను కనుగొనేందుకు ఆసక్తి చూపారని తెలిపారు.
ఆసియాను ముఖ్యంగా భారత్‌ను మసాలాలు, దినుసులు పుష్కలంగా లభించే ప్రాంతంగా పరిగణించేవారు.
అంతేకాక మిరియాలు, బంగారం, డైమండ్లు, రత్నాలు వంటి విలువైన వస్తువులు లభించే ప్రాంతంగా కూడా చూశారు.
విలియం లోగాన్ రాసిన 'మలబార్ మాన్యువల్' పుస్తకంలో.. 1497లో భారత్‌కు బయలుదేరిన వాస్కో డి గామా సముద్ర యాత్రలో సావో రాఫెల్, సావో గాబ్రియల్, సావో మిగ్యుల్ అనే మూడు ఓడలు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఓడలో అధికారులు, నావికులు, వారికి సహకరించే సిబ్బంది ఉన్నట్లు తెలిపారు.
అయితే, భారత్‌కు వాస్కో డి గామా చేరుకున్నప్పుడు, చాలా తక్కువ మందితోనే ఇక్కడకు వచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో కాలుమోపిన తొలి యూరోపియన్ ఎవరు?
వేల కిలోమీటర్లు ప్రయాణం చేసిన వాస్కో డి గామా తన బృందంతో కలిసి 1498 మే 20న కేరళకు చేరుకున్నప్పుడు, తీరానికి కొద్ది దూరంలోనే సముద్రంలో ఈ ఓడలకు లంగరు వేశారు.
వాస్కో డి గామా నావికుల బృందం భారత్‌లోని కోజికోడ్ (కాలికట్) జిల్లాలోని కప్పడ్ గ్రామానికి వచ్చినట్లు చరిత్రలో చెప్పినప్పటికీ, భారత చరిత్రకారుడు, విద్యావేత్త ఎం.జీ.ఎస్ నారాయణన్ మాత్రం వారు తొలుత కొల్లాం జిల్లాకు సమీపంలోని పాండలయని అనే ప్రాంతానికి వెళ్లినట్లు చెప్పారు.
మలబార్ తీరంలోని నాలుగు చిన్న పడవలు వాస్కో డి గామా ఓడల దగ్గరకు వెళ్లి, వారి గురించి ఆరా తీశారు. 'వాస్కో ఏ దేశానికి చెందిన వ్యక్తి?' అని ప్రశ్నించారు.
వాస్తవంగా చెప్పాలంటే.. భారత్‌లో కాలుమోపిన తొలి యూరోపియన్ వాస్కో డి గామా కాకపోవచ్చు.
ఎందుకంటే, ఓడలకు లంగరు వేసిన తర్వాత, అరబిక్, హిబ్రూ తెలిసిన ఒకరిని వాస్కో డి గామా మలబార్ పడవలతో పాటు తీరానికి పంపారు.'' అని 'వాస్కో డి గామా: ది సీ రూట్ టూ ఇండియా' అనే పుస్తకంలో పేర్కొన్నారు.
అలా చూస్తే, మలబార్ తీరానికి వచ్చిన తొలి యూరోపియన్ అరబిక్, హిబ్రూ తెలిసిన క్రైస్తవుడు జోవావ్ న్యూనెజ్ కావొచ్చనే వాదన ఉంది. కానీ, ఆ విషయం ధ్రువీకరించేందుకు సరైన ఆధారాలు లేవు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌కు తొలి ప్రయాణంలో నిరాశే..
కేరళ తీరంలో కాలు మోపిన వాస్కో డి గామా ట్రాన్స్‌లేటర్‌ను ఆ ప్రాంతంలోని ఇద్దరు అరబ్‌ల వద్దకు తీసుకెళ్లారు. వారు ఆయన్ను శత్రువుగా చూశారు.
''నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు?'' అని అడిగారు.
వారి ప్రశ్నకు స్పందించిన వాస్కో డి గామా ట్రాన్స్‌లేటర్, ''క్రైస్తవులు, మసాలాలను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం'' అని ఆయన చెప్పారు.
భారత్‌కు వచ్చిన తొలి యూరోపియన్‌కు, అప్పటికే ఇక్కడ వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేసుకున్న అరబ్‌లకు మధ్య సంభాషణ ఇలా సాగిందని చాలా చరిత్ర పాఠ్యపుస్తకాల్లో పేర్కొన్నారు.
ఆ తర్వాత, వాస్కో డి గామా కొంతమందిని తీసుకుని ఓడల్లో తీర ప్రాంతంలో అడుగు పెట్టారు. మిగిలిన వారిని ఓడల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మలబార్ తీరానికి చేరుకున్న వారికి సాదర స్వాగతం లభించింది.
అయితే, వాస్కో డి గామా భారత్‌కు చేసిన తొలి సముద్ర యాత్ర ఆయన ఆశించిన విధంగా విజయవంతం కాలేదు.
కాలికట్‌లో జమోరిన్‌కు (కోజికోడ్ హిందూ రాజుకు ఉపయోగించే పోర్చుగీస్ పదం) ఆయన ఇచ్చిన బహుమతులు చూసి వారు ఆగ్రహించారు.
మసాలాల వాణిజ్యంలో అగ్రస్థానంలో ఉన్న అరబ్ ముస్లింలు.. పోర్చుగీస్ వారి రాకను అడ్డుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'' మిరియాల వాణిజ్యంలో గుత్తాధిపత్యాన్ని పోర్చుగీస్ వారు కోరుకున్నప్పుడు, జమోరిన్ దానికి ఒప్పుకోలేదు. అప్పటికి ముస్లింలు మిరియాల వాణిజ్యంలో ఉండేవారు. ఆ తర్వాత, పోర్చుగీస్ వారు కొచ్చిన్ రాజ్యాన్ని ఆశ్రయించారు. వాణిజ్యం కోసం అక్కడ ఒక దుకాణాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యానికి దగ్గరగా ఉన్నకారణంగా దాన్ని గోవాకు మార్చారు'' అని చరిత్రకారుడు ఎం.జి.ఎస్ నారాయణన్ ఆంగ్ల పత్రిక ‘ది హిందూ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
ఆ తర్వాత 1499లో మసాలాలతో ఉన్న ఒక చిన్న కన్‌సైన్‌మెంట్‌తో ఐరోపా వెళ్లారు వాస్కో డి గామా. వారికి పోర్చుగల్‌లో ఘన స్వాగతం లభించింది.
'' భారత్ తొలి సముద్రయాత్ర చేసి తీసుకొచ్చిన మసాలాలను వాస్కో డి గామా భారీ లాభంతో విక్రయించారు. సముద్రయానానికి అయిన ఖర్చు కంటే అత్యధికంగా సంపాదించారు'' అని 'ఆసియా, వెస్ట్రన్ డొమినియన్స్'లో ('Asia and Western Dominions') కె.ఎం పానికర్ రాశారు.
భారత్‌కున్న సామర్థ్యాన్ని పోర్చుగీస్ వారు అర్థం చేసుకున్న క్షణమిదే.

ఫొటో సోర్స్, Getty Images
వాస్కో డి గామా రెండోసారి సముద్ర యాత్ర
1497-1499 మధ్య భారత్‌కు వాస్కో డి గామా తొలిసారి చేపట్టిన సముద్ర యాత్రలో భారత్-ఐరోపా మధ్య సముద్ర మార్గాన్ని కనిపెట్టారు.
అయితే, కేరళకు చెందిన కాలికట్ రాజ్యంతో బలమైన వాణిజ్య సంబంధాన్ని కుదుర్చుకోవడంలో విఫలమయ్యారు.
'' కాలికట్‌లోని ముస్లిం వర్తకులను కేవలం ఆర్థిక పోటీదారులుగా మాత్రమే కాక, మతపరమైన, సాంస్కృతిక శత్రువులుగా కూడా వాస్కో డి గామా చూశారు. జమోరిన్ ఆస్థానంలో వారి ప్రభావం పోర్చుగీస్ వారి లక్ష్యాలకు ముప్పుగా పరిగణించారు'' అని చరిత్రకారుడు సంజయ్ సుబ్రమణియం తన పుస్తకం 'ది కెరీర్ అండ్ లెజెండ్ ఆఫ్ వాస్కో డి గామా'లో రాశారు.
ఈ ముప్పును అధిగమించేందుకు, పోర్చుగీస్ ప్రభుత్వం రెండోసారి భారత్‌కు సముద్ర యాత్రను చేపట్టింది. ఈసారి వారి ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది.
'' భారత్‌లో పోర్చుగీస్ ఆధిపత్యాన్ని ఏర్పాటు చేయాలి. మొదటి ప్రయాణంలో జరిగిన అపజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలి. మసాలాల వాణిజ్యంలో గుత్తాధిపత్యం సాధించాలి'' ఇది పోర్చుగీస్ వారి లక్ష్యం.
20 యుద్ధ నౌకలు, 1500 మందితో 1502 ఫిబ్రవరిలో వాస్కో డి గామా మళ్లీ లిస్బన్ నుంచి బయలుదేరారు.
యుద్ధానికి సిద్ధమనే రీతిలో ఫిరంగులు వంటి పరికరాలతో ఈ సముద్ర యాత్ర చేశారు.
అదే ఏడాది సెప్టెంబర్ 11న వాస్కో డి గామా బృందం కేరళలోని కన్నూర్ తీరానికి చేరుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
వాస్కో డి గామా బృందంలోని ఒక సభ్యుడు ''ది జర్నల్ ఆఫ్ ది ఫస్ట్ వాయేజ్ ఆఫ్ వాస్కో డి గామా టూ ఇండియా' అనే తన పుస్తకంలో ఆ తర్వాత జరిగిన పరిణామాలను వివరించారు.
''మక్కాకు చెందిన నౌకలను మేం చూశాం. మా దేశం పోర్చుగల్‌కు మసాలాలు తీసుకుని వస్తున్నాయి. భారత్ నుంచి నేరుగా ఈ మసాలాలను ఇక నుంచి పోర్చుగల్ రాజు మాత్రమే తీసుకోవాలనే ఉద్దేశంతో మేం ఆ నౌకలను నీటిలో ముంచేశాం. ఆ తర్వాత 380 మంది పురుషులు, చాలా మంది మహిళలు, పిల్లలతో మక్కా వెళ్తోన్న నౌకను మేం అడ్డగించి, బందీగా తీసుకున్నాం. కనీసం 12 వేల డ్యుకట్స్ (డ్యుకట్ అంటే గోల్డ్ కాయిన్)ను దోచుకున్నాం. పలు విలువైన వస్తువులను దొంగలించాం. అక్టోబర్ 1న నౌకను, దానిలో ఉన్న వారందర్ని కాల్చేశాం'' అని రాశారు.
ఇక్కడ ప్రస్తావించిన మక్కా నౌక 'మీరీ' అనే అతిపెద్ద నౌక.
కోజికోడ్ ప్రాంతంలో నివసించే ఖోజా కాసిమ్ అనే సంపన్నుడి సోదరుడికి చెందినది ఈ నౌక అని చరిత్రకారుడు కే.ఎం పానికర్ చెప్పారు.
ఆ నౌకను పట్టుకుని నిప్పంటించాలని చెప్పినప్పుడు, దానిలో హజ్ యాత్రకు వెళ్తోన్న చాలామంది మహిళలు, పిల్లలు, పెద్ద వారు, వాణిజ్యం కోసం తీసుకెళ్తోన్న విలువైన వస్తువులు ఉన్నాయి.
మలబార్ తీరంలో ఇప్పటికీ మీరీ నౌక ధ్వంసం గురించిన వివరాలు ఉన్నాయి. వాస్కో డి గామా చేసిన విధ్వంసంతో ఆ ప్రాంతంలో పోర్చుగీసు వారంటే ఒక భయం ఏర్పడింది.
వాస్కో డి గామా సైన్యం చేసిన ఈ చర్య కొంతమంది పోర్చుగీస్ సమకాలీనులను కూడా విస్మయానికి గురిచేసింది. కేరళ చరిత్రలో వాస్కో డి గామాను విలన్‌గా గుర్తుంచుకోవడానికి ఇది ప్రధాన కారణాలలో ఒకటిగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
పలు రాజ్యాలుగా కేరళ విభజన
ఆ సమయంలో కేరళ పలు రాజ్యాలుగా విడిపోయింది. ఇది పోర్చుగీస్ వారి ఆధిపత్యం పెరిగేందుకు సహకరించింది. ఉదాహరణకు మీరీ నౌక దహనం తర్వాత కన్నూర్ రాజా వాస్కో బలగాలకు స్వాగతం పలికారు. ఈ విషయాన్ని 'ది జర్నల్ ఆఫ్ ది ఫస్ట్ వాయేజ్ ఆఫ్ వాస్కో డి గామా టూ ఇండియా'లో ప్రస్తావించారు.
''అక్టోబర్ 20న కన్నూర్‌కు మేం వెళ్లాం. అక్కడున్న అన్ని రకాల మసాలాలను మేం కొనుగోలు చేశాం'' అని ఆ పుస్తకంలో రాశారు. ఆ తర్వాత కాలికట్ వెళ్లిన వాస్కో డి గామా సైన్యం, నగరంలోని ముస్లిం వర్తకులందర్ని బహిష్కరించాలని, పోర్చుగీస్ వారి గుత్తాధిపత్య వాణిజ్యానికి ఒప్పుకోవాలని జమోరిన్ అనే అక్కడి రాజును డిమాండ్ చేశారు.
అయితే, స్వేచ్చా వాణిజ్యానికి మద్దతు ఇచ్చే జమోరిన్ మాత్రం ఆ డిమాండ్‌కు ఒప్పుకోలేదు. దీంతో కాలికట్ నగరంపై వాస్కో డి గామా దాడి చేశారు.
''నగరానికి మా బలగాలను తరలించాం. వారితో మూడు రోజుల పాటు యుద్ధం చేశాం. పెద్ద సంఖ్యలో ప్రజల్ని బందీగా తీసుకున్నాం. నౌకల యార్డులలో వారిని ఉరితీశాం. వారిని తీవ్రంగా హింసించాం. వారి చేతుల్ని, కాళ్లను, తలలను నరికాం'' అని ది జర్నల్ ఆఫ్ ఫస్ట్ వాయేజ్ ఆఫ్ వాస్కో డి గామా టూ ఇండియా పుస్తకంలో ఈ బృందంలోని సభ్యుడు పేర్కొన్నారు.
ఇలా పలు హింసాత్మక చర్యలతో 'శత్రువుకు శత్రువు, మిత్రుడు' అనే సిద్ధాంతంపై ఇతర కేరళ రాజులతో కలిసి పోర్చుగీస్ వారు కేరళలో తమ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకున్నారు.
భారత్‌లో ఐరోపా వలస పాలను తీసుకొచ్చేందుకు వాస్కో డి గామా చేసిన ప్రయాణం, ఆయన చర్యలు పెద్ద ఎత్తున విమర్శలు గురవుతుంటాయి.
మూడోసారి 1524లో వాస్కో డి గామా కేరళకు వచ్చారు. ఆ ఏడాది భారత్‌కు పోర్చుగల్ వైస్రాయ్‌గా వాస్కో డి గామా నియమితులయ్యారు.
కొచ్చి వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురై 1524 డిసెంబర్ 24న మరణించారు. 1539 చివరిలో ఆయన మృతదేహాన్ని పోర్చుగల్ తీసుకెళ్లి, అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














