హల్దీఘాటీ యుద్ధంపై రాజస్థాన్ డిప్యూటీ సీఎం ఏమన్నారు? మహారాణా ప్రతాప్ ‘గెలుపు-ఓటమి’పై చరిత్రకారులు ఏం చెబుతున్నారు?

ఫొటో సోర్స్, ANI/RAJIV LOCHAN
హల్దీఘాటీ యుద్ధంపై, మహారాణా ప్రతాప్‌పై రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి దియా కుమారి చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి తెరలేపాయి.
జైపుర్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన దియా కుమారి, '' హల్దీఘాటీ యుద్ధంలో మహారాణా ప్రతాప్ ఓడిపోయినట్లు శాసనంలో రాసి ఉంది. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆ శాసనాన్ని మార్చాను. నేడు మహారాణా ప్రతాప్ ఈ యుద్ధంలో గెలుపొందినట్లు రాసి ఉంటుంది. నా పదవీ కాలంలో సాధించిన అతిపెద్ద విజయం ఇది'' అని చెప్పుకొచ్చారు.
దీనికి అప్పటి సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ నుంచి తనకు మద్దతు దొరికిందని దియా కుమారి ప్రస్తావించారు.
అర్జున్ రామ్ మేఘ్‌వాల్ కూడా రాజస్థాన్‌కు చెందినవారు.
అంతకుముందు రాసిన రాతి ఫలకాన్ని తొలగించాలని ఆయన ఆదేశించారని చెప్పారు.

వాస్తవానికి 2021లోనే రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలోని రక్తతలాయి నుంచి వివాదాస్పదమైన రాతి ఫలకాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తొలగించింది.
దానిపై 1576లో జరిగిన హల్దీఘాట్ యుద్ధంలో మహారాణా ప్రతాప్ సైన్యం వెనుదిరగాల్సి వచ్చిందని రాసి ఉంది.
దియా కుమారి తాజా వ్యాఖ్యలపై మరోసారి వివాదం చెలరేగింది.
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇలా రాశారు. ‘‘హకీమ్ ఖాన్ సూర్‌తో మీ పూర్వీకులు రాజా మాన్ సింగ్ యుద్ధం చేసి హల్దీఘాట్‌ను గెలుచుకున్నారు. ఒక రాజపుత్ర సేనాధిపతి ఒక ముస్లిం కమాండర్‌ను ఓడించారు. మళ్లీ మీరు చరిత్రను ఎందుకు తిరగరాయాలనుకుంటున్నారు?’’ అని ప్రశ్నించారు.
హల్దీఘాట్ యుద్ధంలో మొగల్ చక్రవర్తి అక్బర్ తరఫున జనరల్ మాన్ సింగ్, మహారాణా ప్రతాప్ వైపున హకీమ్ ఖాన్ సూర్ పోరాడారు.
హల్దీఘాట్ యుద్ధంలో మొగలులకు వ్యతిరేకంగా మహారాణా ప్రతాప్‌తో పాటు హకీమ్ ఖాన్ సూర్ కూడా పోరాడారని ఈ ఏడాది ఏప్రిల్‌లో బీజేపీ సీనియర్ నేత, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, SM Viral Image
రాతి ఫలకంపై ఏం ఉంది?
తొలగించిన రక్తతలాయి రాతి ఫలకపు శాసనంపై.. '' వ్యవహారిక భాషలో ఖూన్ కీ తలాయిగా పిలుచుకునే రక్తతలాయి బనాస్‌కు మరోవైపున్న విశాలమైన క్షేత్రం. షాహి, ప్రతాప్ సైన్యం మధ్యలో భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధానికి గుర్రం, ఏనుగుపై స్వారీ చేస్తూ మహారాణా ప్రతాప్, మాన్ సింగ్‌లు సారథ్యం వహించారు. ఈ యుద్ధం చాలా భీకరంగా జరిగింది. యుద్ధ క్షేత్రమంతా శవాలతోనే నిండింది. అలాంటి పరిస్థితుల్లో ప్రతాప్ సైన్యం వెనుదిరగాల్సి వచ్చింది. 1576 జూన్ 21న యుద్ధం ముగిసింది'' అని రాసి ఉంది.
ఈ శాసనాన్ని తొలగించాలని దియా కుమారి అప్పట్లో డిమాండ్ చేశారు.
ఈ శాసనాన్ని తొలగించే సమయంలో 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్'తో మాట్లాడిన ఏఎస్ఐ జోధ్‌పుర్ సర్కిల్ సూపరింటెండెంట్ బిపిన్ చంద్ర నేగి.. ‘‘1975లో ఇందిరా గాంధీ ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు, చేతక్ సమాధి, బాద్‌షా బాగ్, రక్తతలాయి, హల్దీఘాట్ ప్రాంతాలలో ఈ రాతి ఫలకాలను ఏర్పాటు చేశారు. ఈ సమయంలో ఈ స్మారక చిహ్నాలు కేంద్ర పర్యవేక్షణలో ఉండేవి కావు. ఈ ప్రాంతాలను 2003లో స్మారక ప్రాంతాలుగా ప్రకటించారు. కానీ, ఈ సమాచారం ఈ రాతి ఫలకాలపై లేదు. చాలాకాలంగా ఇవి పాతపడిపోయాయి. దీంతోపాటు తేదీ, వాస్తవాలకు సంబంధించి వివాదాలు ఉన్నాయి’’ అని చెప్పారు.
''ఈ రాతి ఫలకాలపై ఉన్న శాసనాలను తొలగించాల్సిందిగా చరిత్రకారులు, ప్రజా ప్రతినిధుల నుంచి చాలా అభ్యర్థనలు వస్తున్నాయి. వీటి పరిగణనలోకి తీసుకుని, నేను సుమోటోగా తీసుకున్నాను'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, NARAYAN BARETH
ఎనిమిదేళ్ల క్రితమే పాఠ్యాంశాల్లో మార్పు
2017లోనే హల్దీఘాట్ యుద్ధానికి సంబంధించిన రాజస్థాన్ బోర్డ్ పుస్తకాల్లో పాఠ్యాంశాలను మార్చారు. ఇది వివాదానికి దారితీసింది.
ఆ సమయంలో రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది.
2017-18లో విద్యార్థుల సిలబస్‌లో కొత్త సోషల్ సైన్స్ పుస్తకాన్ని చేర్చినట్లు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.
పుస్తకంలో ఈ చాప్టర్‌ను రాసిన చంద్రశేఖర్ శర్మ.. ''మేవార్ రాజపుత్ర రాజు మహారాణా ప్రతాప్ ఈ యుద్ధంలో అనుకూలమైన ఫలితాన్ని సాధించారని చాలా ఆధారాలు చెబుతున్నాయి'' అని చెప్పారు.
ఈ యుద్ధంలో అక్బర్‌ను మహారాణా ప్రతాప్ ఓడించినట్లు పుస్తకంలో ఎక్కడా నేరుగా రాయలేదని రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ బీఎల్ చౌధురి బీబీసీతో చెప్పారు.
‘‘కొంతమంది చరిత్రకారులు ఈ యుద్ధాన్ని ఫలితం తేలని యుద్ధంగా చెబుతుంటారు. ఫలితాన్ని సమీక్షించేందుకు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. మహారాణా ప్రతాప్‌ను బతికుండగానే పట్టుకోవాలన్నది అక్బర్ లక్ష్యం. రెండోది మొగల్ సామ్రాజ్యంలో మేవార్‌ను విలీనం చేసుకోవాలనుకున్నారు. ఈ రెండు లక్ష్యాలను అక్బర్ సాధించలేకపోయారు. ఇవి అక్బర్ హల్దీఘాట్ యుద్ధంలో గెలవలేదన్నది నిరూపిస్తున్నాయి. అక్బర్‌కు మాన్ సింగ్, అసిఫ్ ఖాన్‌లపై కోపం వచ్చింది. మేవార్ సైన్యాన్ని మొగల్‌లు వెంబడించలేదు. హల్దీఘాట్ యుద్ధ ఫలితంలో మహారాణా ప్రతాప్‌కు అనుకూలంగా నిలిచిన అంశాలివే'' అని తెలిపారు.
అప్పట్లో ఈ వార్త సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందింది. ''450 ఏళ్ల తర్వాత, మహారాణా ప్రతాప్ ఎట్టకేలకు అక్బర్‌ను ఓడించాడు'' అని చాలామంది ప్రజలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఫొటో సోర్స్, Getty Images
హల్దీఘాట్ యుద్ధం
అబ్దుల్ ఖాదిర్ బదాయూనీకి చెందిన 'మన్‌తఖబ్-ఉత్-తవారీఖ్', నిజాముద్దీన్‌కు చెందిన 'తబాఖత్-ఏ-అక్బరీ', అబ్దుల్ ఫజల్‌కు చెందిన 'అక్బరనామా'లు హల్దీఘాట్ యుద్ధంపై విస్తృతమైన వివరణ ఇచ్చాయి.
చరిత్రకారుల ప్రకారం.. హల్దీఘాట్ యుద్ధం 1576 జూన్ 21న జరిగింది. మొగల్ సైన్యానికి రాజా మాన్ సింగ్ నేతృత్వం వహించారు.
తొలుత, రాజపుత్రులు మొగలులను జయిస్తున్నట్లు అనిపించినా.. అక్బర్ స్వయంగా యుద్ధంలో పాల్గొంటున్నారనే వదంతి రాజపుత్రుల మనోధైర్యాన్ని దెబ్బతీసింది.
ఈ యుద్ధంలో మేవార్ సైన్యానికి చెందిన ప్రధాన ఏనుగు సంరక్షకుడు రామ్ ప్రసాద్ మరణించారు.
'మహారాణా ప్రతాప్ – ది ఇన్విన్సిబుల్ వారియర్' రచయిత రీమా హూజా రాసిన వివరాల ప్రకారం.. ‘‘మహారాణా ప్రతాప్, మాన్ సింగ్‌ల మధ్య భీకర యుద్దం జరిగింది. మాన్ సింగ్ ఏనుగు తొండంలో చిక్కుకున్న కత్తి కారణంగా ప్రతాప్ గుర్రం చేతక్ తీవ్రంగా గాయపడింది’’.
''మహారాణా ప్రతాప్ యుద్ధ భూమిని వదిలిపెట్టాలని, మేవార్ సైన్యానికి చెందిన జనరల్స్ వెనుదిరగాలని నిర్ణయించుకున్నారు. ఆరోజే యుద్ధం ముగిసింది'' అని రాశారు.

ఫొటో సోర్స్, RAJIV LOCHAN
ఎందుకీ వివాదం?
మొగలులకు స్పష్టమైన గెలుపుగా హల్దీఘాట్ యుద్ధాన్ని చెప్పలేం. అబ్దుల్ ఫజల్ వంటి ఆనాటి చాలామంది చరిత్రకారులు ఈ యుద్ధ ఫలితం అక్బర్‌కు సంతోషాన్ని ఇవ్వలేదని రాశారు.
చాలాకాలం ఈ యుద్ధ జనరల్స్ అయిన మాన్ సింగ్, అసిఫ్ ఖాన్, ఖాజీ ఖాన్‌లు ఆయన ఆస్థానంలో కనిపించేందుకు అక్బర్ అంగీకరించలేదని రాశారు.
హల్దీఘాట్ యుద్ధం తర్వాత, మహారాణా ప్రతాప్ అక్బర్ సైన్యంపై గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించారు. మొగలులపై దాడి చేసి అడవుల్లోకి వెళ్లిపోయేవారు.
సుమారు రెండు దశాబ్దాల పాటు ఇలానే ఆయన యుద్ధాలను కొనసాగించారు. 1596లో వేట సమయంలో గాయపడ్డ ఆయన ఆ తర్వాత రెండేళ్లకు 57 ఏళ్ల వయసులో మరణించారు.
మహారాణా ప్రతాప్, మేవార్‌పై అక్బర్ ఎన్నడూ స్పష్టమైన విజయాన్ని సాధించలేదని చాలామంది రైట్ వింగ్ చరిత్రకారులు నమ్ముతారు.
ప్రతాప్‌కు అనుకూలంగా హల్దీఘాట్ యుద్ధ ఫలితం వచ్చిందని విశ్వసిస్తారు.
డాక్టర్ రామ్ పునియాని వంటి చరిత్రకారులు ఈ యుద్ధాన్ని ఇద్దరు రాజుల యుద్ధంగా వర్ణించారు.
''హిందువులు, ముస్లింల మధ్య జరిగిన యుద్ధం ఇది. కానీ, రాజా మాన్ సింగ్, అక్బర్ కొడుకు సలీమ్‌లు అక్బర్ తరఫున పోరాడారు. హకీమ్ ఖాన్ సూర్ రాణా ప్రతాప్‌తో కలిసి యుద్ధం చేశారు. ఇది మత పోరాటం కాదు. కానీ, అధికారం కోసం చేసిన యుద్ధం ఇది'' అని రామ్ పునియాని రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














