రాణా సంగా: ఒంటి కన్ను, ఒంటి చేయి, పని చేయని కాలుతో బాబర్‌పై యుద్ధం చేసిన ఈ రాజు ఎవరు? చివరికి ఆస్థానంలో ఉన్నవారే ఆయన్ను విషంతో చంపేశారా?

ఫొటో సోర్స్, RAJASTHAN TOURISM
- రచయిత, రెహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
15వ శతాబ్దంలో మేవార్ ఉత్తర భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన రాజ్యంగా ఉండేది.
గుజరాత్ నుంచి వచ్చి, రాజస్థాన్‌లో స్థిరపడిన బప్పా రావల్ అనే రాజు మేవార్‌ను నిర్మించారు.
తన సోదరులతో గట్టి పోరాటం తర్వాత, రాణా సంగా 1508లో మేవార్ సింహాసనాన్ని అధిష్టించారు.
ఆ సమయంలో రాణా సంగా వయసు 27 ఏళ్లు మాత్రమే. మేవార్ పీఠంపై కూర్చున్న వెంటనే రాణా సంగా తన విజయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
అమెర్ సైన్యం మేవార్‌పై దాడి చేసినప్పుడు, రాణా సంగా అమెర్ రాజు మాధో సింగ్‌ను బంధించారు.
''మధ్యయుగ భారత చరిత్ర'' అనే పుస్తకంలో చరిత్రకారుడు సతీష్ చంద్ర 1517లో జరిగిన యుద్ధంలో మాల్వా రాజును రాణా సంగా బంధించడం, ఆయన్ను చిత్తోర్‌కు తీసుకోవడం అంతా వివరించారు. అదే ఏడాది, ఇబ్రహీం లోదీ మేవార్‌పై దండయాత్ర చేశారు. ఖతౌలి వద్ద ఆయనను రాణా సంగా ఓడించారు.
'' ఈ యుద్ధంలో, రాణా సంగా ఎడమ చేతి కవచానికి ఒక బాణం గుచ్చుకుంది. రాణా జీవితాన్ని కాపాడేందుకు వైద్యులు అప్పుడు ఆ చేతిని తీసేశారు. బాణానికి ఉన్న ప్రమాదకరమైన విషం ఆయన శరీరమంతా పాకుతుందన్న ఉద్దేశంతో చేతిని తొలగించారు. చాలాకాలం తర్వాత ఆయన కోలుకున్నారు. ఆ తర్వాత ఆయనకు ఒకటే చేయి ఉండేది. అయినప్పటికీ, రాణా సంగా తన ధైర్యాన్ని కోల్పోలేదు. ఒకటే చేతితో కత్తిసామును ఆయన సాధన చేసేవారు'' అని సతీష్ చంద్ర తన పుస్తకంలో రాశారు.


ఫొటో సోర్స్, ORIENT BLACKSWAN
1526లో పానిపత్‌లోని ఒక నిర్ణయాత్మక యుద్ధం జరగడానికి కొన్ని నెలల ముందు, దిల్లీ పాలకుడు ఇబ్రహీం లోదీ ఆస్థానానికి చెందిన కొందరు బాబర్‌ను కలిసేందుకు వెళ్లారు. భారత్‌కు రావాలని, పరిపాలన నుంచి లోదీని తొలగించాలని వారు బాబర్‌ను కోరారు.
ఇబ్రహీం లోదీ నియంత అని.. తన ఆస్థానాధికారుల మద్దతును ఆయన కోల్పోయారని వారు బాబర్‌కు చెప్పారు.
''మేం కాబూల్‌లో ఉన్నప్పుడు మేవార్ రాజు రాణా సంగాకు చెందిన రాయబారి ఒకరు మా దగ్గరకు వచ్చి శుభాకాంక్షలు చెప్పారు. ఆగ్రా నుంచి ఇబ్రహీం లోదీపై దాడి చేయాలనుకుంటున్నట్లు వారి ప్రణాళికను వివరించారు. నేను దిల్లీ, ఆగ్రా రెండింటినీ స్వాధీనం చేసుకున్నా. కానీ, ఆయన ముఖాన్ని మాత్రం నాకు చూపించలేదు'' అని బాబర్ తన ఆత్మకథ బాబర్‌నామాలో రాశారు.
రాణా సంగాకు చెందిన రాయబారి ఒకరు బాబర్‌ను కలిసేందుకు వచ్చారని 'తారిఖ్-ఇ-రషిది' పుస్తకంలో బాబర్ కజిన్ మిర్జా హైదర్ చెప్పారు. బాబర్ అనే పుస్తకంలో బాబర్‌ను కలిసేందుకు రాణా సంగా రాయబారి వచ్చినట్లు మరో బయోగ్రాఫర్ స్టాన్లీ లేన్ పూలే ప్రస్తావించారు.
'ప్రీమోడర్న్ రాజస్థాన్' అనే పుస్తకాన్ని రాసిన మరో చరిత్రకారుడు రఘువీర్ సింగ్ కూడా.. రాజ్‌పుత్‌లకు రాజకీయ దూరదృష్టి లేకపోవడం అనేది ఇబ్రహీం లోదీని ఓడించేందుకు కాబూల్ నుంచి రావాలని బాబర్‌ను రాణా సంగా ఆహ్వానించడానికి కారణమైందని రాశారు.
అదే విధంగా, రాణా సంగా మరణించిన తర్వాత ఆయన రాణుల్లో ఒకరైన కర్మవతి పెద్ద కొడుకు విక్రమ్‌జీత్‌ను మేవార్ సింహాసనంపై కూర్చోపెట్టేందుకు శత్రువు బాబర్ సాయం తీసుకునేందుకు కూడా వెనుకాడలేదని రాశారు.

ఫొటో సోర్స్, RUPAA
పానిపత్‌లో ఇబ్రహీం లోదీని ఓడించిన బాబర్
''మేవార్, మెఘల్ చక్రవర్తులు'' అనే పుస్తకంలో జీఎన్ శర్మ పలు ప్రశ్నలను లేవనెత్తారు. ''ఈ సమయంలో యుద్ధ వీరుడిగా బాబర్‌కు అంతపెద్ద పేరు ఏమీ లేదు. అంతేకాక, ఇతర రాజులకు రాయబారాలను పంపే సంప్రదాయం కూడా లేదు'' అని పేర్కొన్నారు.
1526లో పానిపత్ యుద్ధంలో ఇబ్రహీం లోదీపై బాబర్ గెలిచినప్పుడు, అక్కడ రాణా సంగా ఉన్న ఆనవాళ్లు కూడా లేవు. బాబర్ ఈ విషయాన్ని బాబర్‌నామా పుస్తకంలోనే స్వయంగా ధ్రువీకరించారు.
''పానిపత్ యుద్ధంలో, మా సైనికులు కేవలం 30 వేలు మాత్రమే. ఇబ్రహీం లోదీ సైనికులు లక్ష మంది వరకు ఉన్నారు'' అని ఆత్మకథలో బాబర్ రాశారు.
''బాబర్ తెలివైన నాయకత్వంతో తన కంటే మూడింతలు పెద్దగా ఉన్నసైన్యంపై గెలుపొందారు. బాబర్ క్రమశిక్షణ, నైపుణ్యం ఉన్న సైనికులు ఇబ్రహీం లోదీని ఓడించారు. దిల్లీపై బాబర్ పైచేయి సాధించి, తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు'' అని సతీష్ చంద్ర రాశారు.

ఫొటో సోర్స్, GN SHARMA
'బాబర్‌కు రాణా సంగా సపోర్టు చేయలేదు'
1519లో జరిగిన యుద్ధంలో మాల్వాలో మహమూద్ ఖిల్జీ 2ను ఓడించిన తర్వాత, రాణా సంగా ప్రభావం ఆగ్రా వరకు ప్రవహించే పలియఖార్ నది వరకు విస్తరించింది. గంగా వ్యాలీలో బాబర్ సామ్రాజ్యం ఆ తర్వాత రాణా సంగాకు ముప్పుగా మారింది.
''రాణా సంగా ఒప్పందాన్ని ఉల్లంఘించారని బాబర్ ఆరోపించారు. భారత్‌కు రావాలని రాణా సంగా తనను ఆహ్వానించారని, ఇబ్రహీం లోదీపై జరిగిన యుద్ధంలో సపోర్టు ఇస్తారని అన్నారని చెప్పారు. కానీ, యుద్ధం జరిగేటప్పుడు సాయం చేసేందుకు రాలేదని బాబర్ ఆరోపించారు. బాబర్‌కు సంగా ఏం వాగ్దానం చేశారో మనకు తెలియదు. తైమూర్ లాగానే, బాబర్ కూడా దాడి చేసి, దోపిడి చేసిన తర్వాత తిరిగి వెళ్లిపోతారని సంగా అనుకుని ఉండొచ్చు. కానీ, భారత్‌లోనే శాశ్వతంగా ఉండిపోవాలనే బాబర్ నిర్ణయం పరిస్థితిని పూర్తిగా మార్చేసింది'' అని సతీష్ చంద్ర తన పుస్తకంలో రాశారు.
భారత్‌ను జయించేందుకు మేవార్ రాణాను అతిపెద్ద అడ్డంకిగా బాబర్ భావించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆల్కహాల్ నిషేధం
1526లో పానిపత్‌లో బాబర్ గెలుపొందిన తర్వాత రాణా సంగాతో యుద్ధం కోసం అంతా సిద్ధం చేసుకున్నారు.
ఆ సమయంలో, ఇబ్రహీం లోదీ తమ్ముడు మహమూద్ లోదీసహా చాలా మంది అఫ్గాన్లు రాణా సంగాతో చేతులు కలిపారు. బాబర్‌పై రాణా సంగా గెలిస్తే, మహమూద్ లోదీ తిరిగి దిల్లీ సింహాసనంపై కూర్చోవచ్చని భావించారు.
రాణా సంగాకు మద్దతుగా ప్రతి రాజ్‌పుత్ రాజు కూడా తమ సైనికులను పంపించారు.
''బయానాలో రాణా సంగా విజయం బాబర్ సైనికుల్లో నిరాశను నిలిపింది. తన సైనికుల్లో మనోధైర్యం పెంచేందుకు, రాణా సంగాపై యుద్ధాన్ని జిహాద్‌గా ప్రకటించారు బాబర్. యుద్ధానికి ముందు అన్ని వైన్ సీసాలను కింద పడేసి పగలగొట్టి తానెంత నమ్మకమైన, బలమైన ముస్లింనో చూపించారు. తన మొత్తం రాజ్యంలో ఆల్కహాల్ అమ్మకాలను, కొనుగోళ్లను నిలిపివేశారు. సైనికుల్లో ధైర్యం నింపేందుకు చాలా శక్తిమంతమైన ప్రసంగాన్ని బాబర్ ఇచ్చారు'' అని 'బాబర్: 16వ శతాబ్దపు సామ్రాజ్య స్థాపకుడు (బాబర్: ఎంపైర్ బిల్డర్ ఆఫ్ ది సిక్స్టీన్త్ సెంచరీ'' అనే పుస్తకంలో విలియమ్ రష్‌బ్రూక్ రాశారు.
రాణా సంగాతో 1527లో జరిగే యుద్ధం కోసం బాబర్ ఆగ్రాకు 40 కి.మీ.ల దూరంలో ఉన్న ఖన్వాను ఎంపిక చేసుకున్నారు.
ఏనుగుపై కూర్చుని రాణా సంగా యుద్ధానికి నాయకత్వం వహించారు.
ఖన్వా యుద్ధంలో, రెండు పక్షాల వారు తీవ్రంగా పోరాడారు. ''రాణా సంగా సైనికులు రెండు లక్షల మందికి పైగా ఉన్నారు. వారిలో పదివేల మంది అఫ్గాన్లే. అంతే సంఖ్యలో సైనికులను రాజా హసన్ ఖాన్ మేవతి పంపించారు'' అని బాబర్‌నామా పుస్తకంలో బాబర్ రాశారు.
బాబర్ సైనికుల కంటే రాణా సంగా సైనికులు చాలాఎక్కువగా ఉన్నారడంతో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఫొటో సోర్స్, Getty Images
''బాబర్ సైన్యం ముందువైపు వస్తువులతో నిండిన బండ్లు వరుసగా నిలబడ్డాయి. ఈ బండ్లు ఒకదానితో ఒకటి ఇనుప గొలుసులతో కట్టారు. బాబర్ సైనికులకు ఇవి అత్యంత రక్షణ వలయంగా నిలిచాయి. ఈ బండ్ల వెనుకాల ఫిరంగులు ఉన్నాయి. అవి ప్రత్యర్థులకు కనిపించవు. వాటి వెనుకాల సైనికులు కూర్చున్న గుర్రాలు వరుసగా నిల్చున్నాయి. యుద్ధ వీరులు ముందుకు, వెనుకకు వెళ్లేలా తగిన స్థలం ఉంది. ఆయుధాలతో ఉన్న సైనిక దళాలు ఏ వైపు నుంచి దాడి జరిగినా ఎలాంటి భయం లేకుండా దాడి చేసేందుకు నిల్చుని ఉన్నారు. ఒకవైపు పెద్ద గొయ్యి తవ్వారు. పెద్ద పెద్ద చెట్లను నరికేశారు. మరోవైపు వాటిని తమకు రక్షణగా ఉంచారు'' అని జీఎన్ శర్మ తన పుస్తకంలో రాశారు.
'' రాణా సంగా సైనికులు ఐదు భాగాలుగా విడిపోయారు. ముందు వరుసలో ఏనుగులు నిల్చున్నాయి. ఏనుగులు ఒక రక్షణ కవచంలా నిలబడ్డాయి. ఏనుగుల తొండాలపై కూడా ఇనుప కవచాలను వేశారు. ఏనుగుల వెనుకాల గుర్రాలపై కూర్చున్న సైనికులు ఈటెలు పట్టుకుని ఉన్నారు. తొలి వరుసలోని ఏనుగుపైనే రాణా సంగా కూర్చున్నారు. దూరం నుంచి కూడా తన సైనికులందరూ ఆయన్ను చూడగలరు. బాబర్ తన సైనికులకు ముందు వరుసలో కాకుండా, మధ్యలో నిల్చున్నారు'' అని శర్మ తన పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
రాణా సంగాకు గాయం
బాబర్‌పై దాడి ప్రారంభించిన రాణా సంగా ఆ యుద్ధానికి తనకు తాను నాయకత్వం వహించారు.
''రాణా సంగాకు ఒక కన్ను లేకపోవడం చూసి అక్కడున్న సైనికులంతా షాక్ అయ్యారు. ఆయన చేయి తెగిపోయింది. కాళ్లల్లో ఒకటి పనిచేయడం లేదు. శరీరమంతా గాయాలే. అయినా, ఆయన చురుకుదనం కానీ, వీరావేశం కానీ ఏమాత్రం తగ్గలేదు'' అని శర్మ రాశారు.
కానీ, మొఘల్ ఫిరంగులు వేగంగా దూసుకువస్తూ రాణా సంగా సైనికులను నాశనం చేస్తున్నాయి. మెల్లమెల్లగా రాణా సంగా సైనికులు వెనక్కు తగ్గడం ప్రారంభించారు.
''అదే సమయంలో, రాణా సంగా నుదుటున ఒక బాణం తగిలింది. రాణా సంగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆయన సైన్యాధిపతులు కొందరు వెంటనే రాణా సంగాను కిందకి దించి, సవారిలో యుద్ధ భూమి నుంచి బయటకు తీసుకెళ్లారు. రాణా సంగా ఏనుగుపై లేని విషయాన్ని ఆయన సైనికులు చూశారు. అది చూసిన తర్వాత, వారు మనోధైర్యం కోల్పోయారు. సైనికులు పట్టు కోల్పోయారు. రాజ్‌పుత్ కమాండర్ అజు ఝాలా.. రాణా కిరీటాన్ని తన తలపై పెట్టుకుని, ఆయన ఏనుగును ముందుకు నడిపారు. కానీ, రాజు లేకపోవడంతో జరగాల్సిన నష్టమంతా జరిగింది. రాజ్‌పుత్ సైనికులు తమ ధైర్యం కోల్పోయి, నిరుత్సాహపడ్డారు'' అని జీఎన్ శర్మ వివరించారు.
''ఇస్లాంను వ్యాప్తి చేసేందుకు నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చాను. ఈ యుద్ధంలో వీరమరణం పొందినా ఫర్వాలేదని అనుకున్నాను. కానీ, దేవుడు నా ప్రార్థనను ఆలకించాడు. రెండు వైపులా సైనికులు బాగా అలసిపోయారు. కానీ, రాణా సంగా దురదృష్టం నాకు అదృష్టంగా మారింది. సంగా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆయన సైనికులు ధైర్యం కోల్పోయారు. నేను గెలిచాను'' అని బాబర్ తన ఆత్మకథలో రాసుకున్నారు.
47 ఏళ్ల వయసులో మరణం
రాణా సంగా సైనికుల్లో క్రమశిక్షణ లోపించడం, సహకారం లేకపోవడం ఆయన సైన్యం ఓటమికి కారణమైంది.
1527లో ఖన్వా యుద్ధ ముగిసిన తర్వాత, బాబర్‌ను జయించిన తర్వాతనే చిత్తోర్ వస్తానని రాణా సంగా వాగ్దానం చేశారు. కానీ, ఎంతోకాలం ఆయన ప్రాణాలతో లేరు.
ఇరవైఒకటిన్నర ఏళ్ల పాటు మేవార్‌ను పాలించి తన సామ్రాజ్య విస్తరణలో కీలక పాత్ర పోషించిన న రాణా సంగా, 47 ఏళ్ల వయసులో చనిపోయారు.
''బాబర్‌కు వ్యతిరేకంగా యుద్ధం కొనసాగించే ఆయన మొండితనం ఆస్థానంలో ఉండే కొందరికి నచ్చలేదని చెబుతుంటారు. ఆయన విషమిచ్చారని అంటుంటారు. రాజస్థాన్‌కు చెందిన ఈ ధైర్యవంతుడి మరణంతో ఆగ్రా వరకు రాజస్థాన్‌ను విస్తరించాలని కలలకు ఎదురుదెబ్బ పడింది'' అని సతీష్ చంద్ర రాశారు.
ఖన్వా యుద్ధంలో బాబర్ గెలుపు, దిల్లీ-ఆగ్రా ప్రాంతంలో ఆయన స్థానాన్ని మరింత బలోపేతం చేసింది. గ్వాలియర్, ధోల్పూర్ కోటలను కూడా ఆయన గెలిచారు. అల్వార్‌లో ఎక్కువ భాగం ఆయన రాజ్యంలోకి వచ్చింది.
''పానిపత్‌లో గెలుపు భారత్‌లోకి మొఘల్ పాలన వచ్చేందుకు పునాది వేసింది. ఖన్వా యుద్ధంలో రాణా సంగాపై బాబర్ గెలుపొందడం ఈ పునాదులను మరింత బలపర్చింది.'' అని చరిత్రకారుడు సతీష్ చంద్ర తన పుస్తకంలో రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














