పండరీపురం విఠలాలయంలో బయటపడ్డ ఈ విగ్రహాలు, నాణేలు ఏ కాలం నాటివి?

ఫొటో సోర్స్, SUNIL UMBARE
మహారాష్ట్రలోని ప్రసిద్ధ పండరీపురం క్షేత్రంలో విఠలాలయ పరిరక్షణ పనులు చేస్తుండగా ఓ చిన్న నేలమాళిగలో వందల ఏళ్ళనాటి విగ్రహాలు, నాణేలు బయటపడ్డాయి.
ఐదు విగ్రహాలతోపాటు పాదుకలు, కొన్ని నాణేలతో కూడిన చారిత్రక సంపదను కనుగొన్నారు. వీటితోపాటు కొన్ని గాజులు కూడా లభించాయి.
ఈ విగ్రహాలు ఏ కాలానికి చెందినవనే విషయాన్ని అధ్యయనం చేశాకా కచ్చితమైన సమాచారం చెప్తామని అధికారులు చెబుతున్నారు.
అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ విగ్రహాలు 15 లేదా 16వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారు.
ప్రస్తుతం ఈ విగ్రహాలను ఆలయ కమిటీ సంరక్షణలో ఉంచారు. వీటిని కమిటీ వద్దే ఉంచాలా లేక పురావస్తు శాఖకు అప్పగించాలా అనే విషయాన్ని ఇంకా నిర్థరించలేదు.


ఫొటో సోర్స్, SUNIL UMBARE
అలా వెలుగుచూశాయి
గడిచిన రెండున్నర నెలలుగా పండరీపురం విఠలాల సంరక్షణా పనులు సాగుతున్నాయి. ఈ క్రమంలో మార్చి 31న చౌకాంబీ, సోలకాంబీ గోడలకు వెండిపూత దితర పనులు మొదలయ్యాయి.
విఠాలాలయం నుంచి బయటకు రావడానికి అక్కడ హనుమాన్ దర్వాజా అనే నిష్క్రమణ ద్వారం ఉంది. ఈ ద్వారం వద్ద నేలపై రాళ్ళు పరిచే పనులు మొదలయ్యాయి. ఆ సమయంలో రాళ్ళ మధ్య ఏర్పడే ఖాళీలను పూరించేందుకు రసాయనాలను వినియోగించారు.
కానీ రసాయనాలను ఎంత పోస్తున్నా అవి కిందకు వెళ్ళిపోతున్నాయి. దీంతో నేల కింద ఏదో ఖాళీ ప్రదేశం ఉందని భావించారు. దీంతో అక్కడ నేలను తవ్వి పక్కనే ఉన్న రాయిని తొలగించగా, కింద ఓ చిన్నపాటి నేలమాళిగ ఉన్నట్టు గమనించారు.
ఆ నేలమాళిగ 6 అడుగుల లోతు, దాదాపు 5.3 అడుగుల వెడల్పుతో ఉంది. ఆలయ కమిటీ ఉద్యోగి ఒకరు ఈ నేలమాళిగలోకి ప్రవేశించారు. ఆయనకు అక్కడ విగ్రహాలు కనిపించడంతో వాటిని బయటకు తీసుకువచ్చారు.

ఫొటో సోర్స్, SUNIL UMBARE
ఏం కనుగొన్నారు?
నేలమాళిగలో ప్రధానంగా ఐదు విగ్రహాలు, పాదుకలు, కొన్ని నాణేలు కనుగొన్నారు. అలాగే గాజుల అవశేషాలు కూడా లభించాయి.
ఐదు విగ్రహాలలో రెండు విష్ణుమూర్తివికాగా, మరొకటి మహిషాసుర మర్థినిది అని పురావస్తు శాఖాధికారులు చెప్పారు. అలాగే మరోకటి వేంకటేశ్వరస్వామిదిగా గుర్తించారు. విఠల మందిరంలో వేంకటేశ్వరాలయం కూడా ఉంది. దీంతో కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు పాత విగ్రహాన్ని ఇక్కడ పెట్టి ఉంటారని భావిస్తున్నారు.
ఈ విగ్రహాలు 15 లేదా 16 వ శతాబ్దానికి చెందినవై ఉండొచ్చని పుణేలోని పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరక్టర్ విలాస్ వహానే చెప్పారు.
విగ్రహానికి ఉన్న ఆయుధాలు, ముఖ కవళికల ఆధారంగా ఈ కాల నిర్ణయాన్ని ఊహిస్తున్నారు.
సాధారణంగా 17,18 శతాబ్దం నాటి మరాఠా, పేష్వా కాలం నాటి విగ్రహాలు విభిన్న శైలిలో ఉంటాయి. అలాగే 15వ శతాబ్దానికి ముందు యాదవ కాలంలోనూ విగ్రహాలు ప్రత్యేక శైలిలో ఉంటాయి.
నేలమాళిగలో లభించిన విగ్రహాలన్నీ ఈ రెండుకాలాలకు సంబంధించినవి కావు. దీంతో ఇవి 15 లేదా, 16వ శతాబ్దానికి చెందినవని కచ్చితంగా చెప్పొచ్చంటారు ఆయన.

ఫొటో సోర్స్, SUNIL UMBARE
శాసనాల సాయం
‘‘వీటిల్లో రెండు విగ్రహాలు విష్ణుమూర్తి రూపంలో ఉన్నాయి. ఇవి రెండూ ఆలయ ప్రాంగణానికి చెందినవై ఉంటాయి. ఎందుకంటే .. మండపంలోని 16 స్తంభాల మండపంలో విష్ణుమూర్తి విగ్రహానికి ఇరువైపులా ఆయుధాలు ధరించిన ద్వారపాలకులు ఉన్నాయి.తాజాగా లభించిన విగ్రహం కూడా ఆ రూపంలోనే ఉంది’’ అని విలాస్ వహానే చెప్పారు.
ఆలయానికి సంబంధించి అనేక శాసనాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని అధ్యయనం చేశాక వాటి గురించి ఓ అంచనాకు వస్తానని చెప్పారు.
నేలమాళిగలో విగ్రహాలను కనుగొన్నప్పుడు, బోలెడు మట్టిని తవ్వారు. అందులో రూపాయి, పావలా, ఐదు పైసల నాణేలు కనిపించాయి. గాజులు, ప్లాసిక్ట్ ముక్కలు ఉన్నాయి.
ఈ నాణేలు 1980 మధ్య దశకానికి చెందినవై ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో ఈ విగ్రహాలు కూడా 1981-82 మధ్య నాటివని వహానే ఊహిస్తున్నారు.
ఇక ఈ విగ్రహాలను పురావస్తు శాఖకు అప్పగించాలా వద్దా అనే విషయంపై ఆలయ కమిటీ నిర్ణయం తీసుకోనుంది.
ఇవి కూడా చదవండి:
- ఏసీ పేలి ఇల్లంతా కాలిపోయింది.. అసలు ఏసీ ఎందుకు పేలుతుంది.. పేలకుండా ఏం చేయాలి?
- ఆంధ్రప్రదేశ్‌లో గెలిచేదెవరు, ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?
- చంద్రుడిపై ఆవల వైపు దిగిన చైనా స్పేస్‌క్రాఫ్ట్
- తేనెటీగలు అంతరించిపోతే మానవ జాతి ఏమవుతుందో తెలుసా?
- తెలంగాణ అనే పదం ఎక్కడ పుట్టింది? మియన్మార్ జోల పాటలో ఎందుకు వినిపిస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














