హిందూ యువతి, ముస్లిం యువకుడి పెళ్లి చట్టవిరుద్ధమని చెప్పిన మధ్యప్రదేశ్ హైకోర్టు, మతాంతర వివాహాలపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపనుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఉమంగ్ పోద్దార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇస్లామిక్ చట్టాలు లేదా ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం హిందూ యువతి, ముస్లిం యువకుడు పెళ్లి చేసుకోవడం కుదరదని మధ్యప్రదేశ్ హైకోర్టు మే 27న చెప్పింది.
విగ్రహాలను పూజిస్తూ, అగ్నిని ఆరాధించే హిందూ మహిళను ముస్లిం యువకుడు వివాహం చేసుకోవడానికి ఇస్లామిక్ చట్టం అనుమతించదని, ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం కూడా అలాంటి వివాహాన్ని చట్టబద్దం చేయలేమని హైకోర్టు తెలిపింది.
అయితే హైకోర్టు నిర్ణయంపై విశ్లేషకులు విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేక వివాహ చట్టం లక్ష్యాల అమలుకు ఈ తీర్పు వ్యతిరేకమని అంటున్నారు.
ముస్లిం యువకుడు, హిందు యువతి పెళ్లి చేసుకుని, వివాహం తర్వాత వాళ్లిద్దరూ తమ తమ మతాలను అనుసరించినప్పటికీ ఆ వివాహం చెల్లదని కోర్టు తన నిర్ణయంలో తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
కోర్టు ముందున్న వివాదం ఏమిటి?
మధ్య ప్రదేశ్‌కు చెందిన ఓ ముస్లిం యువకుడు, హిందూ యువతి తమ వివాహాన్ని రిజిస్టర్ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. పెళ్లి తర్వాత ఎవరూ మతం మారకూడదని, తమ మతాలను అనుసరించాలని వాళ్లిద్దరూ నిర్ణయించుకున్నారు.
తమ వివాహం కోసం ప్రత్యేక వివాహ చట్టం కింద వివాహ అధికారికి దరఖాస్తు చేసుకున్నట్లు ఈ జంట తెలిపింది. అయితే వాళ్లిద్దరి కుటుంబ సభ్యుల అభ్యంతరాలతో వివాహాన్ని రిజిస్టర్ చేయలేదు. దీంతో వీళ్లిద్దరూ తమకు భద్రత కల్పించడంతో పాటు తమ పెళ్లిని రిజిస్టర్ చేయాలని కోరుతూ హైకోర్టుకెళ్లారు.
1954లో అమల్లోకి వచ్చిన ప్రత్యేక వివాహ చట్టం కింద మతాంతర వివాహం చేసుకున్న జంటలు తమ పెళ్లిని రిజిస్టర్ చేయించుకోవచ్చు.
ఈ చట్ట ప్రకారం పెళ్లి చేసుకోవాలనుకునే జంట మ్యారేజ్ ఆఫీసర్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేసుకున్న తర్వాత మ్యారేజ్ ఆఫీసర్ 30 రోజుల నోటీసు జారీ చేస్తారు.
ఈ వివాహం పట్ల అభ్యంతరాలు ఉన్నవారు ఎవరైనా 30 రోజుల్లోపు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ, వివాహాన్ని రిజిస్టర్ చేయవద్దని మ్యారేజ్ ఆఫీసర్‌ను కోరవచ్చు. వివాహంపై ఎవరైనా అభ్యంతరాలు లేవనెత్తితే ఆ వివాహం రిజిస్టర్ చెయ్యరు.
ఈ కేసులో, యువతి తరపువారు ఆమె తమ ఇంట్లో బంగారం అంతా తీసుకుని పారిపోయారని ఆరోపిస్తున్నారు.
ఆమె మతాంతర వివాహం చేసుకుంటే తమ కుటుంబం మొత్తాన్ని సామాజిక బహిష్కరణ చేస్తారని, అందుకే ఈ వివాహంపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కోర్టు ఏం చెప్పింది?
కోర్టు మొదట ఈ పెళ్లి చెల్లుబాటవుతుందా లేదా అని పరిశీలించింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఇలాంటి వివాహం చెల్లదని చెప్పింది. ముస్లిం పర్సనల్ లా కింద చెల్లని ఓ వివాహం ప్రత్యేక వివాహ చట్టం కింద కూడా చెల్లదని తెలిపింది.
అగ్ని లేదా విగ్రహాలను పూజించే ముస్లిమేతర మహిళతో ముస్లిం పురుషుడి వివాహం చెల్లుబాటు కాదని 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా మధ్యప్రదేశ్ కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది.
ముస్లిం పురుషుడు యూదు లేదా క్రైస్తవ మహిళను వివాహం చేసుకోవచ్చు. ఆమె ఈ మూడు మతాలలో దేనినైనా స్వీకరించినట్లయితే అటువంటి వివాహం చెల్లుబాటు అవుతుంది.
అయితే, ప్రత్యేక వివాహ చట్టం ముందు ముస్లిం పర్సనల్ లాకు ప్రాధాన్యత ఉండకూడదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని తమ పెళ్లిని రిజిస్టర్ చేయాలని ఈ జంట వాదించింది. వారి వాదనను మధ్యప్రదేశ్ హైకోర్టు అంగీకరించలేదు. వివాహంపై నిషేధం ఉంటే, దానిని చట్టబద్దం చెయ్యలేమని హైకోర్టు పేర్కొంది.
అలాగే వారికి పోలీసు భద్రత కల్పించాలన్న పిటిషన్‌ను కొట్టేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ నిర్ణయంపై విమర్శలు ఎందుకు వస్తున్నాయి?
మధ్యప్రదేశ్ హైకోర్టు నిర్ణయాన్ని కుటుంబ వ్యవహారాల న్యాయ నిపుణులు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ముస్లిం యువకుడు, హిందూ యువతి వివాహం చేసుకుని, వారు తమ తమ మతాలను ఆచరించాలనుకుంటే అది ప్రత్యేక వివాహ చట్టం, ముస్లిం పర్సనల్ లా కింద చెల్లదని హైకోర్టు చెప్పింది.
హైకోర్టు నిర్ణయం ప్రత్యేక వివాహ చట్టం అమలు లక్ష్యాలకు వ్యతిరేకంగా ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రత్యేక వివాహ చట్టం భారతీయుల వివాహల కోసం అమల్లోకి వచ్చిందని ఈ చట్టం లక్ష్యాలు చెబుతున్నాయి. భారతదేశంలో ఏ మతం వారైనా మరో మతం వారిని పెళ్లి చేసుకునేందుకు చట్టబద్దంగా అవకాశం కల్పించడమే ప్రత్యేక వివాహ చట్టం లక్ష్యం.
చట్టంలో పేర్కొన్న నిబంధనలకు కట్టుబడి పెళ్లి చేసుకునే వారు “ఏ మత ఆచారాలు లేదా సంప్రదాయాలను పాటించవచ్చు” అని ప్రత్యేక వివాహ చట్టం చెబుతోంది.
“చట్టం ప్రకారం కోర్టు నిర్ణయం సరైనది కాదు. ఈ తీర్పుని సుప్రీంకోర్టులో కొట్టివేస్తారు. మతాంతర వివాహాల కోసం ఉద్దేశించి రూపొందించిన ప్రత్యేక వివాహ చట్టం స్ఫూర్తిని ఈ తీర్పు ప్రతిబింబించడం లేదు" అని ఫ్యామిలీ లా ఎక్స్‌పర్ట్, న్యాయవాది మాళవికా రాజ్ కోటియా చెప్పారు.
“కోర్టు పరిశీలన అనుకున్నా కూడా ఈ నిర్ణయం తప్పుదారి పట్టంచేలా ఉంది. న్యాయమూర్తి ముస్లిం పర్సనల్ లా పై దృష్టి పెడుతున్నప్పుడు, ప్రత్యేక వివాహ చట్టం లక్ష్యాలు ఏంటో కూడా గుర్తించాలి” అని మహిళల హక్కుల న్యాయవాది వీణా గౌడ చెప్పారు.
బెంగళూరులోని నేషనల్ లా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సరసు ఎస్తేర్ థామస్ కూడా వీణా గౌడ అభిప్రాయంతో ఏకీభవించారు. “ఈ నిర్ణయం ఏమాత్రం సరికాదని ఆమె అన్నారు. కోర్టు ప్రత్యేక వివాహ చట్టాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఇస్లామిక్ చట్టాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. అయితే ప్రత్యేక వివాహ చట్టం వివిధ మతాలకు చెందిన వారిని పెళ్లి చేసుకోవడానికి అనుమతిస్తుంది” అని ఆమె చెప్పారు.
“ముస్లిం పర్సనల్ లా ప్రకారం నిషేధించిన వివాహాలను ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం జరిపించలేమని ఈ తీర్పు తప్పుగా పేర్కొంది. అయితే ప్రత్యేక వివాహ చట్టం కింద ఎలాంటి వివాహాలు జరిపించకూడదనే దాన్ని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం రక్త సంబంధీకులు, మైనర్లకు వివాహం జరపకూడదు” అని ఎస్తేర్ థామస్ చెప్పారు..

ఫొటో సోర్స్, Getty Images
ఈ తీర్పు వివాహాలపై ప్రభావం చూపుతుందా?
హైకోర్టు తీర్పు మతాంతర వివాహాలపై ప్రభావం చూపదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇది మతాంతర వివాహం పట్ల ఉత్సాహాన్ని తగ్గిస్తుందని భావిస్తున్నారు.
“కోర్టు నిర్ణయం పోలీసు రక్షణ కోరుతూ వేసిన రిట్ పిటిషన్‌లో న్యాయస్థానం పరిశీలన మాత్రమే. అందువల్ల ఇది వివాహాలకు వర్తించకపోవచ్చు. వివాహం చెల్లుబాటు గురించి కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు” అని వీణా గౌడ చెప్పారు.
“మతాంతర వివాహాలను ఆపే సూచనలు లేవు. మరి ఈ నిర్ణయంపై మ్యారేజ్ రిజిస్ట్రార్ ఏం చేస్తారో చూడాలి. రిజిస్ట్రార్లు ఇప్పటికీ మతాంతర వివాహాలను నమోదు చెయ్యవచ్చు. వివాహం చెల్లుబాటును పెళ్లైన తర్వాత కోర్టు నిర్ణయిస్తుంది” అని మాళవికా రాజ్‌కోటియా అన్నారు.
మధ్య ప్రదేశ్ హైకోర్టు నిర్ణయం అమలైతే "ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం వివాహం చేసుకునే ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకంటే కోర్టు ఆదేశాల ప్రకారం ఈ చట్టం ద్వారా చేసుకునే పెళ్లి చెల్లదు. చట్టబద్దంగా పుట్టిన పిల్లలను అక్రమ సంతానంగా మారుస్తుంది. ఎందుకంటే వారి వివాహం చెల్లదు కాబట్టి" అని ప్రొఫెసర్ సరసు ఎస్తేర్ థామస్ చెప్పారు.
ముస్లిం పర్సనల్ లా కింద నిషేధించిన వివాహాలను ప్రత్యేక వివాహ చట్టం కింద రిజిస్టర్ చెయ్యడం సాధ్యపడదని హైకోర్టు ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. ముస్లిం పర్సనల్ లా కింద నిషేధించిన ఇతర రకాల వివాహలను కూడా కోర్టు నిర్ణయం ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు పార్సీ చట్టంలో మతాంతర వివాహాలను నిషేధించారు. అందుకే పార్సీలు వేరే మతస్తులను పెళ్లి చేసుకోవాలనుకుంటే వారు ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకుంటారు. మధ్య ప్రదేశ్ హైకోర్టు తీర్పు దీనికి అడ్డు పడుతుంది” అని ఆమె అన్నారు.
కోర్టు నిర్ణయం వల్ల భవిష్యత్‌లో మతాంతర వివాహం చేసుకునే వారికి ప్రమాదం ఉంటుంది. ఈ కేసులో ముస్లిం యువకుడు, హిందూ యువతి తమకు రక్షణ కల్పించమని కోర్టుని కోరారు. కోర్టు రక్షణ కల్పించలేకపోతే ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకున్న వారి పరిస్థితి ఏంటి?.” అని ఎస్తేర్ ప్రశ్నిస్తున్నారు.
“కోర్టు నిర్ణయం మతాంతర వివాహాలను నిరుత్సాహ పరుస్తుంది. ఇది అత్యంత ఆందోళనకరమైన అంశం” అని అన్నారు న్యాయవాది వీణా గౌడ.
ఉత్తర ప్రదేశ్‌లో సహజీవనం చేస్తున్న 12 మతాంతర జంటలు తమకు భద్రత కల్పించాలని అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించినప్పుడు, వారికి భద్రత కల్పించేందుకు కోర్టు నిరాకరించిందని ఇటీవల ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక కథనంలో తెలిపింది.
అయితే, మతాంతర, కులాంతర వివాహిత జంటలను వేధించకుండా పోలీసులు రక్షణ కల్పించాలని 2005లో సుప్రీంకోర్టు ఆదేశించింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ చట్టవిరుద్ధం కాదని సుప్రీం కోర్టు కూడా అంగీకరించింది.
సహ జీవనం చేస్తున్న కొన్ని జంటలకు వారి కుటుంబ సభ్యుల నుంచి ఎదురవుతున్న వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కొన్ని కేసుల్లో కోర్టులు ఆదేశించాయి.
ఇవి కూడా చదవండి:
- ‘ఒక కూతురు నుంచి ఇలాంటి మాటలు వినడం అసాధారణంగా అనిపిస్తుంది...’
- స్కూటీ అంటే అమ్మాయి, బైక్ అంటే అబ్బాయి...హైదరాబాద్‌లో పిల్లల విక్రయ ముఠా గుట్టు ఎలా బయటపడిందంటే...
- టీ20 వరల్డ్‌కప్: ఆస్ట్రేలియా నుంచి అమెరికాకు పిచ్ తరలింపు, ఎలా సాధ్యమైంది?
- స్టార్మీ డేనియల్స్: డోనల్డ్ ట్రంప్ దోషిగా తేలిన ‘హష్ మనీ’ కేసులో కీలక వ్యక్తి అయిన ఈ మహిళ ఏం చెప్పారు?
- ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతాయా, గత అనుభవాలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














