డేటింగ్‌‌‌‌పై యువత చిరాకు మొదలైందా, ఈ ట్రెండ్ ఎందుకు క్రమంగా పెరుగుతోంది?

డేటింగ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆజ్గే ఆజ్దెమిర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇస్తాంబుల్‌కి చెందిన 34 ఏళ్ల మహిళ హజల్ సిరిన్‌కు డేటింగ్ అనేది రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. ''పెద్దపెద్ద ఊహలతో మీరు డేటింగ్ ప్రారంభించిస్తే, ఆ తర్వాత మీరు నిరాశకు గురవుతారు'' అని ఆమె అన్నారు. 'ఈ విషయంలో అందరిదీ ఒకటే కథ' అన్నారామె.

నాలుగేళ్లుగా తాను సింగిల్‌గా ఉన్నానని హజల్ తెలిపారు. అప్పటి నుంచి పార్టనర్ కోసం వెతుకుతున్నానని, అయితే, రిలేషన్‌షిప్ ఏర్పరచుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు, దీంతో నిరాశకు గురైనట్లు ఆమె చెప్పారు. తన స్నేహితులకు చెబితే అందరి పరిస్థితి అదేనంటూ తమ అనుభవాలు పంచుకున్నట్లు హజల్ తెలిపారు.

కొద్దికాలం డేటింగ్ చేసిన తర్వాత కూడా చాలా మంది తమ భాగస్వామిపై నిజంగా ఆసక్తి, శ్రద్ధ చూపడం లేదని ఆమె అన్నారు.

ఎన్నో సందర్భాల్లో తాను ఘోస్టింగ్‌కి గురయ్యానని, అది భాగస్వామి సరిగ్గా పట్టించుకోకపోవడానికి, సహానుభూతి చెందకపోవడానికి సంకేతమని హజల్ భావిస్తున్నారు.

ఘోస్టింగ్ అంటే ఎలాంటి ముందస్తు సమాచారం కానీ, హెచ్చరిక కానీ లేకుండా అకస్మాత్తుగా అవతలి వ్యక్తిని దూరం పెట్టడం. అవతలి వ్యక్తితో కమ్యూనికేషన్‌ను ఒక్కసారిగా ఆపివేయడాన్ని వివరించేందుకు ఈ పదాన్ని వాడతారు.

అలాంటి డేటింగ్ అనుభవాలతో నిరుత్సాహానికి గురైన హజల్, మంచి రిలేషన్‌షిప్ కొనసాగించేందుకు కొద్దిమంది మాత్రమే సిద్ధంగా ఉన్నట్లు భావిస్తున్నానన్నారు.

డేటింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఈ కాలంలో డేటింగ్‌ విషయంలో పెరుగుతున్న నిస్పృహ, నిరుత్సాహాల గురించి కాఫీ షాపుల్లో, సోషల్ మీడియాలో రోజువారీ సంభాషణల్లో మాట్లాడుకోవడం కామన్‌గా మారింది.

ప్యూ రీసర్చ్ సెంటర్ 2019లో నిర్వహించిన సర్వే ప్రకారం, గత పదేళ్లలో డేటింగ్ చాలా క్లిష్టతరంగా మారిందని 18 ఏళ్లు పైబడిన అమెరికన్లలో దాదాపు సగం మంది భావిస్తున్నారు.

టెక్నాలజీతోపాటు డేటింగ్ ప్లాట్‌ఫామ్స్ వినియోగం పెరిగిపోవడం, వ్యక్తిగత గోప్యత లేకుండా పోవడం, డేటింగ్ స్వభావం మారిపోవడం, శారీరక, మానసిక ఇబ్బందులు, సామాజిక అంచనాల్లో మార్పులు, నైతిక విలువలు, లింగ పరమైన విషయాల వంటివి ఇందుకు కారణాలు.

చాలా మంది డేటింగ్‌ పట్ల అసంతృప్తిగా ఉన్నారని, నమ్మదగిన భాగస్వాములు దొరకడం కూడా కష్టమని ఈ సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి.

డేటింగ్ యాప్‌ల వినియోగంలో తగ్గుదల

కొత్త వ్యక్తులను కలిసేందుకు సులభమమైన మార్గాన్ని చూపిస్తున్నట్లు చెప్పే డేటింగ్ యాప్‌లు...మొదట్లో ఉన్న ఆకర్షణ ఇప్పుడు కోల్పోయినట్లు కనిపిస్తోంది.

ఉదాహరణకు, టిండర్ వార్షిక డౌన్‌లోడ్‌లు 2014లో గరిష్ట స్థాయిలో ఉండగా, ప్రస్తుతం అందులో మూడో వంతు కంటే తక్కువకు పడిపోయాయి.

తమ వినియోగదారులు తక్కువ ఒత్తిడి ఉండే డేటింగ్‌పై ఆసక్తి చూపిస్తున్నారని మరో ప్రముఖ డేటింగ్ యాప్ బంబుల్ తెలిపింది.

''అమెరికాలోని ప్రతి ముగ్గురు బంబుల్ వినియోగదారుల్లో ఒకరు తాము 'స్లో డేటింగ్' చేస్తున్నామని చెబుతున్నారు. ఇక డేటింగ్ విషయానికి వస్తే, మొదట తమ మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ తక్కువ రోజులు డేటింగ్‌కు కేటాయిస్తున్నట్లు చెప్పారు'' అని బంబుల్ పేర్కొంది.

డేటింగ్

ఫొటో సోర్స్, Getty Images

డేటింగ్ యాప్‌ల కారణంగా యువత భావోద్వేగపరంగా నిరుత్సాహానికి గురవుతున్నారని కూడా అధ్యయనాలు సూచిస్తున్నాయి.

యూత్ రీసర్చ్ ఏజెన్సీ సావంట ప్రకారం, 90 శాతం కంటే ఎక్కువ మంది జనరేషన్ జెడ్ వ్యక్తులు, అంటే 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వారు డేటింగ్ యాప్‌లతో విసిగిపోతున్నారు.

''ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, యాప్‌ల వినియోగం తగ్గిపోతున్నప్పటికీ, వాటికి అసలైన ప్రత్యామ్నాయం ఇంకా రాలేదు'' అని ఇంటర్నెట్ ట్రెండ్స్, కల్చర్ రచయిత కేథరిన్ లిండ్సే చెబుతున్నారు.

వ్యక్తిగతంగా కలుసుకోవడం, భౌతిక సంబంధాల వంటివి కూడా జెనరేషన్ జెడ్‌‌కి సాయం చేయవని ఆమె అంటున్నారు.

కోవిడ్ మహమ్మారి ఈ సమస్యను మరింత తీవ్రతరం చేసిందని, చాలామంది జనరేషన్ జెడ్ వ్యక్తులు అవతలి వ్యక్తులను కలవడం ద్వారా సామాజిక నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశాలు లేకుండా చేసిందని లిండ్సే చెబుతున్నారు.

ఇన్‌ఫ్లూయెన్సర్ల 'క్విక్ ఫిక్స్' విధానం

డేటింగ్‌తో విసిగిపోయినట్లు చాలామంది తరచూ చెబుతూ ఉండడంతో డేటింగ్, రిలేషన్‌షిప్ కోసం చిట్కాలు, ఉపాయాలతో సోషల్ మీడియా నిండిపోతోంది.

''నా జీవితాన్ని మార్చేసిన 12 డేటింగ్ రూల్స్'', ''డేటింగ్ కొనసాగడానికి మూడు రహస్యాలు'' వంటి హెడ్‌లైన్స్‌తో ప్రేమను సులువుగా ఇలా గుర్తించొచ్చంటూ ఇన్‌ఫ్లూయెన్సర్లు ఊదరగొట్టేస్తున్నారు.

కొందరు సంప్రదాయ విలువలతో కూడిన సంబంధాలను ప్రోత్సహిస్తూ, డేటింగ్‌కు వెళ్లినప్పుడు మహిళలు పురుషులు ఎలా ప్రవర్తించాలనే విషయాలు చెబుతుంటారు. మొదట కలిసినప్పుడు మగవారే బిల్లులు చెల్లించడం లాంటివి ఉన్నాయి.

ఉదాహరణకు, యూట్యూబ్‌లో 1.5 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ ఉన్న రిలేషన్‌షిప్ కోచ్ స్టీఫెన్ లాబోసియర్ ''డేటింగ్‌లో మగవారు చేసే తొమ్మిది భయంకరమైన తప్పులు'' లేదా ''మహిళలు విజయవవంతంగా డేటింగ్‌‌ చేయడమెలా'' అంటూ హెడ్‌లైన్స్‌తో వీడియోలు చేస్తుంటారు.

డేటింగ్

ఫొటో సోర్స్, Getty Images

''డేటింగ్‌లో అత్యున్నత ప్రమాణాలు - డేటింగ్‌‌లో యువరాణి ట్రీట్‌మెంట్ పొందడమెలా'' వంటి విషయాలు చెబుతూ ''మహిళల విజయవంతమైన డేటింగ్‌కు మార్గాలు'' వంటి హెడ్‌లైన్‌తో లండన్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్ టామ్ కౌర్ వీడియో చేస్తారు.

''ఎవరైనా మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉండాలంటే, వారిపై ఆసక్తి లేనట్లు ఉండండి'' అని టిక్‌టాక్‌లో దాదాపు ఐదు లక్షల మంది ఫాలోయెర్స్ ఉన్న ఇన్‌ఫ్లూయెన్సర్ కాసియా వెస్ట్ చెబుతున్నారు.

ప్రగతి శీల, సమానత్వ విధానాలను సూచించే కంటెంట్ క్రియేటర్స్ కూడా ఉన్నారని, అయితే సోషల్ మీడియా అల్గారిథమ్‌లు అప్పటికే సుపరిచితమైన విధానాలవైపే వ్యక్తులను తీసుకెళ్తాయని, సంప్రదాయ నియమాలను బలపరుస్తాయని కేథరిన్ లిండ్సే పేర్కొన్నారు.

ఒంటరితనం లేదా డేటింగ్ పట్ల ఏర్పడిన నిరాసక్తతను ఇన్‌ఫ్లూయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు తమకు అనుకూలంగా వినియోగించుకుంటారని ఆమె చెప్పారు.

''మీరు మీ పోస్టుకి ఎక్కువ క్లిక్‌లు రావాలనుకునే కంటెంట్ క్రియేటర్ అయితే, నిరాశ, నిస్పృహలో ఉన్నవారు దగ్గర పరిష్కారం ఉన్నట్లు భావిస్తారు'' అని ఆమె అన్నారు.

డేటింగ్‌ గురించి సలహాలు ఇచ్చే వీడియోలను సోషల్ మీడియాలో తరచూ చూస్తుంటానని హజల్ సిరిన్ చెప్పారు.

''ఇదొక సాధారణ ట్రెండ్. కొందరు మేకప్ వేసుకుంటూ డేటింగ్ సలహాలు ఇస్తుంటారు'' అని ఆమె అన్నారు. వాటిలో కొన్ని చెత్తగా ఉంటాయి, కానీ కొన్ని ప్రయోజనకరంగా ఉంటాయన్నారు.

డేటింగ్‌‌కు వెళ్లినప్పుడు కొన్ని సహజ నియమాలను పాటించాలని ఆమె అంటున్నారు.

''వ్యక్తిగత విషయాలు మరీ ఎక్కువ వెల్లడించకూడదు. పురుషులతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఎత్తుగడలు పాటించాలి'' అని ఆమె చెబుతున్నారు.

డేటింగ్

ఫొటో సోర్స్, Getty Images

''మన గురించి మనం తెలుసుకునే ప్రయాణం''

ప్రేమను కనుక్కోవడానికి నిజంగా సులువైన మార్గముందా?

''దురదృష్టవశాత్తూ, అలాంటిదేమీ లేదు'' అని సైకోథెరపిస్ట్, రచయిత కైటీ గిల్లిస్ చెప్పారు.

''ప్రేమ కోసం కొంత కచ్చితమైన అల్గారిథమ్ ఉండాలని కోరుకుంటున్నా. అందరూ అలాగే భావిస్తున్నారని అనుకుంటా, ఎందుకంటే అది వారికొక నమ్మకాన్ని ఇస్తుంది'' అన్నారామె.

డేటింగ్‌ అనేది ఒత్తిడితో కూడుకున్నది కాబట్టి, ఆ అసౌకర్యాన్ని తగ్గించుకునేందుకు ఆన్‌లైన్ చిట్కాలు చూస్తుంటారని గిల్లిస్ అంటున్నారు.

అయితే, డేటింగ్ అనేది, అసలు మీరు ఎవరు? మీకు ఎలాంటి వ్యక్తి కావాలి? అని మన గురించి మనం తెలుసుకుంటూ సాగే స్వీయ ఆవిష్కరణ ప్రయాణంలా ఉండాలని ఆమె అన్నారు.

మనకు కావాల్సిన సంబంధం కోసం వెతకాలి, కానీ సమాజం చెప్పే సంబంధం కాదని ఆమె చెప్పారు.

''రిలేషన్‌షిప్ అనేది మేథమేటిక్స్ ఫార్ములా కాదు, సమస్య క్రియేట్ చేసుకోవడం, అవసరమైతే పరిష్కరించుకోవడం వంటివి సాధ్యం కాదు'' అని మ్యారేజ్ కౌన్సెలర్, సైకాలజిస్ట్ శివాని మిస్రీ సాధూ అభిప్రాయపడ్డారు.

మాటల్లో స్పష్టత, వాస్తవ ఉద్దేశాలు ఎంత ముఖ్యమో చెబుతూ, ''మంచి రిలేషన్‌షిప్‌కి ఎలాంటి అడ్డదారులూ లేవు. మీ పని మీరు చేయాలి'' అని ఆమె చెప్పారు.

దీనికి సైకోథెరపిస్ట్ కైటీ గిల్లిస్ కూడా అంగీకరించారు.

డేటింగ్‌లో నిరాశను తొలగించాలంటే, నమ్మదగిన వ్యక్తులుగా ఉండాలని ఆమె అన్నారు.

''మీరు మీలా ఉండండి'' అని ఆమె సలహా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)