‘ఇజ్రాయెల్‌ను హమాస్‌తో పోల్చుతారా?’ - ఐసీసీ అరెస్ట్ వారెంట్‌పై నెతన్యాహు ఏమన్నారంటే..

ఫొటో సోర్స్, EPA
- రచయిత, శామ్ కాబ్రల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గాజాతో యుద్ధంలో యుద్ధ నేరాలకు సంబంధించి హమాస్ నాయకులతో సమానంగా తనపైనా అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ప్రాసిక్యూటర్ కోరడాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఖండించారు.
ప్రజాస్వామ్యబద్దమైన ఇజ్రాయెల్‌ను హమాస్ లాంటి "హంతకమూక"తో పోల్చడాన్ని తిరస్కరిస్తున్నానని అన్నారు.
నెతన్యాహు వ్యాఖ్యలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమర్థించారు. ఇజ్రాయెల్‌ను, హమాస్‌ను ఒకే గాటన కట్టడం సరికాదన్నారు.
గాజాలో మానవీయతపై దాడులు, యుద్ధ నేరాలకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు, రక్షణ మంత్రి యోవ్ గల్లాంట్ నేరాలకు పాల్పడినట్లు అవసరమైనన్ని అంశాలు ఉన్నాయని ఐసీసీ ప్రాసిక్యూటర్ కరీంఖాన్ అన్నారు.
యుద్ధ నేరాలకు పాల్పడినందుకు గాను హమాస్ నాయకుడు యహ్య సిన్వార్ మీద కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని ఐసీసీ కోరుతోంది.
2022లో ఏర్పాటైన ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఇజ్రాయెల్, అమెరికా, దాని మిత్ర పక్షాలు సభ్యులుగా లేవు.

ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shutterstock
2023 అక్టోబర్ 7న జరిగిన సంఘటనల నుంచి ఇజ్రాయెల్, హమాస్ నాయకుల మీద ఆరోపణలు తలెత్తాయి. అక్టోబర్ 7న హమాస్ సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి 1200 మందిని హత్య చేసింది. 252 మందిని బందీలుగా పట్టుకెళ్లింది. హమాస్ దాడి తర్వాత గాజా మీద ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. ఈ యుద్ధంలో 35,500 మంది పాలస్తీనీయులు మరణించారని గాజాను పాలిస్తున్న హమాస్ నాయకత్వంలోని ఆరోగ్యశాఖ తెలిపింది.
“ఇజ్రాయెల్- హమాస్ మధ్య ఎలాంటి పోలిక లేదు” అని బైడెన్ చెప్పారు.
“ఈ ప్రతిపాదనను అమెరికా ప్రాథమికంగా తిరస్కరిస్తోంది. ఇది సిగ్గు చేటు. ఈ వ్యవహారంలో ఐసీసీకి ఎలాంటి అధికారం లేదు ” అని అన్నారు అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్.
అరెస్ట్ వారెంట్ల కోసం విజ్ఞప్తి వల్ల గాజాలో కాల్పుల విరమణ కోసం ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలు స్థంభించే అవకాశం ఉందని బ్లింకెన్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యావ్ గల్లాంట్‌తో పాటు హమాస్ రాజకీయ నేత ఇస్మాయిల్ హనియా, ఆ గ్రూపు మిలటరీ చీఫ్ మహమ్మద్ డెయిఫ్‌పైనా అరెస్ట్ వారెంట్లు జారీ చేయాలని ఐసీసీ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ కోరారు.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి, రక్షణ మంత్రి గాజాలో యుద్ధతంత్రం ద్వారా ప్రజలను ఆకలితో మాడి చనిపోయేలా చేశారని, నేరుగా ప్రజలపై కాల్పులు జరిపి చంపేసినట్లు అనుమానాలు ఉన్నాయని కరీంఖాన్ చెప్పారు. గాజాలో యుద్ధం చేయడం ద్వారా సామూహిక జాతి హననానికి పాల్పడే కుట్రను అమలు చేసినట్లు ఆరోపించారు.
హమాస్ నాయకుల కేసులో ఆరోపిత నేరాలన్నీ గతేడాది అక్టోబర్ 7 నుంచి జరిగినట్లు ప్రాసిక్యూటర్ ఆరోపించారు. అక్టోబర్ 8న ఇజ్రాయెల్ మొదలు పెట్టిన దాడులతో వారిపైన యుద్ధ నేరాల ఆరోపణలను నమోదు చేయాలని కోరారు.
ఐసీసీ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఇజ్రాయెల్ మీద యుద్ధ నేరాల ఆరోపణలపై స్థానికంగా విచారణ జరుపుతున్నట్లు ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదని, జరుగుతున్నట్లు తమకు సమాచారం అందలేదని అంతర్జాతీయ నేర న్యాయస్థానం తెలిపింది.
అరెస్ట్ వారెంట్లు జారీ చేయాలా వద్దా అనే దానిపై ఐసీసీలోని న్యాయమూర్తుల బృందం నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ వారెంట్లు జారీ చేస్తే, ఐసీసీలో సభ్యదేశాలు ఇజ్రాయెల్, హమాస్ నేతల్ని అరెస్ట్ చేసి కోర్టు ముందుకు తీసుకురాగలవా అనేది మరో ప్రశ్న.

ఫొటో సోర్స్, Reuters
తనను అరెస్ట్ చేయాలంటూ కోర్టులో దాఖలైన పిటిషన్‌ను తప్పుడు విజ్ఞప్తి అంటూ కొట్టి పారేశారు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజామిన్ నెతన్యాహు. ఆయన ఇజ్రాయెల్‌కు సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా ఉన్నారు.
“ఏ ధైర్యంతో ఐసీసీ ఇజ్రాయెల్‌ను హమాస్‌తో పోలుస్తుంది” అని ఆయన హిబ్రూలో విడుదల చేసిన ప్రకటనలో ప్రశ్నించారు.
తమను హమాస్‌తో పోల్చడం వాస్తవాలను వక్రీకరించడమే అని అన్నారు.
“ప్రాసిక్యూటర్ చర్య ప్రపంచవ్యాప్తంగా యూదు వ్యతిరేకత మీద రగులుతున్న మంటలకు ఆజ్యం పోయడం లాంటిదేనని” నెతన్యాహు మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- వైఎస్ రాజశేఖరరెడ్డి: హెలికాప్టర్ అదృశ్యమైన తర్వాత 25 గంటల్లో ఏం జరిగింది... ఆచూకీ ఎలా తెలిసింది?
- బ్యాంకు పరీక్షల కోచింగ్‌కు నంద్యాల ఎందుకింత ప్రత్యేకం?
- వంటకు ఏ పాత్రలు వాడాలి? పోషకాలు కోల్పోకుండా ఆహారం ఎలా వండాలి?
- దుబాయ్ రియల్ ఎస్టేట్ : భారత్, పాకిస్తాన్లకు చెందిన నేతలు, నేరగాళ్లు ఇక్కడ ఎలా ఆస్తులు కొంటున్నారంటే...
- ‘నాకు పెళ్లి కావడం లేదు, సెక్స్ వర్కర్ల దగ్గరకు వెళుతుంటాను. ఇలా ఎన్నాళ్లంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














