ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణించిన హెలికాప్టర్‌ కూలిపోవడానికి కారణం ఇదేనా?

అర్జెంటినా ఎయిర్ ఫోెర్స్ హెలికాప్టర్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, అర్జెంటీనా వైమానికదళం కూడా బెల్ 212 హెలికాప్టర్లను ఉపయోగిస్తోంది.

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణించిన బెల్-212 హెలికాప్టర్‌ వార్తల్లో నిలిచింది.

ఈ హెలికాప్టర్‌ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడితో పాటు విదేశాంగ మంత్రి మరణించారు.

ఇరాన్ -అజార్‌బైజాన్ సరిహద్దుల్లోని కలాసి, ఖొదాఫరీన్ అనే రెండు ఆనకట్టలను ప్రారంభించిన అనంతరం రైసీ ఈ హెలికాప్టర్‌లో తబ్రిజ్ నగరానికి బయల్దేరారు.

రైసీ కాన్వాయ్‌లో మూడు హెలికాప్టర్లు ఉండగా, వాటిలో రెండు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. బెల్-212 హెలికాప్టర్ మాత్రం ప్రమాదానికి గురైంది.

దీంతో ఈ బెల్ 212 హెలికాప్టర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కొండల్లో హెలికాప్టర్

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్,

ఈ హెలికాప్టర్ ప్రత్యేకతలు ఏంటి?

వియత్నాం యుద్ధంలో ఉపయోగించిన యూహెచ్-1ఎన్ ట్విన్ లాంటి ప్రయాణికుల హెలికాప్ట‌రే ఈ బెల్ 212 హెలికాప్టర్ కూడా. దీనిని ప్రభుత్వ, ప్రైవేట్ ఆపరేటర్లు ఉపయోగిస్తున్నారు.

రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకారం, ఈ హెలికాప్టర్‌ను 1960లలో కెనడా సైన్యం కోసం తయారు చేశారు.

యూహెచ్-1 ఇరోక్వియోస్‌ను ఆధునీకరించి దీనిని తయారు చేశారు. కొత్త డిజైన్‌లో రెండు ఇంజన్లను ఉపయోగిస్తున్నారు. కొత్త హెలికాప్టర్ సామర్థ్యం మునుపటి కంటే ఎక్కువే.

అమెరికన్ మిలిటరీ శిక్షణా పత్రాల ప్రకారం, 1971లో ఈ హెలికాప్టర్‌ను ప్రవేశపెట్టాక, అమెరికా, కెనడా దీనిని తమ నౌకాదళంలో చేర్చుకున్నాయి.

ఇవి యుటిలిటీ హెలికాప్టర్లు. కాబట్టి వీటిని యూహెచ్ అని పిలుస్తారు.

యూహెచ్ వంటి పేర్లను సైన్యం ఉపయోగిస్తుంది.

ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ కూలిన ప్రదేశం ఫోటో

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ కూలిన ప్రదేశం

ఏయే పనులకు ఉపయోగిస్తారు?

ఈ హెలికాప్టర్లు అన్ని రకాల పనులకు ఉపయోగపడతాయి. ప్రయాణికుల రవాణా, వస్తువుల రవాణా, మంటలను ఆర్పడం, ఆయుధాల సరఫరా వంటి వాటికి కూడా వీటిని వాడతారు.

ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో ప్రభుత్వ ఉన్నతాధికారులు, నేతలు ప్రయాణించేందుకు వీలుగా అనేక మార్పులు చేశారు.

ఈ హెలికాప్టర్‌ను అమెరికన్ కంపెనీ బెల్ టెక్స్‌ట్రాన్ తయారు చేసింది. దీని ప్రధాన కార్యాలయం టెక్స‌స్‌లో ఉంది.

ఈ హెలికాప్టర్‌ను పోలీసు, వైద్య, రవాణా, సైనికుల చేరవేత, ఇంధన పరిశ్రమ, అగ్నిమాపక ప్రమాదాలలో ఉపయోగించవచ్చని బెల్ హెలికాప్టర్ తాజా మోడల్ బెల్ 412 గురించి కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ పత్రాల ప్రకారం, దీనిలో సిబ్బంది సహా 15 మంది వరకు ప్రయాణించవచ్చు.

బెల్ 212 హెలికాప్టర్ పొడవు 17 మీటర్లు, ఎత్తు నాలుగు మీటర్లు అని హెలికాప్టర్లకు సంబంధించిన సమాచారాన్ని అందించే హెలిస్ వెబ్‌సైట్ పేర్కొంది.

బెల్ 212 హెలికాప్టర్‌ను ఆపరేట్ చేయడానికి గంటకు సుమారు రూ. 1,35,000 ఖర్చవుతుందని గ్లోబల్ ఎయిర్ వెబ్‌సైట్ చెప్పింది.

వెపన్ సిస్టమ్ వెబ్‌సైట్ ప్రకారం, ఈ హెలికాప్టర్ గంటకు 230 నుంచి 260 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

ఇబ్రహిం రైసీ హెలికాప్టర్

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, ఇబ్రహీం రైసీ ఇలాంటి హెలికాప్టర్‌లోనే ప్రయాణించారు.

ఎవరెవరు వాడుతున్నారు?

ఈ హెలికాప్టర్‌ను జపాన్ కోస్ట్ గార్డ్ వాడుతోంది.

అమెరికాలో ఈ హెలికాప్టర్‌ను అగ్నిమాపక దళం, ఇతర ప్రభుత్వ సంస్థలు ఉపయోగిస్తున్నాయి.

థాయ్‌లాండ్‌లోని జాతీయ పోలీసులు కూడా ఈ హెలికాప్టర్‌ను ఉపయోగిస్తున్నారు.

రాయిటర్స్ ప్రకారం, ఇరాన్ ఎన్ని హెలికాప్టర్లను ఉపయోగిస్తుందో ఇంకా స్పష్టంగా తెలియలేదు.

ఫ్లైట్ గ్లోబల్‌కు చెందిన వరల్డ్ ఎయిర్ ఫోర్స్ డైరెక్టరీ 2024 ప్రకారం, ఇరాన్ వైమానిక, నావికాదళాల దగ్గర ఇలాంటి హెలికాప్టర్లు 10 ఉన్నాయి.

యూఏఈలో ఈ మోడల్ హెలికాప్టర్ ఒకటి 2023 సెప్టెంబర్‌లో కూలిపోయింది.

ఇరాన్‌లో ఈ తరహా ప్రమాదం 2018లో జరిగింది.

ఆ ప్రమాదంలో నలుగురు చనిపోయారు.

సెప్టెంబర్ 2013లో బెల్ 212 ట్విన్ బ్లేడ్ హెలికాప్టర్ ముంబైలో కూలిపోయింది. ఆ ప్రమాదంలో ఐదుగురు మరణించారు.

ఏవియేషన్ సేఫ్టీ నెట్‌వర్క్ వెబ్‌సైట్ ప్రకారం, 1972 నుంచి 2024 వరకు బెల్ 212కి సంబంధించి 432 సంఘటనలు జరగగా, వీటిలో దాదాపు 630 మంది చనిపోయారు.

హెలికాప్టర్ ఫోటో

ఫొటో సోర్స్, REUTERS

హెలికాప్టర్ కూలిపోవడానికి కారణం ఏంటి?

ఈ హెలికాప్టర్ కూలిపోవడానికి కారణాలు ఏంటో ఇరాన్ అధికారులు ఇంకా ప్రకటించలేదు.

అయితే, హెలికాప్టర్ ప్రమాదం ఎలా జరిగిందో ఇరాన్ మంత్రులు, వివరించారు.

'విపరీతమైన పొగమంచు, వర్షం కారణంగా హెలికాప్టర్ అదుపు తప్పిందని, దాంతో హెలికాప్టర్ కూలిపోయింది' అని ఇరాన్ మంత్రులు వివరించారు.

వాయు రవాణా భద్రత విషయంలో ఇరాన్ రికార్డు పేలవంగా ఉంది.

దశాబ్దాలుగా అమెరికా విధించిన ఆంక్షలూ ఇందుకు ఒక కారణంగా భావిస్తున్నారు.

ఆంక్షల కారణంగా ఇరాన్ విమానయాన రంగం బలహీనపడింది.

గతంలో ఇరాన్ రక్షణ, రవాణా మంత్రులతో పాటు, సైనిక, వైమానిక దళ కమాండర్లు విమాన లేదా హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించారు.

మే 2001లో, ఇరాన్ రవాణా మంత్రి ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. దాని శిధిలాలను కనుగొనడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. ప్రమాదం జరిగినప్పుడు ఆ విమానంలో 28 మంది ఉన్నారు.

విమానాలను ఆధునీకరించడానికి పశ్చిమ దేశాలతో ఇరాన్ కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంది. పశ్చిమ దేశాలు కొన్ని ఆంక్షలను సడలించాయి.

అయితే, నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందం నుంచి వైదొలిగి, తిరిగి ఆంక్షలు విధించడంతో ఇరాన్ ప్రయత్నాలు ఆగిపోయాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)